Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 17

    అతని పక్కనే ఉన్నతను వెంటనే అన్నాడు. "తల్లులార! మేము ఎక్కువగ ఆడవారి నుదుటి రాతలు గీతలు గీస్తాం. వారికి విశాల హృదయం ఉండటం....వివేకం, విజ్ఞానం, చదువు సాహిత్యం....అన్ని కళలు, అన్ని పదవులు, అందచందాలు అన్నీ ఉండేటట్టు మము రాస్తూంటే మాపై పని చేసే ఈ వృద్ద జంబూకాలు మగాళ్ళ బుద్దులు కుచించుకు పోయేటట్టుగ వంకరటింకర రాతలు రాత్శున్నారు. ఇది మా తప్పు కాదు ఆ ముసలాళ్ళ తప్పు మీరెలాగు బ్రహ్మగారిని కలుసుకోడానికి వెళుతున్నారు. కాస్త మా గురించి చెప్పి ఆ ముసిలాళ్ళ గురించి కాస్తఘాటుగ చెప్పండి చేతులు వణుకుతు కళ్ళు కానరాక ఎన్నాళ్ళని ఈ రాతలు రాస్తారు. ఆ పదవుల్లోంచి వాళ్ళని పీకి పారేస్తేగాని భూలోక పురుష వాసులు బాగుపడరు ఆ ముసలాళ్ళ రాతలవల్ల మేమేమీ చేయలేక మీ నుదుట గీతల్ని కాస్త వంకరగ రాస్తున్నాం. అందుకే ఈ మధ్యకాలంలో మీ ఆడవాళ్ళకి మా రాతలవల్ల చదువు సాహిత్యాలు పదవులు వస్తున్నాయ్ గాని మగవాళ్ళ వల్ల పడే కష్టాలు మాత్రం తీరటంలేదు. అపనిందలు అవమానాలు తప్పటంలేదు."
   
    "అదన్నమాట అసలు విషయం." ఆడవాళ్ళంతా ఒకళ్ళ చెవి ఒకళ్ళు కొరుక్కున్నారు.
   
    "మీకు మంచి పని కల్పించతానికే మేము ఇక్కడి కొచ్చాం. బ్రహ్మగారితో మాట్లాడి మీ విషయం కూడ చూస్తాం" అని లీడర్ లీలారాణి చెప్పి తన వాళ్ళందరిని తీసుకొని ముందుకు బయల్దేరింది.
   
    వీళ్ళు ఒక్కొక్కళ్ళని చూసుకుంటు ముందుకు సాగారు. పాపం చిన్న రాతగాళ్ళు చెప్పిన మాట నిజమే. పోనుపోను మరీ వయోవృద్దులు. చలికి కొంకర్లు పోయినట్టు చేతులు గజగజ వణుకుతుంటే కళ్ళు సరీగ ఆనక కళ్ళు చిట్లించి తోలుముక్కల వేపు చూస్తు గీతలు గీస్తున్నారు. ఆ గీతలన్నీ పిచ్చివాడి రాతల్లాగ వున్నాయ్.
   
    "అందుకే మన మగవాళ్ళు ఈమధ్య మరీ ఇలా తయారయ్యారు" నీలవేణి అనుకుంది.
   
    వాళ్ళని పలకరించే ప్రయత్నం ఒక్కళ్ళూ చేయలేదు. ముసలాల్లందరు మాత్రం తలలెత్తి చూసి రాతాహాలు ఆపుజేసి వీళ్ళు పలకరిస్తారేమో నని కాస్త ఆశపడ్డారు గాని వాళ్ళకు అణుమాత్రం అవకాశం కూడ ఇవ్వలేదు వాళ్ళు.
   
    వాళ్ళల్లో ఓ ముసలాయనకి నోరు ఊరుకోలేదు "ఏమిటి మీ ఆడంగులంతా ఇలా బయల్దేరి వచ్చారు?" అని అడిగాడు.
   
    "షెప్పే అవసరం మాకు లేదు. మీలాంటివాళ్ళు ఇంకా ఈ పదవులు పట్టుకొని వెళ్ళాడుతూండబట్టే మా రాతలు ఇలా తగలబడి ఏడిచాయ్" సూరంపూడి సూర్యకాంతాదేవి ఆయన మీద ఇంతెత్తున ఎగిరింది.
]   
    "ఏమిటో? ఆ కింద కుర్రాళ్ళ రాతలవల్ల లోకం ఇలా తగలబడిడేడ్చింది. షిషి" అనుకున్నాడు ఆయన.
   
    "ఏమిషో అంతమాయ" అందులో ఒకామె అంది.
   
    ఆమె ఆ మాట అనంగానే ఆడవాళ్ళంతా ఫక్కున నవ్వారు.
   
    అందరు ఆడవాళ్ళు ఒక్కసారి నవ్వేసరికి వృద్ద రాతగాళ్ళకి ఒళ్ళు మండింది. వెంటనే తల వొంచేసుకుని చాదస్తంగ గొణుక్కుంటు ఆడ మగ కాని రాతలు రాయడం మొదలెట్టారు.
   
