"బ్రహ్మాండం బాసూ. అయితే సాయంకాలంనుంచే ఇంత రిస్క్ తీసుకోవడం కన్నా రాత్రి ఒంటిగంటకే బ్యారెక్కు నుంచి బయటపడితే" బుద్ధుడు తన సలహా చెప్పాడు.
రాత్రి బ్యారెక్కుల నుంచి బయటపడడం ఇంపాజిబుల్. తలుపు వేసి తాళం పెడతారు గదా! ఏదో సాకుతో బ్యారెక్కునుంచి బయపడ్డా కారిడార్ లో నలుగురు వార్డర్లు వుంటారు. జెయిలు చుట్టూ మరో వార్డరు తిరుగుతుంటాడు. వాళ్ళతో మనం తలపడాల్సి వస్తుంది మనం పారిపోయే ప్రయత్నంలో హింస జరగడానికి నేను ఒప్పుకోను"
"అంటే బ్యారెక్కు నుంచి బయటపడాలంటావ్"
"ఎగ్జాట్లీ. మనం బ్యారెక్కులోకి వెళ్ళి తిరిగి రావడం కుదరదు. తోటలో ఉన్నప్పుడే మనం బ్యారెక్కుకి వెళ్ళకుండా మార్గం మార్చడమే మనకున్న ఏకైక మార్గం. ప్రహారీగోడను దాటడం రాత్రే సాధ్యం. అందుకే సాయంకాలం బ్యారెక్కును తప్పించుకుని రాత్రి కాంపౌండ్ వాల్ ని దాటుతాం."
"బ్యారెక్కుల్లో మనం లేమని క్షణాల్లో పసిగట్టేస్తారు. కూడా"
"అవును. మనం మిస్సయ్యామని వార్డర్లు ఎంత త్వరగా తెలుసుకుంటే మనకంత మంచిది. మనం లేమని తెలిసిన మరుక్షణం మనకోసంవేట మొదలవుతుంది. వార్డర్లంతా మనల్ని వెతకడానికి వెళ్ళిపోతారు. మనం జెయిల్లోనే దాక్కున్నామన్న ఐడియా సాధారణంగా రాదు. ఒకవేళ వచ్చినా టాయ్ లెట్లూ, చెట్లూ చేమలూ, క్రాప్ట్స్ రూమ్ - వీటిల్లో వెదుకుతారుగానీ నీళ్ళట్యాంకులో దాక్కున్నట్టు పసిగట్టలేరు. అందుకే అదే మనకు సురక్షితమైన ప్లేస్."
"అయితే ఆరుగంటలకే ట్యాంక్ లో వుందాం. నాలుగు గంటల నుంచే ఎందుకు?"
"ఆరుగంటలకు ఖైదీలు బ్యారెక్కులలోకి వెళతారు. వార్డర్లు లెక్కపెట్టి బ్యారెక్కుల్లోకి నెడతారు. అంటే మనం మిస్సయ్యామని అరూపదికి తెలుసుకుంటారు. ఆరుగంటల వరకు జైల్లోనే వున్న ఖైదీలు పదినిముషాల్లో జెయిలుదాటి ఉండరన్న అనుమానం వస్తుంది. దాంతో జైల్లోనే ప్రతిమూలనూ క్షుణ్ణంగా వెతుకుతారు. అలా కాకుండా నాలుగు గంటలనుంచే మనం కనపడలేదని తోటి ఖైదీలు ఖచ్చితంగా ఆపాటికి బయటికి పారిపోయి వుంటారని భావిస్తారు. కాబట్టి జెయిలు సిబ్బంది దృష్టిని జెయిలునుంచి తప్పించడానికే మనం నాలుగుగంటలకే కనిపించకుండా పోతాం."
తన బాస్ చాలా పకడ్భందీగా ప్లాన్ వేసినట్టు బుద్ధుడికీ, ఉత్తరుడికీ అర్థమైంది. ఇక అడగవలసిన ప్రశ్నలు ఏమీ లేనట్టు వాళ్లిద్దరూ కాసేపూ మౌనంగా ఉండిపోయారు.
తిలక్ 'ఎనీడౌట్స్' అన్నట్టు చూశాడు.
ఆ నిశ్శబ్దాన్ని భరించలేనట్టు ఉత్తరుడు అడిగాడు. "ఈరోజు లాలస వచ్చాక ముహూర్తం నిశ్చయించావా?"
అవునన్నట్టు తలవూపాడు తిలక్.
"ఏవిధంగా ఆలోచించినా ఇది బ్రహ్మాండమైన ప్లాన్ అని నా కనిపిస్తోంది" బుద్ధుడు మెచ్చుకున్నాడు.
