Previous Page Next Page 
సీతాచరితం పేజి 17


    రోమపాలుడు అందమైన వేశ్యలను విభండకుని ఆశ్రమానికి పంపాడు. వేశ్యలు అడవిలో విడిది ఏర్పరచుకున్నారు. వారి విలాస విభ్రమాలు చూపడానికి సకల సామాగ్రి సిద్ధం చేసుకున్నారు. అయినా వారికి ఋశ్యశృంగుడు కనిపించలేదు. అతడు తండ్రి సేవలోనే నిమగ్నుడై ఉన్నాడు. బయటకు రాడు. వీరి కంటపడడు. ఏమిటి చేయడం?


    అలా కొన్నాళ్లు గడిచాయి. ముని కుమారుడు రాలేదు. వేశ్యలు విసిగిపోయారు. తమ ప్రయత్నం విఫలం అయినట్లే అనుకున్నారు. ఇంతలో వారికేదో అడుగుల సవ్వడి వినిపించింది. అటు చూచారు. ముని కుమారుడు కనిపించాడు. అతడేదో పండ్లూ, కాయలూ ఏరుకోవడానికి వచ్చాడు.


    ముని కుమారుణ్ణి చూచారు. వేశ్యలకు ప్రాణం లేచివచ్చింది. మన్మధుని బాణం పదును పెట్టారు. అతనికి ఎదురేగారు. క్రీగంటి చూపుల వలలో ముని కుమారుణ్ణి చిక్కించారు. ఆటలాడారు. పాటలు పాడారు. మన్మధుని బాణాలన్నీ ప్రయోగించారు.


    ముని కుమారుడు కరిగిపోయాడు. వేశ్యలు అతణ్ణి ఆలింగనం చేసుకున్నారు. కౌగిళ్లలో బంధించారు. అవికూడా పండ్లే అనుకున్నాడు. పాపం! అతడు ఆనందంలో మున్కలు వేశాడు. వేశ్యలను తన ఆశ్రమానికి తీసికెళ్లాడు. వేశ్యలు అతణ్ణి కవ్వించారు. మురిపించారు. మరిపించారు. ఆశ్రమం వదిలి తమ విడిదికి విచ్చేశారు.


    వేశ్యలు వెళ్లిపోయారు. బాగానే వుంది. కాని ముని కుమారుని మనసు తారుమారయింది. తాళలేకపోయాడు. వేశ్యల విడిదికి ఉరికాడు. వేశ్యలు దూరంగా ఉండి అతణ్ణి ఉడికించారు. అలసిన ముని కుమారుని తమ మధ్యకు చేర్చుకున్నారు. కొందరు అతణ్ణి ముద్దుపెట్టుకున్నారు. కొందరు చెవిలో తీయని మాటలు చెప్పారు. కొందరు కౌగిలించుకున్నారు.


    ఋశ్యశృంగుడు వేశ్యలకు స్వాధీనుడు అయిపోయాడు, అప్పుడు అన్నారు :-


    "మునికుమారా! మేం మీ ఆశ్రమానికి వచ్చాం. అలాగే నువ్వు మా ఆశ్రమాలకు రావాలి. మా ఆశ్రమాలు దూరంలో వున్నాయి. గంగానదిలో పడవ ఎక్కి పోవాలి. ప్రయాణం హాయిగా ఉంటుంది. మా ఆశ్రమాల్లో మరింత ఆనందం ఉంది. జుర్రుకోవచ్చు. రా! పోదాం."


    ముని కుమారుడు ఉబ్బితబ్బయినాడు. వారి పిలుపు అతనికి వరంలా తోచింది. వారి వెంట బయలుదేరాడు. వారు గంగానది మీద నావలో పయనించారు. నావలో వినోదాలతో పరవశుడయినాడు ముని కుమారుడు. దివి భువికి దిగివచ్చినట్లనిపించిందతనికి.


    నావ అంగదేశం ప్రవేశించింది. కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు ఉరిమాయి. మెరుపులు మెరిసాయి. ధారాపాతంగా వర్షం కురిసింది. అంగదేశం ఆనందంతో నాట్యం చేసింది. రోమపాదుడు ఎదురేగి ఋశ్యశృంగునికి స్వాగతం పలికాడు. పరవశుడయి ఉన్నాడు ముని కుమారుడు. రోమపాదుని ఆతిథ్యం స్వీకరించాడు. తన కూతురు శాంతనిచ్చి ఋశ్యశృంగునికి వివాహం చేశాడు.


    ఋశ్యశృంగుడు మళ్లీ అడవికి వెళ్లలేదు.


    రోమపాదుడు నగరిలోనే ఉండిపోయాడు.


    దశరథుడు సుమంతుడు చెప్పిన కథ విన్నాడు. ఋశ్యశృంగుని ప్రభావం అర్థం చేసుకున్నాడు. అతనితోనే యజ్ఞం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. కాని అతనికి ఒక అనుమానం వచ్చింది. వశిష్ఠుడు దశరథునికి పురోహితుడు. అతనితో కాక ఋశ్యశృంగునితో యజ్ఞం జరిపిస్తే వశిష్ఠునికి కోపం రావచ్చు. వశిష్ఠునకు కోపం రావడం రాజుకు ఇష్టం లేదు.  అందువలన ఈ విషయం వశిష్ఠునికి చెప్పాడు. వశిష్ఠుడు అభ్యంతరం చెప్పలేదు, అనుమతించాడు. అందుకు దశరథుడు ఎంతో సంతోషించాడు.


