తాము పధకం ప్రకారం పారిపోయామని వార్డర్లు భ్రమపడాలనే తిలక్ అలా మాట్లాడుతున్నాడని బుద్ధుడు గ్రహించాడు. తమ బాస్ అప్పుడే ప్లాన్ ను అమలు చేస్తున్నాడని తెలిసి చిన్నగా నవ్వుతూ పైకి లేచాడు.
అంతలో వార్డర్లు వచ్చి తలుపులు తెరిచారు.
ఖైదీలంతా బోనులోంచి తప్పించుకున్న జింకపిల్లల్లా బయటికి ఉరికారు.
వాళ్ళు ముగ్గురూ వెళ్ళేసరికి టాయ్ లెట్ గదులు దగ్గర ఖైదీలు చిన్నపాటి యుద్ధాలు చేసుకుంటున్నారు. నాలుగువందలమంది ఖైదీలకు అవి చాలవు. అందుకే ఉదయంపూట అక్కడ విపరీతమయిన రద్దీ వుంటుంది.
ముగ్గురూ దూరంగా నిలబడ్డారు. తిలక్ కావాలనే వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నట్టు మామూలు విషయాలే చిన్నగా చెబుతున్నాడు.
అక్కడినుంచి వచ్చేసరికి మరో గంటయింది, ముగ్గురూ టిఫిన్ పు ముగించుకుని పనిలో పడ్డారు.
తిలక్ కి తన ప్లాన్ అంతా సవ్యంగానే జరుగుతుందన్న భరోసా వుంది.
కానీ ఎక్కడో లాలస మీద చిన్నపాటి అనుమానం కూడా కలుగుతోంది.
రాత్రి ఒంటిగంటకు ఆమె ప్రహారీగోడకు తాడు దించాల్సి వుంది. తాడు వుంటే వార్డరు రాకముందే సులభంగా అవతలికి దాటుకోవచ్చు. ఇక జెయిల్ దాటాకా కారులో అయితే సందులూ, గొందుల్లో డౌన్ ని ఈజీగా దాటుకుని, రైల్వేస్టేషన్ చేరుకోవచ్చు. కాలినడకన వెళ్లడం డేంజర్. మరి ఈ పనులన్నీ జరగాలంటే రాత్రి ఒంటిగంటకు లాలస రెడీగా ప్రహారీగోడ దగ్గర వుండాలి. కానీ వుంటుందా?
ఇంతవరకు పరిచయం లేని అమ్మాయి రిస్క్ తీసుకుంటుందా? తమకోసం ఇంత సాహసానికి పూనుకుంటుందా? ప్లాన్ ఎక్కడ బెడిసికొట్టినా ఆమె కూడా జెయిల్ ఊచలు లెక్కపెట్టాల్సిందే. కాని ఆమె తగులుకోకుండా తన ప్లాన్ చేశాడు. ఇంతకి లాలస ఎవరు?
అతను రకరకాలుగా ఆమె గురించి ఊహిస్తున్నాడు. ఒకసారయితే లాలస రాయుడి మనిషేనని, తనను పారిపోయేందుకు పురికొల్పి కక్షను పెంచడానికి నాటకమాడుతూ వుండవచ్చన్న డౌట్ కూడా వచ్చింది అయితే ఆమె రూపం ఓసారి కళ్ళముందు మెదిలి అదంతా తన భ్రమేనని కొట్టిపారేశాడు.
బుద్ధుడు, ఉత్తరుడు కూడా తమ ప్లాన్ సక్సెస్ అవుతుందో కాదోనని బేరీజు వేసుకుంటున్నారు.
ఈలోగా మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాయి.
తిరిగి కాసేపు విశ్రాంతి తరువాత పనులు మొదలుపెట్టారు.
క్షణాలు తేలుకోండిలాగా నిలబడి కాటువేస్తున్నట్టు కాలం బరువుగా జరుగుతోంది. గాలి వడదెబ్బతో ఎక్కడో సోలిపోయినట్టు వుక్క వుక్కగా వుంది. ముగ్గురికీ.
సూర్యుడు పడమటి దిక్కువేపు కదులుతున్నాడు.
వాళ్ళల్లో టెన్షన్ రక్తాన్ని వేగంగా పరుగులిత్తుస్తోంది.
సూర్యుడి పొజిషన్ బట్టి టైమ్ నాలుగయిందని గ్రహించాడు తిలక్. మిత్రులవేపు చూసి కన్నుగీటాడు.
నిప్పుల దారిలోంచి పచ్చిక మైదానాల్లోకి వెళుతున్నట్టు వాళ్ళు ముగ్గురూ అడుగులేస్తున్నారు.
తిలక్ ముందుగా టాయ్ లెట్ గదులవేపు వెళ్ళాడు. మరో పదినిమిషాలకు బుద్ధుడు, ఉత్తరుడు అతన్ని చేరుకున్నారు.
మిగిలిన ఖైదీలు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నలుగురు వార్డర్లు కిచెన్ లో చేరి కాఫీ తాగుతున్నారు.
టాయ్ లెట్ దగ్గర ఎప్పుడూ ఒకరో ఇద్దరు ఖైదీలు తచ్చాడుతుండటం మామూలే గనుక వాళ్ళను చూసిన వాళ్ళకి ఎవరికీ అనుమానం కలుగలేదు.
