"రాజకీయ జీవితంలో వచ్చిన మార్పు నా జీవితంలో కూడా మార్పును తెచ్చింది."
"కాదు. నీలోనే ముందు మార్పు వచ్చింది. అదే రాజకీయ జీవితాన్ని మార్చింది." తీవ్రంగా అంది అరుంధతి.
"కావచ్చు. ఇప్పుడు నా ఆశయాలూ, అభిలాషలూ వేరు."
"ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెబుతున్నట్లు?"
"అదే..అదీ..........!"
"గాబరా అక్కర్లేదు. నిజమే చెప్పండి."
"అదే అరూ! ఇప్పుడిప్పుడే నేను రాజకీయాల్లో పైకి వస్తున్నాను. నా ఆశయం సిద్ధించాలంటే కొంత జాగ్రత్తగా వుండాలి. నామీద ప్రాణాలకు నమ్మకం కుదరాలి. పదిమంది వేలెత్తి చూపించేలా వుండకూడదు. కొంచం సందు దొరికితే చాలు, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో, ఎదుటిపార్టీవాళ్ళు ఏకిపారేస్తారు."
"ఇదంతా నాతో ఎందుకు చెబుతున్నట్టు?" అరుంధతి విరక్తిగా అడిగింది.
"విను అరూ! నన్ను అర్ధం చేసుకో. అందుకే చెబుతున్నాను. నువ్వు నాతో బాహాటంగా పని చేస్తూ వుంటే, అనేక రకాల పుకార్లు పుట్టవచ్చు" అంటూ అర్ధయుక్తంగా అరుంధతి ముఖంలోకి చూశాడు.
అరుంధతి తలవంచుకొని ఆలోచనలో పడింది. "నువ్వు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నానుకుంటున్నావు. ఇప్పుడే పతనం ప్రారంభం అయింది. ఆ పతనం ఎంత దూరం పోయి ఆగుతుందో ఎవరూ చెప్పలేరు" అనుకుంది అరుంధతి అతడి ముఖంలోకి చూస్తూ.
"నువ్వు విజయవాడ వెళ్ళు."
అరుంధతి ఆలోచనలనుంచి బయటపడింది.
"విజయవాడా? ఎక్కడకు? ఎవరి దగ్గరకు?"
"అదేం అలా అంటావు? మీ నాన్నగారుంది విజయవాడలోనేగా?"
"ఏ ముఖం పెట్టుకొని పుట్టింటికి వెళ్ళను? పైగా వాళ్ళ ఆర్ధిక పరిస్థితి నాకు తెలియందికాదు. నన్ను పోషించే స్థితిలో లేడు మా నాన్న."
"అది కాదు నేను అంటూంది. నువ్వు కొంతకాలంపాటు మీ పుట్టింట్లో వుండు. డబ్బు పంపిస్తూ వుంటాను. అప్పుడప్పుడు నేను వచ్చి పోతూవుంటాను."
"అంటే మరోసారి ఇంట్లోనుంచి బయటకు నెట్టిస్తారన్నమాట?"
"అరూ!"
"కాక మరేమిటి? నేను పుట్టింట్లో వుంటే మీరు డబ్బు పంపిస్తారా? అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ వుంటారా? అది మా నాన్న చూస్తూ వుంటాడా? మతివున్న మాటలేనా?"
రాజారావు మాట్లాడలేదు. అరుంధతి మళ్ళీ తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు మాట్లాడుతూంది.
"మెట్టిన ఇంట్లో స్థానభ్రష్ట అయిన స్త్రీకి పుట్టిన ఇంట్లో స్థానం వుంటుందనుకోను. నా విషయంలో ఇది మరీ కఠిన సత్యం. నరకం నుంచి స్వర్గంలోకి వెళ్ళాను. స్వర్గాన్ని నేనే నరకంగా మార్చుకున్నాను. ఎందుకోసం? ఎవరికోసం?"
"ఇప్పుడు నన్నేం చెయ్యమంటావో చెప్పు?"
అరుంధతి జవాబివ్వలేదు. తల వాల్చుకొని కూచుంది.
