వింటున్న సుధ, వెయ్యి కుక్కలు వున్న ఇల్లు ఎలా వుంటుందో ఊహించుకోలేకపోయింది. ఇల్లు కాదు....నవాబుగారి దేవిడీ కాబట్టి సరిపోయి వుండాలి. లేకపోతేనా?!
అయినా కాకపోయినా....
వెయ్యి కుక్కలే! అమ్మో....
చిత్రంగా నవాబుగారి వైపు చూసింది సుధ.
కళ్ళు మూసుకుని కూర్చొని ఉన్నాడాయన. పెద్దవాడయిపోయినా పేరులో కాస్త వికారమున్న ఈ వికారుద్దీన్ జంగ్ గారు చాలా అందగాడే!
హైదరాబాద్ చేరేదాకా ఆయన ఆరోగ్యాన్ని కనిపెట్టుకు వుండే బాధ్యత తన మీద పడింది.
రోగులకు సేవ చెయ్యడం తనకెప్పుడూ యిష్టమే!
కానీ ఈ అఖిల్ కూడా తమ వెంటే వస్తాడా?
ఆ లెఖ్కన తను హైదరాబాద్ చేరేసరికి అలర్జీ పెరిగిపోయి, తనకి ఒళ్ళంతా దద్దుర్లు తేలిపోవడమో, మొహం ఉబ్బిపోవడమో, తను ఊపిరాడక చచ్చిపోవడమో....ఇంకేదేదో జరగక తప్పదు.
అంతటి అసహ్యం అతనంటే.
అయినా తప్పేటట్లు లేదు.
తను డాక్టరు! రోగి ప్రాణం తనకి ముఖ్యం.
తన సౌఖ్యం కాదు.
* * * *
ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్లో అఖిల్, సుధా ఒకరి సమక్షంలో ఒకరు అలా యిబ్బందిపడిపోతూ వుండగా....
అంతకు కొన్ని గంటల ముందు....
హైదరాబాద్ లో....
డాక్టర్ సుధ తండ్రి దుర్గేష్ తన జిప్సీ జీపులో అతివేగంగా, రాష్ గా వచ్చి ఒక స్కూల్ గేట్లోకి జిప్సీని పోనిచ్చాడు.
గేటుదగ్గర ఉన్న గూర్కా అతన్ని ఆపటంమాట అటుంచి తను ఆ జీపు క్రింద పడకుండా బతికి బయటపడ్డందుకు సంతోషించవలసి వచ్చింది.
దుర్గేష్ జిప్సీ అదే రాష్ నెస్ తో ముందుకు పోయింది. స్కూలు ప్లే గ్రౌండ్ దగ్గర ఆగింది.
అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ప్రక్కనే వాళ్ళ 'కోచ్' నిలబడి కుర్రాళ్ళ ఆటను కనిపెట్టి చూస్తున్నాడు.
దుర్గేష్ ని చూడగానే, ఆడకుండా ప్రక్కనే నిలబడి ఉన్న ఒక కుర్రాడు గబగబా దగ్గరికి వచ్చాడు.
ఆ కుర్రాడికి పదమూడేళ్ళుంటాయి. అతనిలో దుర్గేష్ పోలికలు స్పష్టంగా కనబడుతున్నాయి.
"డాడీ!" అన్నాడు కుర్రాడు.
"ఏడ్రావాడు?" అన్నాడు దుర్గేష్ అసహనంగా.
ఆ కుర్రాడు అక్కడే ఉన్న కోచ్ ను చూపించాడు.
కోచ్ ని దగ్గరికి రమ్మని సైగ చేశాడు దుర్గేష్.
సందేహంగా దగ్గరికి వచ్చాడు కోచ్.
పిల్లలందరూ ఆట మానేసి గుంపుగా పోగయి, జరుగుతున్నదానిని చిత్రంగా చూస్తున్నారు.
"నువ్వేనా సాల్మన్?" అన్నాడతను.
"అవును...."
"మా రాకేష్ ని క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ చేయకుండా డ్రాప్ చేసింది నువ్వేనా?"
కోచ్ నిస్సహాతని చేతులు ముందుకు జాచి, భుజాలు ఎగరేశాడు. ఇంగ్లీషు పిక్చర్స్ చూసి అలవాటు చేసుకున్నాడు అతనా అభినయం.
