"బాబూ అంజిబాబూ, ఆయన్తో మాట్లాడేటప్పుడు పదిహేనేళ్ళ క్రితం హైదరాబాద్ ను గుర్తుపెట్టుకుని మాట్లాడాలి... జ్ఞాపకం ఉంచుకో..."
"మీరు బైటకెళ్తే ఇంట్లోకి వస్తారో రారో అనుమానం... ఆ బాధలేవో నేనే పడతాను... అడ్రసివ్వు అంజిబాబూ..." కాఫీ ఇస్తూ అంది భువనేశ్వరి.
ఏ అడ్రస్ ఇవ్వాలి... ఏదో రాంగ్ అడ్రస్ ఇస్తే అదో గోల... అడ్రస్ ఇవ్వకుండా తప్పించుకోవాలి... ఎలా... ఎలా...
"మర్చేపోయానండి వాళ్ళావిడ దగ్గిర్నించి ఉత్తరం వచ్చింది... మీరడిగారు కదా... ఫోటో పంపమని... కలర్ ఫోటో పంపింది... ఆఫీసులో ఉంది... సాయంత్రం తీసుకురారా..." గబగబా నోట్లోంచి వచ్చేశాయి ఆనందానికి.
"చెప్పవేం... మరి...ఇంత మొహమాటం అయితే ఎలాగోయ్... బాబూ... నువ్వు డైనింగ్ హాల్లోకి వస్తున్నపుడే, నువ్వు సిగ్గుపడుతున్నట్టుగా గమనించాన్నేను... ఉత్తరం రాసిందంటే, వస్తుందన్న మాటేగా... సాయంత్రం ఆ ఫోటోని తీసుకురా... మర్చిపోకు..." అంటూ ఏదో పని మీద వంటగదిలో కెళ్ళింది భువనేశ్వరి.
"ఏంటీ! ఫోటో అంటున్నారు?" ఉరుముతున్నట్టుగా అడిగాడు భుజంగరావు.
"లేదండీ... ఉత్తినే అబద్ధం... అబద్ధం సార్... ఏదో దొంగ ఫోటో తెచ్చి సాయంత్రం చూపించేస్తాం సర్..." గొణిగాడు ఆనందం.
"అదీ... అలా చెయ్యి... కానీ ప్రేమా, దోమా, లవరూ, గివరూ అన్నారనుకో... అవుట్ హౌస్ ఖాళీ... జ్ఞాపకం ఉంచుకోండి" గ్లాసెత్తి గడగడా మజ్జిగలా కాఫీ తాగుతూ అన్నాడు భుజంగరావు.
"ఫోటో మర్చిపోకోయ్..." హాల్లోంచి బయటికొస్తున్నప్పుడు హెచ్చరించింది భువనేశ్వరి.
* * * *
"చూశావా - నువ్వు అబద్ధం మీద అబద్ధం ఆడావ్... ఎలా ఇరుక్కుపోయామో? ఈవాళ సాయంత్రం ఏ మాగజైన్ లోంచో కట్ చేసి ఏ ఫోటో చూపిస్తావ్... సరే రేపు..." ఆ ప్రశ్న వేసిన ఆంజనేయులు వేపు క్వశ్చన్ టాగ్ మొఖంతో చూశాడు ఆనందం.
"ఆ పరిస్థితిలో నేనేం చెయ్యాలి చెప్పు... ఫోటో గురించి టాపిక్ ని సైడ్ ట్రాక్ చేయబట్టే కదా... టెలిగ్రామ్ విషయం ఆవిడ మర్చిపోయింది. లేకపోతే ఆవిడ అడ్రస్ యివ్వమని పట్టుబడుతోంది గదా... ఎవడడ్రస్ యిస్తాం చెప్పు..."
"నీ పాయింటూ నిజమే... ఇప్పుడెలా మరి" జుత్తు పీక్కున్నాడు ఆంజనేయులు.
* * * *
ఇద్దరూ మెడికల్ షాపులో కూర్చున్నాక ఆనందానికి ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది.
"ఒరేయ్ అంజి ఆ మేరీ ఫోటో యిచ్చేస్తే సరిపోతుంది కదరా" అన్నాడు ఆనందం.
"వద్దురా... ఆ అమ్మాయి అదోరకం మనిషి... ఆ అమ్మాయికి 'ప్రేమ' విషయంలో ఏవో సీరియస్ థాట్స్ వున్నాయి... నిజంగా నన్ను ప్రేమించమని కూర్చుంటే... లాభంలేదు" అనేశాడు ఆంజనేయులు.