"చెప్పు. నన్నేం చెయ్యమంటావు?" ఆవేశంగా ప్రశ్నించాడు.
అరుంధతి తల ఎత్తలేదు. తను చెప్పాలా? తను ఏం చెబుతుంది? తన అసహాయస్థితి తెలిసికూడా ఏం చెయ్యాలని అడుగుతున్నాడా? తనను చూడగానే ఉద్వేగంతో గుండెల్లో దాచుకుంటాడనుకుంది. అతని ప్రాణాల్లో తన కోసం ఆర్తి నిండివుందనుకుంది. "నేను వుండగా నీకేం? భయపడకు" అంటూ తన బలమైన బాహువు క్రింద ఇంత నీడ ఇస్తాడనుకుంది. దుఃఖం కట్టలు తెంచుకొంది.
"అరూ!" ఆవేశంగా వుంది ఆ పిలుపు.
అరుంధతి తల ఎత్తలేదు. వంచివున్న ఆమె కళ్ళనుంచి నీటిబొట్లు రాలుతున్నాయి.
"అరూ! ఏడుస్తున్నావా? నువ్వు బాధపడటం నేను చూడలేను." ఆ కంఠంలో నిజాయితీ లేకపోలేదు.
"నేను మీ భవిష్యత్తుకు అడ్డు రాను. ఆనాడు మనం చేసుకున్న నిర్ణయానికి కట్టుబడే వుంటాను. భయపడకండి. మనం తప్పు చెయ్యనప్పుడు లోకానికి ఎందుకు భయపడాలి?" కన్నీళ్ళతో తడిసిన చెంపలను తుడుచుకుంటూ అంది.
రాజారావు కొంచెం తొట్రుపాటు చెందాడు. "ఆనాడు నిర్ణయం చేసిన మనిషి కాదు ఈనాడు. నేను చాలా మారిపోయాను. ఇప్పుడు ఇంతవరకూ వచ్చాక ఆ పరమ నీచుడి కోసం మనం ఎలాంటి త్యాగమూ చెయ్యనక్కర్లేదు. నిన్ను చూస్తూ నిగ్రహించుకునే శక్తి నాకు లేదు. ణా ఉద్దేశం కేవలం, కనీసం ఈ ఎలక్షన్స్ అయేంతవరకూ మనం బయటపడకూడదనే."
అరుంధతి ఆశ్చర్యంగా రాజారావు ముఖంలోకి చూసింది. కొంచెంసేపు దీర్ఘంగా ఆలోచించింది.
"అందుకని నన్ను పుట్టింటికి వెళ్ళమంటారు!" రెట్టించింది అరుంధతి.
రాజారావు ఆలోచిస్తూ కూచున్నాడు. వెంటనే అతనికి ఓ ఆలోచన తట్టింది.
"అయితే ఒకటి చేద్దాం, ఈ ఊళ్ళో మిసెస్ వైకుంఠం అనే సోషల్ వర్కర్ ఒకామె వుంది. ఆమె నాకు చాలా ఆప్తురాలు. ణా ఆసరాతో పైకి రావాలని తాపత్రయపడుతూంది. ఆమె ఇంట్లో మగవాళ్ళెవరూ వుండరు. నువ్వు ఆమె ఇంట్లో ఉంటే, కావాల్సిన డబ్బు పంపిస్తూ ఉంటాను. నేనుకూడా అప్పుడప్పుడు రహస్యంగా వచ్చిపోతుంటాను."
రాజారావు చివరివాక్యం వింటూనే అరుంధతి మనస్సు జుగుప్సతో నిండిపోయింది. ఆమె అదోలా నవ్వింది. భర్తతో "మాధవి నీ కూతురు కా"దని చెప్పినప్పుడు నవ్విన నవ్వులాంటి నవ్వే అది! రాజారావు ఆ నవ్వులోని భావం అర్ధచేసుకోవటానికి ప్రయత్నించలేదు. అరుంధతిని రెండు చేతులతో మృదువుగా పట్టుకొని హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు.
అరుంధతి వారించలేదు; సంతోషించలేదు; దుఃఖించనూలేదు.
