Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 18


    "కాశీ! ఏమయింది? వాంతులా! విషం ఎఫెక్టే అయి ఉంటుంది. పద! అమ్మాయ్ గారితో చెబుదాం"


    మరు నిమిషంలో "అమ్మాయ్ గారు" అయిన ఐశ్వర్య ఎదురుగా నిలబడి ఉన్నారు ఇద్దరూ.


    ఐశ్వర్యని చూడగానే తన మనసంతా ఏదోలా అయిపోతోందని గ్రహించాడు కాశీ. వళ్ళంతా వణకడం మొదలెట్టింది. నాసియా!


    కాశీని చూడగానే, పేదసాదల పట్ల తనకెంత ప్రేమ ఉందో ప్రదర్శించడానికి మంచి అవకాశం దొరికిందనుకుంది ఐశ్వర్య.


    అందరికీ వినబడేటంత పెద్ద గొంతుతో అంది - "అరె! కాశీ! మన కాశీకి ఏమయింది? ఇందాక బాగానే ఉన్నాడే! మళ్ళీ వికటించిందా? హెలికాప్టర్ లో సిటీకి తీసుకెళ్ళండి. అక్కస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి! రాబర్ట్... రాబర్ట్ ఎక్కడ...?"


    అక్కడున్న జనంలో ఐశ్వర్య పట్ల ఏమన్నా అనుమానం అనేది ఉంటే అది కాస్తా తొలగిపోయింది.


    మనసులో వియత్నాం ప్లాంటి సంగతి మెదులుతూనే ఉంది ఐశ్వర్యకి. చీప్ లేబర్ ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యాక్టరీ పెడుతుంది తను. కానీ, చీప్ లేబర్ ని మరీ చీప్ గా చూస్తే ఏం జరుగుతుందో వియత్నాం ప్లాంట్ విషయంలో అర్థమవుతోంది. తను జాగ్రత్తగా ఉండాలి. కనీసం... కొంచెం జాగ్రత్తగా!


                                                    *    *    *    *


    మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు కాశీ. కానీ, అది ఐశ్వర్య పురమాయించినట్లుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు. ఐశ్వర్య తత్వం ఆమె పరిజనానికి తెలుసు. అందరూ ఉన్నప్పుడు చాలా ఆదర్శవంతంగా మాట్లాడుతుంది తను. ఆ మాటలు అందరినీ ఆకర్షించడానికేననీ, ఆచరణలో పెట్టడానికి కాదనీ ఆమె కొలువులో ఉండే అందరికీ తెలుసు. అందుకని ఆమె అందరిముందూ ఏం చెప్పినా కూడా, ఆమె అభీష్టం ఏమిటో గ్రహించి ఆ ప్రకారమే చేస్తారు.


    కాశీని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించమని చెప్పింది ఐశ్వర్య. కానీ ఆమె మనసులో అలా నిజంగా అనుకుని ఉండదని నౌకర్లకి తెలుసు. పిల్లికి బిచ్చం పెట్టదు ఆ అమ్మాయి. తనని కట్టుకుపోయేటన్ని కోట్లు ఉన్నా కూడా! ఆమె ఇంటికి వచ్చిన అతిథులని ట్రీట్ చేసే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఇంటికి ఎవరన్నా రాగానే, ఓ నౌకరుని పిలిచి "కాఫీ తీసుకురా" అంటుంది. వినయంగా తల ఊపి లోపలికి వెళ్తాడు నౌకరు, అదే పోవడం మళ్ళీ రాడు. కాఫీ రాదు. కానీ ఐశ్వర్య "సుబ్బారావుగారు వచ్చారు! కాఫీ తీసుకురా" అని స్పష్టంగా చెబితే అప్పుడు కాఫీ నిజంగా వస్తుంది. ఆ కోడ్ ఐశ్వర్యే అరేంజ్ చేసింది.


    అలాగే కాశీని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్పించే విషయంలో నౌకర్లకు ఉప్పు అందలేదు. అందుకని వాళ్ళు అతన్ని గవర్నమెంటు హాస్పిటల్లో పడేశారు. కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాడు కాశీ. తను నరకంలో ఉన్నానేమోనని ఒక క్షణంపాటు అనిపించింది అతనికి. అది హాస్పిటలని అర్థమయ్యాక నీరసంగా వెనక్కి వాలాడు. అతనికి మళ్ళీ మగత్ కమ్ముతున్నట్లుగా అయింది.


