Previous Page Next Page 
జైలు పేజి 17


    "నన్ను తప్పించాలన్నంత రిస్కు ఎందుకు తీసుకుంటున్నారు?"

 

    "ఓ విధంగా స్వార్థం. మరో విధంగా లోకకళ్యాణం. వీటన్నిటినీ విడమరిచి చెప్పకూడదన్న నిబంధన ఏమీలేదు. కానీ అన్నిటికీ ఓ టైమ్ వుంటుంది. అప్పుడు చెబితే చెప్పే విషయాలు చాలా ఎఫెక్టుగా వుంటాయి" అంది. అంత ఫ్రాంక్ గా, ఎలాంటి భేషజాలు లేకుండా ఆమె చెప్పడం వలన ఆమెమీద అదోరకమైన గౌరవభావం కలిగిందతనికి.

 

    "ఎవరో పరాయివాళ్ళు వచ్చి సహాయం చేస్తానంటే ఎలా యాక్సప్ట్ చేయడం?" అతను తలవంచుకుని అన్నాడు.

 

    "నిజమే. ఇబ్బందిగా వుంటుంది. ఇప్పటివరకు మనం మనం పరాయివాళ్ళమే. ఏ పరిచయమైనా, ఏ బంధమైనా ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభం కావాలిగా ఈ క్షణంనుంచి మనం స్నేహితులం. నన్ను ఓ స్నేహితురాలిగా స్వీకరించటానికి మీకేమయినా అభ్యంతరమా?" ఆమె అతని కళ్లల్లోకి సూటిగా చూస్తోంది. తన జవాబు ఆమెలో చాలా రియాక్షన్స్ కలుగజేస్తుందని గ్రహించాడు.

 

    కొంచెం తడబడుతూ "ఏమీ లేదు" అన్నాడు.

 

    ఒక్కసారిగా ఆమె ముఖంలో ఆనందం చిమ్మింది.

 

    "మన స్నేహం మొదలయిందనడానికి గుర్తుగా మన మధ్య బహువచన సంబోధనలు బంద్" అని అతని కళ్ళల్లోకి చూసి "ఈ నరకం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. బయటనుంచి నేను నీకు సహాయం చేస్తాను" అంది.

 

    ఆమె తనను ఏకవచనంతో సంబోధించడం చాలా ఆనందంగా వుంది అతనికి. కానీ తన సంతోషాన్ని వ్యక్తీకరించడం చిన్నతనంగా తోచింది. అందువల్ల గంభీరంగా వుండిపోయాడు.

 

    "మరిక వస్తాను నేస్తం. ఖచ్చితంగా వచ్చేవారం ఇదే రోజు వస్తాను. నువు ప్లాన్ తో సిద్ధంగా వుండు" అని లేచింది.

 

    అలాగేనన్నట్టు తల వూపాడు.

 

    తన వెనక శబ్దం కావడంతో ఏకాంబరం తల తిప్పాడు. ఆమె వెళ్ళిపోతూ వుందని గ్రహించి దగ్గరికొచ్చాడు.

 

    "మరదలా! ఎంత ఆలోచించినా నీ ప్రశ్నకు జవాబు తట్టలేదు" అని వెకిలిగా నవ్వాడు.

 

    ఆమె అతనివేపు చూసి నవ్వుతూ "నీ మట్టిబుర్రకు జవాబు తట్టదని తెలుసు" అంది.

 

    "వరూధిని ఎందువల్ల పొరబడిందో చెప్పు మరదలా" ఏకాంబరం ఉత్సాహాన్ని అణుచుకోలేక అడిగాడు.

 

    "ఆన్సర్ చాలా సింపుల్! ఆ విద్యార్ధి నిక్కర్ జేబులు రెండింటికీ చిల్లులు. మగవాడి శరీరంలో సంకోచ వ్యాకోచనాలు చెందే అవయవానికి సంబంధించిన బూతు జోక్ అది" అని ఆగింది.

 

    ఏకాంబరానికి అర్థమైంది.

 

    ఆమె సీరియస్ గా చెప్పడం ప్రారంభించింది. "చూశావా? ఇంత ఘాటైన బూతు వినడంతో నీ ముఖం ఎలా మున్సిపాలిటీ చీపురులా తయారయిందో. నామీద నీకు ఓ చులకన భావం ఏర్పడిపోయింది. అవునా?"

 

    ఆయన ఇబ్బందిగా అటూ ఇటూ కదిలాడు.

 

    "మన ప్రవర్తన చీప్ గా వుంటే ఎదుటివాళ్ళు మనల్ని ఎంత హీనంగా అనుకుంటారో నీకు తెలియజేయడానికే ఈ జోకు చెప్పాను. నువ్వు నన్ను మరదలా అని పిలిచినప్పుడు నేనెంతగానో బాధపడ్డాను. నువ్వంటేనే జుగుప్సకలిగింది. ఈ జుగుప్స నీకే అనుభవమైతే తప్ప నీకు అర్థంగాదు. అందుకే ఆ బూతు జోక్ చెప్పి నువు చేస్తున్న తప్పేమిటో నీకు తెలియజెప్పాను" అంది ఆమె.

 

    ఆయనలో ఏవేవో మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తూనే వుంది.