కనుచీకటి పడుతోంది. రాజారావు గోముగా అరుంధతిని కుర్చీలో కూచోపెట్టాడు. తను వెళ్ళి తన కుర్చీలో కూచున్నాడు. బెల్ నొక్కాడు. బంగళా బంట్రోతు మరునిముషంలో హాజరయ్యాడు.
"రంగయ్యను పిలు!"
బంట్రోతు వెళ్ళిపోయాడు. కొంచెంసేపటికి రంగయ్య వచ్చి వినయంగా నిల్చున్నాడు.
"రంగయ్యా!"
"అయ్యా!"
"శ్రీమతి వైకుంఠం ఇల్లు తెలుసా!"
"తెలుసునండి!"
"కారు తీసుకెళ్ళి ఆమెను వెంటనే రమ్మన్నానని చెప్పి తీసుకురా"
"చిత్తం!" రంగయ్య బయటికి వెళ్ళిపోయాడు.
"అరూ!"
అరుంధతి ఆలోచనలనుంచి తేరుకొని ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఏమిటిలా వున్నావు? ఇక్కడ నువ్వు కొద్దికాలమే ఉంటావు. ఎలక్షన్ కాగానే నన్ను హైదరాబాదు తీసుకెళతాను."
"మీ ఇష్టం!" అంది విరక్తిగా అరుంధతి.
"నువ్వు అదోలా వున్నావు. నాకు మనస్సేమీ బాగాలేదు. నవ్వుతూ వుండాలి" అన్నాడు రాజారావు సిగరెట్ వెలిగించుకుంటూ.
"ఇదెప్పటినుంచి నేర్చుకున్నారు?"
"ఏమిటి?"
"అదే సిగరెట్ తాగడం!"
"జైల్లో అలవాటయింది. జైల్లో నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పిచ్చెత్తినట్లుండేది. సిగరెట్ అలవాటు చేసుకున్నాను." గతాన్ని తలుచుకుంటూ సిగరెట్ దమ్ము గట్టిగా పీల్చాడు.
అరుంధతి నమ్మలేనట్లు ముఖం పెట్టింది.
"నువ్వు నమ్మటం లేదుకదూ? నీ రూపం ణా హృదయంలో మధుర ఆలాపనలా నిలిచిపోయింది. ఈనాడు నాకు ఆనందమూ, ఆవేదనా రెండూ కలుగుతున్నాయి. నీకు అన్యాయం చెయ్యను అరూ! నాకోసం-నీ గౌరవం, నీ కన్నబిడ్డా, నీ సర్వస్వం వదిలి వచ్చేశావు! నీకు అన్యాయం చెయ్యలేను. నేను బ్రతికి వుండగా నీకు ఏ లోటూ ఉండదు." ఆర్ద్రతా, ఆదరణా నిండివున్న కంఠంతో అన్నాడు. అలా అంటున్నప్పుడు రాజారావు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత కాదనుకున్నా అతని మాటల్లో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది అరుంధతికి.
తలుపు తెరుచుకుంది. బంట్రోతు వచ్చాడు. శ్రీమతి వైకుంఠం వచ్చిందని చెప్పాడు.
"లోపలకు పంపించు" అన్నాడు రాజారావు సిగరెట్ పొగ గట్టిగా వూదుతూ.
ఖద్దరు దుస్తుల్లో ఉన్న ఓ స్త్రీ లోపలకు దొర్లింది. ఆమె లావుపాటి శరీరం-ముతక ఖద్దరు చీర కట్టుకొని ఇంకా లావుగా. మూడు సున్నాలు చుట్టినట్టుగా వుంది. అరుంధతికి ఆమెను చూడగానే నవ్వొచ్చింది. ఆ స్త్రీ లోపలకు వస్తూనే సాలోచనగా అరుంధతి వేపుచూసి అదోలా నవ్వింది. అరుంధతికి ఆమె నవ్వు అనిష్టంగా తోచింది. ముఖం చిట్లించుకుంది.
"కూచోండి" అన్నాడు రాజారావు మిగిలిపోయిన సిగరెట్ ను యాప్ ట్రే అంచుగా నొక్కి, ట్రేలో పడేస్తూ.
