Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 19


    నిస్సహాయంగా ఒకసారి అతనివేపు చూసి, ప్రయత్నపూర్వకంగా అక్కడినుంచి ముందుకు కదిలింది గాయత్రి.

    అక్కడికి కొద్ది దూరంలోనే నిలబడి వున్నాడు కొత్త ఏ.సీ.పీ. అతని బలగం కూడా అక్కడికి దగ్గరలోనే మాటువేసి వుంది.

    కొద్ది క్షణాల తర్వాత ఏ.సీ.పీ. నిలబడి వున్న చోటికి వచ్చింది గాయత్రి. ఆమె గుండె చప్పుడు ఆమెకే పెద్దగా వినబడుతోంది. ఇంకొక్క నాలుగు అడుగులు వేస్తే, తను ఈ పోలీస్ ఆఫీసర్ని దాటిపోతుంది. నాలుగే అడుగులు.

    ఒకటి....

    రెండు....

    మూడు....

    "ప్లీజ్ స్టాప్!" అన్నాడు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, గాయత్రి దగ్గరికి వస్తూ.

    అతని గొంతు వినగానే ఒంట్లోని రక్తం గడ్డకట్టినట్లు అయిపోగా, మంచుబొమ్మలా నిలబడిపోయింది గాయత్రి.


                       *    *    *    *


    ఢిల్లీలో అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో....

    నవాబుసాబ్ గారి భార్య తనకీ, డాక్టర్ సుధకీ డ్యూటీలు అప్పగించేసిన తర్వాత, చిరాకునీ ,అసహనాన్నీ అణచుకుంటూ "కాఫీ షాప్" దగ్గరికి వెళ్ళాడు అఖిల్. పాలు లేకుండా ఉత్త డికాక్షనే కప్పులో తీసుకుని, స్ట్రాంగ్ గా వున్న ఆ ద్రవాన్ని సిప్ చెయ్యడం మొదలెట్టాడు.

    తర్వాత తన రూంకి వెళ్ళి, బట్టలు మార్చుకుని ఒక్క కునుకు తీద్దామని ప్రయత్నించాడు.

    నిద్రరాందే!

    నిద్ర రావడం లేదుగానీ జ్ఞాపకాలు మాత్రం తరుముకుని వస్తున్నాయి. ఆ జ్ఞాపకాల్లో నీర్జా....ఆమె అహంభావం! మొగరాయుడిలా ఆమె ప్రవర్తించే తీరూ....తనకి అక్కడ అడుగడుగునా జరిగిన అవమానాలూ, చిత్రహింసలాంటి వర్కింగ్ కండిషన్స్....ఇవే, ఇవే గుర్తురావడం మొదలెట్టాయి.

    తనలో ఒక చిత్రమైన లక్షణం వుంది. అది తనకి తెలుసు. కాదు_కాదు. ఒక లక్షణం కాదు. రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్నాయి తనలో. తను ఒకడు కాడు....ఇద్దరు....నిజం.

    ఈ స్వభావాన్నే సైకాలజీలో స్లిట్స్ పర్సనాలిటీ అంటారేమో!

    తనలో అతి సాధువు, అతి సజ్జనుడూ, అతి మేధావీ, అతి దయార్ద్ర హృదయం కలవాడూ, అతి నిజాయితీ పరుడూ, పరిపూర్ణ మానవత్వానికి ఉదాహరణలాంటివాడూ, గాంధీగారైనా గర్వపడేటటువంటి వ్యక్తిత్వం గలవాడూ అయిన ఒక అఖిల్ వున్నాడు.

    కానీ ఇదే వంట్లో, ఇదే మెదడులో, ఇదే గుండెలో, ఇదే రక్తంలో ఇరుక్కుని బతుకుతూ ఇంకో అఖిల్ కూడా వున్నాడు. అతడు ఒక రాక్షసుడికి రెండో కొడుకు రజోగుణం, తమో గుణం తండ్రి ద్వారా సంక్రమించినవాడు. వంశపారంపర్య లక్షణాలని శాసించే జీన్సు ద్వారా తండ్రి లక్షణాలని తెచ్చుకొన్నవాడు.

    అతనే మరిడేశ్వరరావు కొడుకు! ఆ మనిషి కూడా తనే!

    తను అతి కష్టం మీద అలవర్చుకున్నాడు సంస్కారం. చెడుకి దూరంగా, మంచికి దగ్గరగా బతకాలన్న కోరిక తనకు వినయాన్ని నేర్పింది. వందనాన్ని తన స్వభావంగా మార్చింది.

