Previous Page Next Page 
నయనతార పేజి 18

 

    సారధి తార చూపు నించి తప్పించుకున్నాడు. ఏమనాలో తోచలేదు ఒక్క క్షణం. "పోయిందా కోపం ఇప్పటి కైనా" కాసేపటికి తారే అంది. సారధి తలెత్తి ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. "నాకేం కోపం? నీమీద కోపగించదానికేం నాకేం అధికారం వుంది !" గడుసుగా తప్పించుకుంటూ అన్నాడు. తార ఆశ్చర్యంగా చూసి " ఏం తెలివి? ఎంతయినా మగవాడివి? ఇప్పటివరకూ అలిగి, ఇప్పుడు నాకేం కోపం అంటున్నావు? ఎంత గడుసుతనం? పొరపాటు వప్పుకోడం చిన్నతనంగాదూ , ఎప్పుడూ మీదే పై చెయ్యిగా వుండాలి కదూ. అవునా!"
    "సర్లే , ఏదో అయింది . దీన్నే గాబోలు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీషులో " నవ్వాడు సారధి. "ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు?"
    "ఇందుకే. తమరికి కోపం వచ్చింది గదా, బ్రతిమాలాడుకుని ప్రసన్నుడిని చేసుకోవాలని ...."
    "నా కోపతాపాలతో నీకేం పని! ప్రఖ్యాత నటీమణివి. నాలాంటి అప్టరాల్ గాడ్ని ప్రసన్నం చేసుకోవలసిన అవసరం నీకేమిటి , నీ కృపా వీక్షణాల కోసం నేను పాటుపడాలి గాని...." హాస్యంగా అన్నాడు.
    "అలా అనుకోవడం లేదుగా నీవు" తార అలిగినట్టు మూతి బిగించి అంది." అందుకే నీకు లోకువయ్యాను గదూ....? అస్తమాను నిన్ను రమ్మంటున్నానని, ఇది నా వెంట పడిందని అనుకుంటున్నావు గాదూ!"
    తన మనసులోనిది గ్రహించినట్టు తార అంటూంటే అబద్దం  అని ఖండించలేకపోయాడు సారధి. ఏం చెప్పాలో అని తడబడే లోపున "అమ్మగారూ భోజనానికి వస్తారా?" అంటూ తార అయా వచ్చింది లోపలికి. సారధి వాచీ చూసుకున్నాడు ఎనిమిది దాటింది. లేచి నిల్చున్నాడు . "వస్తాను , నీకు భోజనం టైమైనట్టుంది."
    "అదేమిటి వెళ్ళిపోతున్నావా? భలే వాడివే వెళ్ళి పోవడానికి పిలిచానను కున్నావా ఏమిటి?"
    "అస్తమానూ ఇదేమిటి సుందరీ, నన్నిలా మొహమాట పెట్టడం బాగుందా !"
    "మొహమాట పడమని ఎవడు చెప్పాడు నీకు, ఇంక పడడం మానేయి. చక్కగా భోం చేసి కాసేపు బీచ్ లో కూర్చుని, సెకండ్ షో ఏదన్నా మంచి పిక్చర్ కి వెడదాం...." ప్రోగ్రాం అంతా ఆలోచించే పెట్టింది తార అప్పటికే. ఇంకేమంటాడు సారధి. కాదనలేని బలహీనత కాక, మరేదో భావం కూడా అతన్ని వశపరచుకుంది.
    ఆ రోజు భోజనం దగ్గర ఓ సీను జరిగిపోయింది. భోజనం బల్ల ముందు కూర్చుంటూనే పదార్ధాలు చూసి "అబ్బ , ముల్లంగి కూరా ఇవాళ! ఇంకేదన్నా చేసావా లేదా! నాకోసం?" అంది వంట అయ్యరుతో తార విసుగ్గా. అతను కాస్త బెరుకుగా "లేదండి ." అన్నాడు.
