Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 18


    "వద్దు....ప్లీజ్....వద్దు" అంటోంది ఆ అమ్మాయి. నిస్సహాయంగా ఆమె కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి.

    హాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి బయటికి తీశాడు కానిస్టేబుల్. అక్కడ క్షణాలలో ట్రాఫిక్ వేగం తగ్గింది. కొంతమంది కార్లలోనుంచి, లారీలలో నుంచి, స్కూటర్లమీద నుంచి కుతూహలంగా వస్తున్నారు. కొంతమంది అక్కడ గుంపుగా గుమికూడారు.

    ఆ అమ్మాయి హ్యాండ్ బాగ్ లో వున్న వస్తువులు ఒక్కొక్కటీ తీసి ఏ.సి.పి.కి చూపించి, మళ్ళీ లోపల పెట్టేస్తున్నాడు పోలీసు కానిస్టేబుల్.

    ఒక బాల్ పాయింట్ పెన్ను, చిన్న దువ్వెన, చిన్న అడ్డం, లేడీస్ హాంకీ, టిఫిన్ బాక్స్, ఐదు రూపాయల నోటు, కొంత చిల్లర.

    వేళ్ళ కొసలతో పట్టుకుని ఇంకొకటి బయటికి తీశాడు కానిస్టేబుల్. దూదిలాగా ఉంది చుట్టచుట్టిన దూది. దానిపైన సన్నటి నెట్ లాంటి గాజ్ క్లాత్.

    చౌకరకం శానిటరీ నేప్ కిన్ అది.

    ఇంకేదో బయటపడుతుందని ఆత్రంగా ఎదురుచూస్తున్న జనంలో నుంచి నవ్వులు! అంతమంది మొగవాళ్ళ ముందు తన మానం పోయినట్లయ్యింది ఆ అమ్మాయికి. అందరి ముందూ తనని వివస్త్రని చేసినంత అవమానం కలిగింది. వెక్కిళ్ళు పెట్టడం మొదలెట్టింది.

    చూస్తున్న ఏ.సి.పి. గుండె నీరయిపోయినట్లయింది. గిల్టీగా ఫీలౌతూ అన్నాడు అతను. అతనింకా కొత్త సున్నితమైన విషయాలకు స్పందించడం అతనింకా మర్చిపోలేదు. తడుముకుంటున్నట్లు అన్నాడు-

    "ఐ....అయామ్ సారీ మిస్...." అతనలా అనగానే ఇంకా పెద్దగా ఏడ్చేయడం మొదలెట్టింది ఆ అమ్మాయి.

    ఏం చేయాలో తోచలేదు ఆ యంగ్ అసిస్టెంట్ కమీషనర్ కి. జనం మీద విరుచుకుపడి అందరినీ తరిమేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఊరడించటానికి బలహీనమైన ప్రయత్నం చేస్తూ అన్నాడు_

    "నేను....నా....ఐమీన్ చూడండి మిస్! పొరబాట్లు అందరివల్లా జరుగుతూనే ఉంటాయి. నావలన దారుణమైన పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకుంటున్నాను. మిస్టేకెన్ ఐడెంటిటీ. ఎవరో ఒకమ్మాయి డ్రగ్స్ చేరేస్తోందని ఇన్ఫర్మేషన్ అందింది మాకు. అది మీరే అని భ్రమపడ్డాం. ఐయామ్ సారీ ఎగెయిన్!"

    వెక్కిళ్ళని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ, ఇంక కాలేజీలోకి వెళ్ళాలనే ఆలోచన మానేసి వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి.

    ఏ.సి.పి. అన్నాడు_ "మిస్! మీకు అభ్యంతరం లేకపోతే మావాళ్ళు మిమ్మల్ని మీరెక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడ డ్రాప్ చేస్తారు మా వెహికల్ లో."

    వద్దన్నట్లు తలాడించి ఇంకో రెండడుగులు నడిచింది ఆ అమ్మాయి.

    నొచ్చుకుంటూ అన్నాడు ఏ.సి.పి-

    "సారీ వన్సెగెయిన్ మిస్! మా డిపార్టుమెంట్ వల్ల మీకు యింకెప్పుడూ ఏ విధమైన ఇబ్బందీ కలగదని హామీ యిస్తున్నాను. దిసీజ్ ఏ ప్రామిస్!" అని అభివాదం చేసి జీపు ఎక్కాడు. పోలీసు జీపు కదిలింది.

    అదంతా వెయ్యికళ్ళతో గమనిస్తున్న దుర్గేష్ బ్రెయిన్ లో ఒక్కసారిగా ఫ్లాష్ వెలిగినట్లయ్యింది. జిప్సీ స్టార్ట్ చేసి ఆ అమ్మాయి ప్రక్కన వచ్చి సడన్ బ్రేకుతో ఆపాడు.