టాయ్ లెట్ గదులను దాటి న్యూజెయిల్ కూ, ప్రహరీగోడకు మధ్య నున్న సందులోకి మలుపు తిరిగాడు తిలక్. మిగిలిన ఇద్దరూ అతని వెనకే నడుస్తున్నారు.
తలలు ముడుచుకుని పడుకున్న పూలపూల కోడిపిల్లల్లాగా క్రోటన్ లు నిశ్చలంగా వున్నాయి.
సందు చివరికంటావచ్చి న్యూజెయిల్ మెట్ల దగ్గర ఓ క్షణం ఆగారు. అక్కడినించి మెట్లెక్కి వెళితే టెర్రస్ చేరుకోవచ్చు.
ఆ సమయంలో ఖైదీలంతా తోటలో వుంటారు గనుక జెయిల్ వరండాల్లో వార్డర్లు ఎవరూ వుండరు. అందుకే తిలక్ నిర్భయంగా మెట్లెక్కుతున్నాడు.
తమకు కాస్తంతపైన మెట్లమీద కూర్చుని ఎవరో మాట్లాడుకుంటున్నారు.మాటలు విన్పిస్తున్నాయి తప్ప మనుషులు కనపడటం లేదు.
వూహించని ఈ పరిణామానికి అతను ఖంగు తిన్నాడు. త్వరలో తాము టెర్రస్ చేరుకోకపోతే జరిగే నష్టాన్ని గురించి ఆలోచించాడు. ఎలాగయినా మరో పదినిముషాల్లో తాము ఏ ఖైదీ కంటపడకుండా చేరుకోవాలన్న ఆరాటం మొదలయింది అతనిలో. కానీ ముందుకు సాగడానికి వీలులేకుండా మెట్లమీద ఎవరో వున్నారు.
బుద్ధుడు, ఉత్తరుడు కూడా ఆందోళనతో అతనివైపు చూశారు. అక్కడ మాట్లాడడం మంచిదికాదని అతను తిరిగి కిందకు దిగాడు. సందులో నిలబడ్డాడు.
బుద్ధుడు, ఉత్తరుడు రాగానే "మెట్లమీద ఎవరో వున్నట్టున్నారు" అన్నాడు. ఏం చేయాలా అన్న ఆలోచనతో అతని భృకుటి ముడిపడింది.
"మాటలు మీకూ విన్పించాయి. నా అనుమానం నిజమైతే మెట్లమీద వున్నవారు వార్డర్ నారాయణ, ఖైదీ వెంకూ" అని చెప్పాడు బుద్ధుడు మెల్లగా.
"వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు?" తిలక్ వెంటనే అడిగాడు.
"నారాయణ హోమోసెక్సువల్. తనకు అవసరమైనప్పుడు ఓ ఖైదీని వాడుకుంటూ వుంటాడు. ఇంతకుముందు నారాయణ వెంకూతో ఏవో గుసగుసలు ఆడుకుండడం చూశాను."
ఆ సమాచారం కరక్టేననిపించింది తిలక్ కి.
అయోమయంగా చూస్తున్న ఉత్తరుడు అడిగాడు "యిప్పుడెలాగా?"
తిలక్ ఓ నిముషం మౌనంగా వుండి "వాళ్ళిద్దరూ అక్కడినుండి లేచేవరకు వెయిట్ చేయడమే. అయితే ఇక్కడ వుండడం ప్రమాదం. మరో పావుగంట వరకు టాయ్ లెట్ గదుల్లో వుండి ఆ తరువాత వస్తాం. అప్పటికి వాళ్ళు అక్కడినుంచి లేవకుంటే మొత్తం ప్లాన్ అంతా అప్ సెట్ అవుతుంది" అన్నాడు.
ముగ్గురూ తిరిగి టాయ్ లెట్ గదుల దగ్గరికి వచ్చారు.
తిలక్ మధ్యలోనున్న ఓ గదితలుపు తెరిచి అందులో దూరాడు. బుద్ధుడు, ఉత్తరుడు చెరో గదిలోకి వెళ్ళబోతుంటే వద్దన్నట్టు తన గదిలోకి రమ్మన్నట్టు సైగ చేశాడు.
వాళ్ళు కూడా వచ్చాక తలుపుబోల్టు వేశాడు.
లోపల దుర్వాసన ముక్కును రెండుగా చీలుస్తోంది. చాలా చిన్న గది కవటం వల్ల ఒకరికొకరు ఒరుసుకుంటూ నిలబడ్డాడు.
సముద్రంలో దారితప్పి వాళ్ళు ప్రాణం నిలబడడానికి పచ్చిచేపలు తిన్నారంటే మనం ఆశ్చర్యపోతాం. అడవిలో చిక్కుకుపోయినవాళ్ళూ ఆకులూ, అలములూ తిన్నారంటే ఒక పట్టాన నమ్మం. కానీ అంతకంటే గత్యంతరం లేనప్పుడు మనిషి ఇంతకంటే హీనంగా ప్రవర్తించాడని మనసు చరిత్రలో అనేకం దృష్టాంతరాలున్నాయి. ప్రాణం, స్వేచ్ఛ చాలా ముఖ్యం మనిషికి. ఈ రెండింటి కోసం మనం ఏ ప్రమాదంలోకైనా వెనకా ముందూ చూడకుండా దూకేస్తాం.