దానికి పరిష్కారం? తల్లిదండ్రులు, చెల్లి కళ్ళముందు మెదిలారు ఆదిత్యకు.
తనకేదయినా ప్రమాదం లేదు. తనవాళ్ళకేం జరగకూడదు.
అంటే...
తనీ జైలు నుంచి బయటపడాలి.
తన సమస్యకి పరిష్కారం... అహోబలపతిని చంపడం. అతన్ని చంపేశాక-
తనని కోర్టు హేంగ్ చేసినా ఫర్వాలేదు.
తన వాళ్ళందరూ సుఖంగా వుంటారు.
ఎస్! దృఢ నిశ్చయానికొచ్చాడు ఆదిత్య.
అదే సమయంలో-
ఇనుప చువ్వల మీద చప్పుడు వినిపించింది ఆదిత్యకు.
తలతిప్పి చూశాడు.
ఎదురుగా సెంట్రీ!!?
"నిన్ను సాబ్ పిలుస్తున్నారు" అన్నాడతను.
ఎందుకు అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నలేస్తూ లేచాడు ఆదిత్య.
* * * * *
"నువ్వు ప్రిజనర్ వో, సూపరింటెండెంట్ వో నా కర్థంకావడం లేదయ్యా! ఇప్పటివరకూ నాకు డైరెక్ట్ గా హోంమినిస్టర్ నుంచి ఫోన్ రాలేదు. నీకు ఫోన్! కూర్చో ఫోనొస్తుంది..." అన్నాడు సూపరింటెండెంట్.
ఆదిత్య బెంచీమీద కూర్చున్న రెండు నిమిషాల తరువాత ఫోన్ మోగింది.
జైల్ సూపరింటెండెంట్ రిసీవర్ తీసుకొని ఆదిత్యకిచ్చాడు.
"ఆదిత్యా! నేను...."
ఆ గొంతును గుర్తుపట్టాడు అతను. అది హోంమినిస్టర్ గొంతు కాదు.
చీఫ్ మినిస్టర్ అహోబలపతి గొంతు.
"బాగున్నావా?"
ఆదిత్య పలకలేదు అతని నరనరంలో ఏదో తెలీని ఉద్రేకం, ఉద్వేగం, కసి, కోపం.
"నీ దగ్గరకొచ్చిన వ్యక్తి చెప్పిన పని రేపు ఆదివారంనాడు పూర్తిచేస్తే బాగుంటుంది. లేకపోతే... నువ్వు సోమవారంనాడు భయంకరమైన వార్త వినాల్సివస్తుంది."
ఫోన్ రిసీవర్ టక్కున పెట్టేసిన చప్పుడు.
ఆదిత్య ముఖం కందగడ్డలా మారింది గబుక్కున వెనక్కి వచ్చేశాడు.
"ఐ విల్ కిల్ యూ... ఐ విల్ కిల్ యూ..."
అతని గుండెల్లో లబ్ డబ్ శబ్దానికి బదులు, ఆ శబ్దం వినిపిస్తోంది.
ఆదివారం...
అంటే... ఇంకా రెండు రోజులు!
ఇంకా 48 గంటలు... జెంటిల్ మన్ లా కనిపిస్తున్న ధరణి సూసైడ్ చేసుకొనేలా చేయాలి. అహోబలపతి తనను నమ్ముతున్నాడు. లేదంటే మరో పని అప్పగించడు. అలాగే నమ్మాలి. నడిరోడ్డులోకి లాగి నరికేసే వరకూ అలాగే తనను నమ్మాలి. పళ్ళు కొరుక్కుంటూ లోలోపలే అనుకున్నాడు ఆదిత్య.
* * * * *
చార్మినార్ ఎడం పక్కనున్న గల్లీలోకి కారు మలుపు తిరిగింది. ఆ వెనక రెండు జీపులు.
వరసగా గల్లీలు, బస్తీల్లోంచి రెండున్నర కిలోమీటర్ల దూరం వరకూ వెళ్ళి, అక్కడొక విశాలమయిన భవనంలోకి ప్రవేశించాయి.
