దానికి వాళ్ళని నిందించి ప్రయోజనం లేదు, వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు. సమాజాన్ని, చుట్టూ లోకులని కాదనే నిబ్బరం, కాదని ఎదిరించి నిలబడగలిగే సత్తువా వుండదు. మనిషి సంఘజీవి. అమ్మాయి కాపురానికి ఎందుకు వెళ్ళలేదు- ఫలానా వారి అమ్మాయి కాపురం వదిలి పుట్టింటి కొచ్చింది అంటే జవాబు చెప్పలేని నిస్సహాయులు. ఒక పిల్ల పరిస్థితుల ప్రాబల్యంతో పుట్టిల్లుచేరితే ఆ కుటుంబంలో మిగతాపిల్లల పెళ్ళిళ్ళు సమస్య అయికూర్చుంటాయి.
తరువాత ప్రతి నిత్యమూ మావాళ్ళు నాకు ఇదే విషయాన్ని విపులంగా చెప్తూ వచ్చారు. అవకాశం వచ్చి నపుడల్లా. నా మంచికోరే చెప్పవచ్చు. కాని దాని చాటున వాళ్ళ నిస్సహాయత, పరువు ప్రతిష్టల ప్రలోభం, నా తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ఆధారపడిన సత్యం గ్రహించాక నేనేం చెయ్యగలను. నిస్సహాయంగా తలదించుకుని బలి పశువులా నాన్నగారివెంట మళ్ళీ ఆ నరకంలో అడుగుపెట్టాను.
నేను వచ్చిన పది రోజులకి ఆయనగారినించి నాన్నకి తాఖీదు వచ్చింది. "నేను వద్దన్నా నామాట వినక నిర్లక్ష్యంగా వెళ్ళింది మీఅమ్మాయి. నా మాట లెక్కలేని పెళ్ళాం నా కవసరంలేదు. ఇంకముందు యిలా జరగదని హామీయిస్తే మీ అమ్మాయి మళ్ళీ యిక్కడికి రావచ్చు. లేదంటే శాశ్వతంగా అక్కడే వుంచుకోండి"అంటూ వచ్చిన ఉత్తరాన్ని చూసి నాన్న అమ్మ గాబరాపడి నన్ను వెంటనే ప్రయాణం కట్టించారు.
నాన్నవచ్చి దిగబెట్టి నచ్చచెప్పారు. నీకేం భయం లేదు అంటూ అమ్మ వూరడించింది. భయపడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? అక్కడికి వెళ్ళకా తప్పదు - బ్రతకకా తప్పదు. మొండి ధైర్యంతో పాటు నిరాశ, నిర్లిప్తతా కూడా చోటు చేసుకుంది నాలో.
* * *
అల్లుడిముందు తప్పుచేసిన కుర్రాడిలా నాన్న నెమ్మదిగా, సంజాయిషీ ఇచ్చే ధోరణిలో బతిమిలాడు తున్నట్లు, ప్రాధేయపడ్తున్నట్లు మాట్లాడుతూంటే అవమానభారంతో నాతల వాలిపోయింది. ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడ్డాను. ఆడపిల్లగా పుట్టించినందుకు ఆ దేముడ్ని నిందించాను.
"మీ అమ్మాయికి బుద్దిచెప్పుకోండి. ఈసారికి క్షమిస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే సహించను" అన్నారు ఆయన నాన్నకు సమాధానంగా.
నాన్నగారు నన్నేమనలేక ఏం చెప్పలేక, వదిలి వెళ్ళలేక దిగులుగా నా తల నిమిరి, చమర్చిన కళ్ళని వత్తుకుని నా తల ప్రేమగా నిమిరి ఒకసారి దగ్గరికి తీసుకుని మొహం తిప్పుకు వెళ్ళిపోయారు. అయిపోయింది ఇంకేముంది. నాకు బతుకయినా చావయినా ఇక్కడేనని నా వాళ్ళు సయితం నిర్ణయించారు.
మా మామగారికి నాన్న మీ అబ్బాయి ఇలా అని రాస్తే మేమేం చేస్తాం. ముందునించి మీ అమ్మాయి ప్రవర్తన సరిగాలేదు. వాడి ప్రవర్తన అలా మారడానికి మీ అమ్మాయే కారణం అని జవాబు వచ్చింది.