 

    "మన ప్రవర్తన ఎదుటివాళ్ళ మన్ననలు పొందేటట్లుండాలి తప్ప అసహ్యం కలిగించేటట్టు వుండకూడదు... నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు గనుక నూరు రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు" అని ఆమె బయటికి నడిచింది.

 

    ఏకాంబరం శిలాప్రతిమలా నిలబడిపోయాడు.

 

    ఏదో తుఫాను వచ్చి వెలసినట్లుంది తిలక్ కి. తమ మాటలు వినకూడదని ఏకాంబరానికి ఓ చిక్కు ప్రశ్న ఇచ్చి దూరంగా నిలబెట్టడంతో పాటు ఆయనకి ఎంతో షార్ప్ గా బుద్ధి చెప్పిన ఆమె సామాన్యురాలు కాదనిపించింది.

 

    మెల్లగా నడుచుకుంటూ తోటలోకి వచ్చాడు.

 

    జరిగిందంతా ఉత్తరుడికి, బుద్ధుడికి చెప్పాడు.

 

    వాళ్ళిద్దరూ అంతా విన్నాక ఒకే ప్రశ్న వేశారు.

 

    "లాలస ఎవరు?"

 

                                    *    *    *    *

 

    సాయంకాలం అయిదుగంటలవుతోంది.

 

    అప్పటివరకు పని చేస్తున్న ఖైదీలు బ్యారెక్కులలోకి వెళ్ళడానికి తయారవుతున్నారు.

 

    ఇదే మంచి సమయమనుకుని బుద్ధుడ్ని, ఉత్తరుడ్ని ఓ మూలకి లాక్కెళ్ళి కూర్చోబెట్టాడు తిలక్.

 

    "ఏమిటి బాసూ?" ఉత్తరుడు అడిగాడు.

 

    "రేపు మనం పారిపోతున్నాం" తిలక్ సర్దుకున్నాక చెప్పాడు.

 

    శ్రోతలిద్దరూ చిన్న జర్క్ ఇచ్చారు. రక్తం ఒక్కసారిగా చల్లబడిపోయినట్టు భావన.

 

    "నిజమా బాసూ!" మరోసారి కన్ ఫర్మ్ చేసుకోవడానికి బుద్ధుడు అడిగాడు.

 

    "అవును. మనం రేపే జైలుని బ్రేక్ చేయబోతున్నాం. మొత్తం ప్లాన్ అంతా సిద్ధం. రేపు సాయంకాలం నాలుగుగంటలకు మన సాహసయాత్ర మొదలవుతుంది.

 

    ఏ పనయినా చేయాలనుకోవడం వేరు. చేయడం వేరు. బుద్ధుడిలో పెద్ద అలజడి లేకపోయినా ఉత్తరుడు మాత్రం వణికిపోతున్నాడు. అప్పుడు ఏ వార్డరు అయినా అతన్ని చూసుంటే వెంటనే వాళ్ళ ప్లాన్ ని పసిగట్టేవాడు.

 

    ఆ సమయంలో ఏ వార్డరూ అటు రాకపోవడం వాళ్ళ అదృష్టం.

 

    "ఎలా పారిపోతున్నాం?" బుద్ధుడు అడిగాడు.

 

    "జాగ్రత్తగా వినండి. రేపు సాయంకాలం నాలుగు గంటలకు మనం తోటలో చేస్తున్న పనిని ఆపేస్తాం. ముగ్గురూ టాయ్ లెట్ గదుల దగ్గరికి చేరుకొని, అక్కడినుంచి తూర్పువైపుగా నడిచి న్యూజైల్ వెనుక వున్న సందు చేరుకుంటాం. సందుగుండా పైకి నడిచి న్యూజెయిల్ మెట్ల దగ్గరికి చేరుకుంటాం. ఇక మెట్లన్నీ ఎక్కి టెర్రస్ మీదకి వెళతాం."

 

    "ఆ తరువాత" ఉత్తరుడు అప్పటికి సర్దుకున్నాడు.

 

    "జైలు పైభాగాన - అంటే డాబామీద పెద్ద వాటర్ ట్యాంక్ వుంది. అక్కడి నుండే మనకు కొళాయిల్లో నీళ్ళు వచ్చేది. అందులో రాత్రి ఒంటిగంట వరకు దాక్కుంటాం. ఖచ్చితంగా అప్పుడు కరెంట్ ఆఫ్ అవుతుంది. ఈ సమయంలో అక్కడినుంచి బయటికి కిందకు దిగి వస్తాం. న్యూజెయిల్ వెనకకు వచ్చి ప్రహారీగోడ దూకుతాం. అప్పుడు గోడ మీదున్న కరెంట్ తీగల్లో కరెంట్ వుండదు గనుక షాక్ కొట్టదు. అంతే కాకుండా సైరన్ కూడా మ్రోగదు. మనం  గోడ ఎక్కడానికి అవతలి నుంచి లాలస తాడు వదులుతుంది. గోడ దాటుకున్నాక నలుగురూ కాలేజీ దగ్గరికి వెళతాం. అక్కడినుంచి కారులో ఈ టౌన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న ఓ చిన్న రైల్వేస్టేషన్ కి చేరుకుంటాం. రెండు గంటలకు ప్యాసెంజరు రైలు వస్తుంది. అందులో ఎక్కి యీ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోతాం."        

 Previous Page Next Page