    భూలోకంలో త్వరలోనే జరగబోయే మార్పుకి అంకురార్పణ ఆ నిముషాన అక్కడ జరిగింది వాళ్ళ కొత్త రాతలవల్ల కాకపోతే వాళ్ళు గీసిన గీతలకు అర్ధాలు వాళ్ళ కెలాగూ తెలియవు కాబట్టి పాపం గ్రహించలేదంతే.
   
    అక్కణ్ణించి అంతా మళ్ళీ బయలుదేరారు.
   
    "ఇంతోటి రాతలు నేను రాయలేనా ఏమిటి?" మహా రచయిత్రి మహాదేవి అంది.
   
    "ఈ రాతలు రాయడానికి నువ్వెందుకు? వంకర టింకరగ గీయడమే కదా? ఒక్కసారి నాకిస్తే గీకి ఏకి పారేస్తాను. ముగ్గులేయటంలో ప్రతి ఏడు ఫస్ట్ ప్రైజు నాకే" ముగ్గుల ముత్యాల సుందరి అంది.
   
    "జిలేబి చుట్టలు చుట్టటంలో, జంతికలు ఆర్ట్ గ నొక్కటంలో నన్ను మించినవాళ్ళు లేరు. సేమ్యాలు చేయటంలో నా చేయే చేయి. ఇంతోటి గీతలు నేనూ గీయగలను." సూరంపూడి సూర్యకాంతాదేవి గీతలు గియ్యటం అనేది ఉప్మా చేసినంత తేలికగ చెప్పేసింది.
   
    అందరూ నవ్వుతూ తుళ్ళుతూ మాటాడుకుంటు అలా అలా నడిచి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు.
   
    అప్పుడే కాస్త విశ్రాంతిగ నడుం వాల్చిన బ్రహ్మదేముడు ఆడవారి నందరిని చూసి లేచి తన ఆసనం అయిన పెద్ద పుష్పరాజం మీద బాసిపెట్లు వేసుకుని కూర్చున్నాడు. అలా కూర్చుంటేగాని బ్రహ్మ నోట్లోంచి వాక్కురాదు.
   
    ఆడవాళ్ళు అందరూ బ్రహ్మదేముడికి దండం పెట్టారు.
   
    "గురుబ్రహ్మ గురుబ్రహ్మ... బ్రహ్మగురు బ్రహ్మగురు...." అంటూ అదేదో సినిమాలోని పాట స్టయిల్ లో పాటలాంటి శోత్రం చేశారు.
   
    ప్రసన్న వదనుడయిన బ్రహ్మదేవుడు చిరుమందహాసం చిందిస్తు "అమ్మాయిలారా! మీరంత ఒక్కసారిగా ఇలా వచ్చారేమిటి?" అంటూ ఆప్యాయంగా పలకరించాడు.
   
    ఎంతయినా బ్రహ్మ బ్రహ్మే ఆ మాట తీరు అంత ముసలితనంలో కూడ ముఖాల్లో దివ్యతేజస్సు గంభీరమయిన స్వరం వెండి తీగల్లాంటి తలకట్టు, బారెడు గడ్డంతో చూడంగానే భక్తి శ్రద్దలతో పదే పదే ఆయన ముందు మోకరిల్లాలని అనిపిస్తున్నది. బ్రహ్మ తేజస్సు ఆ ప్రదేశమంతటా ప్రజ్వరిల్లుతూ ఉంది.

    "మీరు పెద్దవారు సృష్టికర్తలు. మిమ్మల్ని మించిన వారెవరులేరు. అందుకే మా గోడు మీతో విన్నవించుకొని మా కష్టాలు... కోర్కెలు చెప్పి వరాలు పొందుదామని ఆడవాళ్ళమంతా ఏకగ్రీవంగా అనుకొని ఇలా బయలుదేరి వచ్చాం" అంటూ లీడర్ లీలారాణి చెప్పింది. అంతే గాని శ్రీ మహాలక్ష్మీ, చదువుల రాణి సరస్వతీదేవి, పర్వత పుత్రి పార్వతీదేవి దగ్గరలకు వెళ్ళి అక్కడ పని కాక ఇక్కడకు వచ్చినట్లు మాత్రం చెప్పలేదు.
   
    "బ్రహ్మ దివ్యదృష్టితో చూసి అడిగితే అంతగా కావాలనుకొంటే అప్పుడు చెప్పొచ్చు. అనవసరంగా ముగ్గురు అమ్మాయిల దగ్గర పనికాని విషయం ఎందుకు చెప్పాలి?" అనుకొన్న లీడర్ లీలారాణి తమ కష్టాలన్నీ ఏకరువు పెట్టింది కావాల్సిన కోరికల్ని వినయంగా విన్నవించి కోరదగ్గ వరాలను కోరేసింది.
   
    వాళ్ళు వచ్చినపని బ్రహ్మదేవుడికి అర్ధమైపోయింది. వాళ్ళ  బాధలు అర్ధమైనట్టుగా తనకున్న తలలన్నీ తాటించి చిరుమందహాసం చేసి "అమ్మాయిలారా!" అన్నాడు.

 Previous Page Next Page