Previous Page Next Page 
సీతాచరితం పేజి 18


    అయోధ్యలో ఋశ్యశృంగునికి ఇచ్చిన స్వాగతం పురోహితునికి ఇచ్చినట్లుగా లేదు - రాజులకూ రారాజులకూ ఇచ్చినట్లుంది. క్షత్రియుడు పురోహితుడు అయినందుకు "మా వాళ్లూ మంత్రాలు నేర్వగలరు" అని ప్రదర్సించడానికి చేసిన ఏర్పాటులా వుంది.


    బ్రాహ్మణాధిక్యతను అరికట్టడానికి ప్రయత్నాలు నాటినుంచి నేటివరకూ జరుగుతున్నాయి. బ్రాహ్మాణేతరులు ఒక ఉద్యమంగా పౌరోహిత్యం నేర్చుకోవడం ఈ మధ్యదాకా జరుగుతోంది. అతడు ఏ కులం వాడైతే ఆ కులంవాడు అతనితోనే పౌరోహిత్యం చేయించుకోవడం జరుగుతూంది. అతనికి ఆ కులంవాళ్లు బ్రహ్మరథం పట్టడమూ జరుగుతూంది.

    
    అశ్వమేధం


    ఋశ్యశృంగుడు అయోధ్యలో సుఖంగా ఉన్నాడు. అలా కొంత కాలం జరిగింది. వసంతకాలం వచ్చింది. చైత్రపౌర్ణమినాడు దశరథుడు ఋశ్యశృంగుని దగ్గరకు వెళ్లాడు. తనకు సంతానం కలగాలనీ, అందుకుగాను అశ్వమేధం చేయించమనీ వేడుకొన్నాడు. ఋశ్యశృంగుడు సమ్మతించాడు. యజ్ఞానికి గాను ఏర్పాట్లు చేయించవలసిందన్నాడు. దశరథుడు యజ్ఞానికి అవసరం అయిన ఏర్పాట్లు చేయించవలసినదని ఆదేశించాడు.


    ఏర్పాట్లన్నీ అయ్యేవరకు ఏడాది తిరిగివచ్చింది. వశిష్ఠు ఆదేశం ప్రకారం బ్రాహ్మణులు, స్థపతులు, వర్థకులు, ఖనకులు, గణకులు, శాస్త్రవేత్తలూ వచ్చారు. వారు విశాలములయిన రాజ భవనాలు నిర్మించారు. సకల వర్గములవారికి మృష్టాన్న భోజనముల ఏర్పాట్లు జరిగాయి.


    రాజులను ఆహ్వానించడానికి సుమంతుడు స్వయంగా వెళ్లాడు. కాశీపతి, కేకయరాజు, రోమపాదుడు, సింధు, సౌవీర, సౌరాష్ట్ర ప్రభువులను ఆహ్వానించాడు. వారంతా వచ్చేశారు. ఇదంతా జరిగేవరకు మరో సంవత్సరం గడిచింది. విడిచిన యజ్ఞాశ్వం తిరిగివచ్చింది.


    సరయూ నదికి ఉత్తరాన యజ్ఞశాల సిద్దం అయింది. దశరథుడు యజ్ఞశాలకు చేరాడు. ఋశ్యశృంగుడు విచ్చేశాడు. యాగం ప్రారంభం అయింది. మునులు ఇంద్రునికి ఇవ్వాల్సిన హవిర్బాగాలు ఇచ్చారు. స్తోత్రాలతో సోమలతను స్తుతించారు. బహిష్పవనాదులతో ఆయా కర్మ దేవతలను పూజించారు. తరువాత ప్రాతస్సవనం, మధ్యాహ్న సవనం, తృతీయ సవనం నిర్వహించారు. యాగంలో ఋత్విక్కులు బిల్వాలకు, యూపాలను నిలిపారు. ఇంద్రాది దేవతలకోసం యూపాలకు పశువులకూ, పక్షులనూ, పాముల్నూ కట్టారు. వారికి కట్టిన మొత్తం సంఖ్య మూడు వందలు. వాటిలో దశరథుని పట్టపు గుర్రం కూడా వుంది. పట్టమహిషి అయిన కౌసల్య ఆ గుర్రాన్ని యథారీతిగా పూజించింది. బంగారు సూదుల్తో దాని గుండెమీద మూడునాట్లు పెట్టింది. ఆ రాత్రి సాంతం ఆమె అక్కడే గడిపింది. అధ్వర్యుడు గుర్రపు వపను తీసి హోమం చేశారు. మహారాజు తపో గంధాన్ని వాసన చూచాడు. తరువాత పదహారు మంది రుత్విక్కులు గుర్రపు అంగాలన్నిటినీ యథావిధిగా హోమం చేశారు. అలా అశ్వమేధం మూడు రోజులు జరిగింది. ఆ యాగంలో మరికొన్ని యాగాలు జరిగాయి. ఆ తర్వాత దశరథుడు తన రాజ్యాన్నంతా ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చాడు. వారు ఆ రాజ్యాన్ని మళ్లీ దశరథునకిచ్చారు. వారలా ఇచ్చినందుకు బ్రాహ్మణులకు పది లక్షల ఆవులను, నూరు కోట్ల బంగారాన్ని, నాల్గువందల కోట్ల వెండిని ఇచ్చాడు. దేశదేశాల నుంచి అనేకమంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్లకు కోటి బంగారాలు ఇచ్చాడు. అంతా అయిపోయింతర్వాత ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చాడు. దశరథుని దగ్గర ఏమీ మిగులలేదు. అప్పుడు దశరథుడు తన చేతి కడియాన్ని ఆ బ్రాహ్మణునికిచ్చాడు.

