శ్రీరామ జననం
రాణులు గర్భం దాల్చినందుకు దశరథుడు చాలా సంతోషించాడు. కాలం గడిచింది. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాట లగ్నంలో కోసల్య రాముణ్ణి కన్నది. రాముని గన్న కౌసల్య ఇంద్రుని కన్న అదితివలె ప్రకాశించినది. సుమిత్రకు లక్ష్మణుడు, శతృఘ్నుడు జన్మించారు. కైకకు భరతుడు జన్మించాడు. వారు నలుగురు పుట్టినప్పుడు దేవదుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. అయోధ్యలో గొప్ప ఉత్సవాలు జరిగాయి. మహారాజు అపారంగా దానధర్మాలు చేశాడు. పన్నెండవ రోజున తన కొడుకులకు జాతకర్మలు చేశాడు. నామకరణాలు చేయించాడు.
దశరథునికి సంతానం కలిగింది. అతడు ఆనందంతో పొంగిపోయాడు. వారిని కంటిపాపలా కాపాడాడు. నల్గురు కొడుకులను విద్యాబుద్ధులు నేర్పించాడు. గజారోహణం, అశ్వారోహణం, రధసారధ్యంలో వారు అపార ప్రజ్ఞ సాధించారు. వారందరిలో రాముడు శ్రేష్టుడు. అతనికి అన్ని విద్యలు కరతలామలకములు. ధనుర్విద్య అంటే అతనికి మిక్కిలి ప్రీతి. రాముడంటే దశరథునికి ప్రాణం. లక్ష్మణుడు రామునికి నీడ వలె అనుసరిస్తుండేవాడు. అన్న లేక అన్నం ముట్టేవాడుకాడు. అలాగే శతృఘ్నుడు భరతుణ్ణి సేవించేవాడు. పుత్రులు జ్ఞానవంతులు, గుణవంతులు కావటం చూసి దశరథుడు మురిసిపోయాడు. కొడుకులకు కూడ దశరథుడంటే మిక్కిలి శ్రద్ధాసక్తులు.
కొడుకులు పెద్దవాళ్లవుతున్నారు. అది చూచాడు దశరథుడు. వారికి పెళ్లిళ్లు చేయాలనుకున్నాడు. అందును గూర్చి బంధువులతోను, ఉపాధ్యాయులతోను ఆలోచించడం ప్రారంబించాడు.
సుడిగాలి
ఒకనాడు దశరథుడు కొలువుదీర్చి కూర్చున్నాడు. కొడుకుల పెళ్లిండ్లను గూర్చి ఆలోచిస్తున్నాడు. అలాంటి సమయంలో విశ్వామిత్రుడు సుడిగాలిలా ప్రవేశించాడు. విశ్వామిత్రుని చూశాడు. దశరథుడు సింహాసనంపై లేచాడు. విశ్వామిత్రుడిని ఆదరించాడు. ఆసనం మీద కూర్చోబెట్టాడు. అడిగాడు.
"మహర్షీ! మీరు వచ్చారు. నా జన్మ ధన్యమయింది. మీరు ఏమి కోరి వచ్చారో సెలవివ్వండి - తలదాల్చి నెరవేరుస్తాను."
విశ్వామిత్రుడు దశరథుని మాటలు విన్నాడు. సంతోషించాడు. అన్నాడు:
"రాజా! నీ వంశం గొప్పది. నీకు గురువు వశిష్టుడు. నీవు ఆడి తప్పేవాడివికావు. నా మనసులో మాట చెబుతాను విను. మాట తప్పక నెరవేర్చు. నేను ఒక యజ్ఞం చేయాలనుకున్నాను. మారీచ - సుభాహులనే వాళ్లు రాక్షసులు. వాళ్లు నా యజ్ఞానికి అనేక అంతరాయాలు కల్గిస్తున్నారు. యజ్ఞ కుండంలో రక్తమాంసాలు కురిపిస్తున్నారు. నాకు శక్తి వుంది. శపించగలను. వాళ్లను భస్మం చేయగలను. కాని దీక్షలో వున్నాను. కోపించడం కూడదు. శపించరాదు. నీ రాముడున్నాడే అతడు సత్యపరాక్రముడు - కాకపక్షధరుడు, శూరుడు. అతడు రాక్షసులను వధించడానికి సమర్దుడు. నేనతనికి అండగా వుంటాను. అతణ్ణి నా వెంట పంపు. రాముని ఎదిరించి ఆ రాక్షసులు జీవించలేరు. వారికి చావు దగ్గర పడ్డది. కొడుకని గారాబం చూపకు. రాముడు మహాత్ముడు. అప్రతిహత పరాక్రమం గలవాడు. ఆ విషయం నాకు తెల్సు. అంతేగాదు వశిష్టునికి తెల్సు. నీకు ధర్మం కావాలంటే నీ కీర్తి స్థిరంగా వుండాలంటే రాముని నావెంట పంపు. వశిష్ఠుడు మొదలగు వారిని అడిగే పంపు."
దశరథుడు విశ్వామిత్రుని మాటలు విన్నాడు. గడగడ వణికాడు. కాస్సేపు మూర్ఛిల్లాడు. తర్వాత తేరుకున్నాడు. దోసిలొగ్గి విశ్వామిత్రునితో యిలా అన్నాడు. "ఎన్నో యజ్ఞ యాగాదులు చేసిం తరువాత నాకు కల్గినవాడు రాముడు. అతడంటే నాకు ప్రాణం. అతడు లేకుండా నేను బ్రతకలేను. రామునికి పదహారేళ్ళైనా నిండలేదు. ముక్కు పచ్చలారనివాడు. రాక్షసులతో ఏం యుద్ధం చేయగలడు? ఐనా రాక్షసులు ఎవరు? వారి బలమెంత?" అందుకు విశ్వామిత్రుడు "రావణుని పేరు మీరు వినేవుంటారు. వాడు స్వయంగా యజ్ఞములు పాడుచేయలేనప్పుడు మారీచ సుభాహులను పంపుతుంటాడు."