ఆ భవనానికో మూడువందల సంవత్సరాల వయసుంటుంది. చుట్టూ గార్డెన్, మధ్య ఒంటరిగా వుందా బిల్డింగ్.
విశాలమైన పోర్టికో మెట్లదగ్గర ఆగింది అంబాసిడర్ కారు... అందులోంచి దిగాడు యాభై రెండేళ్ళ గుర్రం పెద్దబ్బాయి.
నున్నగా గీసిన గుండు, తెల్లటి మీసాలు, అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తు, బండ పెదాలు, దృఢమైన మనిషి.
అటూ ఇటూ చూసి-
లోనికి అడుగులేశాడాయన. నేరుగా ఆఫీసు రూమ్ లోకెళ్ళిపోయి, ఖరీదయిన కుషన్ సీట్లో కూర్చుని, స్టెనో కమ్ క్లర్క్ వేపు చూసి-
"ముషీరాబాద్ జైల్ కు కలుపు" అన్నాడు.
రెండు నిమిషాల్లో జైల్ సూపరింటెండెంట్ లైన్లోకొచ్చాడు.
"ధరణిబాబుగారికి ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం సార్! ఫెసిలిటీస్ అన్నీ యిచ్చాం సార్..." వినయంగా చెప్పాడు సూపరింటెండెంట్.
"అసలే డెలికేట్ ఫెలో. ఫ్యామిలీలో తప్పబుట్టాడు జాగ్రత్తగా చూసుకో. ఇంకెన్నాళ్ళు? పదిరోజులే గదా! బైదిబై... ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేశావు?"
"మీ అనుమానం నిజమే సార్! హోంమంత్రి మొన్ననే స్వయంగా వచ్చి అరగంటసేపు ఆదిత్యతో మాట్లాడి వెళ్ళాడు సార్!"
గుర్రం పెద్దబ్బాయి భృకుటి ముడిపడింది.
"ఏం మాట్లాడాడు?"
"తెలీదు సార్!"
"చూడు సుబ్రహ్మణ్యం! వాడి ద్వారా నాకు రెండే రెండు విషయాలు తెలియాలి. ఆ పిస్టల్ వాడికెలా దొరికింది? రెండు... అహోబలపతికి, వాడికి వున్న సంబంధం ఏంటి? ఎప్పుడు తెలుసుకుంటావ్?"
జైల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం వెంటనే జవాబివ్వలేదు.
"నువ్వా ఇన్ఫర్మేషన్ సంపాదించు. ఇంటికి యాభై వేలు పంపిస్తాను."
డబ్బు మాట వినగానే గువ్వ కువకువలాడినట్టు నవ్వాడు సుబ్రహ్మణ్యం.
"ఇవాళ రాత్రికి... వాడి దగ్గర్నుంచి ఇన్ ఫర్ మేషన్ సంపాదిస్తాను. నాకు తెలుసు కదా! ఎలాంటి ఇన్ ఫర్ మేషన్ ఎలా వస్తుందో! తర్వాత విషయం మెడ చూసుకోవాలి" నవ్వుతూ అన్నాడతను.
"నువ్వసలే రాక్షసుడివి. వాడు చావకూడదు... అర్ధమైందా? వాడితో చాలా అవసరం వుంది నాకు."
"అర్ధమైంది సార్...."
ఫోన్ పెట్టేశాడు గుర్రం పెద్దబ్బాయి. ఎదురుగా నిల్చున్న వ్యక్తి వైపు చూశాడు.
వాడి పేరు బాలయాదవ్. గుర్రం పెద్దబ్బాయి కుడి భుజం.
"నిజాం కాలేజీ మీటింగ్ కి ముందురోజు... అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అహోబలపతి తన బృందంతో ఓల్డ్ పి.జి. హాస్టల్ కెళ్ళి ఆదిత్యను కలిసాట్ట... సార్..."
"ఏం మాట్లాడాడు?"
"తెలీదు సార్!"
"నా పిస్టల్ ని అహోబలపతి ఆదిత్యకిచ్చాట్ట."