"లుక్! రాజేష్ కి ఆడాలనే కుతూహలం అయితే ఉంది. కానీ అతనికి బ్యాటు సరిగ్గా పట్టుకోవటం కూడా రాదు. బౌలింగ్ చేస్తే బాలు స్టంప్స్ కి నాలుగు గజాల అవతల పడుతుంది. అందించినట్లున్న క్యాచ్ కూడా పట్టుకోలేడు. ఫీల్డింగ్ హారిబుల్. సారీ! అతను క్రికెట్ కి పనికిరాడు."
"ఇంతకంటే పనికిరాని ఫాల్తూగాళ్ళు కూడా కొంతమంది పాలిటిక్స్ ప్లే చేసి టెస్టు మ్యాచెస్ లో ఆడట్లేదూ? వన్ డే వరల్డ్ కప్ కోసం ఆడట్లేదూ? దేఖో....మా రాకేష్ టీమ్ లో వుండాలి. వేరే మాట లేదు. అర్ధమైందా?"
"సారీ! అది జరగని...." అనబోయాడు కోచ్ సాల్మన్.
మెరుపువేగంతో చెయ్యి ముందుకు జాచి, సాల్మన్ ఎడమ చేతిని అందుకున్నాడు అతను. సాల్మన్ లెఫ్ట్ హాండరు. అతను ఎడమ చేత్తోనే బాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తాడు.
క్షణంలో సాల్మన్ ఎడమ చేతిని ఫట్ మని మణికట్టు దగ్గర విరక్కొట్టాడు.
"గాడ్!" అని మైదానం అంతా వినిపించేటంత పెద్దగా కేకపెట్టాడు సాల్మన్. బాధ భరించలేక కిందపడి "గాడ్! ఓ గాడ్! ఓ గాడ్!" అని విలవిల్లాడుతూ దొర్లటం మొదలుపెట్టాడు.
చటుక్కున వంగి, సాల్మన్ రెండో చేతిని అందుకున్నాడు అతను.
"మా రాకేష్ క్రికెట్ టీమ్ లో ఆడుతున్నాడు. అర్ధమయ్యిందా? లేకపోతే...." అని సాల్మన్ రెండో చేతిని మణికట్టు దగ్గర కొంచెం వంచాడు అతను.
భయంకరమైన ఆర్తనాదం వెలువడింది సాల్మన్ గొంతులో నుంచి.
"గుర్తుంచుకో...." అని లేచి నిలబడ్డాడు అతను.
తక్షణం స్పృహ తప్పింది సాల్మన్ కి.
చుట్టూ చేరిన కుర్రాళ్ళంతా తమ కోచ్ మీద జరిగిపోయిన దారుణాన్ని చూస్తూ నిశ్చేష్టులై నిలబడిపోయారు.
"మా నాన్న ప్రతాపం చూశారా?" అన్నట్లు అందరివేపూ గర్వంగా చూస్తున్నాడు రాకేష్.
రాకేష్ భుజం తట్టాడు అతను.
"బాగా ఆడుకో బేటా" అని వెళ్ళి జిప్సీ స్టార్ట్ చేశాడు.
జిప్సీ కొంత దూరం వెళ్ళీ వెళ్ళక ముందే వాతావరణంలో ఏదో మార్పు కనబడింది దుర్గేష్ కి. పరిసరాల్లో, పరిస్థితుల్లో ఏమాత్ర మార్పు వచ్చినా అతనికి తక్షణం తెలిసిపోతుంది. అలర్టుగా అయిపోతాడతను.
ఇప్పుడూ అలాగే జరిగింది.
జిప్సీ స్పీడు తగ్గించాడు దుర్గేష్.
నెమ్మదిగా జారుతున్నట్లు జిప్సీ ముందుకు వెళ్ళిపోతుండగా రెండు కళ్ళనీ వెయ్యికళ్ళుగా చేసుకుని పరిసరాలని గమనించాడు.
తన ఊహ కరెక్టే! ఈ ఏరియాలో కొత్తగా పోలీస్ ప్రెజెన్స్!
ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీసు జీపు ఒక ఇంటి కాంపౌండ్ దగ్గర ఆగి వుంది. కాపు వేసినట్లు జీపు దగ్గర నిలబడి ఉన్నాడు ఏ.సి.పి. కొత్తగా ఐ.పి.ఎస్. అయి పోలీస్ ఫోర్స్ లో చేరినట్లున్నాడు. ఉడుకురక్తం అతను నిలబడిన తీరులోనే కనబడిపోతుంది.
