"నా ఫ్రెండ్ హోటల్ కి వచ్చి నన్ను ఇక్కడ కల్సుకుంటానన్నాడు .వాడూ నేనూ కలిసి టిఫిన్ చేస్తాము. ముందే నేను టిఫిన్ తింటే ఏం బాగుంటుంది!" టీ కప్పు కింద పెడుతూ చెప్పాను.
సర్వర్ ముఖం మారిపోయింది. నవ్వుతూ వెళ్ళిపోయాడు.
ఏ ఫ్రెండూ రాడని నాకు తెలుసు. సర్వర్ కి తెలియదు కదా!
పదినిమిషాల తర్వాత మళ్ళీ సర్వర్ వచ్చాడు.
"మా ఫ్రెండ్ రాలేదు. మరో పది నిమిషాలు చూసి వెళతాను. సరీగ పది నిమిషాలు ఆగిరా. నా ఫ్రెండ్ వచ్చినా రాకపోయినా టిఫెన్ తిని వెళతాను." అని చెప్పాను.
సర్వర్ తలవూపి వెళ్ళిపోయాడు.
మరో పది నిమిషాలు వృధాచేసి ఆ లూబోండాటీ కానిచ్చి హోటల్లోంచి బైటికి వచ్చాను.
ఈ తఫా పక్కనున్న ఫాన్సీషాపులో దూరాను. అక్కడ అవీ ఇవీ చూస్తూ పావుగంట లాగేశాను. అలా అలా మొత్తానికి గంటన్నరకాలం అవలీలగా గడిపేసి ఆ వీధి చివరికి వచ్చి నుంచున్నాను.
నా కళ్ళన్నీ అద్దె పుస్తకాల షాపుమీదే వుంది. ఎవరూ వచ్చి నవలలు తీసుకున్న పాపానపోలేదు. నేను ఎప్పుడూ బుక్స్ తీసుకునే షాపు పెద్దది. రెండోసారి తీసుకున్న ఈ షాపు చిన్నది. అయినా నా అనుమానం ఈ షాపుమీదే అడ్డదిడ్డం ప్రశ్నలు వేసింది ఈ షాపు అతనే.
ఎదాలాపంగా ఇటు తిరిగిన నేను ఉలిక్కిపడ్డాను
ఆ రోజు ఫాన్సీషాపులో ఆంటీకోసం అంటూ గాజులు బేరం ఆడిన అందాల సుందరి. ఎటూ తిరిగి చూడకుండా చకచక నడుస్తూ ముందుకు వెళుతున్నది. ఆ రూపం నాకు బాగా గుర్తు. ఓసారి చూసిన వాళ్ళని నేను ఓ పట్టాన మర్చిపోను. అందులో ఈమె నా అనుమానం సుందరి.
ఈ తఫా ఈ సుందరిని పోనీయకూడదు. ఎక్కడికి వెళుతుందో ఏం చేస్తుందో చూడాలి. ఆమెకి అనుమానం రాకుండా వెంట వెళ్ళాలి." అనుకున్నాడు.
అద్దె పుస్తకాల షాపుమీద అనుమానంతో పరిశోధన మొదలు పెడితే సుందరి ఎదురయింది. ఇదీ కావాలి నాకు అదీ కావాలి. అద్దె పుస్తకాలషాపు ఎక్కడికీ వెళ్ళదు. అందాల సుందరి అలాకాదు. రెండోసారి కంటపడింది. ఈ తఫా కూడా పోనిస్తే మళ్ళీ యీ ఛాన్స్ రాకపోవచ్చు.
నన్ను దాటి సుందరి పది గజాలుముందుకు వెళ్ళింది .నేను నడిరోడ్డు మీదనుంచి కాక షాపుల పక్కగా నడుస్తూ అందాల సుందరి వెనుకనే బైలుదేరాను.
అందాల సుందరి అద్దె పుస్తకాల షాపుముందు ఆగింది.
ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవి అయ్యాయి.
అక్కడేవున్న స్వీట్ షాపుముందు నిలబడి స్వీట్ బేరం ఆడుతూ ఓ కన్ను ఇటు వేసి వుంచాను.