    కానీ లోకం అలా అర్ధం చేసుకోదుగా!

    వినయం, వందనం, మంచీచెడూ ఆలోచించే సంస్కారం, మర్యాదా, మన్ననా_ఇవన్నీ యిప్పుడు అవుటాఫ్ ఫేషన్! అసమర్ధతకి సంకేతాలు! అవన్నీ అప్రయోజకుడి లక్షణాలు!! అంతే!

    మెత్తగా వున్నవాడిని చూస్తే మొత్తబుద్ధవుతుందిట!

    తను మెత్తగా వుండడానికే ప్రయత్నిస్తాడు ఎప్పుడూ!

    ఫలితంగా తనని ఒక చెత్తగాడిలాగా చూస్తారు అందరూ!

    తను సహిస్తాడు! సహిస్తాడు! సహిస్తాడు!  

    ఒక పాయింట్ దగ్గర తన సహనం బ్రేక్ అయిపోయి, హఠాత్తుగా తిరగబడతాడు.

    ఎట్లా తిరగబడతాడు?

    అట్లా ఇట్లా కాదు!    

    తన తిరుగుబాటు ఎదుటివాడు ఊహించలేనంత తీవ్రంగా వుంటుంది.

    అంతటి దారుణమైన రియాక్షన్ తననుంచి ఊహించని ఎదుటివాళ్ళు బెదిరిపోయి, అన్నాళ్ళ నుంచి తను చూపించిన మంచితనాన్ని అంతా మంటలో కలిపేస్తూ, తనమీద వున్నవీ, లేనివీ కల్పించి అసత్య ప్రచారాలు చేస్తుంటారు.

    అలా చాలాసార్లు జరిగింది.

    ఈ లోకంలో సక్సెస్ కి ఒక ఫార్ములా ఉంది.

    నోటితో నవ్వుతూ వుండాలి. నొసలతో వెక్కిరిస్తూ వుండాలి. మనిషిముందు మర్యాదగా తివాచీ పరచాలి. వాడి వెనగ్గానే గొయ్యి తవ్వాలి. మధ్య మధ్య నిర్దయగా నిష్టూరపు మాటలు అంటూ వుండాలి.

    ఆత్మస్తుతి అలవాటుగా పెట్టుకోవాలి. పరనింద ప్రతిక్షణం పారాయణం చేస్తూ ఉండాలి.

    తిట్టడం_ తిట్టించుకోవడం, మనసులో పెట్టుకోవడం, మనసులో పెట్టుకోనట్లు నటించడం-ఇవన్నీ అలవాటుగా ఉండాలి.

    ఒక్కమాటలో చెప్పాలంటే_

    కపటం! కపటం! కపటం!

    కపటానికి అలవాటు పడితేనే నెగ్గుకొస్తాడు మనిషి.

    తనకి రానివిద్య అదొక్కటే!

    కపటం! కుహనావాదం!

    "ఆనాడీ" సినిమాలోనేనా రాజ్ కపూర్ పాడతాడు?

    "సబ్ కుఛ్ సీఖా హమ్ నే, న సిఖీ హోషియారీ!" అని.

    "అన్నీ నేర్చుకున్నాను నేను, లౌక్యం తప్ప" అని అర్ధం చెప్పుకోవచ్చేమో!

    అచ్చం అలాంటి పరిస్థితే తనది. 

    తను ఉంటే నూటికి నూరుపాళ్ళూ గాంధీగారిలాగా వుండగలడు!

    లేకపోతే గాడ్సే వీడేనేమో అని జనం భయిపడిపోయేటట్లు ప్రవర్తించగలడు కూడా.

    అంతేగానీ మధ్యే మార్గం తనకి తెలియదు.

    గాంధీగారిలాగా తననెందుకు బతకనివ్వదు ఈ లోకం?

    తనే ఒక గ్యాంగ్ స్టర్ లా ఉత్తుత్తిగా భయపెట్టినప్పుడు మాత్రం దాసోహం అంటుంది ఎందుకనీ?

    లోపం తనలో ఉందా?

    అసలు ఈ లోకంలోనే లోపం వుందా?

    ఏమో!

    నీర్జా హోటల్లో కిచెన్ లో పనిచేస్తున్నప్పుడు తను గాంధీగారిలాగానే బతికాడు. శ్రమజీవనం, నిరాడంబరత, సహనం ఎట్ సెట్ రా, ఎట్ సెట్ రా....

