సమయం 5.35 ఎ.యమ్.
జోహ్రా ఒకచోట ఆగిపోయాడు.
అరేబియా మహాసముద్రం మీంచి చల్లటిగాలి వీస్తోంది. నగరాన్ని పల్చటి మంచుపొగ కప్పేసి ఉంది.
బైనాక్యులర్ సెట్టుని జోహ్రా ఖలీల్ కి అందించాడు. షర్టు జేబులోంచి చాక్ పీస్ తీసి ఆ నుంచున్న స్థలాన్ని మార్క్ చేసాడు.
ఆ తరువాత జోహ్రా ప్రక్కకు తప్పుకున్నాడు. ఖలీల్ మార్క్ చేసిన స్థలంలో నించుని బైనాక్యులర్ లోంచి రూట్ నెంబర్ టూని, ఆపైన దేవానంద్ ఇంటిని చూసి సంతృప్తిగా తల పంకించాడు.
5-40 ఎ.యమ్.
ఇద్దరూ క్రిందకు వచ్చేసారు.
* * * * *
సమయం 6-00 ఎ.యమ్.
విక్రోలి బంగ్లా చుట్టూ వెలిగే రివాల్వింగ్ ఫ్లడ్ లైట్సు ఆఫ్ అయ్యాయి.
మాస్టర్ కమెండోస్ డ్యూటీ మారారు.
మెయిన్ గేటు ప్రక్కనే, లోపల వేపున్న కంప్యూటర్ సెక్యూరిటీ చెకింగ్ ఆఫీసర్ నిద్రలేమితో ఆవలిస్తూ, ఒళ్ళు విరుచుకొని తన సీట్లోంచి లేచాడు.
నలుగురు ఆటోమొబైల్ ఇంజనీర్స్ విక్రోలి బంగ్లా వాహనాల్ని చెక్ చేసి, ఇంజన్స్ స్టార్టు చేసి, బంగ్లా చుట్టూ ఓ రౌండ్ వేసి వాటికై కేటాయించిన స్థానాల్లో ఉంచేస్తున్నారు.
6-10 ఎ.ఎమ్.
యశోధర- మాస్టర్ మదర్.
నిద్ర లేచింది.
అప్పటివరకు తననే కౌగిలించుకొని నిద్రపోతున్న సోహ్నిని సున్నితంగా జరిపి, నుదుటి ముంగురుల్ని సరిచేసి బెడ్ దిగి బాత్ రూమ్ కేసి నడిచింది.
మాస్టర్ ఇంకా నిద్రపోతున్నాడు.
6.30 ఎ.యమ్.
సెక్యూరిటీ కమెండోస్ ఎఫ్, బి, ఆర్, ఎల్ సర్వసన్నద్దమైన బంగ్లా ముందుకొచ్చారు.
వారిని చూస్తూనే మాస్టర్ కమెండోస్ అలర్టయి పోయి, సెల్యూట్ చేస్తున్నారు.
బిగ్ బాస్- మాస్టర్.
బాస్- మిల్లర్.
సెక్యూరిటీ కమెండోస్ ఎఫ్,బి,ఆర్, ఎల్, మాస్టర్ కమెండోస్ సుమారు 40 మంది వీళ్ళందరి మధ్య మిలటరీ క్రమశిక్షణ అమలులో వుంటుంది ఎప్పుడు.
మాస్టర్ కమెండోస్ పర్యవేక్షించే భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసే హక్కు ఎఫ్, బి, ఆర్, ఎల్ లకు వుంటుంది. వీళ్ళ భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసే అధికారం మిల్లర్ కు ఉంటుంది.
మిల్లర్ భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసే అధికారం ఎవ్వరికీ లేదు.
'ఎఫ్' మాస్టర్ ఎక్కే రోల్స్ రాయిస్ టైర్స్ ని, బ్రేక్స్ ని చెక్ చేశాడు.
'బి' మాస్టర్ కమెండోస్ సబ్ మెషిన్ గన్స్ సేఫ్టీ కీ చెస్ ని చెక్ చేశాడు.
అంతా నిశ్శబ్దంగా వుంది.
6.40 ఎ.యమ్.
ఘంటసాల ఉద్వేగంతో, అపరిమిత భక్తిభావంతో వేదాంత ధోరణిలో గానంచేసిన గీతోపదేశం ఆరంభమైంది. యశోధర భక్తిపారవశ్యములో మునిగి పోయింది. బంగ్లా అంతటా ఫిక్సు చేసిన స్టీరియోల ద్వారా ఘంటసాల గానామృతం అలలు అలలుగా ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని కదిలించి వేస్తోంది.
6-45 ఎ.యమ్.
కమ్యూనికేషన్ ఛాంబర్ లోని టెలెక్స్ మెషిన్స్ పనిచేయటం ప్రారంభించాయి.
6-50 ఎ.యమ్.
బంగ్లా మెయిన్ గేట్ ముందు ఓ బుల్లెట్ మోటార్ బైక్ వచ్చి ఆగింది.
గేటు మెన్ మోటార్ సైకిల్ శబ్దం విని కేబిన్ లోంచి తొంగి చూశాడు.
వచ్చింది మిల్లర్ పి.ఏ అని ఐడెంటిఫై చేశాడు. గేటుమెన్ అతన్ని సోదాచేసి అతని దగ్గరున్న రివాల్వర్ ని తీసుకుని లోపలకు వెళ్ళేందుకు అంగీకారం తెలిపాడు.
అతను సరాసరి రోల్స్ దగ్గరున్న ఎఫ్ ని కలిసి ఓ సీల్డ్ కవర్ అందించాడు.
ఆ వెంటనే సెల్యూట్ చేసి వెనుదిరిగాడు.
బైక్ గేటు కేబిన్ దగ్గర ఆగింది.
గేటు మెన్ అతని రివాల్వర్ ని అతనికి హాండోవర్ చేసాడు.
'ఎఫ్' కవర్ ఓపెన్ చేసి అందులోని మేటర్ చదివి లైటర్ తో దాన్ని కాల్చివేశాడు.
7-00 ఎ.యమ్.
మాస్టర్ నిద్రలేచాడు.
సిగరెట్ వెలిగించుకుని బాత్ రూమ్ కి వెళ్ళాడు.
ఆ ఉదయమే నింపబడిన స్విమ్మింగ్ ఫూల్ లో ఫెర్ ఫ్యూమ్ డ్ లిక్విడ్ ని కలిపాడు ఓ మాస్టర్ కమెండో బంగ్లా జిమ్మాజియమ్ హాల్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్ స్ప్రే చేయబడింది.
7-05 ఎ.యమ్.
ఎఫ్ ఎదురుగా ఎల్, ఆర్, బిలు సమావేశమయ్యారు. ఎఫ్ వాళ్ళకు మిల్లర్ పంపించిన మెసేజ్ గురించి చెప్పసాగాడు.
* * * * *
10-30 ఎ.యమ్.
లీలా కెంపెన్ స్కీ హోటల్.
"మనక్కావలసిన వస్తువులన్నింటికి అడ్వాన్స్ పే చేశాను. అవి మనకు మధ్యాహ్నం రెండుగంటలకు అందాలని చెప్పాను" జోహ్రా తన ముందున్న మేప్ కేసి చూస్తూ అన్నాడు.
ఖలీల్ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూండి పోయాడు.
* * * * *