అందాల సుందరి చేతికి తగిలించుకున్న వ్యానిటీ బ్యాగ్ ని చేతిలోకి తీసుకుని జిప్పుతీసి బ్యాగ్ లోంచి నవలతీసి షాపు అతనికి ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ నాలుగు మాటలు ఏదో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరో పుస్తకం తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని మళ్ళీ వెనుతిరిగి బైలుదేరింది. అంటే ఇప్పుడు ఆమె మళ్ళీ నా వేపుకే వస్తున్నది.
నేను ముఖం చాటు చేసుకుని నుంచున్నాను.
నేను ఓ విషయం కనిపెట్టాను. అద్దె పుస్తకాలషాపులో ఏ పుస్తకం తీసుకున్నా పుస్తకంతో పాటు డబ్బులు ఇవ్వాలి ఆమె ఇవ్వలేదు. అద్దె పుస్తకం తీసుకునేటప్పుడు తిరిగి ఇచ్చేటప్పుడు పుస్తకం పేరు తీసుకున్నవారి పేరు రాసుకుంటారు. ఆ పని అతను చేయలేదు.
ఆ షాపువాడికి ఆమె బాగా తెలుసా?
అలా అయినంత మాత్రాన నా పరిశోధన వృధా అని ఎక్కడా లేదు. అందాలసుందరి ఎవరన్నది పరిశోధన చేస్తున్నా కదా! నా మరో అనుమాన నివృత్తికి ఇదిచాలు.
అందాల సుందరి నన్ను దాటి పది గజాలు వెళ్ళిం తరువాత నేను నెమ్మదిగా బైలుదేరాను.
అందాల సుందరి నడిచి వెళుతున్నది.
నేను రెండు కాళ్ళకి పని కల్పించాను.
16
క్రితం రోజుది బాగా గుర్తు వుంచుకుని పూర్తిగా మారువేషం ధరించి బైలుదేరాను.
క్రితం రోజు అందాల సుందరి వెనుకనే బైలుదేరిన నేను పెద్దగా పరిశోధన ఏమీ చేయలేకపోయాను. అయినా ఆమె వెళ్ళిన రెండు ఇళ్ళు గుర్తు పెట్టుకున్నాను.
దాదాపు ఇరవై నిమిషాలు నడిచి ఓ చిన్న వీధిలో వున్న పెద్దమేడలోకి వెళ్ళింది. ఆ మేడలో అయిదు నిమిషాలు వుండి బైటికి వచ్చి రిక్షా ఎక్కింది. నేను రిక్షా ఎక్కి బయలుదేరాను.
మే మెక్కిన రిక్షాల పయనం పావుగంట పట్టింది. ఆమె ఎక్కిన రిక్షా ఓ షాపుముందు ఆగింది. ఆమె రిక్షా అతనకి డబ్బులిచ్చి పంపేసి షాపులోకి వెళ్ళింది. నేను రిక్షా దిగి పేవ్ మెంటుమీద పరిచి అమ్ముతున్న గౌనులు బేరమాడుతూ నుంచున్నాను.
ఆమె పది నిమిషాల తర్వాత షాపులోంచి బైటికివచ్చి మరో దారిన బైలు దేరింది.
నేను ఆమెని అనుసరించాను.
దాదాపు అరగంట పైనే వేమ్గంగా నడుస్తూ పాత ఇళ్ళు వున్న ఓ వీధిలో ప్రవేశించింది.
నేను మూల మలుపు దగ్గర ఆగిపోయాను.
ఆ అందాల సుందరి ఓ ఇంట్లోకి వెళ్ళింది. అరగంట, గంట...మొత్తం గంటన్నర కాలం ఆమె కోసం నిరీక్షిస్తూ అక్కడే అటూ ఇటూ తచ్చాడుతూ గడిపాను.
ఆమె ఆ ఇంట్లోంచి బైటికి రాలేదు.
ఇంక ఆమె ఆ ఇంట్లోంచి బైటికి రాదు అనిపించిన తర్వాత నేను అక్కడ నుంచి వచ్చేశాను.