Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 19


    "అమ్మా, ఏమిటి అంత కోపం? ఎందుకలా అరిచావు?"
    "మాట్లాడకు. నేను లేనప్పుడు వాణ్ణి ఎందుకు రానిచ్చావు? నీకేం చెప్పాను?"
    "నీకోసం ఏదో రోల్ ఉందని మాట్లాడాలని వచ్చి కూర్చున్నాడు."
    "ఎవరు వచ్చినా, 'మా అమ్మ వచ్చాక రండి' అని చెప్పాలి. తెల్సిందా?" అని మళ్లీ అరిచింది.
    తల్లి కోపం ఎందుకో అర్థంకాక మూతి ముడుచుకు లోపలికి వెళ్లింది రేణుక.
    రెండో సంఘటనతో తనేదో గట్టి నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని సీత తల్లడిల్లిపోతూ నాల్గు రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఎంత ధైర్యం వాడికి! ఆ హనుమంతు వెధవచూపు తన కూతురిమీద పడిందని తనకు అర్థమైంది. ఏం చెయ్యాలో ఆలోచించే లోపలే ఆ చెత్తవెధవ ఎంత మాటన్నాడు? "అబ్బో, సీతా! నీకేటి ఇంక, తల్లి, కూతురు రెండు చేతులా సంపాదించవచ్చు. దోరజామపండులా ఉంది నీ కూతురు. కసుక్కున కొరికేయాలని ఉంది" తేలిగ్గా, హేళనగా అనేశాడు.
    ఒక్క ఉదుటున కాళి అవతారం ఎత్తి, చేతిలో శూలం బదులు చీపురుకట్ట పట్టుకుని "ఏట్రా పేలుతున్నావు? నాలిక చీరేస్తాను. ఛీ ఇటు తల్లి, అటు కూతురు కావాలా? కన్నెత్తి దానివంక చూస్తే కళ్లు పీకేస్తా" షర్టు కాలరు పట్టి చీపురెత్తి చూపించింది ఆవేశంతో ఊగిపోతూ.
    హనుమంతు ఆ రూపం చూసి కాస్త బెదిరినా "అబ్బో! కూతురుచేత ఏసం కట్టించవేటి? ఏసం కట్టాలంటే నా కాళ్లకాడికి రావా? అప్పుడు చెపుతా. ఈ గోరోజనం అప్పుడు సూపించు." షర్టు కాలరు విడిపించుకుని హేళనగా నవ్వి, విసురుగా వెళ్లిపోయాడు.

