11-05 ఎ.యమ్.
థాయ్ లాండ్...
ఓబరాయ్ ఇంటర్నేషనల్ హోటల్.
"ఈ రోజు సాయంత్రం సరిగ్గా ఏడుగంటల ప్రాంతంలో మన అదృష్టరేఖ మలుపు తిరుగుతుంది" చిండూహాన్ తేనీరు సేవిస్తూ ఆనందంగా అన్నాడు.
"గొప్ప మలుపు కాదు వక్రీకరిస్తోందేమోనని భయంగా వుంది...." అన్నాడు సాలోచనగా లిండాహాన్.
అదేం అన్నట్లు ముఖం చిట్లించాడు చిండూ.
"మాస్టర్ కి భాగస్వాములం మాస్టర్ హత్యచేయబడితే ముందుగా పోలీసులు మనల్నే అనుమానిస్తారు."
చిండూ చిన్నగా నవ్వాడు.
"మనం మరోగంటకు థాయ్ లాండ్ టూరిజం మినిష్టర్ ని కలిసేందుకు వెళుతున్నాం. రాత్రి పదిగంటల వరకు ఆయనతోనే వుంటాం. ఈ రాత్రి మనకు మినిష్టర్ డిన్నర్ అరేంజ్ చేయిస్తున్నారు."
ఈసారి లిండా నవ్వాడు.
"ఎంత గొప్ప ఎలిబీ అయినా, సాక్షాత్తు జడ్జీ అయినా మనల్ని రక్షించటం కష్టం."
చిండూ ఈసారి నవ్వలేదు.
ఆలోచనల్లో పడ్డాడు.
* * * * *
సమయం 2-05 పి.యమ్.
లీలా కంపెన్ స్కీ హోటల్ ముందు ఓ సెకండ్ హేండ్ అంబాసిడర్ కారాగింది.
దానికున్న నెంబర్ ప్లేట్సుని బట్టి అది కర్నాటకు చెందిన దానిలా వుంది.
ఆ కారు డిక్కీ తెరవబడింది.
అందులోంచి ఓ వి.ఐ.పి సూటుకేసు క్రిందకు దిగింది.
చాలా పెద్ద సూట్ కేసు అది.
ఇద్దరు మనుష్యులు దాన్ని తీసుకెళ్ళి రిసెప్షన్ లో అప్పజెప్పి ఏ రూమ్ లో వున్న అతిధులకు అందజేయాలో తెలియజెప్పి వెళ్ళిపోయారు.
2-10 పి.యం.
ఆ సూట్ కేస్ జోహ్రా గదికి చేర్చబడింది.
ఆ వెంటనే ఆ గది తలుపులు మూసుకున్నాయి.
జోహ్రా సైగలందుకున్న ఖలీల్ రెండు నిమిషాల వ్యవధిలో డూప్లికేటు కీస్ తో ఆ సూట్ కేసుని ఓపెన్ చేశాడు. పైన రెండు జతల బట్టలు పొందికగా పేర్చి వున్నాయి. వాటిని పక్కకి తప్పించి చూశాడు.
ఆరోజు ఉదయం జోహ్రా ఆర్డర్ ఇచ్చిన వస్తువులన్నీ పాలిథిన్ కవర్స్ లో భద్రంగా చుట్టబడి వున్నాయి.
వాటిని చూస్తూనే జోహ్రా ముందుకు ఒంగాడు. "ఈ సూటుకేసులో వున్న వస్తువులతో మనం పని పూర్తి చేయగలిగితే మరో సూటు కేసు కరెన్సీతో మన సొంతమవుతుంది" అంటూ జోహ్రా అందులోని వస్తువుల్ని బయటకు తీసి టీపాయ్ మీద పేర్చసాగాడు.
* * * * *
సమయం 2-30 పి.యమ్.
కమ్యూనికేషన్ ఛాంబర్ లోని టెలెక్స్ మెషిన్స్ నిర్విరామంగా పని చేసుకుపోతున్నాయి.
