మొన్న కథలో హాస్యం ఎక్కువైతే, రాత్రి కథలో విషాదం ఎక్కువైంది ఏం చేయను?
దెయ్యం కథ అయిపోయింది. రేప్ కథ అయిపోయింది. ఇంకా నాలుగు రాత్రులు మిగిలున్నాయి. ఇకనైనా నేను గెలుస్తానా?
"సరే మదన్, రాత్రికి ట్రై చెయ్. విష్ యు బెస్టాఫ్ లక్. ఇప్పుడు మనం పాపనాశనానికి పోతున్నాం. వెళ్ళి తయారవ్" అంది.
నేను లోపలకు వెళ్ళాను.
ఇద్దరం పాపనాశనానికి పోతున్నాం. వెళ్ళి తయారవ్" అంది.
గోగర్భ డ్యామ్ నీళ్ళతో భూమి మీద అభ్రకం పలకను తీర్చినట్టుంది చిన్న జలపాతం. కుళాయి నుంచి నీళ్ళొస్తున్నట్లు నీటి ధార, డ్యామ్ పక్కన పూల తోటలు.
ఆకాశం మబ్బు పట్టి వుండడంతో చల్లగా వుంది. గాలి చలిని కప్పుకు తిరుగాడుతూ వుంది.
అక్కడ్నుంచి వచ్చేసరికి అయిదు గంటలైంది.
టైమ్ పాస్ కోసం నేనూ కీర్తి గుడి దగ్గరకు వెళ్ళాం.
గుడి ముందు పెద్ద మంటపం వుంది. దాని మెట్లు మీద అక్కడక్కడా జనం వున్నారు.
"అక్కడ కాసేపు కూర్చుందామా?" కీర్తి ప్రపోజ్ చేసింది.
అలానేనని తల ఆడించాను.
కీర్తి తన ఖర్చీఫ్ తో మెట్ల మీదున్న దుమ్మును తుడిచి కూర్చుంది. నన్నూ కూర్చోమని కళ్ళతోనే చెప్పింది.
ప్యాంట్ ను సర్దుకుని కూర్చోబోతున్న నేను "ఏయ్" అని వినపడడంతో ఏమిటన్నట్టు చూశాను.
"షరతులు మరచిపోయావా? మనద్దరికీ మధ్య మూడడుగుల దూరం వుండాలి" చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది కీర్తి.
కానీ నేను ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఎదురుగా వున్న బంగారపు గోపురం తళుకు తన ముఖంలో రిఫ్లెక్టవుతూ వుంది. ఆ చిరుకోపంలో, ఆ కాంతిలో కీర్తి అచ్చం దేవకన్యలా వుంది.
"స్కేల్ తెచ్చుకుంటే ఇవ్వు. కొలత పెట్టి కూర్చుంటాను" వ్యంగ్యంగా అన్నాను.
"షరతులకు ఒప్పుకున్నాకే నేను నీతో ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు నువ్వు ఇలా మాట తప్పావనుకో అందరూ కూతుళ్ళే పుడతారు నీకు."
"ఏం ఫరవాలేదు. ఆడపిల్లలు పుడితే బెదిరిపోయేరకాన్ని కాదు. ఎనిమిదో తరగతిలోనే బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయే ధైర్యాన్ని నూరిపోస్తాను వాళ్ళకు. ఇక పేచీ వుండదు. కట్న కానుకలు పెళ్ళిలో అల్లుడికి కాశీయాత్రకు పోవడానికి గొడుగులు, చెప్పులు కొనే దౌర్భాగ్యం తప్పుతుంది."
"ఇక ఆపు మహాప్రభూ! ఇంతకీ దూరంగా జరిగి కూర్చుంటావా? లేదా?"
"ఓ.కే" అని కాస్తంత దూరంగా జరిగి కూర్చున్నాను.
నేను 'ఫస్ట్ నైట్' గడపాలన్న పెద్ద ప్లాన్ లో వుంటే ఈ షరతులు అడ్డొస్తున్నాయి. ఈ వెధవ షరతులు లేకుంటే మాటలతోనో, చేతలతోనో కాస్తంత రెచ్చగొట్టచ్చు. కాణీ ఆ అవకాశాలు లేకుండా తలుపులన్నీ బిగుసుకున్నాయి. లాభంలేదు. ఈ షరతులను బ్రేక్ చేయాలి. కానీ ఇవన్నీఫోర్స్ తో చేసే వీలు లేదు. సున్నితంగా చేయాలి. ఆ అనుభవం పొందే వరకు కీర్తిని నేను ప్రసన్నం చేసుకోవాలి. ఆ తరువాత తనే నా వెంట పడుతుంది. ఇది నేను చెప్పిన మాటకాదు. ఇండియన్ కాత్యాయనుడి దగ్గర్నుంచి, పాశ్చాత్య ఫ్రాయిడ్ వరకు నొక్కి వక్కాణించారు.
"కీర్తీ!" పిలిచాను.
"ఏం?" అని కుడిచేతిని బుగ్గ కానించుకుంది.