    
    పుత్రకామేష్టి


    దశరథుడు అశ్వమేధం చేశాడు. ఐనా అతనికి సంతానం కలుగలేదు. మళ్లీ ఎప్పటిలాగే సంతానం కోసం బాధపడ్డాడు. అప్పుడతడు ఋశ్యశృంగుని వద్దకు వెళ్లాడు. అతన్ని పూజించాడు. తనకు సంతానం కలిగే మార్గం చూడవలసిందని కోరాడు. ఋశ్యశృంగుడు బాగా ఆలోచించాడు. సంతానం కలగటానికి ఒక ఉపాయం వుంది. ఆ యిష్టి నీతో చేయిస్తా. అందువల్ల సంతానం కల్గుతుంది అన్నాడు. దశరథుడు సంతోషించాడు.


    దశరథుడు యిష్టికోసం ఏర్పాట్లు చేయవలసిందని మంత్రులకు ఆజ్ఞాపించాడు. మంత్రులు ఏర్పాట్లు చేశారు. ఋశ్యశృంగుడు యిష్టి చేయించడం ప్రారంభించాడు. అతడు అందరు దేవతలకు హవిస్సులు అర్పించాడు.


    హవిస్సులు అందుకోవడానికి దేవతలంతా ఒకచోట చేరారు. వారంతా బ్రహ్మ దగ్గరకి వెళ్లారు. బ్రహ్మతో విన్నవించారు : దేవా! రావణుడు రాక్షసుడు. అతడు నీ అనుగ్రహం సంపాదించాడు. వరాలు సాధించాడు. బలగర్వితుడై ఉన్నాడు. అతనికి బెదిరి సూర్యుడు ఎండకాయటం లేదు. గాలి వీచటం లేదు. సముద్రం కెరటాలు వేయడం మానివేసింది. కాబట్టి వాడిని సంహరించే ఉపాయం చూడండి."


    బ్రహ్మదేవుడు దేవతల విన్నపం విన్నాడు. అతడు ఆలోచించాడు. అన్నాడు :


    "రావణుడు దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు వీళ్లవల్ల తనకు చావుకలక్కుండా వరం కోరుకున్నాడు. మనుష్యులంటే అతనికి లెక్కలేదు. వాళ్లవల్ల చావుకలక్కుండ వరం కోరుకోలేదు. కాబట్టి వానికి మనిషి చేతిలో చావురాసిపెడ్తాను అన్నాడు.


    అప్పటికి నారాయణుడు అక్కడికి వచ్చాడు. దేవతలు అతణ్ని పూజించారు.


    "దేవదేవా! మీరు దయ తలచాలి. దశరథమహారాజుకు పుత్రులుగా పుట్టాలి. రావణున్ని చంపాలి. రావణుడు దేవతలకు బద్ధవైరి, వాణ్ని చంపడానికి మీరు నరజన్మం ఎత్తక తప్పదు." అని మొరపెట్టుకున్నారు.


    నారాయణుడు దేవతల మొర ఆలకించాడు. దశరథుని పుత్రునిగా జన్మించడానికి అంగీకరించాడు. రావణాన్ని నాశనం చేస్తానని శపధం చేశాడు. నారాయణుని వాగ్దానాం దేవతలను సంతోషపెట్టింది.


    బ్రహ్మలోకంలో అలా జరుగుతుండగా అయోధ్యలో పుత్రకామేష్టి జరుగుతూంది. మండుచున్న హోమగుండంలో నుంచి ఒక మహా పుఋషుడు ఉద్బవించాడు. అతడు మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. అతని చేతిలో బంగారు కలశం వుంది. అది దశరథునికిచ్చి, "ఇది దేవ నిర్మితమైన పాయసం. సంతానం కలుగుతుంది. దీన్ని తీసుకో" అని మహారాజునకిచ్చాడు. ఆ తర్వాత ఆ మహా పురుషుడు మాయమయ్యాడు.


    దశరథుడు పాయసం తీసికొని చాల సంతోషించాడు. దాన్ని తీసుకొని అంతఃపురానికి వెళ్లాడు. అది చూసి రాణులంతా చాల సంతోషించారు. దశరథుడు వారికి పాయసం చూపాడు. ఇది తింటే సంతానం కలుగుతుందని చెప్పాడు. ఆ పాయసంలో సగం భాగం కౌసల్యకిచ్చాడు. సగంలో సగం సుమిత్ర కిచ్చాడు. అందులో సగం కైకకిచ్చాడు. మిగిలిన రెండోభాగం సుమిత్రకిచ్చాడు. రాణులు ఆ పాయసం భక్షించారు. ఆ తర్వాత వాళ్లు గర్భాలు దాల్చారు.


    ఇక్కడ ఇలా వుండగా బ్రహ్మలోకంలో ఓ జరిగిందో చూద్దాం.


    బ్రహ్మ అంతకుముందే జాంబవంతుణ్ని సృష్టించాడు. బ్రహ్మ ఆవలిస్తే అతనికి నోట్లోంచి పుట్టినవాడు జాంబవంతుడు. బ్రహ్మ దేవతలను పిలిచాడు. అప్సర గంధర్వ యోనుల్లో వానరులను సృష్టించాల్సిందని కోరాడు. వారు రామునికి సహాయం చేస్తారని అన్నాడు. అదే విధంగా దేవతలు, అప్సరసలు, గంధర్వులు, వాలి సుగ్రీవ, హనుమదాదులను కన్నారు. ఆ విధంగా నూరు లక్షల వానర వీరులు జన్మించారు.

 Previous Page Next Page