Previous Page Next Page 
శరతల్పం పేజి 18


    అలా హాయిగా గడిచిపోతాయనుకున్నారు రోజులు నారాయణస్వామి దంపతులు. కాని అలా జరగలేదు. అంతా తలకిందులైంది. గురువయ్య పిచ్చమ్మను చూచిన్నాటినుంచి నారాయణస్వామి ఇంటివైపు రావడం మానేశాడు. నారాయణస్వామి కాలుకాలిన పిల్లిలా వెనక్కూ, ముందుకూ తిరగసాగారు. వారికి లేనిపోని వంటరి తనం, చిరాకు, కలవరపాటు మొదలయినాయి. ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు. ఊళ్ళోకి వెళ్ళేట్లు లేరు___గడప దాటడం లేదు, ఇంట్లో తోచటం లేదు. లచ్చమ్మ స్నేహితంతో నాంచారమ్మకూ, నారాయణస్వామికి దూరం పెరిగింది. వారిద్దరూ అన్యోన్యంగా మాట్లాడుకోవలసిన విషయం కనిపించడంలేదు.    
    తొలి రోజు గురువయ్యతో తన్నులు తిన్న తరువాత లచ్చమ్మ నాంచారమ్మ ఇంటివైపు రావడం మానేసింది. తన ముఖం చూపించడం ఎందుకో సిగ్గనిపించింది లచ్చమ్మకు. ఇంట్లో కూలబడి కుంగి, కృశిస్తున్నది గాని బయట అడుగుపెట్టడం లేదు. ఆమె మనసులోని క్షోభను దాచుకొని, ఆ అగ్గిలోనే ఆహుతి అవుతూంది లచ్చమ్మ. ఆమె బయటికి రాదు. ఒకరికి చెప్పుకోదు. నాంచారమ్మ చాలాసార్లు కబురుపెట్టింది. లచ్చమ్మ ఏదో నెపం చెప్పింది. పోలేదు.
    "ఏమండీ! నాకు పిచ్చిలేచేట్లున్నదండి" ముసుగు కప్పుకొని పడుకున్న నారాయణస్వామిని లేపి అన్నది నాంచారమ్మ. నారాయణస్వామి ముఖంమీది కప్పుతీసి నాంచారమ్మను చూచాడు అంతే. ఏమీ అనలేదు.
    "నిజం గనండి, మనసు గుబులు గుబులుగున్నది. ఎందుకంటరు?"
    నారాయణస్వామి లేచికూర్చున్నాడు. నాంచారమ్మ భుజంమీద చేయివేసి "ఏది! ఏమన్న మాట్లాడు!" అన్నారు.
    "ఏం మాట్లాడమంటరండీ" ఇంటి కప్పులోకి చూచింది. ఎక్కడో ఉన్న సందులోంచి సూర్యరశ్మి చారలా వస్తూంది. అది నేలమీదపడి ఒక వెలుగు వలయం ఏర్పడింది.
    "ఆఁ ఏం మాట్లాడాలె నంటవుకద! ఇవ్వాళ వంకాయ కూర బాగా కుదిరింది. నువ్వులు వేసినవా? ధనియాలా?"
    "లచ్చమ్మకు పెడ్తే శాన సంతోషించేదండి" వద్దనుకున్నా అదే ముచ్చట వచ్చినందుకు నాలిక్కరుచుకుంది నాంచారమ్మ.
    "నాంచారూ అంతా భగవన్మాయ. ఈ బంధాలు ఎందుకు కలిపిస్తడో, ఎందుకు తెంచుతడో వానికే తెలియాలే. ఈ బంధం తగిలిందని వేరే బంధాలు వదులుకున్నాం. గురువయ్య బాగయితున్నడనుకున్నం. అట్ల సంతోషపడవచ్చుననుకున్నం. మన సంతోషం ఆ పరాత్పరునికి ఇష్టం లేదు. గురువయ్య చెడిపోతున్నడు___మనకు దుఃఖం తెచ్చేటందుకు! మనం ఏం చేయగలం? మన చేతిలో ఏమున్నది? గురువయ్యకోసం సంఘాన్ని వదులుకున్నం. గురువయ్య మనను వదిలిండు. ఈ బంధం కూడా వదులుకోవటం మంచిది నాంచారూ____లచ్చమ్మను మరిచిపో" నారాయణస్వామి మాటల్లో దుఃఖపు జీరలు కనిపించాయి.
    "ఎట్ల వదులుకుంటమండి! వదులుకొని ఇంక బతుకెందుకండి.....ఎందుకండి బతుకు?" నాంచారమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. వద్దనుకున్నా చెక్కిళ్ళ వెంట కన్నీరు ధారగా పారుతూంది.
    "నిజమే నాంచారూ; కాని చావు మనం అనుకున్నప్పుడు వస్తుందా? అదీ మన చేతులో లేదు" నారాయణస్వామి కళ్ళు చెమ్మగిల్లాయి.
    ఎక్కడో దూరంనుంచి లచ్చమ్మ పిలుపు వినిపించి నట్లయింది__ఆలాపననుకున్నారు ముందు మళ్ళీ వినిపించింది పిలుపు. దిగ్గున లేచి ఉరికి వచ్చింది నాంచారమ్మ.
    లచ్చమ్మ నుంచొని ఉంది!
    నాంచారమ్మ "లచ్చమ్మా!" గట్టిగా అని ఆగిపోయింది___ నివ్వెరపోయింది___లచ్చమ్మను చూచి.
    "ఎట్లయినవు లచ్చమ్మా!" నాంచారమ్మ అనగలిగిన మాటలవి. అంతలో నారాయణస్వామి వచ్చేశారు.
