Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 20


                                               దుష్టరక్షణ

    "యువర్ ఆనర్, ఈ అమ్మాయి పేరు శృతి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో, బతుకుదెరువు కోసం ఉద్యోగం చేసుకునే లక్షలాదిమంది అమ్మాయిలలో ఒకర్తి. పల్లెటూర్లో పొలాలు అమ్ముకొని, ఇళ్లు తాకట్టు పెట్టుకుని కాస్త మంచి చదువులు చదువుకుంటే, మంచి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో భవిష్యత్ మీద ఆశ పెంచుకున్న ఓ దిగువ మధ్యతరగతి అమ్మాయి. ఇంజనీరింగు చదివింది. ఏడాదిగా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక, ఆఖరిగా ఖాళీగా ఉండటం కంటే దొరికిన ఉద్యోగమే చేద్దామనుకొని, ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగంలో చేరింది, కొద్దిపాటి జీతంతో ఆరునెలల క్రితం. ఊరికి దూరంగా కొత్తగా కడుతున్న అపార్ట్ మెంట్స్ లో అద్దె చవకని, ఆఫీసుకి దగ్గరని ఒక అపార్ట్ మెంట్ లో ఇంకో అమ్మాయితో షేర్ చేసుకొని ఉంటోంది. కాల్ సెంటర్ ఉద్యోగం, పనివేళలు మారుతుంటాయి. ఈ దుర్ఘటన జరిగినరోజు తనని రిలీవ్ చేయాల్సిన అమ్మాయి అత్యవసర పనిపడి మామూలు కంటే రెండు గంటలు ఆలస్యంగా రావడం వల్ల శృతి ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది దాటింది. శృతి ఉండే అపార్ట్ మెంట్ సందుకు ఇంకా రోడ్డు పడలేదు. ఆటో కూడా వెళ్లలేదు. అపార్ట్ మెంట్ కట్టే రాళ్లు, రప్పలు, ఇసుకతో రోడ్డంతా నిండి ఉంటుంది. రోజూ మాదిరిగానే మెయిన్ రోడ్డు దగ్గర దిగి డబ్బవసరం ఉండటంతో ఏటిఎం దగ్గర డబ్బు డ్రా చేసుకొని, బ్రెడ్, పాలులాంటివి ఏవో కొనుక్కొని సందులోకి తిరిగింది." అప్పటివరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు ప్రజెంట్ చేసి... "యువర్ ఆనర్, ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో నా క్లయింట్ ని ప్రశ్నించి అడిగేందుకు పర్మిషన్ కోరుతున్నాను" అన్నాడు ప్రాసిక్యూటర్ సదాశివం.
    "పర్మిషన్ గ్రాంటెడ్" అంది మెజిస్ట్రేట్ జయలక్ష్మి.
    శృతి బోనులో నిల్చున్నాక - "చూడమ్మా, ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన వివరంగా చెప్పు" ప్రాసిక్యూటర్ అన్నాడు.