ఇటు కన్నవారు, అత్తవారు అంతా నాకర్మ అని తేల్చాక ఇంకేముంది చేయడానికి-పిచ్చిగా నవ్వుకున్నాను.
డాక్టర్ గారూ ఆరోజునించి నా బతుకు మరింత నరకమయింది. నాకు ఈ ఇంటికంటే గత్యంతరం లేదని, కన్న తల్లిదండ్రులు సయితం నన్నాదరించరన్న సంగతి నాకే కాదు ఆయనకీ అర్ధం అయింది. ఆయనేమన్నా ఇదివరకు మాదిరి జవాబు చెప్పగలిగే శక్తి నేను కోల్పోయానని ఆయన గ్రహించారు. దాంతో ఆయన పశుత్వం మరింత విజ్రుంభించింది.
ఏ మాటలంటే నేను బాధపడ్తానో అవే పదే పదే అనడం ఆరంభించారు. నేను మౌనంగా వూరుకుంటే "ఏం పాపం నోరు పడిపోయిందే, అహంకారం పొగరు ఇప్పటికైనా తగ్గిందా. పుట్టింటికి పరిగెడితే ఏ బాబూ నిన్ను ఆదుకోడని అర్ధమైందా, నీకీ ఇల్లే గతి తెలుసుకున్నావా, ఏం జరిగినా కట్టుకున్నవాడితోనే బతుకు అన్నది అర్ధం అయిందా, ఏదో తప్పు ఎత్తి ఏ చిన్న సాకు దొరికినా, అసలు ఏ కారణం లేకపోయినా నన్నెత్తి పొడుస్తూ హేళన చేస్తూ వ్యంగ్యోక్తులతో నన్ను నా వాళ్ళని ఆడిపోసుకుంటూ నన్నేడిపించడమే పరమావధిగా తయారయ్యారు.
ఆ వాతావరణంలో జీవచ్చవంలా బతుకుతూ, సిగ్గు అభిమానం పౌరుషం అన్నీ విడిచి ఆయన పడేసే తిండికోసం కుక్కలా బతకడం దుర్భరంగా వుండేది. ఎన్నోసార్లు ఆ హింస అవమానం భరించలేక చచ్చిపోదామనుకునే దాన్ని, ధైర్యం చాలేదికాదు. అసలు అలాంటి బతుకులో కూడా ఇంకా ఏదో మూల చిన్న ఆశ, బతుకుపట్ల తీపి నన్ను చావనీయలేదు. పోనీ ఇంట్లోంచిపోయి అమ్మ నాన్నల దగ్గిరకి పోకుండా ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ బతికితేనో అన్న ఆలోచన వచ్చేది. కాని నాకు ఉద్యోగం ఎవరిస్తారు? నాలాంటి బి.ఏ.లు లక్షలమంది వుండగా ఉద్యోగం అంత సుళువుగా దొరుకుతుందా, అసలెలా ప్రయత్నం చేయడం. ఈ సంగతి ఆయన గుర్తిస్తే చంపుతారు. అసలు అలా ఉద్యోగం చేసుకుందామన్నా దాంతో మావాళ్ళ పరువు ప్రతిష్ఠలు, నా తోబుట్టువుల భవిష్యత్తు ముడిపడి వున్నాయి గదా! ఇంకొకరి కోసం అంత త్యాగం చెయ్యాలా? ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి.
ఈలోగా నాకు నెల తప్పింది. దానికి సంతోషించాలో విచారించాలో అర్ధంకాని పరిస్థితిలో పడ్డాను. అందరూ అన్నట్లు పిల్లలుపుడితే అయిన మారుతారేమో ఆయన. బిడ్డల తల్లిగా నన్ను అభిమానిస్తారేమో అన్న ఆశ ఒకవైపు, ఈ బంధం ఏర్పడితే ఆయన మారకపోతే పిల్లల కోసం అన్నా జీవించక తప్పని స్థితిలో ఇక్కడే పడుండాలి అన్న భయం ఒకవైపు - పెళ్ళయిన ఏడాది తరువాత భార్య నెల తప్పితే సంతోషించని భర్తలుంటారా లేక సినిమా లలో, కథలలో అంతలా అతిశయోక్తులుగా చూపిస్తారా పదిరోజులు గడిచాక ఆ మాట చెప్పాను ఆయన మొహంలో భావాలు పరికిస్తూ. 'ఆహా' అన్నారు అతిమామూలుగా.