ఏం కథ చెప్పాలా అని ఆలోచనలో పడ్డాను.
మా ముందు బహు రద్దీగా వుంది. రంగు రంగుల దుస్తుల్లో జనం. ఇంద్రధనుస్సు కరిగి ప్రవహిస్తున్నట్టు తిరుగుతున్నారు. నేతి వాసనతో బరువెక్కిన గాలి ముక్కుపుటాలకు జిగురుగా తాకుతోంది. దేవాలయం ముందున్న ధ్వజస్థంభం దేశంలో పెరిగిపోతున్న నాస్తికత్వానికి ప్రతీకలా ఎత్తుగా వుంది.
"ఏమిటి ఆలోచన! ముచ్చటగా మూడు మినీ కథలు చెప్పి, మూడుసార్లు నవ్వించు. ఒక షరతు రద్దయిపోతుంది" కీర్తి నన్ను ఉడికించింది.
ఇదీ నా మంచికే. మొదటి మూడు మినీ కథలు ఈ మెట్ల మీదే చెప్పదలుచుకున్నాను. నా కథలన్నీ పండి, తనకు నవ్వు తెప్పిస్తే ఒక షరతు రద్దయిపోతుంది. తొలుత ఏ షరతును రద్దు చేసుకోవాలో అప్పుడే ఆలోచించాను. "ద్వంద్వార్థాలు స్ఫురించే మాటలు మాట్లాడకూడదు" అన్న షరతును తీసివేయించాలి. ఇక అప్పుడు నోటికి అడ్డూ అదుపూ వుండదు. మిగిలిన ఐదు షరతులనూ తుడిచేసే మిషతో చెప్పబోయే మినీ కథల్ని మన్మధ బాణాలుగా చేసి తన మీదకు విసరాలి. దాంతో తను తాళలేని తాపంతో వేడెక్కిపోవాలి. సెక్స్ కోరిక పన్నీటి బుగ్గలా మనసులో చిమ్మాల్ని. రాత్రి చెప్పే హారర్ కథతో భయపడి, మినీ కథలు రేపే శృంగార రసంలో గిలగిల్లాడి నాదగ్గరకు పరుగెత్తాలి. అప్పుడు ఆ అందాన్ని తనివి తీరా......
"మదనా! అన్నీ వూహించుకోకు. ఇక సెన్సార్ చెయ్" నా మనసు నన్ను హెచ్చరించింది.
"పేరు మాత్రం మదన గోపాలరావు. ఓ అమ్మాయితో ... అదీ కాబోయే భార్యతో మదన తాపాన్ని రగిలించలేని నీకు ఆ పేరు సరిపోదు. పేరైనా మార్చుకో. లేదా తనను మెప్పించి కోరికైనా తీర్చుకో" ఆ మనసే నన్ను ఛాలెంజ్ చేస్తోంది.
"కీర్తి ! మొదటి మినీ కామెడీ ప్రారంభం" అన్నాను.
"ప్రొసీడ్" పచ్చ జెండా వూపింది.
నేను చెప్పడం ప్రారంభించాను.
ఆయన పేరు శర్మ. విజయవాడలో ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్. నలభై అయిదేళ్ళ వయసులో మాంచి కలర్ ఫుల్ రేపర్ లా వుండేవాడు. తను ఆరోగ్యంగా వుండడానికి కారణం యోగాసనాలే అనేవాడు. గొప్ప దేశభక్తి కలవాడు. భారతదేశం అన్నిదేశాల్లో కెల్లా ఉన్నతమైనదని భావించడమే కాక ప్రచారం కూడా చేసేవాడు.
"తెల్లవాళ్ళకు బుర్ర ఎక్కడిది! వాళ్ళుకనిపెట్టిన సైంటిఫిక్ ఇన్ వెన్ షన్స్ అన్నీ భారతీయ గ్రంథాలలో వున్నవే. మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు విలువైన గ్రంథాలన్నీ తస్కరించి తమ దేశానికి తరలించి, అక్కడ వాటిల్లోని సారాన్నంతా ఆకళింపు చేసుకుని ప్రయోగాలు చేశారు. సక్సెస్ అయ్యారు. అయితే అవన్నీ తామే కనిపెట్టినట్టు ప్రపంచానికి చాటి చెప్పి భారతీయుల్ని దొంగదెబ్బతీశారు. వాళ్ళు కనిపెట్టిన విమానం ఎక్కడిదనుకున్నారు? రామాయణంలోని పుష్పక విమానానికి నమూనా మాత్రమే. ఇప్పుడు తామరతంపరగా ప్రతి యింటి మీద ఎగిరే యాంటినా టీ.వీల మొలకలు మన ప్రాచీన గ్రంథాల్లో వున్నాయి. మాయల ఫకీరు బాలనాగమ్మను చూసింది టీ.వీ. స్క్రీన్ మీదే. అంజనం వేసి చూడడమంటే అదే" ఇలా సాగేది ఆయన ఉపన్యాసమంతా.
అలాంటి ఆయన ఒకసారి కొత్త మిషినరీ ఆర్డర్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ ఆయనకు జార్జి అనే ఒక అమెరికన్ మిత్రుడుండేవాడు. న్యూయార్క్ లో దిగీ దిగగానే జార్జికి ఫోన్ చేశాడు. జార్జి మహానందపడిపోయి రాత్రికి డిన్నర్ కి ఆహ్వానించాడు.
సాయంకాలం ఆరుగంటలకల్లా బయల్దేరి జార్జి ఇంటికి వెళ్లాడు శర్మ. ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు.
