Previous Page Next Page 
జన్మభూమి పేజి 18

    "అట్లాగే కానీండి. నేనెందుకు కాదనాలి. చెడ్డవాడి నవ్వాలి" చౌదరి వంకర నవ్వు నవ్వి అన్నాడు. కేశవరావు గొప్ప డాక్టర్. డబ్బున్నవాడు. స్వయంగా ముఖ్యమంత్రి దన్ను వున్నవాడు. అట్లాంటి వాడిని కాదంటే... రేపు ఏదన్నా సమస్య తలెత్తితే తానొక్కడూ ఒంటరివాడు అవచ్చు. ఏదో చేస్తానంటున్నాడు, చూద్దాం... నాలుగురోజులు పోతే ఆయనకే అర్ధం అవుతుంది అనుకున్నాడు మనసులో. ఇదే ఇంకెవరన్నా అయితే యింతసేపు కూచునేవాడు కాదు అతను. ఆ వూర్లో అంతటికి డబ్బు, మేడ వున్నవాడు చౌదరి.
                                     *    *    *
    "సుగుణేం చదువుచెప్పగలదు మామయ్యా...తనకేం వచ్చని. చదివింది ఎనిమిదో క్లాసేగా..." రంగా నవ్వి భార్యవైపు చూశాడు.
    "ఒకటో క్లాసు పిల్లలకి చదువు చెప్పడానికేం ఉందయ్యా... మీ అత్తయ్య నాలుగో క్లాసు, ఐదోక్లాసు వాళ్ళకి సైన్సు, యింగ్లీషు చెపుతుంది. సుగుణనీ వెళ్ళమను. ఒకటో క్లాసు పిల్లలకి తెలుగు, లెక్కలు చెప్పమను. టీచరుని పోస్టుచేసి నెలరోజులయినా ఇంకా రాలేదట. హెడ్మాస్టరు రాజేశ్వరి వచ్చి క్లాసులు తీసుకుంటుందనగానే సంబరపడిపోయాడు. పెద్ద క్లాసు పిల్లలకి పాఠాలే సరిగా అవడం లేదు. ఒక్కడే టీచరు అన్ని క్లాసులకి అని మొత్తుకుంటున్నాడు. నేనే సుగుణ కూడా వచ్చి చెపుతుందని చెప్పాను. ఏమ్మా సుగుణా వెడతావా- అసలు నీవు ఎనిమిదో క్లాసు తరువాత చదువెందుకు ఆపావు. పోనీ ప్రైవేటుగా మెట్రిక్ చదవాల్సింది.
    "మా ఊర్లో అంతే వుందండి బాబాయిగారు. పెళ్ళయ్యాక యింకేం చదువు... పిల్లలు, సంసారమే సరిపోయింది..." సుగుణ సిగ్గుపడుతూ అంది.
    "పోన్లే, కాస్త స్కూలుకి వెళ్ళి వస్తూండు. కాలక్షేపం, కాస్త మర్చిపోయిన నాలుగు ముక్కలూ జ్ఞాపకానికి వస్తాయి."
    "ఈ వూర్లో ఏ టీచరు వచ్చినా ఆర్నెల్లకంటే వుండరు. ఏదో వంకన సెలవు పెడ్తారు. మళ్ళీ రారు మామయ్యా..."
    "అదే గదా రంగా అసలు ప్రాబ్లమ్. ఈ పల్లెలలో వసతులు పెరగాలి. మంచి స్కూల్స్, ఆస్పత్రి సౌకర్యం, మంచి రోడ్లు, బస్సు, రైలు సౌకర్యాలు వుంటే ఎవరన్నా వుంటారు. చదువు చెప్పడానికి టీచర్లకీ ఈ స్కూలు, ఈ పిల్లలు, ఈ వాతావరణం చూసి ఉత్సాహం చచ్చిపోతుంది."