ఎవరికోసం కాపు వేశాడు ఇతను? తన కోసమా? అంత ధైర్యమా? ధైర్యం కాకపోవచ్చు! కానీ మూర్కత్వం ఉండొచ్చుగా?
పోలీస్ జీపుని దాటింది దుర్గేష్ జిప్సీ. జిప్సీని ఎవరూ ఆపలేరు. అంటే తన కోసం కాదన్నమాట! మరి.... జిప్సీని ఇంకొంతదూరం పోనిచ్చి ఒక పాన్ షాపుముందు ఆపాడు దుర్గేష్.
దుర్గేష్ ని చూడగానే పాన్ షాప్ వాలా లేచి నిలబడి నమస్కారం పెట్టి, తన వినయవిధేయతలు ప్రదర్శించాడు.
"పాన్ ఎట్ల కావాలే అన్నా"
చెప్పాడు దుర్గేష్.
"పాన్ కట్టించాడు షాపతను. ఇంకో పాన్ ప్యాక్ చేసి యిచ్చాడు. ఖరీదయిన ఇండియా కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. డబ్బులు తీసుకోలేదు. భక్తిగా నమస్కారం పెట్టాడు.
మెకానికల్ గా రెండో పాన్ నీ, సిగరెట్ ప్యాకెట్ నీ సఫారీ సూట్ జేబులో వేసుకున్నాడు దుర్గేష్. అతని చూపులు మాత్రం ఏ.సి.పి. జీపుపై ఉన్నాయి.
"ఏందిరా? ఏం జరుగుతుంది అక్కడ?" అన్నాడు నెమ్మదిగా.
షాపతను అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి చెప్పాడు_
"డ్రగ్స్ అమ్మకం జోరుగా సాగుతోందని తెలిసిందట. కొత్త ఏ.సి.పి.కి రెయిడ్ చేయటానికి వచ్చాడు" నెమ్మదిగా తల పంకించాడు దుర్గేష్. అప్పుడు జరిగిందొక అనూహ్యమైన సంఘటన!
ఒకమ్మాయి ఆటోలో వచ్చి అక్కడ దిగింది. పంతొమ్మిదేళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. నాజూగ్గా ఉంది. కళగా ఉంది మొహం. మధ్య తరగతి కుటుంబం అని చూసీ చూడగానే తెలిసిపోతోంది.
ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి, ఎదురుగా ఉన్న కాలేజీలోకి వెళ్ళబోయింది ఆ అమ్మాయి.
క్షణంలో ఆమెని చేరుకున్నాడు. ఏ.సి.పి. అడ్డంగా నిలబడ్డాడు.
"ఆగు!"
అతని పోలీస్ యూనిఫారం చూడగానే అదిరిపడి, ఆగిపోయింది ఆ అమ్మాయి.
"హెరాయిన్ సప్లయ్ చేసే హీరోయిన్ వి నువ్వే కదూ?" అన్నాడు ఏ.సి.పి.
"ఏమిటీ?" అంది ఆ అమ్మాయి అర్ధం కానట్లు.
"డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటావ్ కదూ నువ్వు?"
"నేనా! డ్రగ్సా!" అంది విహ్వలంగా చూస్తూ. ఆమె వళ్ళు వణకడం మొదలెట్టింది.
కఠినంగా అన్నాడు ఏ.సి.పి. "నిన్ను సెర్చ్ చెయ్యాలి. ఆ హేండ్ బ్యాగ్ ఇలా తే!"
అసంకల్పిత ప్రతీకార చర్యలాగా, ఆ బ్యాగ్ ని తన గుండెలకి గట్టిగా అదుముకుంది ఆ అమ్మాయి.
"నిజం చెబుతున్నాను. ఇందులో ఏమీ లేవు" అంది కంపిస్తున్న గొంతుతో.
"నేను చూసి చెప్పాలి ఆ మాట"
"ప్లీజ్...." అంది దీనంగా.
ఏ.సి.పి. కానిస్టేబుల్ కి సైగ చేశాడు. కానిస్టేబుల్ ఆమె దగ్గరనుంచి హాండ్ బ్యాగ్ ని బలవంతంగా లాక్కుని తెరిచాడు.