"ఈ షరతులను పాటించడం చాలా న్యూసెన్స్ గా వుంది. వాటిని రద్దు చేసెయ్య కూడదూ" ప్రాధేయపడ్డాను.
"అదేం కుదరదు."
"అలా అంటే ఎలా కీర్తి! పూర్వకాలం ఘోరశాపాలు పెట్టిన మునులు కూడా ఆ శాపాలు తొలగిపోయే తరుణోపాయం చెప్పేవాళ్లు. నువ్వు కూడా అలాంటి మార్గం ఏదైనా చెప్పవా!"
కీర్తి ఆలోచనలో పడింది.
"నువ్వు అలా మాట్లాడకుండా కూర్చుంటే చాలా కష్టం కీర్తి. ఏదో పాత సినిమాలో అక్కినేనిలా "అంటరాని తనమూ, ఒంటరి తనమూ-అనాదిగా స్త్రీ జాతికి అదే మూలధనమూ" అని పాడాల్సి వుంటుంది. అయితే నాగేశ్వరరావుకు ఘంటసాల గొంతు ఎరువిచ్చాడు. మరి నాకు గొంతు ఇవ్వడానికి బాలసుబ్రహ్మణ్యం ఖాళీగా లేడు."
కీర్తి నవ్వింది. దేవాలయం గచ్చు మీద బంగారపు గుళ్ళు దొర్లించినట్టు.
అయితే ముందు నేను పెట్టిన షరతులన్నీ రద్దు కావడానికి నువ్వు ఓ కొత్త షరతుకి ఒప్పుకోవాలి.
"మళ్ళీ కొత్త షరతా! వీటితో చచ్చిపోతున్నాను."
"మరిక నీ ఇష్టం." ఇక అంతేనన్నట్లు తల అటు తిప్పుకుంది.
"ఒప్పుకుంటున్నాను. అదేమిటో చెప్పు?"
ముఖం ఇటు తిప్పి "నన్ను మూడు సార్లు అద్భుతంగా నవ్విస్తే ఒక షరతు చొప్పున రద్దయిపోతుంది" చెప్పింది కీర్తి.
"చక్కలగిలి పెట్టనా?" వెంటనే అడిగాను మీదకు వంగుతూ.
షార్ప్ గా పక్కకు జరిగి "దూరం ... దూరం" అంది.
"మరి మూడుసార్లు నిన్నెలా నవ్వించడం? పోనీ బోడి గుండు కొట్టుకుని కనిపించనా? అలా చేసినా ఒక్కసారే నవ్వుతావు. మొత్తం ఏడు షరతులు కదా అంటే ఇరవై ఒక్కసార్లు నవ్వించాలి. మరి అన్ని సార్లు ఎలా నవ్వించను?"
"అలాంటిదేం వద్దులే. అందుకూ నేనో మార్గం చెబుతాను."
"త్వరగా చెప్పు." తొందర చేశాను.
"హాస్యం వుట్టిపడేట్టు మినీ కథలు చెప్పు."
"మినీ కథలా?"
"ఆ. భారతంలో పిట్ట కథల్లాగా అన్నమాట."
"అంటే మొత్తం ఇరవై ఒక్క కథలు చెప్పాలా?"
"నేను పెట్టింది ఆరు షరతులే. ఎక్ స్ట్రాగా ఒక షరతు ఎందుకు కలుపుకుంటావ్? మొత్తం పద్దెనిమిది మినీ కథలు చెప్పాలి."
నేనేమీ మాట్లాడలేదు. పద్దెనిమిది కథలు చెప్పాలంటే మాటలా? నేను చెప్పిన కథకు కీర్తి నవ్వుతుందన్న గ్యారంటీ ఏమిటి? ఈ కథలూ, కాకర కాయలతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోయేట్టుంది. ఏం చేయాలి? హాస్యపు కథల్ని జుట్టుపట్టుకుని ఎక్కడ్నుంచి లాక్కురావాలి?
ఇదంతా అయ్యేపనిలా లేదు. పెట్టే బేడా సర్దుకుని వుడాయించడం బెస్ట్. కాణీ ఆఫ్ట్రరాల్ ఓ ఆడపిల్లను లొంగదీసుకోలేకపోవడం మొత్తం మగజాతికే అవమానమనిపించింది. అందుకే ఎంత కష్టమైనా పడదలుచుకున్నాను.
నా మౌనాన్ని చూసి కీర్తి అంది "రాత్రుల్లో నీ కోసం హారర్ కథలు చెబుతున్నావు. పగలు నాకోసం కామెడీ కథలు చెప్పు."
"సరే" అయిష్టంగానే ఒప్పుకున్నాను.
"మరి, మొదటి మినీ కథ మొదలుపెట్టు" కీర్తి కథలు వినడానికి చాలా ఉత్సాహపడుతోంది.
"అలానే. విన్నవీ కన్నవీ చెబుతాను. వీటి కాపీరైటు మాత్రం నాది కాదు."
"సరేలే."