    మనసు మళ్ళీ వెనక్కి వెనక్కి వెనక్కి పోతోంది.


    రోజులు - వారాలు - నెలలు - సంవత్సరాలు - దశాబ్దాలు - ఒక్క సెకెండులో వెయ్యోవంతులో గడిచిపోయాయి. మనోవేగంతో గతంలోకి వెళ్ళిపోయాడు కాశీ. మళ్ళీ అదే ఫీలింగు. తను గాల్లో తేలుతూ అన్నిటినీ పరికిస్తున్నట్లుగా - హాస్పిటల్ కప్పుని తాకుతున్న లెవెల్లో ఉన్నాడు తను.


    తన బెడ్ వైపు చూశాడు. అది హాస్పిటల్ బెడ్డే! కానీ ఈ కాలపుది కాదు. ఆ బెడ్ మీద తనే... కానీ, పాతకాలపు గెటప్ లో ఉన్నాడు. హిట్లరు మీసాలు, లాల్చీ, లుంగీ, పక్కన పాపారావు నిలబడి ఉన్నాడు. అక్కడికి కొంతదూరంలో ఐశ్వర్య నిలబడి ఉంది.


    ఐశ్వర్య... తన భార్య!


    సిగ్గుతో చితికి పోతున్నట్లు అవమాన భారంతో కుంచించుకుపోతున్నట్లుగా తల వంచుకుని ఉంది ఐశ్వర్య.


    పాతకాలపు డాక్టర్ చెబుతున్నాడు "వ్యసనాలలో కూడా చాలా ఓవర్ గా వెళ్ళిపోయాడు ఈయన. ఒళ్ళంతా పుచ్చిపోయింది. సెక్స్ అడిక్షన్ కీ, లిక్కర్ అడిక్షన్ కీ కూడా ట్రీట్ మెంట్ ఇవ్వాలి.వెనెరల్ డిసీసెస్ ఉన్నాయి. లిక్కర్ వల్ల లివర్ పాడయిపోయింది. ఈసారికి బతికి బయటపడవచ్చు. కానీ మళ్ళీ గనక ఇదే స్థితికి వస్తే ఈయన ప్రాణానికి నేను హామీ ఇవ్వలేను. ఇప్పుడు కూడా నేను పూర్తిగా భరోసా ఇవ్వలేను. ట్రీట్ మెంట్ మొదలెట్టమంటారా?


    డాక్టర్ ని పక్కకి పిలిచి చెవిలో అడుగుతున్నాడు పాపారావు. "డబ్బు ఖర్చు పెడితే లాభమేమన్న ఉంటుందా! గంగలో కలవడమేనా?" అని. ఓరినీ...


    "చెబుతున్నానుగా! నా ప్రయత్నం నేను చేస్తాను!" అంటున్నాడు పాతకాలపు డాక్టరు.


    కొద్దిదూరంలో నిలబడి ఉన్న ఐశ్వర్య దిగులుగా తన దగ్గరికి వచ్చింది.


    "నా ప్రాణాలు దక్కించండి డాక్టర్ గారూ! ఆయనంటే నాకు పంచప్రాణాలు. ఆయన బతికితే నేను బతుకుతాను.లేదా ఆయనతోబాటే నేనూ."


    "చెప్పాను కదమ్మా! నా ప్రయత్నం నేను చేస్తాను" అంటున్నాడు డాక్టర్.


    ఐశ్వర్య అంటోంది. "డాక్టర్ గారు! మీరు వైద్యం చేస్తారు. నా దేవుడు నయం చేస్తాడు. నాకు దేవుడంటే అపారమైన నమ్మకం ఉంది. డాక్టర్ గారూ! మీరు మంచి ట్రీట్ మెంట్ ఇవ్వండి. దేవుడు చెయ్యాల్సింది ఏమిటో దేవుడే చేస్తాడు". త్వరత్వరగా ఒక్కసారిగా ఆమె అన్ని మాటలు ఎప్పుడూ మాట్లాడి ఉండలేదు. భర్తని దక్కించుకోవాలనే తహతహ ఆమెచేత అలా మాట్లాడించింది.

 Previous Page Next Page