"అయ్యా, సెలవిప్పించండి!" అంది శ్రీమతి వైకుంఠం అనవసరంగా అతిగా పెరిగిపోయిన శరీరాన్ని కుర్చీలో పడేస్తూ. ఆమె కుర్చీలో కూచున్న తీరు చూస్తే రాజారావుకు కూడా నవ్వొచ్చింది. కాళ్ళు కింద ఆనటంలేదు.
"చూడండీ! ఈ అమ్మాయి బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. ఈమెను ఎలక్షన్స్ అయిపోయేదాకా మీ దగ్గరే ఉంచాలి. ఎలాంటి కష్టం కలగ్గూడదు. ఈమెకు అయ్యే ఖర్చు ఎంతయినా నేను భరిస్తాను. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుంటాను."
"నాకు తెలియదా?" అన్నట్లు మిసెస్ వైకుంఠం అర్ధయుక్తంగా నవ్వింది. అది చూసి అరుంధతికి అసహ్యం వేసింది. రాజారావుకు కూడా చిరాకు వేసింది. ముఖం చిట్లించుకున్నాడు. శ్రీమతి వైకుంఠానికి చిరుచెమట్లు పట్టినంత పనయింది. ఆమెకు తను చేసిన అపరాధం ఏమిటో బోధపడలేదు.
"అలాగేనండి. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను" అంది మిసెస్ వైకుంఠం. ఇలాంటి విషయాలు తనకు కొత్తకాదు.
అలాంటి అర్ధయుక్తమైన తన నవ్వుకు మగవాళ్ళు నుంచి ఇంతకుముందు ఉత్సాహాన్నే పొందింది. రాజారావు స్వభావం అంతేనేమోలే అని సరిపెట్టుకుంది.
అరుంధతికి ఆమెతో వెళ్ళటానికి మనస్కరించలేదు. రాజారావుకు గూడా ఏదో ఎబ్బెట్టుగానే ఉంది.
మిసెస్ వైకుంఠాన్ని గురించి చాలా విషయాలు విన్నాడు. ఆ పరిస్థితుల్లో అంతకంటే తను చెయ్యగలిగిందేమీ లేదు.
"చాలా పెద్దకుంటుంబం పిల్ల! అందరిలా చూసేవు!"
"అయ్య ఎంత మాట?" అంది శ్రీమతి వైకుంఠం.
అరుంధతికి వాళ్ళ చివరిమాటల్లో ఏదో గూఢార్ధం ఉన్నట్లు అనిపించింది.
అరుంధతి శ్రీమతి వైకుంఠంతో వెళుతూంటే తనుకూడా కారువరకు వచ్చి సాగనంపాడు రాజారావు. తనకోసం ఎంత సాహసం చేసింది! గాఢంగా నిట్టూర్చాడు.
22
శ్రీమతి వైకుంఠం చాలాకాలంనుంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఉంది. గుంటూరులో ఆమెను ఎరుగనివారు లేరు. ఎంతలేదన్నా ఆమె పేరుమీద బ్యాంకులో ఓ పదివేలైనా డబ్బునిలవ ఉంటుంది. ఆమె ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు ఆ మధ్య స్వయంగా కట్టించుకొన్నదే. ఇల్లు మరీ పెద్దది కాకపోయినా చిన్నదిమాత్రం కాదు. ఆధునిక పరికరాలతో చక్కగా కట్టించింది. ఖరీదైన ఫర్నిచర్ తో ఇల్లు అలంకరించింది. హాల్లోకి ప్రవేశిస్తూనే నిలువెత్తు వెంకటేశ్వరస్వామి పటం ఆహ్వానిస్తుంది. ఆ హాలు గోడలనిండా దేశనాయకుల ఫోటోలు ఉన్నాయి. అనిబిసెంటు ఫోటోకూడా ఉంది. అంత మంచి ఇల్లు ఆమె బీదసాదలు ఉండే బస్తిలోనే కట్టించుకుంది. అక్కడ ఉంటేనే తను బీదవాళ్ళ దగ్గరగా ఉండి సేవ చెయ్యటానికి అవకాశం ఎక్కువ లభిస్తుందని చెబుతూ ఉంటుంది. ఆమె ఆ వూళ్ళో వాళ్ళకు తలలో నాలుకలా ఉంటుంది. ఆమె విషయాలు కొన్ని కొందరికి నచ్చవు. "కాని ఆమాత్రం సర్వీసు చేసేవాళ్ళు ఏరీ?" అనుకుంటూ సరిపెట్టుకుంటారు. