డాక్టర్ చిరునవ్వు నవ్వి, కేసు ఛార్టు శ్రద్దగా చదవడం మొదలెట్టాడు. తర్వాత అన్నాడు. "సరే! అయిందేదో అయింది. ఇకముందు ఒక్క చిక్క కూడా విస్కీ తాగనని మాటిస్తే ట్రీట్ మెంట్ మొదలెట్టొచ్చు. మళ్ళీ విస్కీ తాగాడో... అంతే సంగతులు?"
తాగను అన్నట్లు తల ఆడించాడు తను. కొన్ని మందులు, ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ రౌండ్సుకి వెళ్ళాడు. స్నానం చేసి భోజనం తీసుకురావడానికి ఐశ్వర్య ఇంటికి వెళ్ళింది. పాపారావు మాత్రం మిగిలాడు. తన చెవిలో అన్నాడు. "పాపం!" ఒక్కసారిగా మందు మానెయ్యడం అంటే కష్టమే కదా! డాక్టర్లకేం! అట్లాగే చెప్తారు. నరాలు తెగిపోవూ? తాగుడు తగ్గించాల్సిందే? అయితే ఒక్కసారిగా ఢమాల్ మని తగ్గిస్తే శాల్తీ కూడా డిటో. ఈ తమాషాలన్నీ నేనూ చూసినవాడినే? సీమ సరుకు ఒక బాటిలు తెచ్చా - నోటి హితవు కోసం మందులాగా తాగు! అంతే! మితిమీరకు సుమా!"
అరగంటలోపల మొత్తం బాటిలు ఖాళీ చేశాడు తను. అంతా కక్కేశాడు. అరుపులూ, కేకలు మొదలెట్టాడు. తనని తాగొద్దని చెప్పినా వాళ్ళందరినీ అమ్మనా బూతులు తిట్టాడు.
* * * *
హఠాత్తుగా మెలకువ వచ్చినట్లయింది కాశీకి.
తను నిజంగానే పెద్దగా కేకలేస్తున్నాడు. ఇది భ్రమ కాదు. నిజమే! ఇది పాతకాలపు హాస్పిటల్ కాదు. ఇప్పటి హాస్పిటలే! అనరాని, వినరాని తిట్లని తిడుతున్నాడు డాక్టర్లని. రౌండ్స్ కు వచ్చిన పెద్ద డాక్టరూ, డ్యూటీలో ఉన్న హౌస్ సర్జన్లూ అందరూ బిత్తరపోయి చూస్తున్నారు - అంతేకానీ అదేమిటని ఎవ్వరూ నోరెత్తలేదు.
ఠక్కున కాశీ నోరు మూతబడింది.
అయ్యబాబోయ్! డాక్టర్లని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు తను. ఇప్పుడు తనని ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి గుండెకాయ తీసేస్తారా?
భయంగా పెద్ద డాక్టర్ గారి మొహంలోకి చూశాడు. ఆయన ఏడవలేక నవ్వుతున్నట్లుగా కనబడ్డాడు.
ఎందుకని?
ఈలోగా ఇంకో విశేషం కనబడింది.
పక్క బెడ్డులో ఇంకో పేషెంట్ ఉన్నాడు. అతను బాత్ రూంకి వెళ్ళాల్సిన అవసరంలో ఉన్నాడు. కానీ కాలు కదిపే స్థితి కాదు. బెడ్ పాన్ తెమ్మని దీనంగా సైగచేసి అడుగుతున్నాడు. అతని బెడ్ పక్కనే కూర్చుని ఉన్న అతని భార్య మేల్ నర్సుని సిగ్గు విడిచి అడుగుతోంది.
"అన్నా! ఆయన మూత్రం చెయ్యాలి. పాన్ తెచ్చి పెట్టవా?"
"పైసలు ఇవ్వవు. పాన్ మాత్రం వస్తదా?" అన్నాడు మేల్ నర్స్ నిర్దయగా.
అది చూస్తున్న కాశీ ఊరుకోలేకపోయాడు. తను ఇందాక ఒళ్లు తెలియక తిడితే పడ్డారు వీళ్ళు.
ఇప్పుడు ఒళ్ళు తెలియని కోపంతో తిడతాడు. పడరా?
తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు కాశీ.
"బెడ్ పాన్ తీసుకురారా!" అన్నాడు.
తీసుకురాకపోతే చంపేస్తా! అన్నట్లు.
అదిరిపడి బెడ్ పాన్ తెచ్చాడు మేల్ నర్సు.
ఇంక అందుకున్నాడు కాశీ.
"ఇక్కడ ఉండాల్సిన ఆయా లేదు. వార్డ్ బాయ్ లేడు. ఇదేమిటని అడిగే గుండె ధైర్యం పెద్ద డాక్టర్ కి లేదు. పెద్ద డాక్టరు పక్క ఉండగానే వీళ్ళు డబ్బులడగడం! అవును మరి! వీళ్ళు చైనా విషయాల్లో డబ్బు తింటున్నప్పుడు ఆయన అడ్డం రాడు. ఆయన పెద్ద ఆపరేషన్లలో గడ్డి తింటున్నప్పుడు వీళ్ళు అడ్డంరారు. ఒకళ్ళ పాపపు పనులకి ఇంకొకళ్ళు రక్ష! ఎందుకురా! ఎందుకురా ఈ కక్కుర్తి! కుక్క వెధవల్లారా! ప్రజల సొమ్ము ప్రభుత్వం దగ్గరనుంచి జీతంలాగా తింటున్నారు కదరా దొంగ వెధవల్లారా! దేవుడనే వాడుంటే మళ్ళీ జన్మలో మీరు కుక్కలు, నక్కలు, పందులుగా పుడతారు దొంగనాయాళ్లలారా!"
వార్డు అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు అందరూ నిశ్చేష్టులయి చూస్తున్నారు కాశీవైపు.
అంతలోనే...
"అదిగో వస్తున్నారు... వస్తున్నారు" అంటూ గుసగుసలు.
తలతిప్పి చూశాడు కాశీ.
చాలా ఫేషనబుల్ గ ఉన్న సూటు వేసుకున్న ఒకాయన... బహుశా పెద్ద డాక్టరు అయుండొచ్చు. నెమ్మదిగా అటే వస్తున్నాడు. లేత గోధుమరంగు సూటు అది. ఎంతో డిగ్నిఫైడ్ గా ఉంది. ఆయనది గంభీరంగా ఉన్న విగ్రహం. మొహం ప్రసన్నంగా ఉంది. దయతో కూడిన చిరునవ్వు.
కాశీ బెడ్ దగ్గర ఆగాడు ఆయన.
"కాశీ!" అన్నాడు అభిమానంగా.
"సార్!" అన్నాడు కాశీ. ఆయనెవరో అంతుబట్టలేదు.