వాళ్ళ మధ్యలో తను.
ఒక చేతిలో తుపాకి. రెండో చేతిలో... అదేమిటి?
అరె! విస్కీ సీసా!
తనా? తనేనా? తను విస్కీ తాగుతాడా? ఓరి దేవుడా!
తన పక్కన.
ఓరి దేవుడోయ్. తన పక్కన నిలబడి ఉన్న ఆ అమ్మాయి ఐశ్వర్య! అస్సలు పోలికే లేదే! పోలిక అంటే, డ్రెస్సింగులో, నిలబడడంలో, మాట్లాడటంలో, సిగ్గు పడటంలో, వినయ విధేయతలు ప్రకటించడంలో..
ఆమె ఏదో అంటోంది.
ఏమంటోందీ?
మొత్తానికి తనని బతిమాలుతోంది.
ఆమె మొహంలో మొహమాటం! ఏమనుకుంటారో అన్నట్లుగా మధ్య మధ్యన అందరివైపూ చూస్తోంది. తను అదేం పట్టించుకోకుండా విదిలించి కొడుతున్నాడు. కొంతమంది ఆడవాళ్లు తనవైపు నవ్వుతూ చూస్తున్నారు. కొంతమంది తనవైపు ఆరాధనగా చూస్తున్నారు. తనంటే పడి చచ్చేటట్లు ఉన్నారు వాళ్ళు. వాళ్ళలో ఓ అమ్మాయి కొంగు జారేసి తనవైపు ఎలా చూస్తోందో.
తన చేతిలో విస్కీసీసా ఖాళీ అయిపోయింది.
"పాపారావ్! విస్కీ!" అంటున్నాడు తను.
ఈ పాపారావు ఎవరూ?
అటూ ఇటూ చూశాడు కాశీ.
"పాపారావ్! విస్కీ" థానే అరుస్తున్నాడు. చటుక్కున గుంపులోనుంచి బయటికి వచ్చాడు పాపారావు. ఇతన్ని ఎక్కడో చూసినట్లే ఉంది. నల్లగా, పొట్టిగా, లావుగా ఉన్నాడు. ఎర్రటి కళ్ళు.
"అర సీసా అని ఆరు సీసాలు లాగించేటట్లు ఉన్నావే! మా చెల్లెలు ఏమనుకుంటుందీ? తగ్గు మిత్రమా!" అంటున్నాడు పాపారావు. అంతా ఉత్తదే! చెల్లెలు ఏమన్నా అనుకుంటుందేమో అన్న భయంతో చెబుతున్నాడు గానీ తనకు తాగుడు అలవాటు చేసింది వీడు కాదూ! వీడేం చెప్పాడూ?
"బ్రదర్! తాగడం ఎలాగో నన్ను చూసి నేర్చుకో! తాగాక ఒళ్ళు తూలడం కాదు. ఒళ్ళు తెలీకూడదు. ఓ చేత్తో ఆ గోడా, ఓ చేత్తో ఈ గోడా పట్టుకుంటే తప్ప అడుగు ముందుకు పడకూడదు. అదీ తాగడమంటే..." అని చెప్పింది వీడు కాదూ?
"ఏమండీ! నా మాట వినరా?" అంటోంది ఐశ్వర్య జాలిగా చూస్తూ. ఐశ్వర్యేనా? తనతో అంత వినయంగా మాట్లాడుతోంది?
"ఏమండీ! తాగడమే తప్పండీ! అమ్మడం పాపం! మనకేం తక్కువనీ..."
ఇప్పుడు కనబడుతున్నది ఛక్ మని సీను మారినట్లనిపించింది. వనభోజనం సీనుకాదు - తన ఇంటి సీను.
తన ఇల్లు! అసలు తనకు ఇల్లే లేదు కదా! మరి ఆ కనబడుతున్నది...? ఇల్లా అది!
