Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 18

    "విన్నవించండి బ్రహ్మ స్వామీ?" వినయంగా అందరు ముక్త కంఠంతో అన్నారు.
   
    "మీ కోరిక సమజసంగా లేదు. సృష్టికి ప్రతిసృష్టి చేయడం నేను ఎరుగుదును. కాని సృష్టిని తలక్రిందులు చేయటం తగినపని కాదు. అయినా నా చేతిలో ఏముంది?" అన్నాడు బ్రహ్మదేవుడు.
   
    "అదేమిటి బ్రహ్మస్వామీ! మీరు మాకు ఈ సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు. సృష్టికర్త మీరు. మా నుదుటి రాతలు గీతలు మీ చేతల ద్వారానే వస్తాయ్. మీరే కాదంటే ఎలా? మమ్మల్ని నిరుత్సాహ పర్చక ఒక్కసారి వరమిచ్చి చూడండి. జరగబోయే అపూర్వ సృష్టికి మీరే అబ్బురపడతారు" అంది లీలారాణి.
   
    "ఈ సృష్టికర్తను నేనే మట్టి బొమ్మలు చేయటం.... వాటికి ప్రాణ ప్రతిష్ట చేయడం....వాళ్ళ నుదుట రాతలు గీతాలూ గీయటం....ఇంతవరకే నా పని వరాలివ్వటం నా పని కాదు" బ్రహ్మ దేవుడు చెప్పాడు.
   
    "అదేమిటి బ్రహ్మస్వామీ! గత యుగాల్లో మీరు కూడ వరాలిచ్చి ఉన్నారు. బ్రహ్మస్త్రం ఎంతమందికో ఇవ్వలేదా? ఇప్పుడు చరిత్రలు చెబుతూ కూర్చోడానికి సమయంలేదు. మీరు కూడా చాలామందికి చాలా యుగాల్లో చాలాసార్లు అస్త్రాలు...వరాలు....దీవెనలు ఇచ్చారు."
   
    "ఇవ్వలేదని నేననటం లేదు అమ్మాయి! కాని అది వేరు ఇదివేరు. ఓ దేశం మీదనన్నా ప్రయోగించడానికి బ్రహ్మస్త్రం కావాలంటే ఇస్తాను. కాకపోతే కాస్త కఠిన తపస్సు చేయాలి. అంతేగాని ఇలాంటి వరాలు అడిగితే నేనెలా ఇస్తాను."
   
    "వరాలివ్వకపోతే ఇవ్వకపోయారు పోనీ ఒక పని చేయండి. మగవాళ్ళు మగపిల్లల్నే కనేట్టు, ఆడవాళ్ళు ఆడపిల్లల్నే కనేట్టు మాతృత్వం లాంటి మగవాళ్ళకి కూడా ప్రసాదించేలా మగాళ్ళందరి నుదుట గీతలు గీయండి దాంతో ఆటోమేటిగ్గా మగాళ్ళు కూడా మాలాగా అంట్లు-ముట్లు, కడుపులు-గిడుపులు, పిల్లలు-గిల్లలతో నానాపాట్లు పడతారు" కచ్చగా అంది లీడర్ లీలారాణి.
   
    "అమ్మాయీ! ఈ విషయంలోను మీరు పొరబడుతున్నారు. సృష్టించేది నేనే వాళ్ళ నుదుటి రాతలూ - గీతలూ గీసేది నేనే. కాని ఇక్కడ మీరొకటి గమనించాలి. దేముడయినా మీకు ఈ వరాలిస్తే ఆ వరాలను అమలు పరచాలి కాబట్టి అప్పుడు నేను నా రాతల్ని గీతల్ని మారుస్తాను.
   
    నా పని అంతవరకే మీరు ఆ వరాలు ఎవరి ద్వారానయినా పొందండి. అప్పుడు తప్పనిసరై నా (తల) రాత మార్చుకుంటాను. ఇంతకుమించి ఈ విషయంలో నేను చెప్పేదేమీ లేదు. ఈ ఒక్కరోజే నాకు విశ్రాంతి అయినా మీరందరు కలసికట్టుగా వచ్చారని మీతో కూర్చుని వివరంగా మాట్లాడాను. అసలే వయోవ్రుద్దున్ని ఈ మధ్య జనాభా పెరుగుదలతో పని చేయలేక నా కింద బోలెడుమంది మనుషుల్ని నియమించుకున్నాను. పెద్దవాన్ని నన్ను కష్టపెట్టక ఇంకా మీరు వెళ్ళి రండి" అంటూ బ్రహ్మదేవుడు పెద్దగా ఆవులించి పుష్ప ఆసనం మీంచి కిందకు దిగాడు.
   
    "పెద్దవాడు....ఆయన్ని బాధపెట్టడం మంచిది కాదు. బ్రహ్మ దేవుడు చెప్పింది ఒక విధంగా చూస్తే సమంజసంగానే వుంది" అనుకున్నారు ఆడవాళ్ళంతా.
   
    బ్రహ్మదేముడు వెళ్ళి విశ్రాంతిగా మేనువాల్చాడు.
   