    "లచ్చమ్మా! నువ్వేనా!" అన్నారు.
    లచ్చమ్మ పూర్తిగా మారిపోయింది. పోలికలు సైతం లేవు. బాగా శుష్కించి పోయింది. కాళ్ళూ చేతులూ పుల్లల్లా ఉన్నాయి. పొట్ట తప్ప ఏదీ కనిపించడం లేదు. ముఖం పూర్తిగా మారిపోయింది. కళ్ళు లోతుగా పీక్కుపోయాయి. దవడ ఎముకలు కనిపిస్తున్నాయి. చెంపలు పీక్కుపోయాయి. జుట్టు చిందర వందర గా ఉంది.
    ముఖంలో కళ లేదు. కళ్ళల్లో ప్రాణాలు కనిపించలేదు.
    "అవునండి" నవ్వుదామని ప్రయత్నించింది లచ్చమ్మ "జర నవుస్తున్న___వళ్ళు బాగాలేదు. జరాన్ని నూకలుంటే పెట్టకపోతిరి - గంజి కాచుకుంట" ఈ నాలుగు మాటలకే తనువు వస్తున్నట్లుంది. నుంచోలేకుండా ఉంది.
    "కూచో లచ్చమ్మా! నిలబడ్డవెందుకు?" నాంచారమ్మ అనడమూ లచ్చమ్మ కూలబడ్డమూ ఒకేసారి జరిగాయి.
    నారాయణస్వామి కనురెప్ప వాలడం లేదు.
    "ఎందుకట్లయినవు?" అడిగింది నాంచారమ్మ.
    "ఏం లేదుండి, జరమొస్తున్నది" రాకపోవడానికీ ఇలా కావడానికీ రెంటికీ సమాధానముంది అందులో.
    "గురువయ్య ఇంటికొస్తున్నడా?" నారాయణస్వామి అడిగారు.
    లచ్చమ్మ తలెత్తి స్వామి కళ్ళల్లోకి చూసింది____గురువయ్య సంగతి వీరికి తెలిసిపోలేదుగదా అని. నారాయణస్వామి కళ్ళల్లో ఏమీ కనిపించలేదు. లచ్చమ్మ దీనత్వమే ప్రతిఫలించింది వాటిల్లో. "వస్తానే ఉన్నడు" తలవంచి చెప్పింది లచ్చమ్మ.
    "వస్తుంటే ఇట్లెందు కయితవు?" నాంచారమ్మ.
    "వస్తనే ఉన్నడు ___రాకేం చేస్తడు?" నాంచారమ్మ ముకాన్ని చూచి చెప్పలేక తలవంచుకొని అన్నది___కాని గొంతు దుఃఖాన్ని సూచిస్తూంది.
    "గురువయ్య తప్పుతోవలు తొక్కుతున్నడు గద! తాగి నిన్ను కొడుతున్నడు గద! ఇంట్లకేం తేవటం లేదుగద!" నారాయణస్వామి మాటలు నగ్న సత్యాల్లా అనిపించాయి లచ్చమ్మకు. సత్యానికి తాను కప్పిన గుడ్డలు బరబరా కాలి పోతున్నట్లనిపించింది. అలా నిటారుగా నుంచొని కంటిరెప్ప వాల్చకుండా గంట కొట్టినట్లు పలికిన నారాయణస్వామిని చూచి వడకిపోయింది లచ్చమ్మ. 'నాకు అబద్దాలు చెపుతావా?" అని బెదిరిస్తున్నట్లున్నాయి స్వామి కళ్ళు.
    "అవును అయ్యగారూ" తల వంచుకొని అన్నది లచ్చమ్మ.
    "ఏం చేసిండే! ఎందుకు రావటంలేదే? ఎందుక్కొడ్తున్నడే?" అడిగింది నాంచారమ్మ-ఆవేదనగా.
    నాంచారమ్మలో లచ్చమ్మకు చనిపోయిన తన తల్లి కనిపించింది. నాంచారమ్మ నుంచున్నది దూరంగానైనా, దగ్గర కూర్చొని కళ్ళు తుడిచి అడుగుతున్నట్లనిపించింది. లచ్చమ్మ దుఃఖం ఆగలేదు. పొంగిపొర్లింది. "నా కర్మ అమ్మ గారూ నా కర్మ" అని తల బాదుకొని ఏడ్చింది. ఏడుస్తూనే తన ఇంట్లో జరుగుతున్న కథంతా వివరించింది. ఈరోజు బియ్యం తెచ్చి వండకుంటే లచ్చమ్మను చంపేస్తా నన్నాట్ట గురువయ్య. అందుకూ వచ్చింది నారాయణస్వామి ఇంటికి.
    నారాయణస్వామి దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. వారి కళ్ళూ చెమ్మగిల్లాయి. నాంచారమ్మ లచ్చమ్మ దగ్గిరగా వెళ్ళి "లచ్చమ్మా! ఇగ ఏడవకు. న ఆకడుపు తరుక్కొని పోతున్నది. గ్రహచరం మనకు బాగలేదు" అన్నది. లచ్చమ్మ చేతులు నేలకానించి మొక్కి "ఇగ ఏడవను తల్లీ ఏడ్వను. నాకు అమ్మ దొరికింది. మా అమ్మ బతికి వచ్చింది" అని కళ్ళు తుడుచుకుంటూన్న లచ్చమ్మను చూచి మాతృత్వం పొంగి పొరిలింది నాంచారమ్మలో. అవధులన్నీ అధిగమించింది____అడ్డుగోడలు కూల్చింది. "బిడ్డా" అని కూలబడి లచ్చమ్మను కావిలించుకొని గట్టిగా ఏడ్చేసింది.

 Previous Page Next Page