ఇల్లు కాదు - ఒక దేవిడీలాగా ఉంది! చాలా పెద్ద భవంతి! పోర్టికోలో ఒక పాతకాలపు ఫోర్డు కారు ఆగి ఉంది. ఆ ఇంట్లో ఉన్న హాల్లో పెద్ద సీను జరుగుతోంది. తను... తనే... ఉన్నాడు అక్కడ కూడా! ఈ సీన్లో ట్వీడ్ సూటు వేసుకుని ఉన్నాడు. ఒక చేతిలో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ల టిన్ను. రెండో చేతిలో జానీవాకర్ విస్కీ సీసా!
"నామాట వినరా! ఈ వ్యాపారం మనకు వద్దండీ! వాళ్ళ ఉసురు మనకి తగులుతుందండి. వచ్చే జన్మలో మళ్ళీ పుట్టగతులు ఉండవండీ!" అంటోంది ఐశ్వర్య. తనా...! తను సారా వ్యాపారం చెయ్యడమా? ఐశ్వర్య తన భార్యా...? తనని వద్దని వారిస్తోందా? ఏం పిచ్చి! కలగంటున్నాడా తను?
చెట్టుకి ఆనుకుని నిస్త్రాణగా పడుకుని ఉన్న కాశీ పెద్దగా మూలిగి కదిలాడు. మళ్ళీ వనభోజనం సీను కనబడుతోంది. అందరూ తమవైపే చూస్తున్నారు.ఐశ్వర్యకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె ఇంక అక్కడ నిలబడలేక "రండమ్మ! రండి! ఇక్కడికి దగ్గర్లోనే పాముపుట్ట ఉంది. కాసిని పాలుపోసి వద్దాం" అంది. ఆమెతోపాటు కొందరు ఆడవాళ్ళు వెళ్ళారు. కొంతమంది ఇక్కడే ఉండిపోయారు. కొంగుజార్చిన అమ్మాయి వళ్ళంతా కళ్ళు చేసుకుని తననే చూస్తోంది. ఆమెని ఇంప్రెస్ చెయ్యడానికి గానూ తను గన్ ని ఎయిమ్ చేసి, ఆ అమ్మాయి తలమీదగా గురిచూసి, చెట్టుకొమ్మ మీద ఉన్న రంగులపిట్టను కాల్చాడు. పిట్ట అరవను కూడా అరవకుండా కిందపడిపోయింది.
"పడేశారు" అంది ఆ అమ్మాయి భావగర్బితంగా. తను గర్వంగా నవ్వబోయాడు. కానీ కడుపులో విస్కీ కదలడం మొదలెట్టింది. భళ్ళున వాంతి అయిపోయింది. నిండా రెండు సీసాలు తాగి ఉన్నాడు తను అప్పటికే!
నిజంగానే వాంతి అయిపోయింది కాశీకి. నీరసంగా కళ్ళు తెరిచి చూశాడు. ఎంత చిత్రమిన కల! ఊరికే కలేనా, లేకపోతే తనకి మతి చలించిందా! స్వీటుతో బాటు విషయం తిన్నాడు తను. వెంటనే ట్రీట్ మెంటు ఇవ్వడం వల్ల బతికి బయటపడ్డాడు. కానీ వంట్లో బాగాలేదు. వాంతులవుతున్నాయి. పైగా - ఈ కలలు! తన కడుపులో ఇంత దురాలోచన ఉందా? ఐశ్వర్యని తన భార్యగా ఊహిస్తున్నాడా? ఛీఛీ? ఎప్పుడూ లేనిది... ఎందుకిలా? తనకి ఆడవాళ్ళ యావ లేదే అసలు!
మళ్ళీ వాంతి అయింది కాశీకి.
"కాశీ!" అని వినబడింది ఒక గొంతు. చూశాడు కాశీ. బాలూ నిలబడి ఉన్నాడు పక్కన. ఆదుర్దాగా చూస్తున్నాడు.