"మీ కొటేషన్ బాగుంది... అది సీరియస్ లవ్ కి సబంధించింది... నా కొటేషన్ సిల్లీ లవ్ కి సంబంధించింది... అంచేత... నా కొటేషన్ని మీరేం పట్టించుకోకండి..."
అలా అంటున్న ఆంజనేయులు వేపు విచిత్రంగా చూసింది మేరీ.
* * * *
ఆ సాయంత్రం నుంచే భువనేశ్వరీ దేవి ఆంజనేయులి భార్య ఫోటో చూడాలని పేచీ పెట్టటంతో ఆనందం తిరిగి అబద్ధమాడేశాడు. ఆంజనేయులి ఆఫీసులో ఏదో ఇన్ స్పెక్షన్ జరగటంతో, ఆ ఫోటో మిస్ అయిపోయిందని, ఉత్తరం రాసి ఫోటో తెప్పించి చూపిస్తామని అనేశాడు. అప్పటికామె క్షమించి వదిలేసినా, అమ్మాయిని వెంటనే కాపురానికి రమ్మని టెలిగ్రాం ఇవ్వమని హుకుం జారీచేసి వెళ్ళిపోయింది.
రెండ్రోజులు గడిచాయి.
మూడో రోజు ఉదయం ఆఫీస్ కెళ్ళే హడావుడిలో వున్నారు ఆంజనేయులు, ఆనందం.
తోటలో మొక్కలకు నీళ్ళుపోసి, తటాల్మని అవుట్ హౌస్ లోకి వచ్చింది భువనేశ్వరీదేవి.
"అమ్మాయికి టెలిగ్రాం ఇచ్చానన్నారుగదా... ఏమైనా రిఫ్లయ్ వచ్చిందా..."
అలా అడుగుతున్న ఆవిడ ముఖంవేపు తెల్లబోయి చూశారిద్దరూ.
రోజున్నర క్రితం భోజనాల టైమ్ లో ఆవిడ వేసిన ప్రశ్న నుంచి తప్పించుకోవడం కోసం 'టెలిగ్రాం ఇచ్చానండి' అని ఆడిన అబద్ధం జ్ఞాపకాని కొచ్చింది ఆనందానికి.
"ఇంకా రాలేదండి... ఏమైందో... పల్లెటూరు గదా... రావడానికి లేటౌతుంది..." సర్దాడు ఆనందం.
"నెల్లూరు పల్లెటూరేటి బాబూ..." గబుక్కున క్రాస్ క్వశ్చన్ వేసిందావిడ.
"నెల్లూరంటే, నెల్లూరు కాదండి... నెల్లూరు దగ్గర్లో పల్లెటూరండి... ఇవాళ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం... ఇవాళ రావచ్చు..." అన్నాడు ఆనందం.
ఆ సమాధానంతో సంతృప్తి పడింది ఆవిడ.
"టిఫిన్ రెడీ అయింది... చేసి వెళ్దురుగాని రండి..." అనుకుంటూ గదిలోంచి బయటకొచ్చింది.
గండం గడిచిందనుకొని ఇద్దరూ టిఫిన్ చెయ్యడానికి బయల్దేరారు.
* * * *
ఇంకో రెండ్రోజులు గడిచాయి.
ఆ రోజు ఆఫీసునుంచి అలా బయటకెళ్ళి టాంక్ బండ్ అంతా తిరిగి అట్నించటు ఓ ఇంగ్లీషు సినిమా చూసి తొమ్మిది గంటలకు ఇంటికొచ్చారిద్దరూ. అలా అయినా ఆమె బాధ తప్పుతుందని.
హాల్లో వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది భువనేశ్వరీ దేవి.
"ఏమయ్యా... అర్దరాత్రి అపరాత్రీ వరకూ షికార్లు కొడితే ఎలా?
ఇవాళేం టెలిగ్రాం రాలేదా? ఫోటో లేదు... అమ్మాయి లేదు... ఏమిటిదంతా?" ఆవిడ అనుమానంగా చూస్తూ అంది.
గొంతులో కాకరపిక్క అడ్డుగా పడినట్టయింది ఆంజనేయులికి. నీళ్ళు నమిలాడు ఆంజనేయులు.
"ఇవాళ ఫోన్ వచ్చిందన్నావ్ గదరా..." పక్కనున్న ఆనందం చటుక్కున అడ్డకోత కోశాడు.
"అవునండి... ఇవాళ మా ఫాదరిన్లా ఫోన్ చేశారండి... పదో తేదీ వరకూ మూఢాలూ, వర్జాలూ ఉన్నాయట... ఆ తర్వాత పంపిస్తానని... ఇంకా పిండివంటలూ అవీ తయారీ కూడా పూర్తి కాలేదని కూడా చెప్పారండి...