    ఫలితంగా అక్కడున్న అందరూ తనని అనాడీని చూసినట్లు చూశారు. రెక్కలిరిగేలా పని చేయించారు. కుక్క బతుకు అంటే ఏమిటో తెలిసేలా చేశారు. రెక్కల కష్టానికి జీతం కూడా ఎగ్గొడదామని చూశారు.

    పేరుకి మాత్రం ఫైవ్ స్టార్ హోటలు!

    ట్రీట్ మెంటేమో టీ బడ్డీ కంటే అధ్వాన్నం.

    నిజం చెప్పాలంటే, ఆ భేల్ పూరీ బండి దగ్గర పని చేస్తున్నప్పుడే తన పని ఇంకా బాగుండేది.

    ఈ సోదంతా ఒక రోజున తను తన డియరెస్టు ఫ్రెండ్ ఉత్తమ్ సింగ్ చెడ్డాతో చెప్పుకొన్నాడు.

    తను చెప్పుకోలేదు. ఉత్తమే కక్కించాడు తన చేత.

    విన్న తర్వాత అన్నాడు ఉత్తమ్_

    "అరె బలె బలె బలే! ఖుడీతో బహుత్ చాలూ దిఖ్ తీ! మహా గడుసుపిండంలా వుంది ఈ పిల్ల! దాని దగ్గర నువ్వెందుకూ పనిచెయ్యడం? వచ్చెయ్ నా దగ్గరికి! ఒక రోటీ, ఇంత చెట్నీ నీతో పంచుకోవడం నాకేం కష్టం కాదు!" అని.

    ఉత్తమ్ అసిస్టెంట్ రాంభరోసే కూడా వచ్చెయ్యమన్నాడు తనని.

    "ఇంతకాలం ఊరికే ఊడిగం చేశాను! కొన్నాళ్ళాగి, నషాళానికంటేటట్లు బుద్ధి చెప్పి, వచ్చేస్తా" అని అప్పటికి వాయిదా వేశాడు తను. తన మానసిక పరిస్థితిని అర్ధం చేసుకుని, తన అశాంతిని దూరం చెయ్యడానికి గానూ జోకుల మీద జోకులు చెప్పడం మొదలెట్టాడు ఉత్తమ్ సింగ్ చెడ్డా.

    "అరె యార్! ఇది విన్నావా?" అని మొదలెట్టి_

    "నాలాంటోడే ఒక సర్దార్జీ వున్నాట్ట! అతను ఓసారి గుర్రప్పందాలకి వెళ్ళాడు. రేసు కోర్టుకి వెళ్ళగానే అతని జేబులోని డబ్బులు జారి మైదానంలో పడిపోయాయి. అతను వంగి, వెదకడం మొదలెట్టాడు.

    ఈలోగా ఒక జాకీ హడావిడిగా వచ్చి, చెంగుమని ఎగిరి అతని వీపుమీద కూర్చుని, 'ఛెల్' మని కమ్చీతో కొట్టి, "ఛల్ ఛల్!" అని అదిలించాడు."

    "అప్పట్నుంచి పాపం సర్దార్జీ అవమానంతో కుమిలిపోతున్నాడు" అన్నాడు ఉత్తమ్ సింగ్.

    "ఎందుకు సాబ్! ఆయన్ని చూసి జాకీ గుర్రం అనుకుని ఎక్కేసి నందుకా?" అన్నాడు రాంభరోసే ఆత్రంగా.

    "కాదు! సర్దార్జీ రేసులో లాస్ట్ ప్లేస్ లో వచ్చాడు అందుకు" అన్నాడు ఉత్తమ్ సింగ్.

    వింటున్న తను విరగబడి నవ్వాడు.

    కానీ రాంభరోసే మాత్రం అనుమానంగా చూసి "అట్లా నిజంగా జరుగుతుందా సాబ్!" అన్నాడు అమాయకంగా.

    రాంభరోసేని కొట్టబోయినట్లు నటించి, తర్వాత యింకో జోకు అందుకున్నాడు ఉత్తమ్ సింగ్.

    "ఒకాయన అమెరికా వెళ్ళొచ్చాడు" వెళ్ళొచ్చినప్పటి నుంచి తన పనులన్నీ తనే సొంతంగా చేసేసుకోవడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఆ అలవాటు ఎంతదాకా పోయిందంటే, ఊరి చివర ఇల్లు కట్టుకోదలిచి, అది కూడా తనే సొంతంగా కట్టేశాడు సర్దార్జీ. అంతా బాగానే కుదిరింది యిల్లు. అయితే ఒకటే పెద్దలోపం."

 Previous Page Next Page