అందుకు దశరథుడు "రావణుని ఎదిరించటమా? అబ్బో, ఆ శక్తి నాకు లేదు. చతురంగ బలాలతోనైనా అతనితో నేను యుద్ధం చేయలేను. అలాంటప్పుడు రాముడు బాలుడు - అతడేం చేయగలడు? నేనతన్ని పంపలేను మన్నించాలి."
దశరథుని మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. మండిపడ్డాడు. "నీవు రఘువంశం వాడివి. మాట యిచ్చి తప్పటం నీకు తగదు సరే - నేను వెళ్లిపోతున్నాను. నీవు సుఖంగా వుండు." అని గర్జించాడు. అప్పుడు భూమి వణికింది.
అప్పుడు వశిష్ఠుడు ముందుకు వచ్చాడు. "రాజా! మీరు సత్యసంధులు, ధర్మాత్ములు, ఆడి తప్పడం తగదు. అందువల్ల యజ్ఞయాగాలు చేసిన ఫలం, వాపీకూప తటాకాలు నిర్మించిన ఫలం నశిస్తాయి. మాట యిచ్చావు - రాముని పంపించు. భయపడాల్సిన అవసరం లేదు, అగ్ని మధ్యలో ఉండే అమృతాన్ని ఎవరూ అంటలేరు. అలాగే విశ్వామిత్రుని రక్షణలో వున్న రాముణ్ణి రాక్షసులేం చేయలేరు. విశ్వామిత్రునికి సకల శస్త్రాస్త్ర పరిజ్ఞానం వుంది. అందులో అతనికి సమానమైన వారెవ్వరు లేరు. విశ్వమిత్రుడు అఖండశక్తి సంపన్నుడు. అతడే రాక్షసులను చంపగలడు. ఐనా రామునికి మేలు చేయడానికే మిమ్మల్ని యాచిస్తున్నాడు. నిస్సందేహంగా రాముని పంపు" అని ప్రోత్సహించాడు.
దశరథుడు వశిష్ఠుని మాటలు విన్నాడు. విశ్వామిత్రుని గర్జన తలచుకున్నాడు. రాముని పంపక తప్పదనుకున్నాను. రామలక్ష్మణులను పిలిపించాను. కౌసల్య స్వస్తి పలికింది. దశరథుడు రాముని శిరస్సు మూర్కొన్నాడు. విశ్వామిత్రునికి అప్పగించాడు.
ముందు విశ్వామిత్రుడు, అతనివెనుక ధనుర్ధారియైన రాముడు, అతనివెనుక లక్ష్మణుడు బయలుదేరారు. చూపానినంతసేపు దశరథుడు చూచాడు. అలా బయలుదేరిన రామలక్ష్మణులు సరయూ నదివెంట బయలుదేరారు. ఒకటిన్నర యోజనాలు నడిచారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముని పిలిచాడు. ఆచమనం చేయమన్నాడు. అప్పుడు రామునికి బల, అతిబల అనే రెండు విద్యలను ఉపదేశించాడు. అవి సకల జ్ఞానములకు మాతృ భూతములు. వాటిని జపిస్తే ఆకలిదప్పులు వుండవు. అపారమైన కీర్తి కలుగుతుంది. ఆ విద్యలు స్వీకరించిన రాముడు మహా పరాక్రమవంతుడైనాడు. శరద్రుతువులో వెలిగే సూర్యునిలా ప్రకాశించాడు. ఆ రాత్రి గడ్డిపరచుకొని అక్కడే పడుకున్నాడు.
మరుసటిరోజు తెల్లవారుతూంది. విశ్వామిత్రుడు "కౌసల్యా పుత్రా! తూర్పు ఎర్రవారింది. లే! లేచి ఆంగికములు నిర్వర్తించుకో" అని లేపాడు. రామలక్ష్మణులు మేల్కొన్నారు. స్నాన సంధ్యలు ముగించుకున్నారు. మహర్షికి పాదాభివందనం చేశారు. బయలుదేరారు. అలా కొంతదూరం నడిచారు. అది సరయూనది గంగలో కలిసేచోటు, అక్కడ వారికి ఒక ఆశ్రమం కనిపించింది. విశ్వామిత్రుడు దానికి సంబంధించిన ఒక కథ చెప్పాడు.
పూర్వం శివుడు ఘోరమైన తపస్సు చేశాడు. మన్మధుడు శివుని తపస్సు భంగం చేయాలనుకున్నాడు. పూలబాణాలతో శివుణ్ణి కొట్టాడు. శివుడు కలతపడ్డాడు. కన్నులు తెరిచి చూశాడు. పూలబాణాలతో మన్మథుడు కనిపించాడు. కన్నులు హుంకరించాడు. మూడవకన్ను తెరిచాడు. ముక్కంటి మంటకు కాముడు బూడిదై కూలాడు. నాటినుంచి కాముడు అనంగుడైనాడు. మన్మథుడు అంగత్యాగం చేసిన స్థలం కాబట్టి ఈ స్థలానికి అంగదేశం అని పేరు. సాంబశివుని శిష్యులు యింకా ఈ ఆశ్రమంలో వున్నారు. వారు ధర్మపరులు, ఈ రాత్రికి ఈ ఆశ్రమంలో విశ్రమించి గంగ దాటుదాం అన్నాడు.