సీత తడబడింది. "అయ్యో, రండి లోపలికి" అంటూ దారిచ్చి కుర్చీ చూపించింది. "నా కూతురు స్కూలుకెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం షూటింగని సావకాశంగా కూర్చున్నా. ఉండండి టీ తెస్తా" అంటూ లోపలికెళ్లబోయింది.
"వద్దులే, ఊరికే అన్నా. కూర్చో. కబుర్లు చెప్పుకుందాం" అని చెయ్యి పట్టుకు లాగాడు.
సీత కాస్త గతుక్కుమని నవ్వి చేయి వదిలించుకుని కుర్చీలో కూర్చుంది. "చెప్పండి కబుర్లు వింటాను."
"ఉత్తి కబుర్లేనా? ఇంకేం వద్దా?" అన్నాడు అదోలా నవ్వి.
"ఏం కావాలి?" అర్థం కానట్టు అయోమయంగా అంది.
"నీకింత చేశాను. మరి నాకేం ఇవ్వవా?" కుర్చీలోంచి లేచి చటుక్కున సీత కాళ్ల దగ్గర కూర్చుని ఆమె ఒడిలో తల పెట్టాడు. "సీతా, నీవు నాకు కావాలి. నీవంటే ఇష్టపడ్డాను. ఎన్నాళ్లుగానో చెప్పాలనుకుంటూ ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు" అన్నాడు తమకంగా.
సీత చటుక్కున అతని తోసేసి లేచి నిలబడింది. రెండు చేతులూ జోడించి నమస్కారం పెడుతూ "రాజేష్ గారూ, దయచేసి నన్ను మళ్లీ పాత సీతని చెయ్యకండి. నన్నిలా బతకనీయండి. నిజమే, మీ ధర్మమా అని కాస్త మర్యాదగా బతకడం ఆరంభించాను. మళ్లీ నన్ను ఆ రొంపిలోకి లాగకండి. మీకు దండం పెడతా" కళ్లనీరు తిరుగుతుండగా దీనంగా అంది.
"ఛా! అలా ఎందుకనుకుంటావు? నీవంటే నాకిష్టం. మనం ఆనందంగా గడపవచ్చు. ఆ పాత జీవితం మరచిపో. అలా ఎందుకవుతుంది? నేను నీకు అండగా ఉంటా" అంటూ మళ్లీ చెయ్యి పట్టుకున్నాడు.
"సీతా, నన్ను కాదనకు. నన్ను నమ్మితే నీకింకా మంచి జీవితం వుంటుంది. కాస్త అందరూ ఇప్పుడే నిన్ను గుర్తిస్తున్నారు. సెకండ్ హీరోయిన్లు, సైడ్ రోల్స్ ఇప్పిస్తా. నేను చెపితే ప్రొడ్యూసర్లు కాదనరు. మనం ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఆనందంగా ఉందాం" సీతని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు.
సీత నిస్సహాయంగా చూసింది. 'వద్దంటే కోపం వచ్చి వెళ్లిపోతాడేమో! మళ్లీ వేషాలిప్పించడేమో!' పాత జీవితం గుర్తుకు తెచ్చుకుని బిక్కచచ్చినట్టు వుండిపోయింది. 'ఏమంటే ఏమవుతుందో, ఏం చెయ్యాలో, ఏమనాలో నిర్ణయించుకోలేక నిర్జీవంగా, మౌనంగా ఉండిపోయిన సీతని 'నిర్ణయం నాది, నీకే ఛాయిస్ లేదు' అన్నంత ధీమాతో ముందుకెళ్లిపోయాడు రాజేష్.
మరోసారి పతనం ఆరంభం. మేమేం తక్కువ తిన్నాం? రాజేష్ గాడికెంత హక్కుందో, మాకూ అంతే ఉంది అన్నట్టు వెంకట్, యాదగిరి, హనుమంతు వేషాలిప్పించే అందరూ లైనులో నిలబడ్డారు. డబ్బుతో వచ్చిన సుఖజీవనం, అలవాటైన సుఖజీవితం వదులుకోలేని బలహీనత ముందు ఆమె అయిష్టత వెనకడుగు వేయక తప్పలేదు. అప్పుడు మాస్, ఇప్పుడు కాస్త క్లాస్. అంతే తేడా. అప్పుడైతే రాత్రి బిజినెస్. ఇప్పుడు బిజినెస్ టైములు మారాయి. షూటింగులు లేనప్పుడు, కూతురింట్లో లేనప్పుడు, వాళ్లకి కుదిరి, వాళ్ల మూడ్, ఇష్టాయిష్టాలను బట్టి - సీతకేమీ ఇష్టాలుండే వీలులేదు కాబట్టి నవ్వుతూ తలుపు తీసి ఆహ్వానించాలి. కూతురు పెద్దదవుతోంది. ఇక్కడికొచ్చాక బతుకు బాగుండి, తల్లి చేసే పనులు కంటబడక హాయిగా చదువుకుంటూ సంతోషంగా ఉంది. 'నీ కోసమే, నీ సంతోషం కోసమే, నీ భవిష్యత్తు కోసమే...' అని పాడుకోకపోయినా సీత ధ్యేయం కూడా అదే.
