మనసులో సంతోషపడ్డారో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం ఆయన ముఖకవళికలు ఏమాత్రం మారలేదు. లేక నా దగ్గిర అది నటనో నాకు తెలియదు. ఎంత దుర్మార్గపు భర్త అయినా కడుపుతో వున్న స్త్రీని అపురూపంగా చూస్తారంటారు. అదీ అబద్దమే అయింది నా విషయంలో. వేవిళ్ళతో బాధపడ్తున్నాగాని, వంట్లో సరిలేక లేవలేకపోయినా, వేళపట్టున ఏది అమరకపోయినా ఆయనగారికి ఏ చిన్న లోటువచ్చినా ఇంత పిసరు సర్దుకోక పోగా-
"ఈనాటికి లోకంలో కడుపుతోవున్న దానివి నీ వొక్కర్తివే కాదు. ఎప్పుడు చూసినా పడక-బద్ధకం బలిస్తే అలాగే వుంటుంది. లేచి కులాసాగా తిరిగితే కదా ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడు చూసినా నిద్రమొహం నీవూను" అంటూ విసుక్కునేవారు.
ఆయనపట్ల నా విముఖత మరింత పెరిగింది. ఇంక ఆ పిల్లలని చూసుకుని బతుకు ఈడ్చాలి అన్న విరక్తిలో, నిర్లిప్తతలో పడ్డాను.
నన్ను ఆ బంధంతో బంధించడం ఇష్టంలేనట్టు భగవంతుడు నా మీద దయతలిచో, నన్నింకా పరీక్షించడానికో అన్నట్టు-మూడో నెలలో ఎబార్షన్ అయింది. బాత్ రూములో బాల్చి ఎత్తుతూ కాలుజారి పడ్డాను. అసలే నీర్సంగా తిండి లేకుండావున్న దెబ్బకి రక్తస్రావం అయింది.
'తీరి కూర్చుని ఏదో తెస్తావు. నిన్ను బాల్చి ఎవరు మోయమన్నారు' అంటూ తిట్టారు.
బాల్చితో వేడినీళ్ళు స్నానానికి నేను పెట్టాలి. అలాంటి ఆయన బాల్చి ఎందుకు మోసావని తిడితే ఏం చెయ్యడం!
తీసికెళ్ళి ఆస్పత్రిలో పడేశారు. ఎబార్షన్ అయింది అసలే నీరసం మీద చాలా రక్తంపోయి వారం రోజులు పక్కనంటిపెట్టుకుని వుండాల్సి వచ్చింది.
ఆ వారం రోజులు ఆయన విసుగు చెప్పనలవికాదు. బాధతోవున్నా మనిషికి ఓదార్పు ధైర్యం ఇవ్వాల్సింది పోయి విసుక్కుంటూంటే ఈ ప్రాణంపోతే ఎంత హాయిగా వుండేదని బాధపడ్డ్డాను.
అమ్మని చూడాలని వూరికే తపనపడింది మనసు. నోరు తెరిచి అడగడానికి అభిమాన పడ్డాణు. అడిగినా ఆయన వాళ్ళకి రాయకపోతే అనిపించి వూరుకున్నాను.
ఇంటికి వచ్చాక శవాకారంగా తయారయిన నా అవతారం చూసి, పనిచేసుకోడానికి నేను పడేఅవస్థ చూసి ఆ రాయిలాంటి మనిషికి కూడా జాలి అనిపించింది గాబోలు నాలుగు రోజులు పోయాక 'మీ అమ్మగారిని కొన్నాళ్ళు రమ్మని రాయి. సాయం వుంటారు' అన్నారు.
ఇప్పుడయినా మీ యింటికెళ్ళు రెస్టుతీసుకురా అంటే సంతోషించే దాన్ని. అమ్మరావాలి, చాకిరి చెయ్యాలి, ఆయనగారికి సమస్త సౌకర్యాలు జరగాలి. ఒకరోజయినా ఆయన సర్దుకోరు.