మాస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా వున్న కేసినోస్ లో జరుగుతున్న కార్యకలాపాల గురించి సమాచారం టైప్ అయిపోతుంది. ఆ గదిలో ఇద్దరు ఆపరేటర్స్ అప్రమత్తంగా వివిధ దేశాల నుంచి వస్తున్న సమాచారాన్ని క్రోఢీకరిస్తున్నారు. ప్రతి అరగంటకు వాళ్ళు క్రోడీకరించిన సమాచారం మాస్టర్ ఛాంబర్ కి చేరవేయబడుతుంది.
'ఎఫ్' మాస్టర్ కి సెక్రటరీ కమ్ సెక్యూరిటీ కమెండోగా పనిచేస్తుంటాడు.
'ఎఫ్' ఒక మెసేజ్ తీసుకొని మాస్టర్ ఛాంబర్ దగ్గరకు వెళ్ళి కాలింగ్ అలారమ్ బటన్ ప్రెస్ చేసి కొద్ది క్షణాలాగాడు.
అప్పుడు వెలిగింది గ్రీన్ లైటు. ఎఫ్ తలుపుల్ని తెరచుకొని మాస్టర్ ఛాంబర్ లోకి ప్రవేశించి తన దగ్గరున్న టెలెక్స్ స్లిప్స్ ని టేబుల్ పై ఉంచాడు వినయంగా.
"ఎనీ ఇంపార్టెంట్ న్యూస్-?" మాస్టర్ కంఠం గంభీరంగా వుంది.
"ఎస్. యువర్ హైనెస్" అన్నాడు ఎఫ్ నెమ్మదిగా.
"ఏమిటది?" మాస్టర్ కుర్చీలో అటుకేసి తిరిగి గోడకు ఫిక్స్ చేసి వున్న వరల్డ్ మేప్ కేసి చూస్తున్నాడు.
"హాన్ సోదరులు థాయ్ లాండ్ లో విడిది చేశారు. రెండురోజులు బ్యాంకాక్ కి దూరంగా ఒక విలేజ్ బీచ్ రిసార్టులో మకాం చేసినట్లు ఇన్ ఫర్మేషన్ వచ్చింది..."
"ఈ వార్తలో పెద్ద విశేషమేముంది?"
చల్లగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో పొగవలయాలు సృష్టిస్తున్న మాస్టర్ ప్రశ్న కేజువల్ గా ఉంది.
"హాన్ సోదరులు విలేజీ రిసార్టునుంచి బ్యాంకాక్ వచ్చి ఓబరాయ్ ఇంటర్నేషనల్ లో దిగారు. వాళ్ళ గదికున్న ఫోన్ ఒక ఓవర్ సీస్ కాల్ ని ఎంగేజ్ చేసింది."
"దెన్...?"
"ఆ కాల్ ఇండియాకి సంబంధించినది. దట్ టూ బొంబాయి."
అప్పటివరకు అటువేపు తిరిగి వున్న మాస్టర్ రివాల్వింగ్ చైర్ వేగంగా 'ఎఫ్'కి అభిముఖంగా తిరిగింది.
తను అందించిన చివరి ఇన్ ఫర్మేషన్ మాస్టరు అటెన్షన్ ని పట్టుకోగలిగిందని ఎఫ్ గుర్తించాడు.
కొద్ది క్షణాలక్కడ నిశ్శబ్దం పేరుకుంది.
"నన్ను వాళ్ళు చంపించినా, నేను వాళ్ళను చంపించినా పోలీసుల దృష్టి మామీదే పడటం ఖాయం. వాళ్ళిద్దరూ చనిపోతే నాకు, నేను చనిపోతే వాళ్ళకు చాలా ప్రయోజనాలు, లాభాలున్నాయి. సో అది అమెచ్యూర్ ఆలోచన అవుతుంది. ఎనీ హావ్.... మన జాగ్రత్తలో మనం వుండటం మంచిది..." గంభీరంగా, బేస్ వాయిస్ లో అన్నాడు మాస్టర్.
'ఎఫ్' సెల్యూట్ చేసి తన పనయిపోయినట్లు వెను తిరిగాడు.
* * * * *