"తొందరేం లేదు అమ్మాయిగారూ! నిదానంగా ఆలోచించుకోండి. ఇంటికెళితే అయ్యగారు వెక్కిరిస్తారని మీరేమీ సిగ్గుపడక్కరలేదు. మేమంటే మీకిష్టమేకదా! ఇక్కడి కుర్రాళ్ళంతా చాకులాంటివాళ్ళు. మావాళ్ళల్లో ఏ కుర్రాడినో ఒక కుర్రాడిని చూసి పెళ్ళాడవచ్చు. లేదంటే మీ యిల్లు మీకేవుంది. నిదానంగా ఆలోచిద్దురుగాని. పదండి వెళదాం" అంటూ యలమందయ్య ముందుకి దారితీశాడు.
"పదండి అమ్మాయిగారు" అంటూ అచ్చమ్మ కూడా బయలుదేరింది.
మాట్లాడటానికి కాని, ఆలోచించడానికి కాని అప్పుడుకప్పుడు శక్తిలేక పోయింది. నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ వాళ్ళవెనకనే బయలుదేరింది పద్మిని ప్రియదర్శిని.
10
ఆరోజు...
పద్మిని ప్రియదర్శిని వర్కర్స్ తో కలిసి సమ్మెచేసే చోటుకి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండిపోయింది. స్నానానికి నీళ్ళదగ్గిర్నుంచి భోజనంవరకు అన్నీ అమర్చిపెట్టింది కానీ అచ్చమ్మకూడా గట్టిగా ఏమీ మాట్టాడలేదు. అంటీ ముట్టనట్టు మెలగసాగింది.
"జీవితంలో యెప్పుడో ఒకసార్ యెవర్నో ఒకర్ని పెళ్ళాడాల్సిందేకదా. మీరయినా ఇవాళ కాకపోతే రేపైనా పెళ్ళి చేసుకోక తప్పదు. మీరూ మేమూ ఒకటేనని మీరే అన్నారుకదా! అలాంటప్పుడు మా గూడెంలోని పిల్లవాడ్ని మీకు బాగా నచ్చినవాడ్ని చూసి పెళ్ళాడితే ఏం బోయింది? వాడే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, పోషిస్తాడు. ఇందులో తప్పేంలేదు బాగా ఆలోచింకండి అమ్మాయిగారు! పెద్దవాడ్ని మీ మంచికే చెబుతున్నయు" అని మంచిగానే చెప్పి యలమందయ్య ఉదయాన వెళ్ళిపోయాడు.
ఇదంతా టుమచ్ గా వుంది. తను వారి కోసం అన్ని సుఖాలు వదులుకొని వస్తే మా పేటలో వున్నందుకు మా వాడినే పెళ్లాడు. మేము చెప్పినట్లే విను. పేరుకూడా మార్చుకో...అంటూ ఈ ఆంక్షలు ఏమిటి?
వీళ్ళ మాట కాదంటే తను ఈ పేటలో వుండరాదా ఇదెక్కడి న్యాయం? ఇప్పటికే కులాలు మతాలు జాతులతో ఈ దేశం అతలా కుతలమవుతున్నది. ఇది దేశాభివృద్ధికి అడ్డు తెర అంటూ డాడీ పేపరు చదివి ప్రతిరోజూ అనటమే.
ఉన్న గోలలు చాలక...కొత్తమార్పులు తేలేక ఓ ప్రక్క ప్రభుత్వం బాధపడుతుంటే కట్టుబాట్ల నియమాలు ఆచారాలు...ప్రజలు ఎదగరు...దేశం ముందుకు పోదు...ఆలోచించే అవసరం ఎవరికీ లేదు.
అంతవరకు ఆలోచించిన పద్మిని ప్రియదర్శిని అరె నా గురించి ఆలోచించక ఇప్పుడు దేశం గురించి ఆలోచన దేనికి? నా భవిష్యత్తు ఏమిటి? ఓడిపోయిన ముఖంతో ఇంటికెళ్ళాలా! ఉహూ అంతకన్నా సిగ్గుచేటు విషయం మరొకటి లేదు. పోనీ వీళ్ళల్లో ఒకడిని పెళ్ళాడి ఇక్కడే కాపురం పెట్టాలా! నెవర్, తన కంఠంలో ప్రాణముండగా జరగని పని అది.
అచ్చమ్మని పల్లెత్తు మాట అనలేదు తను. అయినా నిన్నటినుంచి అచ్చమ్మ అడిగినమాటే అడగటం తప్ప మరో మాటలేదు.
"అమ్మాయిగారూ! మా వాళ్ళల్లో ఒకడిని మనువాడి యిక్కడే వుంటారా లేక అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతారా!"