                                                   *  *  *

    "ఇక్కడ ఇన్ని కాలేజీలుండగా, ఇంకో ఊరెళ్లి హాస్టల్లో ఉండి ఎందుకు చదువుకోవాలి?" మెట్రిక్ రిజల్ట్స్ వచ్చి ఫస్టుక్లాసులో పాసైన రేణుక తల్లి చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
    "ఇక్కడొద్దు. నేను షూటింగులని బిజీగా తిరుగుతూ ఉంటాను. ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉండొద్దు. హాస్టలైతే బాగుంటుంది.మంచి స్నేహితులు దొరుకుతారు."
    "నాకిక్కడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్త ఊరు నే పోను, నాకొద్దు" మొండిగా వాదించింది.
    "రేణూ, నీకిప్పుడు తెలియదు. ఇక్కడ నీవు ఉండకూడదు. ఈ తోడేళ్లు నిన్ను బతకనీయవు. నీవు వెళ్లాల్సిందే. నువ్వు బాగా చదువుకోవాలి. పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం. అలాంటి జీవితం నీ సొంతం కావాలి. అందుకే పంపిస్తున్నాను. నువ్వు వెళుతున్నావు అంతే!" నిర్ణయం తనదే అన్నట్టు తేల్చి చెప్పింది.
    "తోడేళ్లేమిటి, ఇక్కడికెందుకు వస్తాయి?" కూతురు అమాయకత్వం తల్లికి అర్థమైంది.
    "నేను చెప్పేదేమిటో అర్థం కాని వయసు నీది. ఎదుగుతున్న పిల్లవి నువ్వు. ఏం జరిగేది నీకు అర్థమయ్యేలోపు నీమీద వల వేస్తారు. ఆ వలలో చిక్కుకుపోతావు. ఆశలు రేపుతారు. హీరోయిన్ అంటారు. కళ్లముందు సినిమా కలలు చూపిస్తారు. మంత్రం వేసినట్టు ఆ మాటలకు లోబడిపోతావు. తేరుకోలేవు. మంచి చెడ్డ అర్థంకాని వయసు నీది. సినిమా వ్యామోహం అలాంటిది. ప్రతి ఆడపిల్ల హీరోయిన్ కాలేదు. అవలేదు. వందల్లో ఒకటో ఇద్దరో. మిగతా అందరూ ఇదిగో ఇలా... నాలా... నా జీవితం చూశావుగా! తొంభై తొమ్మిదిమంది జీవితాలు ఇలాగే తెల్లారిపోతాయి. ఒకసారి సినిమా ఛాన్స్ వలలో పడితే, పతనమే! నిన్నెలా వాడుకోవాలో వాళ్లకి తెలుసు. రొచ్చులోకి జారిపోతావు. అంతే, ఆ ఊబిలోంచి పైకి రాలేవు" ఆవేశంతో అరుస్తున్నట్లే అంది.
    "ఏమిటమ్మా! ఏం మాట్లాడుతున్నావు?" విసుగ్గా అంది.
    "ఇప్పుడు నీకు అర్థం కాదు. అర్థమయ్యేవేళకి ఇంకేం మిగలదు. నన్ను చూశాక కూడా ఇలాగే బతకాలని ఉందా? నా బతుకు కుక్కలు చింపిన బతుకైంది. ఎలాంటి వాళ్ళొచ్చి తలుపు తట్టేవారో నువ్వే చూశావుగా. అలాంటివాళ్లు వచ్చి అలాంటి వాళ్లతో..."
    "ఛీ... ఛా" అంది రేణుక కంపరంగా.
    "ఛీ... ఛా...లు ఏమన్నా, ఆకలి అన్నింటినీ లొంగదీస్తుంది. అందుకే పెద్ద చదువులు చదువుకో. పెద్ద చదువు వివేకాన్నిస్తుంది. చదువు నీకు సమాజంలో ఉన్నతస్థాయినిస్తుంది. ఉద్యోగం, సంపాదన నీకు హోదానిస్తాయి. అది నీకు సంస్కారం నేర్పుతుంది. ఆలోచించే శక్తినిస్తుంది. సినీ హీరోయిన్ కావాలంటే ఆ స్థాయికి వెళ్లు. నీకు అందం, అర్హత ఉంటే అన్నీ నీ కాళ్ల దగ్గరకొచ్చి వాలతాయి. ఆ స్థానం నీవు సంపాదించుకోవాలంటే కొన్నాళ్లు అన్నీ మరచిపో. చదువుకో. చదువు తప్ప ఇంకో ధ్యాస వద్దు. ఈలోగా నీలో వయసుకు తగ్గ పరిణతి వస్తుంది. అప్పుడు ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించుకోగల సత్తా నీకు వస్తుంది. రేణూ! నీ బతుకు నా బతుకులా కాకూడదన్న ఒకే ఒక్క గమ్యంతో బతికాను. నేను బతకడం కోసం మరో దారిలేక అడ్డమైన బతుకూ బతికాను. నిన్ను కన్నందుకు, నా తప్పుకి శిక్షగా నిన్ను బలి చెయ్యకూడదన్న ఒకే కోరిక నన్ను బతికించింది. నా ఆశని వమ్ము చేయకు. నా ఆశయానికి సమాధి కట్టకు. నీకు దండం పెడతా!"