ఇంత దిగజారినా సీత ఏమీ అందనంత ఎత్తులకెదిగిపోలేదు. రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోలేదు. అందరినీ తన్ని పొమ్మనేంత స్థాయికేం రాలేదు. సీత పదహారేళ్ల బాలాకుమారి కాదు. ముప్ఫైల్లో పడిందామె. సెకండ్ హీరోయిన్, అక్కలు, చెల్లెళ్లు, వదిన పాత్రలిచ్చి సరిపెట్టింది ఇండస్ట్రీ. ఓ టూ బెడ్ రూమ్ ఫ్లాటుకి యజమానురాలు కాగలిగింది. కూతుర్ని మంచి స్కూల్లో చదివించుకుంటూ రొటీన్ జీవితానికి అలవాటు పడిపోయింది. కానీ రొటీన్ జీవితానికి అలవాటు పడకు. ఇంకా నీ శిక్షాకాలం పరిసమాప్తి కాలేదు అన్న వార్నింగ్ వచ్చింది.
* * *
రేణుకకి పదిహేను నిండాయి. మెట్రిక్ చదువుతోంది. విరిసీ విరియని మొగ్గలా తేలింది. "చదువుకో. బాగా చదివితే నీవెంత వరకు చదివితే అంతవరకూ చదివిస్తా. ఇంజనీరు, డాక్టరు, లాయరు, కలెక్టరు ఏదో ఒకటి కావాలి. చదువుకుంటే నీ బతుకెంత బాగుంటుందో మరచిపోకు." రోజుకోసారైనా కూతురికి చెబుతోంది సీత. కూతురు నవ్వుతుంది. "చదువుతున్నాగా అమ్మా!" అంటుంది. ఒకోసారి కూతురు కాస్త మూడీగా ఉందంటే చాలు వార్నింగ్ లు ఇస్తుంది. మనసులో ఎక్కడో ఉలికిపాటు, భయం. 'కూతురికి తన పోలిక వస్తుందేమో! అమ్మో! దేవుడా! కాపాడు' అంటూ దండాలు పెట్టుకుంటుంది.
సీత భయాలు ఉత్తి భయాలు కావనీ, నిజాలు కావచ్చేమోననే ఓ చిన్న సంఘటన సీత కంటిమీద కునుకు లేకుండా చేసింది.
ఓ రోజు సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చేసరికి ఇంట్లోంచి మాటలు, నవ్వులు వినిపించాయి. హాల్లో శంకర్ అనే అసోసియేట్ డైరెక్టర్ కొత్తగా వచ్చాడు. ఆ కుర్రాడు, రేణుక కబుర్లు చెప్పుకుంటున్నారు.
"అదిగో అమ్మ వచ్చింది. అమ్మా, ఈయన నన్ను హీరోయిన్ని చేసేస్తాడట. కొత్త సినిమాకి హీరోయిన్ కావాలట" రేణుక నవ్వుతూ అంది.
సీత మొహం పాలిపోయింది. రక్తం మొహంలోకి పొంగుకొచ్చింది. వెంటనే "నోర్ముయ్" అంది గట్టిగా. తల్లి ఎందుకంత గట్టిగా అరిచిందో అర్థంకాక రేణుక భయంగా చూసింది. "వెళ్లు, లోపలికి వెళ్లు. నీకు ఏం చెప్పాను? చదువు తప్ప ఇంకోమాట నీ నోట వినబడకూడదన్నానా?" హెచ్చరించింది. బిత్తరపోయి చూస్తున్న శంకర్ వంక తిరిగి దండం పెడుతూ "బాబూ! చిన్నపిల్ల. చదువుకోవలసిన వయసు దానిది. లేనిపోని ఆశలు చూపించి దాని బతుకు నాశనం చెయ్యొద్దు."
"లేదు నిజంగానే..."
అపరకాళిలా నిప్పులు చెరిగే కళ్లతో "వద్దు. నువ్వు నా కూతుర్ని ఏ హీరోయిన్నీ చెయ్యనక్కరలేదు. వెళ్లు ముందు" అని హూంకరించింది. అతని చెయ్యి పట్టుకుని గుమ్మం అవతలికి లాగి "మళ్లీ ఇటు కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు" వార్నింగ్ ఇస్తూ అరిచింది. శంకర్ గాభరాగా స్కూటర్ స్టార్ట్ చేశాడు.