Previous Page Next Page 
శరతల్పం పేజి 17


    రెండు నదులు కలిశాయి. రెండు మబ్బులు కలిశాయి. రెండు మనసులు కలిశాయి. రెండు తనువులు కలిశాయి.
    కలయికలో ఆనందం ఉంది- అనుభూతి ఉంది- మాధుర్యం ఉంది. ఆనందం ఎప్పుడూ ఉండదు. కలయిక కలకాలం కొనసాగదు.
    పిచ్చమ్మ విడిపించుకుంది. "పోవాలె. ఆడ అందరు పన్నరు వదులు."
    "పిచ్చమ్మా! అప్పుడే పోతవా?"
    పిచ్చమ్మ గురువయ్యను ముద్దుపెట్టుకుంది. "పోవాలె. రేపు పొద్ధాల___ఏటి కాడ___యాపచెట్లల్ల___రావాలె____నేనొస్త" సాగిపోయింది పిచ్చమ్మ.
    ఏమీ తెలియనట్లే పోయింది. కొంతదూరం పోయి తిరిగి చూచింది. గురువయ్య ఆమెనే చూస్తున్నాడు. గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది.
    గురువయ్యకు ఈలపాట వచ్చింది.
    "మనమిద్దరమూ కూడి
    బండిమీద పోతుంటే
    కన్నుకుట్టి ఏడ్చిందే
    మన ఊరంతా__కన్నుకుట్టి ఏడ్చిందే."
    గురువయ్య కూనిరాగం తీస్తూ సాగిపోతున్నాడు. అతడు ఎంతో తేలిగ్గా ఉన్నాడు. రెక్కలు లేకున్నా తేలిపోతున్నాడు. లచ్చమ్మ చూచింది. మాట్లాడలేదు. దీపం ముందుంచి అన్నం పెట్టింది. మౌనంగా దీపం ముందు కూర్చుంది. గురువయ్య కూడా మాట్లాడలేదు. అన్నం తిని మంచంలో వాలిపోయాడు.
    లచ్చమ్మ కళ్ళు కన్నీటి కొలకు లయినాయి.
    ఆమె గురువయ్య మౌనం భరించలేకపోయింది. ఇవాల్టి మౌనంకంటే నిన్నటి దెబ్బలే బాగనిపించాయి!
    లచ్చమ్మ నిద్రపోలేదు. కన్నీటిలో మునిగిపోయింది. అయినా తెల్లవారింది. కాలం కర్కశమైంది. దానికి ఎవరి బాధా తెలియదు.
    గురువయ్య లేచాడు. నిత్యకృత్యాలు తీర్చుకొని స్నానం చేశాడు. మంచి పంచె కట్టుకున్నాడు. అన్నం తిని బయల్దేరాడు. అతడు కూలికి పోలేదు. ఏటి ఒడ్డుకు చేరాడు___అప్పటికే బారెడు పొద్దెక్కింది. వేప వనానికి చేరాడు.
    పిచ్చమ్మ తలలో ముద్దబంతి పూలతో కూర్చుని, వేపపుల్లతో నేలమీద బొమ్మలు గీస్తున్నది. గురువయ్యను చూచి తల ఎత్తింది. "ఇంతసేపటికా!"
    "ఇంత జల్ది వస్త వనుకోలేదు."
    "అట్లనా!" నవ్వింది. కళ్ళు మరింత ఎరుపెక్కాయి__మోదుగుపూలలా.
    "పిచ్చమ్మా!" గురువయ్య ఆమె ఎదుట కూలబడ్డాడు.
    పిచ్చమ్మ కళ్ళు పెద్దవి చేసి చూసింది ఏమిటి అన్నట్లు.
    "ఎంత పరేషానయన్ననుకున్నావు నీ కోసం!"
    "అట్లనా!" కిలకిలా నవ్వింది.
    వెర్రెత్తింది గురువయ్యకు. కావిలించుకున్నాడు.
    ఆమె అతని తొడమీద తలపెట్టి పడుకుంది. ఆ వేపచెట్ల పొద విచిత్రంగా ఉంది. చుట్టూ వేపచెట్లే__మధ్యన కాళీ స్థలం__వేపాకు రాలి ఉంది___పచ్చిది-పండుదీ, వేపచెట్ల చిరుచేదు వాసన!
    "ఎందుకట్లయినవు?" వేపాకు కొరుకుతూ అడిగింది___కొంటెగా.
    "అట్లనా! నిన్ను చూసి."
    "నేనంత బాగున్నానా?"
    "నాకు పిచ్చెక్కించిన వనుకో."
    "అట్లనా?" అని కళ్ళల్లోకి చూచింది.
    కళ్ళను చూసి పొంగిపోయాడు గురువయ్య. వంగి ముద్దుపెట్టుకున్నాడు. ఆమె లేచి అతన్ని కౌగలించుకుంది.
    అతడు ఆమె తొడమీద పడుకున్నాడు___వేపాకు కాడ కొరుకుతూ.
    "మనం ఇట్లానే ఉంటే ఎట్లుంటది?" అడిగాడు.
    "ఎట్లుంటదా? మబ్బుల్ల తేలిపోయినట్లుంటది."
    "ఉందామా మరి."
    "మరి మా అత్త?"
    "అవుతే మాలచ్చికూడున్నది."
    "ఇట్లానే వస్తవు గద దినం?"
    "అబ్బ! ఎంత ఆశ!!" వేపాకుతో బుగ్గమీద కొట్టింది.
    "రావా!" భయపడి దిగ్గున లేచి అడిగాడు.
    "ఏం చేస్తవు రాకుంటే?" కిలకిలా నవ్వింది.
    "ఏం చేస్తనా? ఏట్లపడి చస్త!"
    "నిన్ను చావనిస్తనా?" అని అతని తల భుజంమీద పెట్టుకొని జుట్టు నిమిరింది.
    "ఎంత మంచిదానివి." అతడు ఆమె వీపు నిమిరాడు.
    "బావా!" అలా ఆమె పిలవడం తొలిసారి. తలయెత్తి చూచాడు గురువయ్య.
    "పిచ్చీ!"
    ఆమె పెదవులు కలిపింది.
    అలా ఉండిపోయారు__ఆనందానికి అవధుల్లేకుండా.
    సూర్యుడు తలమీదికి వచ్చి సమయం చెప్పాడు.
    పిచ్చమ్మ తటాలున లేచి నుంచుంది. "పోవాలె" అని. "పోతవా?" అని ఆ చేయి పట్టుకున్నాడు గురువయ్య.
    "అత్త వచ్చేయాళయింది. ఇపుడు పోత."
    "పోతవా?"
    "పోవాలె."
    "సరెపో" చేయి వదిలాడు. ఆమె అడుగులు బరువుగా వేస్తూ సాగిపోతూంది.
    "మాపటికి తాటి వనానికి...." కేకవేశాడు గురువయ్య.
    ఆమె తల ఊపుతూ సాగిపోయింది.
    గురువయ్య వేప చెట్లలోనే పడి ఉన్నాడు - అక్కడే నిద్రపోయాడు.
    