"ఓహో... నా మతిమండా... మార్చేపోయాను... కరెక్టే.. మూఢంలో మొదటిసారి ఆడపిల్లనెలా పంపిస్తారయ్యా... నిజమే... ఈ లోపల మీ ఇంటికి సున్నమయీ వేయిస్తే ఎలా వుంటుందంటావ్..." అందావిడ.
"చాలా బాగుంటుంది పిన్నిగారూ... కొత్తింట్లో కొత్త కాపురం బాగుంటుంది కదరా..." వంట పాడాడు ఆనందం.
"రేపే సున్నం వేయిస్తాలే... రండి... భోజనాలకు... మీతో కలిసి భోంచేస్తానని ఆయన కూడా భోంచెయ్యలేదు..." అనుకుంటూ డైనింగ్ హాల్ వేపు నడిచింది భువనేశ్వరి.
* * * *
అయిదు రోజులు గడిచాయి. ఈ అయిదు రోజులూ భువనేశ్వరి వాళ్ళనేమీ ప్రశ్నలు వెయ్యలేదు.
ఆ రోజు పడుకునే ముందు....
"పదో తేదీ దగ్గర పడుతోందిరా... ఎలాగరా... రేపో ఎల్లుండో... మీ పిన్నిగారు... మళ్ళీ ఎంక్వయిరీలు మొదలెడితే ఎలాగరా..." సీలింగ్ ఫాన్ వేపు చూస్తూ అన్నాడు ఆంజనేయులు.
"ఒరే అంజీ... ఈ మాత్రం దానికే అలాగ బెంగపడిపోగూడదురా... ప్రతీ వెధవ పనికీ, ఇంకో వెధవ ఉపాయం ఉంటుందని ఎవరో ఒక వెధవ ఎప్పుడో చెప్పగా విన్నాను... టైమ్ దగ్గరకు రానీ, ఆలోచిద్దాం..." అంటూ ముసుగు తన్నేశాడు ఆనందం.
వాళ్ళూహించిన ప్రళయం మర్నాడుదయాన్నే డైనింగ్ హాల్లో ఎదురైంది భువనేశ్వరీదేవి.
"ఇంటికి సున్నాలు కూడా అయిపోయాయి... పదో తేదీ దగ్గర పడుతోంది... టెలిగ్రామ్ ఇంకా రాకపోవడమేమిటి?" తనలో తను అనుకున్నట్టుగా అంది భువనేశ్వరీదేవి.
రోజు రోజుకీ ఆమె కళ్ళలో అనుమానపు నీడలు పెరుగుతున్నట్లుగా అనిపించింది ఆ ఇద్దరికీ.
"అతనా కొత్త పెళ్ళికొడుకు... సిగ్గెక్కువ... నువ్వా టింగరి వెధవ్వి... ఈ వ్యవహారాలు చూసుకోడానికి పెద్దవాళ్ళెవరూ ఇంట్లో లేరాయే... ఇవాళ నేనెలాగూ... బిర్లా టెంపుల్లో అర్చన చేయించడానికి వెళ్తాను... ఆ అడ్రసిలా ఇవ్వు... నేనే టెలిగ్రామ్ కొడతాను..." అందావిడ.
నెత్తి మీద 'దబ్' మని బాంబ్ పడినట్టయింది ఆంజనేయులికి.
'చచ్చింది గొర్రె...' అనుకున్నాడు ఆనందం. బేలగా భుజంగరావు వేపు చూశారిద్దరూ.
పరిస్థితి అర్ధమైంది భుజంగరావుకి.
"నువ్వెందుకే... నువ్వు గుడికెళ్ళు... టెలిగ్రామ్ కొట్టడానికి నువ్వే వెళ్ళాలేమిటే... నేను లేనూ... పదిహేనేళ్ళయింది ఇల్లు కదిలి... నేనివాళ వెళ్తానులే... అలా ఊరు చూసినట్టూ వుంటుంది... టెలిగ్రామ్ ఇచ్చినట్టూ వుంటుంది... చార్మినార్ ప్రాంతంలో ఒకే ఒక టెలిగ్రాఫ్ ఆఫీసున్నట్టు గుర్తు... ఈ మధ్య దానవసరం పడలేదు కదా... అక్కడే వుంది కదా..." ముగ్గురు మొఖాల వేపూ చూస్తూ అన్నాడు భుజంగరావు.
"చార్మినార్ దగ్గర టెలిగ్రాఫ్ ఆఫీసు ఉండడం ఏమిటండీ..." ఆంజనేయులు అయోమయంగా అడిగాడు.