    "లేదూ, మరేం తింటా ననుకున్నావు. నాకీ కూర సయించదని తెలియదూ. ఈ వెధవ కూర చేయద్దని ఇది వరకు చెప్పానా లేదా?" తార గొంతు తారా స్థాయికి  లేవడం ఆరంభించింది.
    "నేనేం చెయ్యనండి. అక్కడికి అమ్మగారికి చెప్పానండి మీరు తినరని పరవాలేదు అన్నారు."
    ఈ లోపల తార తల్లి గబగబ లోపల్నించి వచ్చింది "ఏమిటే సుందూ ' అంటూ . "అయ్యో నా మతి మండిపోనూ ఈ కూర నీవు తినవన్న సంగతే మరిచిపోయేనే తల్లీ" అంటూ సాగదీసింది.
    "అమ్మగారీ కూర తినరని నే చెప్పానా లేదా మీకు, ఇదే వందమన్నారు. అమ్మ నన్ను తిడ్తున్నారు" తార ఏదో అనే లోపలే వంటవాడు కోపంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు.
    'అవ్వ....అవ్వ.....నాకు చెప్పావా నీవు. ముసలిదాన్ని, మతిమరుపుదాన్ని గుర్తుండదు. పోనీ నీవు చెపితే ఎందుకు వండమంటాను. దాని కోసం వేరే ఏదన్నా చేయించే దాన్ని కాదూ." ఆవిడ అయ్యరుని ఉరిమి చూసింది.
    "ఇదిగో అమ్మా, పెద్దవారు అబద్దాలాడమకండి. ఇందాక హల్లో మీరు కూర్చుండగానే వచ్చి చెప్పలేదూ పరవాలేదు లెద్దూ ఒక పూటకి, అది వండేయి..... అనలేదూ...."
    "అయ్యయ్యో .... చెప్పవా నాకు నీవు. ఎవరితో మాట్లాడుతూ , ఏది విన్నానో, ఏమనుకున్నానో , అమ్మాయి కోసం అంటే ఊరుకుంటానా ?' ఆవిడ గబగబ అంది.
    ఈలోపల తండ్రి, అన్న వదిన అందరూ చేరారు గదిలో ఏమిటేమిటంటూ . "ఒసేయ్. మీకెవరికీ బుద్ది లేదర్రా. అమ్మాయి సంగతి ఎవరికీ అక్కరలేదు. మీ మీ సుఖాలు తప్ప దాని సంగతి ఎవడూ పట్టించుకోరు." భార్యని తిట్టడం మొదలు పెట్టారు అయన. " అమ్మా, నీవు పెద్దదానివయిపోయావు. మతిసరిగా లేకపోతే నీ కోడలుకి అప్పచెప్పకూడదూ ఆ పెత్తనం. ఇంత మందిమీ ఇంట్లో పడి తింటూ దానిక్కావలసినవి చూడక పొతే ఎలా. ఒసేయ్ , అలా మొద్దులా నిలబడి చూడకపోతే నాలుగు బంగాళా దుంపలన్నా తరిగి గబగబ వేయించకూడదూ." భార్యని కేక వేశాడు అన్నగారు.
    "బాగుంది . మధ్య నన్నంటారేం. నా పెత్తనం అయితే సుందరికేం కావాలో కళ్ళల్లో వత్తు లేసుకు చూసి అమర్చనూ" అంది మూతి తిప్పుకుంటూ వదినగారూ.
    "అనండర్రా అనండి. అదేదో నాకు సవితి కూతురు అయినట్టు నన్నే అనండి. అది నా కూతురు కాదూ, అది తినకపోతే నాకంటే మీ అందరికీ ఎక్కువా బాధా....... కన్నకడుపు నాది. అయ్యరూ , ఏమిటలా నిలబడి చూస్తావు. గబగబ మరేదన్నా వండు."

 Previous Page Next Page