                                     10


    కొత్త ఇంటికి చేరిన కొత్తలో నారాయణస్వామి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇల్లు కట్టే రోజుల్లో గురువయ్యతో బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. అతడు ఇంట్లో మనిషికాదు__మనసులో మనిషిలా మసలసాగాడు. ఈ కొత్త ఇల్లు గురువయ్య ఇంటికి దగ్గర్లో ఉంది. తనను గురువయ్యకు దగ్గరగా తేవడానికే భగవంతుడు ఇక్కడికి రప్పించాడేమో ననుకున్నాడు. గురువయ్య సన్నిహితుడైన కొద్ది రామకిష్ణయ్యమీద ఒక రకపు అసహ్యం ఏర్పడింది. ఇల్లు కాళీ చేయించడంతో అది మరీ బలపడింది. రామకిష్ణయ్యను తద్వారా ఊరినీ వాదులుకున్నాడు స్వామి___గురువయ్య స్నేహం కోసం. గురువయ్య దగ్గరగా ఉండడం వారికి ఒక రకంగా ఆనందంగానే ఉంది. పైగా పురాణం వినడానికి లచ్చమ్మ కూడా వస్తూంది. నాంచారమ్మకు వేరే ఆలోచనలు లేవు కాబట్టి అర్ధం అవుతూంది. అంత కంటే కావలసిందేమీ నారాయణస్వామికి!
    నాంచారమ్మకూ ఒక రకంగా హాయిగా ఉంది. ఇంటి వెనక మంచినీళ్ళ బావి ఉంది. ఇందువల్ల రెండు సమస్యలు పరిష్కారం అయినాయి. ఆమె చెరువుకు పోవాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్తే ముక్కులు, మూతుల విరుపులు చూడాల్సి వస్తుంది. అది తప్పింది. లచ్చమ్మ తరచుగా ఇంటికి వస్తూంది. గురువయ్య ఇంట్లో నుంచి బయటపడితే లచ్చమ్మ నాంచారమ్మ ఇంటికే చేరుతూంది. వంటింట్లోంచి బయటపడ్తే నాంచారమ్మ లచ్చమ్మతోనే ఉంటూంది. లచ్చమ్మ నిగనిగలాడుతుంటే, ఆమెపొట్ట పెరుగుతుంటే ఏదో ఆనందం నాంచారమ్మకు. లచ్చంమను అడిగి, అడిగీ చేసిపెట్టేది అన్నీ. లచ్చమ్మకూ, నాంచారమ్మకూ ముచ్చట్లు తెగడమంటూ ఉండేదే కాదు. లచ్చమ్మ చెప్పే కథలన్నీ విచిత్రంగా ఉండేవి నాంచారమ్మకు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ తగాదాలు తవ్వులాటలు, వాళ్ళ సమాధానాలు, పెళ్ళిళ్ళు, లేచిపోవడాలు, తాగుళ్ళు, తన్నులాటలు వింతగా కనిపించేవి ఆమెకు. మళ్ళు, ఆచారాలు, పురాణాలు వింతగా అనిపించేవి లచ్చమ్మకు. వారిద్దరి కలయిక రెండు విభిన్న సమాజాల కలయికగా, రెండు విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా, రెండు విభిన్న నాగరి కతల కూడలిగా వుండేది. లోన మంచంలో పడుకుని వినే నారాయణస్వామికి హాయిగా ఉండేది. అవి పురాణాల్లో కథలు కావు - అవి వారికి తెలుసు. రాజుల దండయాత్రలు కావు - అవి వారికి తెలుసు. ఇది కొత్తకథ____జీవితంలోంచి చొచ్చుకొని వచ్చింది. ఈ కథల్లో మనుషుల వాసన - వారి కష్టసుఖాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇవి నేలనంటిన కథలు. నారాయణస్వామికి తెలిసినవి నేల విడిచిన కథలు. అందుకే వారికి లచ్చమ్మ కథల్లో ఎంతో ఆసక్తి-అయినా లచ్చంమకు నారాయణస్వామి పరోక్ష శ్రోత మాత్రమే. వారు వింటున్నారని సైతం లచ్చమ్మకు తెలియదు.

 Previous Page Next Page