"అవున్రా... ఇప్పుడు మనం ఆడుతున్న డ్రామా ఉద్యోగాన్ని రక్షించుకోవడం కోసం. ఎందుకంటే, చిన్నదో, పెద్దదో కంపెనీలో నెలకు రెండు వేల రూపాయల జాబ్... అది లేకపోతే మనం మలమల మాడిపోతాం. ఒక్కపైసా ఆదాయంలేక, ఉద్యోగంలేక, ఉండడానికి యిల్లులేక మనం ఇన్నాళ్ళూ ఎన్ని కష్టాలు పడ్డామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో-పైగా ఇక్కడ రెంట్ లేదు...
రెండు మూడు నెలలు ఈ డ్రామా ఆడేశాక ఓ 'ఫైన్' మార్నింగ్ మనకు ఆశ్రమం యిచ్చిన ఆ భుజంగరావు గారికి, ఆ భువనేశ్వరి గారికి కృతజ్ఞతలు చెప్పి, అక్కడ నుంచి బయటకొచ్చేస్తాం... మంచి అమ్మాయిని చూసుకుంటాను... పెళ్ళి చేసుకుంటాను... అదీ నా ఐడియారా" చెప్పాడు ఆంజనేయులు.
"ఎలాంటి అమ్మాయిని చూసుకుంటావో సరదాగా చెప్పు-వినాలని కుతూహలంగా వున్నది..."
"నువ్వు వెక్కిరించినా సరే... నా యిష్టాలు నావి"
నా ఊహతో వున్న అమ్మాయికి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ ఉండాలి. పాలబొమ్మలాంటి అమ్మాయి కళ్ళు చక్కగా తెల్ల కలువల్లా వుండాలి... ముక్కు పున్నాగ పువ్వులా వుండాలి. పెదాలు భోగిమంట దగ్గర చలికాగు తున్నప్పుడు అరచేతులెలా అవుతాయో అలా వుండాలి. ఆమె నవ్వితే కష్టాలు మరచిపోయేటట్టుగా వుండాలి. ఆమె చేతి స్పర్శే సుఖానికి కారణంగా వుండాలి...నన్ను ఆమె నిరంతరం ఇన్ స్పైర్ చేయాలి...
"అలాంటి అమ్మాయి కోసమే నా అన్వేషణ... నా అన్వేషణ ఫలిస్తుందని నాకు నమ్మకం ఉంది" సీరియస్ గా చెప్పాడు ఆంజనేయులు.
"నీ బుర్రలో ఎన్ని ఆలోచనలున్నాయిరా"
ఆ మాటన్న ఆనందం వేపు కోపంగా చూశాడు ఆంజనేయులు.
* * * *
చికాగ్గా ఆలోచిస్తూ, విసుగ్గా కూర్చున్నాడు ఆఫీసులో ఆంజనేయులు.
ఏదో టైమ్ లో రెడ్ హేండెడ్ గా ఆ భువనేశ్వరీదేవి పట్టుకోవడం ఖాయం.
ఏదీ పెళ్ళాం... ఎందుకు రాలేదని నిలదీయడం ఖాయం... ఎడ్రస్ తే... టెలిగ్రామ్ కొడతానని అనడం ఖాయం... చెప్పినవన్నీ అబద్దాలనీ బయటపడిపోవడం ఖాయం... అవుట్ హౌస్ ఖాళీ చెయ్యమని, ఉన్న ఒక్క చాపను బయటకు విసిరెయ్యడం ఖాయం.
నిజాన్ని ఒప్పేసుకుని బయటపడిపోతే... ఆ భుజంగరావు పెద్ద మనిషికి కోపం.
ఆఫీసు దగ్గరలో ఇల్లు లేకపోతే బాస్ కి కోపం.
"ఏవిటీ సిన్మా టిక్కెట్ దొరకనివాడ్లా ఫేసు పెట్టుకున్నారు" నవ్వుకుంటూ వచ్చింది మేరీ.
తప్పదన్నట్లు నవ్వాడు ఆంజనేయులు.
"ఇవ్వాళ... మీకు లీజర్ గా ఈవెనింగ్... సరదాగా ఎగ్జిబిషన్ కి రాగూడదూ" మునిపంట హేండ్ కర్చీఫ్ ను కొరుకుతూ అంది మేరీ.
"మీకు ఎగ్జిబిషన్ లూ, సిన్మాలు తప్పితే, మరి వేరే పనుల్లేవీ లేవాండీ..." చిరాకును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు ఆంజనేయులు.
"ఎవడో ఒకడు దొరికేదాక తప్పదు కదండీ..." అంది ఓరగా చూస్తూ.
అదే సమయంలో ఆఫీసులోకొచ్చాడు ఆనందం.
"మెడికల్ షాపులో ఉద్యోగం వదిలేశాను..." తీరుబడిగా కాళ్ళు చాపుకుంటూ అన్నాడు ఆనందం.
"ఏం?" కంగారుగా అడిగాడు ఆంజనేయులు.