    శృతి బెరుకుగా చూస్తూ "యువర్ ఆనర్ ఆ రాత్రి అసలే ఆలస్యం అయిందని గబగబా సామాను కొనుక్కొని ఇంటిదారి పట్టా. సందు ముందు ఈ అబ్బాయిలిద్దరూ మోటార్ సైకిల్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను సందులో కాస్త దూరం వెళ్లగానే వెనకాల నుంచి మోటార్ సైకిల్ చప్పుడు వినిపించి వెనుతిరిగి చూసేసరికి వాళ్లిద్దరూ నా ముందు మోటార్ సైకిల్ అడ్డు పెట్టారు. చీకటి సందు, ఎవరూ లేరు. ఒక్కక్షణం భయపడ్డా. 'ఏయ్ డబ్బు తీయ్' అన్నాడు ఒకడు. 'నా దగ్గర రెండొందలే వుంది. తీసుకోండి' అని బ్యాగులోంచి తీసి ఇచ్చా. మరోడు బ్యాగు లాగి డబ్బేం లేదని తేల్చుకొని 'పదరా, భలే బేరం దొరికింది' రెండొందలు జేబులో కుక్కుకుని అన్నాడు. రెండోవాడు అపుడే ఏదో తట్టినట్టు 'అగరా, డబ్బెలాగూ లేదు. పద కాసేపు ఎంజాయ్ చేద్దాం' అని నా చేయి పట్టుకొని లాగసాగాడు. రెండోవాడు మోటారు సైకిల్ దిగి పక్కన పెట్టి ఇద్దరూ నన్ను చీకట్లోకి లాగసాగారు. నా ప్రాణాలు పోయినట్టు బెదిరిపోయాను. గట్టిగా అరవబోతుంటే నోరు మూసేశాడు. ఆ క్షణంలో నాకర్థం అయింది వాళ్లిద్దరిని ప్రతిఘటించే శక్తి నాకు లేదు. ఏదన్నా ఉపాయంతో తప్పించుకోవాలి అనిపించి గట్టిగా పెనుగులాడి నోటిమీద చెయ్యి లాగి "ఆగండి, మీకేం కావాలో చెప్పండి. నన్ను వదలండి మీకు ఏం కావాలో చెబితే ఇస్తాను."   
    "మాకేం కావాలో తెలియనంత చిన్నదానివా? కబుర్లొద్దు, నోరు మూసుకొని పద" అన్నాడు హేళనగా.
    "మీకు కావాల్సింది నేనివ్వడానికి రెడీగా వుండగా ఈ బలవంతం ఎందుకు? ముందు చేయి వదులు. నన్ను చెప్పనీయండి."
    ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. చీకట్లో వాళ్ల మొహాల హావభావాలు కనపడకపోయినా వాళ్లు చెయ్యి వదలడంతో వాళ్ల ఆశ్చర్యం అర్థం అయింది. "మా ఇల్లిక్కడే వుంది. ఇంట్లో ఎవరూ వుండరు. నాతో వుండే అమ్మాయి నైట్ షిఫ్ట్ కి వెళ్లిపోతుంది. పదండి అక్కడికి వెళదాం. ఈ రాళ్లు, రప్పలు, చీకటి, ఇదంతా ఎందుకు? ఇంటికెళ్లి హాయిగా ఎంజాయ్ చేద్దాం. నేనే పిలుస్తుంటే రేప్ లు ఎందుకు?" విలాసంగా నవ్వి అన్నాను.
    వాళ్లిదరూ తెల్లబోయారు. "ఏయ్, ఏమిటి గేమ్ ఆడుతున్నావా? నీవెంత తీసుకెళ్లి అక్కడ అందరినీ పిలిచి పట్టిద్దామనా? మేం అంత వెర్రివెధవల్లా కనబడుతున్నామా? నీ ట్రిక్కులు మా దగ్గర కాదు, మళ్లీ చెయ్యి పట్టుకున్నాడు.
    "ఒట్టు నా మాట నమ్మండి. మీకు నా సంగతి తెలియదు గదా, అందుకే అలా అనుకుంటున్నారు. ఇలాంటివి నాకలవాటే. అబ్బాయిలు నా రూమ్ కొచ్చి పోతుంటారు. మీరూ రావచ్చు కానీ, ఒక్క విషయం, గంటకి నా రేటు ఐదువందలు. ఇద్దరు గదా వెయ్యి ఇచ్చారంటే ఇద్దరూ రండి." చాలా మామూలుగా అలవాటున్నదానిలా అన్నాను.
    "వెయ్యి రూపాయలా? మా దగ్గర అంత డబ్బు లేదు. అయినా నీవిలాంటిదానివి అనుకోలేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయివనుకున్నాం.