    ముందు అందుకే స్కూలు బాగుచేయించుదాం. కాస్త బల్లలు, కుర్చీలు అవి ఆర్డరివ్వాలి రంగా. ఈ వూర్లో మంచి మేస్త్రీ వున్నాడా- పిల్చుకురా - వడ్రంగున్నాడా- లేకపోతే సిటీ నుంచి ఆర్డరు చెయ్యాలా.
    "తాపీ పనివాళ్ళు ఇద్దరున్నారు- రేపు పిల్చుకువస్తా... కుర్చీలు, బల్లలు ఇక్కడ చేయించేకంటే విజయవాడనుంచి ఆర్డరిచ్చి చేయించితే తొందరగా వస్తాయి. ఇక్కడివాళ్ళకి సరిగా పనిరాదు... ఏదో చిన్నచిన్న రిపేర్లు చేస్తుంటారు అంతే."
    "ఉగాది నాటికి ఆలయం, స్కూలు బాగుచేయించాలి రంగా. సున్నాలు వేసేవారిని కూడా చూడు. ఇదిగో డబ్బు యివ్వడం నావంతు. ఇదంతా దగ్గరుండి నీవే చేయించాలి మరి. రెండు మూడు రోజుల్లో నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఈ వూరిలో జన్మభూమి కింద మనం చేయబోయే పనులు చెప్పి సహకార సేద్యానికి అసెస్ మెంట్ చేయడానికి అగ్రికల్చర్ ఆఫీసర్లని పంపమని, బ్యాంకు లోన్ల విషయం అన్నీ మాట్లాడి వస్తాను. ఈలోగా రంగా నీవు ఒకపని చెయ్యి. ఈ వూర్లో కాస్త చదువుకున్న ముగ్గురు నలుగురు యువకులను కూడగట్టు. అందరికి మనం తలో పని అప్పచెపుదాం... నీ ఒక్కడివల్ల అన్నీ చూడడం అవదు గదా. గుడి పని ఒకరికి, స్కూలు పని ఒకరికి, ఆస్పత్రి పని ఒకరికి ఇలా ప్రతివాళ్ళని బాధ్యుల్ని చేస్తూ పని అప్పచెపుదాం. కాస్త చదువుకున్న కుర్రాళ్ళున్నారా.
    "హెడ్మాస్టరుగారబ్బాయి వాసు అని బి.ఏ. పాసయి ఉద్యోగం లేక తిరుగుతున్నాడు. అలాగే మన పెద్ద రైతు వెంకటపతి కొడుకున్నాడు. ఇంటరు తప్పి పొలం లేదు, అటు ఉద్యోగం లేక తిరుగుతున్నాడు."       
    "ఆ... అలాంటివాళ్ళని ఇద్దరు ముగ్గురిని పట్టుకునిరా. ఒక్కొక్కళ్ళకి ఓ పని అప్పచెపుదాం. నేను హైదరాబాదు నుంచి వచ్చాక మనం ఈ వూరిలో రైతుల లిస్టు, ఎన్ని ఎకరాలు- ఒక్కొక్కరికి ఓ ఫైలు, పుస్తకం తయారుచెయ్యాలి. రంగా ఈ లెక్కలు, ఖర్చులు, వసూళ్ళు, రుణాలు, బ్యాంకు పనులు యివన్నీ చెయ్యడానికి మనకి ఓ అకౌంటెంట్ వుంటే బావుంటుంది- మొత్తం మనీ మేటర్స్ డీల్ చెయ్యాలి అతను- అలాంటి పని తెల్సిన ఎవరైనా వున్నారా."
    రంగా మొహం వెలిగింది ఒక్కసారిగా. "ఎవరో ఎందుకు మామయ్యా- మావాడు శ్రీనివాసున్నాడు గదా. బి.కాం. చదివాడు. సరైన ఉద్యోగం లేక తిరుగుతున్నాడు హైదరాబాదులో. పాసయ్యి ఆరునెలలు అయింది. ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పల్లెలో వుండి ఏం చేస్తాను. అక్కడుంటే ఏ కంప్యూటర్ కోర్సో బ్యాంక్ పరీక్షలో  కట్టొచ్చు అంటూ అక్కడ వుండిపోయాడు. రమ్మంటే రాడు. యిక్కడ వాడికి నెలకింత అని ఏర్పాటుచేస్తే, ఉద్యోగం అంటే వస్తాడేమో-" ఆశగా కేశవరావు ముఖంలోకి చూశాడు.