    సీత ఏడవడం ఆరంభించింది. ఆ ఏడుపు మధ్యలోనే మొదటిసారి కూతురికి తన కథ చెప్పి మళ్లీ ఏడ్చింది. నమ్మశక్యం కానట్టు ఆశ్చర్యంగా చూసింది రేణుక. "అమ్మా! మరి ఇలాంటి తోడేళ్లు అక్కడ ఉండవా?" అమాయకంగానే అడిగినా కూతురు మాటల్లో నిజం ఉందని తెలుసు సీతకి.
    "ఉంటాయి. అన్నిచోట్లా ఉంటాయి. కానీ, ఇలా ఇంత నిర్భయంగా, విచ్చలవిడిగా రాలేవు. అక్కడ కాపలా ఉంటుంది. కట్టుబాటు ఉంటుంది. కట్టడి ఉంటుంది. గేట్లు ఉంటాయి. చూడు రేణూ! చెడిపోదల్చుకున్నవారిని ఏ గేట్లూ, ఏ కపలాలూ ఆపలేవు. అక్కడ కంటే ఇక్కడ నిన్ను వ్యామోహంలో పడేసే అవకాశాలెక్కువ. నీచేత తప్పు చేయించే పరిస్థితులు ఎక్కువ. అక్కడా ఇలాంటి రాజేష్ లు, హనుమంతులు, శంకర్లూ ఉంటారు. కానీ, నిన్నందుకోడానికి చాలా దారులు వెతుక్కోవాలి. ఇక్కడ ఆ దారులు సులువు. ఇక్కడ అప్పుడే వాళ్ల కళ్లు నీమీద పడ్డాయి. వాళ్లకి ఏం కావాలో, నిన్ను ఎలా వాడుకోవాలో వాళ్లకి తెలుసు. అందుకోసం నిన్ను నిస్సహాయస్థితిలోకి నెడతారు. ఆ ధాటికి నిన్ను నీవు కాపాడుకోలేవు. తల్లిగా నేనెన్ని జాగ్రత్తలు చెప్పినా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎవరి హద్దుల్లో వాళ్లని ఉంచాలి. వివాహబంధం లేని ఆడదాన్ని ఏ మగాడు శాశ్వతంగా భరించడు. అది వాడి నైజం. వాడుకోడానికే తప్ప వాగ్దానాలు నిలుపుకోడు. ప్రతి ఆడపిల్ల ప్రేమ అనే రెండు అక్షరాల మాయాజాలంలో పడుతుంది. అది ఆడపిల్లకి శాపం. భ్రమరం మధువు గ్రోలడానికే తప్ప మరెందుకూ కాదని మగవాడి ఆలోచన. ఎంతో వివరంగా నీకు ఈ జాగ్రత్తలు చెపుతున్నాను. ఇవన్నీ స్తోత్రపాఠాల్లా రోజూ కంఠతా పట్టాలి. ఇంక నిన్ను రక్షించుకునే బాధ్యత నీదే. నిన్ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లే మెట్ల దగ్గర నిలబెట్టే ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ జారిపోకుండా జాగ్రత్తగా గమ్యం చేరాల్సిన బాధ్యత నీదే. నిన్ను ఉన్నతస్థానంలో నిలబెట్టేది నీ చదువే. అదే నీ గమ్యం. అర్థమైందా? రేపే నీ ప్రయాణం" అని లేచి కళ్లు తుడుచుకుంది సీత. రేణుక బట్టలు పెట్టెలో సర్దడం ఆరంభించింది.    
    అయోమయంగా చూస్తోంది రేణుక.
    "లేవాలి నువ్వు. ఆలోచించే సమయం దాటిపోయింది. ఆచరించే సమయం వచ్చింది. లే! లేచి పుస్తకాలూ, నీ సామాన్లూ సర్దుకో. మరో దారి ఉండదా అనే ఆలోచన నీలో రానీయకు. ఇదొక్క దారే నీ ముందుంది. తల్లి మాటల్లో నిజం అర్థమయ్యీ అర్థమవనట్లున్నా, 'నిజమే కాబోలు మరో దారి లేదేమో తనకి' తనని తాను సన్నద్ధం చేసుకుంటూ, తిరుగులేని తల్లి నిర్ణయాన్ని కాదనే ధైర్యం లేక లేచి పుస్తకాలు సర్దడం మొదలుపెట్టింది రేణుక.
    తల్లి నిర్ణయం సరైనదేనన్న సంగతి ఇప్పుడు గ్రహించలేకపోయినా, గ్రహించే వయసొచ్చాక చేతులెత్తి దండం పెట్టుకుంటుందేమో ఆ తల్లికి!

                                                                                 (నవ్య వీక్లీ, 29 ఆగస్టు. 2018)

                                             *  *  *  *

 Previous Page Next Page