    దుర్గేష్ జిప్సీ తనని రాసుకున్నంత రాష్ గా వచ్చి ఆగడంతో ఉలికిపడింది ఆ అమ్మాయి.

    జిప్సీలో ఉన్న దుర్గేష్ "జెన్నీ" అన్నాడు వెనుకసీటువైపు చూస్తూ. జెన్నీ లేచింది. ఆ అమ్మాయి అసలు పేరు జానకి. దుర్గేష్ త్వరత్వరగా ఏదో చెప్పాడు. అర్ధం చేసుకున్నట్లు తలూపి, చటుక్కున కిందికి దిగింది జెన్నీ. రోడ్డుమీద ఉన్న ఆ అమ్మాయి పక్కన నిలబడి "జీపెక్కు" అంది కఠినంగా.

    భయభ్రాంతురాలై పోయింది ఆ అమ్మాయి.

    "ఎందుకు?" అంది గొంతు తడారిపోతూ ఉండగా.

    "అధిక ప్రసంగం వద్దు ఎక్కు" అంది జెన్నీ.

    "నేను...." అని ఏదో అనబోయింది ఆ అమ్మాయి.

    జెన్నీ అరచేతిలో ఇమిడిపోయి ఉన్న అతి చిన్న లేడీస్ రివాల్వర్ చల్లగా ఆ అమ్మాయి నడుముని తాకింది.

    "మాట వినకపోతే షూట్ చేసేస్తాను. జీపెక్కు" అంది జెన్నీ.

    గత్యంతరం లేక జీపు ఎక్కింది ఆ అమ్మాయి.

    ఆమెని ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు గుర్గేష్.

    "నీ పేరేమిటి?" అన్నాడు.

    "గాయత్రి!" అంది ఆ అమ్మాయి వణుకుతున్న గొంతుతో.

    "నువ్వు డ్రగ్స్ స్మగుల్ చేస్తావు కదూ?"

    "నేనా? అయ్యో! నేను అలాంటిదాన్ని...."

    "ఇంతవరకూ చెయ్యకపోయినా ఇకముందు చేస్తావు" అన్నాడు దుర్గేష్ నింపాదిగా.

    భయంతో స్పృహతప్పిపోతున్నట్లు వుంది ఆ అమ్మాయి గాయత్రికి.

    "అంటే....?" అంది అసందిగ్ధంగా.

    నవ్వాడు దుర్గేష్.

    "నీ అదృష్టమో, దురదృష్టమోగానీ ఆ కొత్త ఏ.సీ.పీ. దృష్టి నీ మీద పడింది. నువ్వే డ్రగ్స్ కేరీ చేస్తుంటావని దురభిప్రాయపడ్డాడు అతను. నిన్ను చెక్ చేశాడు. నీ దగ్గర డ్రగ్స్ లేవు. ఆడాళ్ళు ఆ మూడ్రోజులూ వుపయోగించే శానిటరీ నేప్ కిన్స్ తప్ప. అతను అపార్ధం చేసుకున్నందుకు అపాలజీ చెప్పి నిన్ను వదిలేశాడు. ఇంక నీ మీద అతనికి అనుమానం వుండదు. అది మాకు ఉపయోగపడుతుంది. నిజానికి డ్రగ్స్ తీసుకొస్తోంది ఈ జెన్నీ. నువ్వు పోలీసుల దృష్టిలో చాలా ఇన్నోసెంట్ అని అనిపించుకొన్నావు. కాబట్టి ఇకనుంచి జెన్నీ బదులు నీతోనే చేరవేయిస్తాం డ్రగ్స్- చాలా సేఫ్!"

    షాకయిపోయింది గాయత్రి. నోటెంబడి మాటరానట్లు చాలాసేపు అలాగే వుండిపోయి, తర్వాత....

    "ఇది అన్యాయం!" అంది గొంతు పెగుల్చుకుని.

    "నా దృష్టిలో అన్నీ న్యాయమే" అన్నాడు దుర్గేష్ తేలిగ్గా.

    తెల్లకాగితం లాగా పాలిపోయిన మొహంతో అతని వేపూ, జెన్నీ వేపూ భయం భయంగా చూసింది గాయత్రి.

    అప్పుడు హఠాత్తుగా ఆమెకి గుర్తొచ్చాడు ఒక వ్యక్తి.

    తన పాలిత ఆర్తత్రాణ పరాయణుడు.

    అఖిల్!

    అఖిల్ పేరు తలుచుకోగానే ఆమె మొహంలోకి రంగు తిరిగి వచ్చింది. అఖిల్ పేరు చెబితే వీళ్ళు అదిరిపోతారు. అతను గ్యాంగ్ స్టర్ మరిడేశ్వరరావు కొడుకు! అవును!!