    "అయితే మరింకేం - రమ్మని రాయి. మరి ఈ పల్లెటూరిలో వుంటాడా. జీతం ఏర్పాటుచేస్తాం అనుకో - అదేదో అడుగు. లేకపోతే పేపరులో ప్రకటన యిద్దాం-"
    "ఎందుకు రాడు. ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడుగా. జీతం యిచ్చే ఉద్యోగం అంటే వాడే వస్తాడు. నే ఫోను చేసి మాట్లాడి చెప్తాను."
    "డబ్బుతో పని. బాధ్యతగా వుండాలి. తనని కంట్రోలు చేసేందుకు కమిటీ వుంటుంది. ఏడాదికి ఒకసారి అకౌంట్ ఆడిట్ చేయించాలి. అన్నీ వివరిద్దాం ముందురానీ - పోనీ ఈ విధంగా నీ కొడుకు ప్రయోజకుడవుతే నాకూ సంతోషమే-"
    "రంగా, ఈ రైతులు, పొలం పనులు, విత్తనాలు, ఎరువులు, మందులు తేవడం ఈ విషయాలన్నీ నీవు చూడగలవా. ఈ సహకార సేద్యం మొత్తం భారం నీవు మోయగలవా. రైతులందరినీ కూడగట్టుకోవాలి. పని మొత్తం అందరికి పంచాలి, నాటాల్సిన విత్తులు, వేయాల్సిన ఎరువుల మోతాదు- చల్లాల్సిన మందులు - దగ్గరుండి రైతుల చేత చేయించాలి. ఇదంతా నీవు చెయ్యగలవా- ఇన్నాళ్ళు వ్యవసాయ పనులు చేశావు గనక యివన్నీ నీకు తెలిసే వుంటుంది. మొత్తం అందరిమీద అజమాయిషీ చెయ్యగలవా! ఏ రైతు కింద ఎంత పొలం అన్నది అసెస్ మెంటు అయ్యాక కేటాయిద్దాం. మొత్తం వూరిలో సేద్యపు ఎకరాల పంట విషయం నీవు చూసుకోగలనంటావా?" సందేహంగా చూశాడు.
    "మొత్తం అంతా నా ఒక్కడివల్లా అవుతుందా - చౌదరిలాంటివారు కలిసిరారంటావా - ఆయనేం బాధ్యత తీసుకోడంటావా? వెయ్యి ఎకరాలపైన అంతా నేచూడగలనా-"
    "ఆయన డబ్బున్నవాడినని చాలా ఫోజు కొడ్తున్నాడు- అతనికున్న డబ్బు నాకు ఒక సంవత్సర సంపాదన అన్నది అతనికి తెలీదనుకుంటాను. అతను బాధ్యత అంటే నిలబడి పొలం పనులు చేయించే రకమా-" కేశవరావు సందేహంగా అన్నారు.
    "అబ్బే, తన భూములే కౌలికిచ్చి దర్జాగా కూచుంటాడు- తీసుకోమంటే కర్ర పెత్తనం, డబ్బు పెత్తనం లాంటివి తీసుకుంటాడేమో"
    "డబ్బు పెత్తనం ఇలాంటివారి కొద్దులే- అసలు ఏ ఒక్కరికీ వద్దు. కమిటీ పెత్తనం, అకౌంటు చూడడానికి ఎకౌంటు వుంటేనే నయం. చూద్దాం -నీవల్ల అవకపోతే ఇంకొక్కరిని కూడా కలుపుకుందాం. అసలు మనకు ఎవరన్నా ఓ అగ్రికల్చర్ చదివినవారు సలహాదారుగా వుంటే బాగుంటుందేమోననిపిస్తుంది...ఆలోచిద్దాంలే ఆ విషయం.

 Previous Page Next Page