అతను కూడా చిన్నగా నవ్వి "లాలస కూడా యిదే మాట అంది" అన్నాడు.
పైకి ఎంతో గంభీరంగా, జీవితపు లోతులు తెలిసినవాడిలా వుండే తిలక్ కూడా ఆడపిల్ల విషయంలో సిగ్గుపడడం వింతగా అనిపించింది బుద్ధుడికి. అయితే యిలాంటి సున్నితమయిన విషయాలను ఫీల్ కాగలిగిన ఉత్తరుడు మాత్రం తన బాస్ వేపు చూస్తూ ముచ్చట పడ్డాడు.
"ఈరోజు లాలసను దూరం నుంచి చూపించావు కదా. ఆమెను చూడగానే నాకో భావన కలిగింది" చెప్పాలా వద్దా అన్నట్టు ఆగాడు బుద్ధుడు.
"ఏమిటది?"
"నిజం చెప్పమంటావా? అబద్ధం చెప్పమంటావా బాసూ"
"నిజమే చెప్పు"
"లాలసకూ, నీకూ ఊడూ జోడూ బ్రహ్మాండంగా వుంది బాసూ"
ఆ మాటలకు ఇబ్బందిగా ఫీలయ్యాడు తిలక్. కానీ అతని మనసులో ఎక్కడో ఓ మూల ఆమెమీద ఇష్టం మొలకెత్తింది. అది గుండెల్లో వూహల పూలు పూయాలంటే యింకొద్ది కాలం పడుతుంది.
"మరిక లేద్దామా? రేపు సాయంకాలం ముహూర్తం. మానసికంగా రడీ కండి" అని లేచాడు.
వీళ్ళ ముగ్గుర్నీ దూరంనుంచి చూస్తున్న దాదా నైఫ్ వేపు తిరిగి క్రూరంగా నవ్వాడు.
"ఆడంగిలా వుండే ఆ ఉత్తరుడు నీ ప్రేమను తిరస్కరిస్తున్నాడా? అయితే వాడ్ని నువు లొంగదీసుకోవాలంటే ఒకటే మార్గముంది" అని దగ్గరికి రమ్మన్నట్టు చేత్తో సైగచేసి ఏం చేయాలో చిన్నగా చెవిలో చెప్పాడు.
వింటున్న నైఫ్ పెదవులమీద విషపునవ్వు విచ్చుకుంది.
* * * *
తిలక్, బుద్ధుడు, ఉత్తరుడు పడుకున్నారేగానీ నిద్ర రావడం లేదు.మరో ఇరవై గంటల్లో జెయిలునుంచి తప్పించుకుంటున్నామన్న ఎగ్జయిట్ మెంట్ నిద్రను దూరంగా తరిమేస్తోంది.
తన ప్లాన్ లో ఏమైనా లొసుగులు వున్నాయేమోనని మొత్తం ప్లాన్ ను మననం చేసుకుంటున్నాడు తిలక్. జైలు నుంచి దూరంగా వెళ్ళిపోయాక కొత్త జీవితం ఎలా వుంటుందో ఊహించుకుంటున్నాడు బుద్ధుడు. తాము పట్టుపడితే ఏం జరుగుతుందో వూహించుకుని భయపడిపోతున్నాడు ఉత్తరుడు. తిలక్ పక్కనుంటాడన్న భరోసా లేకపోతే అతను ఇంతగా సాహసించేవాడు కాడు.
ఎప్పుడో మూడుగంటలకు నిద్రపోయి అయిదుగంటలకల్లా లేచారు.
రాత్రంతా మేల్కొని వుండడం వల్ల కళ్ళు మండుతున్నాయి. కాళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. మొత్తం శరీరమంతా మత్తుగా వాలిపోతూ వుంది.
అయితే ముగ్గురిలోనూ ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తోంది. అప్పటికే కొందరు ఖైదీలు లేచి పడకలు సర్దుకున్నారు.
తిలక్ గాఢ నిద్రలోంచి లేచినట్టు ముఖాన్ని రుద్దుకుని "గుడ్ మార్నింగ్ ఉత్తరా. ఈరోజు ఎందుకో మనసు స్వాగతం చెప్పడానికే ఉదయించినట్టుంది. చాలా రోజుల తరువాత స్వే చ్ఛాలోకంలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతోంది" అన్నాడు.
ఉత్తరుడు ఓ క్షణంపాటు కంగారుపడ్డాడు. తమ ప్లాన్ అందరికీ తెలిసిపోతుందేమోనన్న ఆందోళన అతనిలో.