అంటే అర్ధం?
"మీరు రెండు మార్గాలలో ఏదో ఒకటి నిర్ణయించుకోండి లేకపోతే లాభం లేదు" అనేకదా అచ్చమ్మ మాటల్లోని అర్ధం.
తనకి రెండు నిర్ణయాలు యిష్టంలేదు.
తను ఏదో ఒకటి నిర్ణయించుకోకపోతే వాళ్ళకి అయిష్టం అయిష్టం. అయిష్టం.
ఈ సమస్యకి రేపటిలోగా పరిష్కారం ఏమిటి?
ఆడపిల్లకి తక్కువ వయస్సులో పెళ్ళి చేయటం వీళ్ళపద్ధతి కావచ్చు...వీళ్ళ ఆచారం కావచ్చు...
కాని...తన పేరు మార్చటంలో వీళ్ళ యిష్టం ఏమిటి? పద్మిని ప్రియదర్శిని అందంగ...గంభీర్యంగ... నైస్ గా... వినముచ్చటగా...ఎంత చక్కటి పేరు తనది? పొడి అక్షరాలతో పప్పీ అంటూ ముద్దు ముద్దుగ పిలుస్తుంటే ఎంత నాజూకుగ వినవచ్చేది? అలాంటి తన పేరుని మార్చేసి "పద్దమ్మట పద్దమ్మట...ఛీ...ఛీ...
పద్దమ్మ అన్న పేరు అసహ్యం ఏమీ కాదు. కాని తనకి మాత్రం అసహ్యమే. ఆ పేరు తనది కానప్పుడు తనెలా ఆమోదిస్తుంది? పద్దమ్మట...పద్దమ్మ...ఛీ...ఛీ...
యావగింపంతా మనసులోకి తెచ్చుకొని ఒకటికి పదిసార్లు వికారంగ ముఖం పెట్టుకుని "ఛీ...ఛీ..." అనుకుంది పద్మిని ప్రియదర్శిని.
ఈ ఆలోచనలకి తోడు నిన్నటి రోజు తనకి ఒంట్లో ఎందుకు బాగుండలేదో పద్మినికి అర్ధమయింది. ఉదయం తిన్న కాస్త భోజనం వాంతయిపోయింది. తల పగిలిపోయేలా తలనొప్పి దానికి తోడుగ జ్వరము. ఒళ్ళంతా నొప్పులు, చలి.
అచ్చమ్మ నడిగి ప్రస్తుతానికి తలనొప్పికి, వికారం తగ్గటానికి మాత్రలు తెప్పించుకుని వేసుకుంది.
ఇక్కడికి వచ్చిన మొదట్లో కాళ్ళు పిసకనా అమ్మాయిగారూ! అనడిగిన అచ్చమ్మ ఈ రోజు "తల పట్టమంటారా అమ్మాయిగారూ!" అని మాట వరసకి కూడా అడగలేదు.
ఎంతలో ఎంత మార్పు?
శరీర బాధకితోడు వాళ్ళందరి ప్రవర్తన ముఖ్యంగ అచ్చమ్మ తలపట్ల చూపే నిర్లక్ష్య భావం పద్మిని ప్రియదర్శిని మనసుని కృంగదీసింది.
ఆ రాత్రి
జ్వరంతో, తలనొప్పితో చెట్టుకింద మంచంమీద పడుకుంది పద్మిని.
చెట్టుకింద అరుగుమీద యధాప్రకారం అచ్చమ్మ పడుకుంది. ఎలమందయ్య పంచలో పడుకున్నాడు.
జ్వరానికి చలి వచ్చింది. దాంతో ఉన్న ఒక్క దుప్పటి కప్పుకోటానికి చాలలేదు. చలి వణికించేస్తున్నది. దాంతో నిద్రపట్టలేదు పద్మినికి.
అక్కడ దుప్పట్లు లేకపోవచ్చు. తాతచీరలు, గోనె పట్టాలు వున్నాయి అవి తన దుప్పటిమీద కప్పమని అచ్చమ్మని అడగటానికి పద్మిని మంచంమీద నుంచి లేచింది.
అచ్చమ్మ చెట్టుకింద పడుకుని లేదు. అరుగుమీద చాప వుందిగానీ అచ్చమ్మ లేదు. పంచలో ఎలమందయ్య లేడు. "వీళ్ళిద్దరూ ఏమయ్యారు?" అని పద్మిని అక్కడే నుంచుని ఆలోచిస్తున్న సమయంలో ఆ పక్క చెట్టుచాటు నుంచి మాటలు వినబడ్డాయి.
పద్మిని అటుకేసి నడిచింది.