"డ్రింక్స్ ఏమైనా తీసుకుంటావా?" జార్జి అడిగాడు.
"ఆ" అన్నాడు శర్మ.
ఆయన తన దగ్గరున్న సర్వెంట్ ని కేకేశాడు. మరో క్షణంలో ఓ నీగ్రో యువకుడు ప్రత్యక్షమయ్యాడు. బజారుకెళ్ళి రెండు విస్కీ బాటిల్స్ పట్టుకురమ్మని సర్వెంట్ కి చెప్పి, డాలర్లు అందించాడు. నీగ్రో యువకుడు వెళ్ళాడు.
"నువ్వు ఎన్నిఅయినా చెప్పు శర్మా! మా అమెరికన్స్ వర్క్ చేయడంలో మాత్రం చాలా సిన్సియర్. తమ వృత్తి మీద ఎంతో అంకిత భావాన్ని కనపరుస్తారు. ఉదాహరణకు ఇప్పుడు నీ ముందు వెళ్ళిన మా సర్వెంట్ ఎప్పుడు ఏం చేస్తుంటాడో ఇక్కడ కూర్చునే నేను చెప్పగలను. ఇప్పుడు మా సర్వెంట్ వంట గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకున్నాడు... ఇప్పుడు లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాడు... కిందకు దిగాడు... రోడ్డు క్రాస్ చేశాడు... రొడ్డంటా నడుస్తున్నాడు... బ్రాందీ షాపు వచ్చింది... కౌంటర్ లో డబ్బులిచ్చాడు... విస్కీ బాటిల్స్ తీసుకున్నాడు... మళ్ళీ వెనక్కి తిరిగి రోడ్డు మీద నడుస్తున్నాడు... రోడ్డు క్రాస్ చేశాడు... మన ఇంటి దగ్గరకు వచ్చాడు లిఫ్ట్ ఎక్కాడు... మన రూమ్ దగ్గరకు వచ్చాడు." అని నరేట్ చేసి ఆగాడు జార్జి.
వెంటనే డ్రాయింగ్ రూమ్ తెరుచుకుని నీగ్రో యువకుడు లోపలికి వచ్చాడు. బ్యాగ్ లోంచి రెండు విస్కీ బాటిల్స్ పెట్టాడు. మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు.
"చూశావా శర్మా! మా వాళ్ళ టైమ్ సెన్స్. ఎప్పుడూ ఒక క్షణం కూడా వృధా చేయరు. అందుకే ప్రపంచ పటంలో నెంబర్ వన్ మా దేశం" అన్నాడు జార్జి గర్వంగా.
శర్మకు తల కొట్టేసినట్లయింది. కాణీ కళ్ళముందు కనిపిస్తున్న సత్యాన్ని కాదనలేక పోయాడు. అన్యమనస్కంగానే జార్జితో గడిపి వచ్చేశాడు.
శర్మ తన పని ముగించుకుని స్వదేశానికి చేరుకున్నాడు. మరో సంవత్సరం తరువాత జార్జి ఇండియా వచ్చాడు. విజయవాడకు రాగానే శర్మకు ఫోన్ చేశాడు.
జార్జి వచ్చాడనగానే అమెరికాలో ఆ రోజు జరిగిందంతా గుర్తు కొచ్చింది శర్మకు. దెబ్బకు దెబ్బ తీయాలనుకున్నాడు. ఇండియన్స్ అమెరికా వాళ్ళకంటే ఏ విషయంలోనూ తీసిపోరని నిరూపించాలనుకున్నాడు.
అందుకే రాత్రి డిన్నర్ కు ఆహ్వానించాడు.
జార్జి ఇంటికి రాగానే సాదరంగా ఆహ్వానించి డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళాడు.
"గోవిందూ" గట్టిగా పిలిచాడు తన నౌకర్ ను. ఓ యువకుడు వచ్చాడు.
"గోవిందూ! కొట్టుకు వెళ్ళి రెండు విస్కీ బాటిల్స్ పట్టుకురా!" అని డబ్బులిచ్చాడు. అతను వెళ్ళిపోయాడు.
"జార్జ్ ! ఇప్పుడు గోవిందు ఏం చేస్తుంటాడో చెప్పనా?" అన్నాడు శర్మ వెటకారం చేస్తూ.
జార్జి చెప్పమన్నట్టు తల ఆడించాడు.
"ఇప్పుడు మా గోవిందు స్టోర్స్ గదిలోకి వెళ్ళాడు. సంచి తీసుకున్నాడు... మెట్లు దిగుతున్నాడు... రోడ్డు క్రాస్ చేశాడు... రోడ్డులో నడుస్తున్నాడు... అదిగో వైన్ షాప్ కనిపించింది... ఆగాడు... కౌంటర్లో కూర్చున్న వ్యక్తికి డబ్బులిచ్చాడు... బాటిల్ తీసుకున్నాడు... సంచిలో పెట్టుకున్నాడు... తిరిగి నడవడం మొదలుపెట్టాడు... ఇంటి దగ్గరకొచ్చాడు... మెట్లు ఎక్కుతున్నాడు... ఎక్కేశాడు" అని ఆగి "గోవిందూ" అంటూ గట్టిగా పిలిచాడు శర్మ.
డోర్ తెరుచుకుంది. శర్మ ఆనందానికి పట్టపగ్గాలేవు. తన పరువేకాక హోల్ ఇండియన్స్ పరువు కాపాడిన గోవిందు మహాత్మా గాంధీకంటే గొప్పవాడుగా కనిపించాడు.