    ఆడవాళ్ళంతా ఆయనకి భక్తి శ్రద్దలతో నమస్కారం పెట్టి అక్కడ్నించి మళ్ళీ బయల్దేరారు.
   
    బ్రహ్మలోకంలో వాళ్ళపని కానందుకు వాళ్ళేమీ నిరాశ చెందలేదు. రెట్టింపు పట్టుదలతో కొత్త ఉత్సాహం తెచ్చుకుని "ఈ కార్యం ఎందుకు సాధించలేమో చూస్తాం" అనుకొంటూ "ఈ తఫా ఏ లోకానికి వెళ్ళాలా?" అని ఆలోచిస్తూ అక్కడ్నించి బయల్దేరారు.
   
                                             *    *    *    *
   
    "ఎక్కడికి వెళితే మంచిదంటావ్?" మార్గం మధ్యలో నీలవేణి అడిగింది.
   
    "లక్ష్మీ, సరస్వతి, పార్వతి అన్నారు. ఆ మూడులోకాలు అయిపోయాయ్ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు అన్నారు. బ్రహ్మలోకం అయిపోయింది. రెండు విష్ణువు ఆయనగారి దగ్గరకే వెళదాం. ఇప్పుడు మన పయనం విష్ణులోకానికి అంటే వైకుంఠానికన్నమాట" లీడర్ లీలారాణి చెప్పింది.
   
    "ఎంతయినా విష్ణువు మంచివాడే అన్ని యుగాల్లోనూ అవతారాలెత్తింది ఆయనేకదా! అవతారపురుషుడు తారక రాముడు. శ్రీకృష్ణుడు వెంకటరమణుడు..."
   
    కోడలు త్రివేణి అంటుంటే "ఇంక చాల్లే" అంది అత్తగారు అలివేణి.
   
    "విష్ణువు టక్కరి వాడుకూడాను. తమాషా కోరికలు తీర్చటంలో ఆయన ఘనుడు. అవసరానికి మోహిని అవతారం ఎత్తినవాడు. స్త్రీల గురించి ఆయనకీ తెలిసినంతగా మరొ దేముడికి తెలియదు."
   
    "అవునవును శ్రీకృష్ణుడి అవతారంలా అందరి స్త్రీ మూర్తుల కోరికలు తీర్చిన చిలిపివాడు."
   
    "ఇందరం ఆడవాళ్ళం వెళ్ళికోరితే మన కోరికలు కాదనడు."
   
    "మరే" అంది నీలవేణి,
   
    "విష్ణుమూర్తికి మన ఎన్.టి. రామారావుకి దగ్గరపోలికలు వుంటాయంటావా?" త్రివేణి అడిగింది తన కొచ్చిన అనుమానం తీర్చుకోటానికి.
   
    "విష్ణుమూర్తి పోలికలు ఎన్.టి రామారావుకి ఎందుకుంటాయి. సినిమావాళ్ళకి పనా పాటా! అన్నిరకాల దేముళ్ళ వేషాలు ఆయనకు ఇవ్వకపోతే నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వర్రావుకి యివ్వకూడదా! అక్కినేని తన నటనతో దేముళ్ళందరినీ అదరగొట్టి పారేసే వాడు. దేనికయినా ప్రాప్తం వుండాలి. దేవదాసు నటన నీ ఎన్ టి ఆర్ ని చెయ్యమను చూద్దాం" కాస్త ఆవేశంగా అంది అలివేణి.
   
    అత్తగారు అలివేణి అభిమాన నటుడు అక్కినేని అయితే కోడలు త్రివేణి అభిమాన నటుడు ఎన్. టి. ఆర్. అన్ని విషయాలలో అత్తా కోడలు రాజీ పడతారు కాని అభిమాన నటుల విషయంలో మట్టుకు సజీవ ప్రసక్తే లేదు.
   
    అత్తాకోడళ్ళ మాటలు వింటున్న సూరంపూడి సూర్యకాంతాదేవికి ఒళ్ళు మండింది. "తినబోతూ రుచులడిగినట్లువెళ్ళబోతూ రూపాలగురించి దేనికి? ఏమో ఎవరుచూసి వచ్చారు. విష్ణుమూర్తి సుత్తివేలులాగాను వుండొచ్చు. గొల్లపూడి మారుతీరావులాగాను వుండొచ్చు మళ్ళీ మాట్లాడితే బ్రహ్మానందంలాగాను వుండినా వుండొచ్చు" అంది.
   
    సూరంపూడి సూర్యకాంతాదేవి అలా అనంగానే అందరూ ఫక్కున నవ్వారు.
   
    అలా సరదాగా మాట్లాడుకుంటూ వైకుంఠపురం చేరాడు. విష్ణుమూర్తి నివాసం అయిన వైకుంఠపురంని ఆనుకుని పాలసముద్రంవుంది.
   
    విష్ణుమూర్తిగారి బెడ్ రూమ్ పాలసముద్రం మీద శేషశాయి తల్పం కాని వీళ్ళు వెళ్ళేసరికి ఆయనగారు అక్కడ పవళించి లేడు. ఆఫీస్ రూంలో కూర్చుని దీర్ఘాలోచన చేస్తున్నాడు. తన కాళ్ళు తనే వత్తుకుంటూ.

 Previous Page Next Page