    "ఎవరూ కావాలని చేయరు. గతిలేక చేస్తారు. డబ్బుల కోసం కక్కుర్తి. అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివా, బోడి పదిహేనువేల జీతం, ఇంటద్దె, వూర్లో అమ్మకి పంపించాలి. అప్పు తీరాలి. నెలనెలా అప్పులే. అందుకే ఈ కక్కుర్తి తప్పదు మరి!" నమ్మకంగా అన్నా.
    "నీవిలాంటి పనులు చేస్తున్నట్టు ఎవరికీ తెలీదా?"
    "తెలిసేటట్టు చేస్తారా ఎవరన్నా? నా రూమ్మేటు లేనపుడు, ఎవరన్నా నామీద ఇంటరెస్టు చూపినపుడు పిలుస్తా. ఇంతకీ వస్తారా లేదా చెప్పండి."
    "మా దగ్గర అంత డబ్బు లేదు" నసిగారు.
    "సరే, ఆలస్యం అయిపోయింది. దక్కిందే దక్కుడు. పదండి తొందరగా."
    "ఇందులో మోసం లేదుగా?" అనుమానంగా అన్నారు.
    "ఎహె, పదండి. మిమ్మల్ని బయట పడేస్తే నేనూ బయట పడతాగా? గప్ చిప్ గా నా వెంట రండి." నమ్మబలికా. ఇద్దరూ సందేహిస్తూనే కదిలారు. ఇంటి దగ్గరకి రాగానే తాళం తీసి "నెమ్మదిగా వచ్చేయండి లోపలికి" అని సైగ చేసి పిలిచి, లోపలికి వచ్చాక "ఉండండి, పక్కింట్లో పాల ప్యాకెట్టు వుంది. ముందు టీ తాగుదాం" అంటూ చటుక్కున బైటకి వెళ్లి తలుపు లాగేసి గొళ్లెం పెట్టేశాను. తరువాత ఇరుగుపొరుగుని పిలిచి వాళ్ల సలహా ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను." శృతి చెప్పడం ఆపింది.
    ప్రాసిక్యూటర్ లేచి నిల్చుని "యువర్ ఆనర్ నా క్లయింట్ సమయస్ఫూర్తి ఉపయోగించి, జరగబోయే ఆపద నుండి తప్పించుకుంది. వారిద్దరివల్ల హాని జరగకపోయినా, ఇలాంటి పనులు చేసేముందు అబ్బాయిలు కొన్నాళ్లయినా భయపడతారన్న ఉద్దేశ్యంతో తన పరువు పోయినా సరేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇలాంటి జులాయిల ఆట కట్టించాలని, తన తోటి అమ్మాయిలకి ధైర్యం ఇవ్వడానికి ముందుకు వచ్చిన శృతిని అభినందిస్తున్నాను. ఈ దోషులకు శిక్ష విధించి ఇలాంటి అమ్మాయిలకు ధైర్యమివ్వాలని కోర్టువారిని కోరుతున్నాను" ప్రాసిక్యూషన్ వాదన ముగించారు.
    "డిఫెన్స్ వారు తమ వాదన వినిపించవచ్చు" పర్మిషన్ ఇస్తూ అన్నారు జడ్జి.
    "యువరానర్! పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన క్లయింట్ ని చాలా తెలివిగా చక్కని కథ అల్లి, నా క్లయింట్స్ ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చక్కగా చేశారు. యువర్ ఆనర్ ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చీకటి సందులో ఆమెని వెంబడించి, బలాత్కారం చేయబోయారన్న ఆరోపణ చేశారు. ప్రాసిక్యూటర్ గా ఏ ఆధారాలతో నా క్లయింట్స్ ని దోషులుగా నిర్ణయించారో తెలియదు. వారిద్దరినీ దోషులుగా నిర్ణయించేముందు వారిద్దరినీ విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోర్టువారిని కోరుతున్నాను" అన్నాడు డిఫెన్స్ లాయర్ విశ్వనాథం.

 Previous Page Next Page