    దశరథుడు అంగదేశానికి బయలుదేరదలచాడు. రాణులను సిద్ధం కావలసిందన్నాడు. పరివారాన్ని వెంటతీసుకున్నాడు. అంగదేశం చేరాడు. రోమపాదుడు ఎదురేగి స్వాగతం చెప్పాడు. అంగదేశంలో దశరథునికి అనువైన వసతి సమకూర్చాడు. ఆదరించాడు.


    రోమపాదుడు దశరథుణ్ణి ఋశ్యశృంగుని దగ్గరకి తీసికెళ్లాడు. ఋశ్యశృంగుడు నగరిలో అగ్నిలా తేజరిల్లుతున్నాడు. దశరథుడు ఋశ్యశృంగుణ్ణి చూచాడు. అతనిని పూజించాడు. రోమపాదుడు దశరథుణ్ణి తన బంధువుగా పరిచయం చేశాడు. అది విన్నాడు ఋశ్యశృంగుడు. దశరథుణ్ణి సత్కరించాడు.


    దశరథుడు అశ్వమేధాన్ని గురించి ప్రస్తావించాడు. ఋశ్యశృంగుని మహిమలను కొనియాడాడు. అయోధ్యకు రావలసిందని విన్నవించాడు. అశ్వమేధం చేయించాల్సిందని మనవి చేశాడు. రోమపాదుడు ఋశ్యశృంగుణ్ణి ప్రోత్సహించాడు. ఋశ్యశృంగుడు దశరథుని ఆహ్వానాన్ని మన్నించాడు. అయోధ్యకు వస్తానన్నాడు. అశ్వమేధం చేయిస్తానన్నాడు. అందుకు దశరథుడు చాలా సంతోషించాడు.


    దశరథుడు అంగదేశంలో ఎనిమిది రోజులున్నాడు. ఆ తరువాత అయోధ్యకు బయలుదేరాడు. అతని వెంట ఋశ్యశృంగుడు, శాంత కూడా బయలుదేరారు.


    ఋశ్యశృంగుడు వస్తున్నాడనే వార్త అయోధ్యకు తెలిసింది. అయోధ్యను  అమరపురిలా అలంకరించారు. శంఖ దుందుభి ధ్వానాలతో అయోధ్య ప్రతిధ్వనించింది. మంత్రులు ఎదురేగి  స్వాగతం పలికారు. ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. అనేకవిధాల సత్కరించారు. దశరథుడు శాంతా ఋశ్యశృంగులకు చక్కని ప్రాసాదంలో విడిదుంచాడు. అంతటితో సంతృప్తి చెందాడు. కృతకత్యుణ్ణి అయినాను అనుకున్నాడు.


    ఆనాటికి జన పదాలు పూర్తిగా ఏర్పడలేదు. అటవికులు కూడ అనేకులుండేవారు. జలపదాల్లో ఉండేవారు. అడవుల్లో ఉండేవాళ్లను పవిత్రులుగా భావించేవారు. వారిదగ్గర ఏవో మహిమలుంటాయనీ భావించేవారు. ఆ నమ్మకం ఈనాటికీ ఉంది. కోయవాళ్ల దగ్గర ఏవో మహిమలూ మంత్రాలూ ఉంటాయని నమ్మే నాగరకులు అనేకులు.


    ఒక మహిమావంతుణ్ణి తమ రాజ్యంలో ఉంచుకోవడం క్షేమం అనుకునేవారు రాజులు. అందుకే రోమపాదుడు ఋశ్యశృంగుణ్ణి తెచ్చి పెట్టుకున్నాడు. దశరథుడు ఋశ్యశృంగుణ్ణి తెచ్చుకోవడానికి తపన కనబరిచింది. ఇది ఈనాటికీ సాధారణంగా ఉంది. బాబాలను, అమ్మలను నమ్ముకున్న మంత్రులు, నాయకులు అనేకులు.


    ఆ రోజుల్లో బ్రాహ్మణులకూ, క్షత్రియులకూ, పరస్పర ద్వేషాలు ఉన్నట్లు కనిపిస్తుంది. బ్రాహ్మణులను క్రోసి రాజని తామే అధికులు కావాలనే క్షత్రియుల ప్రయత్నం అడుగడుగునా కనిపిస్తుంది. జారిపోతున్న తమ ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి బ్రాహ్మలు పడిన తపన కనిపిస్తుంది. ఇది ముందు ముందు స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఇది ఈ కథలోనూ రేఖామాత్రంగా కనిపిస్తుంది.


    ఋశ్యశృంగుడు క్షత్రియుడు. అతడు పురోహితుడు అయినాడు. దశరథుడు అశ్వమేధం చేయదలచాడు. తన పురోహితునితో చేయించుకోవాల్సింది చేయించాడు. అలా చేయించవద్దని చెప్పినవాడు సుమంతుడు, క్షత్రియుడు. దశరథుని మనసుకు నాటడానికి కారణం ఋశ్యశృంగుడు క్షత్రియ పురోహితుడు కావడం. క్షత్రియ పురోహితుడు ఉండగా బ్రాహ్మణా పురోహితునితో యజ్ఞం ఎందుకు చేయించుకోవాలి అనుకున్నాడు. తన పురోహితునికి కోపం రాకుండా వశిష్ఠుణ్ణి సంప్రదించాడు. వశిష్ఠుడు అంత తేలిగ్గా అంగీకరించాడంటే అతని బలం అప్పటికే క్షీణించిందని అర్ధం. త్రిశంకుని విషయంలో అతని పట్టుదల ఎలాంటిదో ముందు ముందు చూస్తాం.

 Previous Page Next Page