'అవసరం లేదులెండి, నామీద మీకెంత జాలి' అన్నాను ఉక్రోషంగా-
"అయితే ఏడు, నీ ఖర్మ పోనీ అని చెబితే బుర్ర తిరుగుడు" అన్నారు కోపంగా.
శ్రీధర్ గదిలోకి వస్తూ విజయని చూసి "ఇవాళ డ్యూటీకి శలవు ఇచ్చేశావా ఏమిటి, నీ పేషంట్లు కాచుకు కూర్చున్నారు అవతల. వెళ్ళిపొమ్మన్నావా ఏమిటి వాళ్ళని" నవ్వుతూ అడిగాడు.
విజయ టైమ్ చూసుకుని అయ్యో ఈ మాటల్లో పడి టైము కూడా చూడలేదు....జస్ ట్ ఎ మినిట్-
'శారద కాసేపు రెస్టుతీసుకో పని పూర్తి చేసుకువస్తాను.' విజయ హడావిడిగా లేచి వెళ్ళింది. వెడుతున్న విజయని శ్రీధర్ ని చూస్తే ముచ్చట అన్పించింది శారదకి. అతని కళ్ళల్లో ఆమెపట్ల ఎంత అనురాగం, ఆరాధన కనిపిస్తుంది. అలాగే విజయా శ్రీధర్ ని దేముడన్నట్టు భావిస్తున్నట్టు ఆమె ప్రతిచర్యలో కన్పిస్తుంది. ఎంత అదృష్టవంతురాలు డాక్టర్ - ఆలుమగల అన్యోన్యతని మించిన సంపద ఏం కావాలి ఆడదానికి!
అందంగా, ఆనందంగా వుండే ఆవిడ వెనుక ఏదో కథ వుందంటే ఆశ్చర్యకరమనిపిస్తూంది. ఆవిడ కథ తెలుసుకోవాలని శారదకి మహా ఆరాటంగా వుంది. గంటసేపటి నుంచి మాట్లాడి మాట్లాడి అలసిపోయి కళ్ళు మూసుకోంది శారద.
* * *
'శారదా, సరే యిన్నాళ్ళనించి లేనిది యివాళ కొత్తగా ఏం జరిగిందని ఆత్మహత్యకి తలపడ్డావు చెప్పు. కొత్తగా వచ్చిన కష్టం ఏమిటి?" పన్నెండు గంటలవరకు ఊపిరి తిరగని పనిలో సతమత మయి పేషంట్లు వెళ్ళాక ఆరాటంగా గదిలోకి వస్తూనే అడిగింది విజయ.
శారద మాటాడలేనట్లు కళ్ళు వాల్చుకొంది.
"ఏం జరిగింది శారదా?" ఆరాటంగా చూసింది విజయ చెప్పమన్నట్లు.
"డాక్టర్! మొన్నటి రోజుతో నాసహనం, ఓర్పు ఆఖరి మెట్టుకు వెళ్ళాయి. డాక్టరుగారూ! మా చెల్లెలి పెళ్ళండీ. మరి నాలుగు రోజుల్లో. చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళ వీలులేదంటే నా మనసెంత బాధపడుతుందో ఆయనకి తెలీదా! తెలిసే నేను ఏడిస్తే చూడాలని ఆయనకి సరదా. పెళ్ళికి వెళ్ళడానికి వీలులేధంతే నేను సహించలేక, ఇన్నాళ్ళు అణిగి వున్న కసి, ఉద్రేకం నాలో కట్టలు తెంచుకోగా వళ్ళు మరిచి అరిచాను, తిట్టాను-'మీరు మనుషులు కాదు పశువులు, రాక్షసులు, మీలో సంస్కారం మాట దేముడెరుగు-మానవత్వం లేదు, నరరూప రాక్షసులు, నేనేం తప్పు చేశానని నన్నిలా హింసిస్తున్నారు నా మీద యింత కక్ష మీ కెందుకు? ఛీ. మీ మొహం చూడాలంటేనే అసహ్యం నాకు. మీతో కాపురంకంటే యింత విషం మింగి చావడం నయం' అంటూ కసితీరా తిట్టి ఏడిచాను.