    ధైర్యంగా అంది గాయత్రి.

    "అఖిల్ తెలుసా మీకు? మరిడేశ్వరరావు కొడుకు."

    నిశ్చలంగా ఆమె వేపు చూశాడు దుర్గేష్.

    "అఖిల్ నీకు తెలుసా?" అన్నాడు.

    "తెలుసు."

    "ఎట్లా తెలుసు?"

    "అతను నన్ను చదివిస్తున్నాడు."

    "ఇల్లొదిలి పారిపోయాడుగా! వాడి దగ్గర డబ్బెక్కడిదీ?" అన్నాడు అతను చులకనగా.

    "అది నాకు తెలీదు. తనే సంపాదిస్తున్నాడేమో! లేకపోతే అప్పు చేస్తాడేమో" అంది గాయత్రి.

    "అప్పు చేసి మరీ నిన్ను చదివించాల్సినంత అవసరం ఆడికేమిటి?"

    "నన్నే కాదు. ఇంకా నలుగుర్ని కూడా చదివిస్తున్నాడు."

    "అందరూ ఆడోళ్ళేనా?" అతని గొంతులో వ్యంగ్యం.

    "ముగ్గురు మొగపిల్లలు కూడా వున్నారు. మా అందరికీ అఖిల్ గార్డియన్ లాంటివాడు" అంది గాయత్రి పదునుగా.

    "గార్డియనా గాడిద గుడ్డా! రంగేళీ రాజా అని చెప్పరాదూ?"

    చివుక్కున తలెత్తి తీవ్రంగా చూసింది గాయత్రి.

    ఆమె కోపం చూసి హేళనగా నవ్వాడు దుర్గేష్.

    "అఖిల్ వస్తాడు. వచ్చాక మీ పని పడతాడు" అంది గాయత్రి నిశ్చయంగా.

    ఆమె అలా అనగానే, తక్షణం దుర్గేష్ మొహంలో భావం మారింది. పెదిమలు పళ్ళపైకి లాగి పిచ్చికుక్కలా భీకరంగా చూశాడు.

    "అఖిల్ గాడి పేరు చెప్పకపోతే కొంతలో కొంతన్నా దయచూపించే వాడిని నీ మీద. వాడి పేరు చెప్పి నీ బతుకులో నువ్వే నిప్పులు పోసుకున్నావ్" అని జెన్నీ వేపు తిరిగాడు అతను.

    "ఆ డ్రగ్స్ దీనికివ్వు!" అన్నాడు.

    గాయత్రి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అందుకుంది జెన్నీ. బ్యాగ్ ఓపెన్ చేసి, అందులోని శానిటరీ నేప్ కిన్స్ తీసింది. తన బ్యాగులో నుంచి చిన్న కత్తెర తీసి, నేప్ కిన్స్ ని నాజూగ్గా చీల్చి, తన బ్యాగులోని డ్రగ్స్ పాకెట్స్ ని ఆ నాప్ కిన్స్ లో జొనిపింది. తన బ్యాగులో నుంచి సూదీ దారం తీసి, టకటక కుట్లు వేసి, నాప్ కిన్స్ ని యధాప్రకారం మూసేసింది. నాప్ కిన్స్ ని గాయత్రి హ్యాండ్ బ్యాగులో పెట్టి తిరిగి ఆమెకి ఇచ్చేసింది.

    అప్పుడన్నాడు దుర్గేష్-

    "ఇక్కడే ఎక్కడో కాపువేసి ఉంటాడు ఆ కొత్త ఏ.సీ.పీ. నువ్వు నంగనాచిలా నెమ్మదిగా వెళ్ళిపో! అతను నిన్నేమీ అనుమానించడు. నువ్వు పోలీసులని దాటిన తర్వాత మేం వచ్చి డ్రగ్స్ కలెక్ట్ చేసుకుంటాం నీ దగ్గర్నుంచి."

    "ఇదంతా అఖిల్ కి తెలిస్తే మిమ్మల్ని వదలడు" అంది ఆ అమ్మాయి, అఖిల్ మీద అపారమైన నమ్మకం ఉన్నదానిలాగా.

    కర్కశంగా అన్నాడు "నువ్వు గనక నేను చెప్పినట్లు చెయ్యకపోతే....వాడు వచ్చేలోపలే మీ అమ్మనీ, నాన్ననీ చంపిపారేస్తా! అర్ధమయ్యిందా?"

    ఆ మాట వినగానే గుండె ఆగిపోయినట్లయ్యింది గాయత్రికి.

    "వద్దు! ప్లీజ్! వద్దు! అంతపని చెయ్యొద్దు." అంది ప్రాధేయపూర్వకంగా.

    "అయితే నేను చెప్పినట్లు చెయ్! కదులు!" అన్నాడు దుర్గేష్.

 Previous Page Next Page