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా శ్రీమతి వైకుంఠం అందరికంటె ముందు వచ్చి వాలిపోతుంది. అధికార పార్టీవారి రాజకీయ సభలు ఆ ఊళ్లో ఆమె చేతిమీదగా జరగాల్సిందే. ఆమె నిష్కామకర్మ చేస్తున్నట్లు కనిపించాలని చాలా ప్రయత్నిస్తుంది. కాని ఆమెకు ఉన్నది ఒకటే కోరిక. అది చాలా చిన్న కోరిక. అది ఎం.ఎల్.సి. కావాలనే కోరిక. ఆమెకు తను ఏనాటికైనా ఎం.ఎల్.సి. అవగలననే నమ్మకం వుంది. ఊరూపెరూ లేనివాళ్ళంతా ఎం.ఎల్.సి.లు అవుతూంటే తను కావటానికేం? కాకపోతే ఇంకా రాజకీయ నాయకులకు జ్ఞానోదయం కలగలేదు. నిజమైన సోషల్ వర్కర్స్ ఇంకా గుర్తింపుకు రావటం లేదు. కాని ఒకనాడు గుర్తించక తప్పదు. శ్రీమతి వైకుంఠం ఆలోచిస్తూ ఉండేది.
మిస్టర్ వైకుంఠం ఏమయ్యాడో ఎలా ఉంటాడో చాలా మందికి తెలియదు.
అరుంధతికి శ్రీమతి వైకుంఠం ఇల్లుచూసి ఆశ్చర్యం వేసింది. ఆమె ఎంత నిరాడంబరంగా ఉన్నట్లు కనిపించిందో ఆ ఇల్లు అంత ఆడంబరంగా ఉంది. అక్కడ దాదాపు తన ఈడు ఆడపిల్లలు ఉండటం చూసి అరుంధతికి సంతోషం కలిగింది. శ్రీమతి వైకుంఠం ఆ అమ్మాయిల్ని అరుంధతికి పరిచయం చేసింది. చూడగానే వాళ్ళు ముగ్గురూ ఆమె కూతుళ్ళనుకుంది. ఒకరికీ మరొకరికీ ఎక్కడా పోలికలు లేవు. శ్రీమతి వైకుంఠం వారితో మాట్లాడే విధం చూస్తే వెంటనే తెలిసిపోయింది. వాళ్ళు ఆమె కూతుళ్ళు కాదని బంధువులేమో ననుకుంది.
ఆ రాత్రి అరుంధతి ఎవరితోనూ మాట్లాడలేదు. తెల్లవారి లేచేసరికి ఆ ముగ్గురు అమ్మాయిలూ పనుల్లో మునిగిపోయివున్నారు. అరుంధతి లేచి పళ్ళు తోముకుని వచ్చింది. అందరికంటే చిన్న అమ్మాయి కాఫీ తెచ్చి ఇచ్చింది.
"శ్రీమతి వైకుంఠం ఎక్కడ?" అరుంధతి కాఫీగ్లాసు అందుకుంటూ అడిగింది.
"ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇవ్వాళ సాయంకాలం బహిరంగసభ జరుగుతుంది. ఏర్పాట్లు చూసుకోడానికి వెళ్ళింది. రాజారావు అని చాలా బాగా మాట్లాడతారట" అంది వసంత.
"శ్రీమతి వైకుంఠానికి నువ్వు ఏమవుతావు?" అడిగింది అరుంధతి.
"నువ్వు ఏమవుతావూ?" ఠపీమని జవాబిచ్చింది వసంత.
"వాళ్ళిద్దరూ?" అంది కుతూహలంగా.
"వాళ్ళూ అదే అవుతారు!"