భార్య మీదనుంచి దృష్టి మరల్చుకోలేకపోయాడు శ్రీకర్. ఆకాశంలోంచి రాలిపడిన చుక్కలా, మెరుపు తీగలా అరవిచ్చిన రోజాలాగా తాజాగా వున్నది ఆమె.
గ్లాసెస్ తీసి విలాసంగా వూపుతూ వారికెదురుగా భర్త ప్రక్కన కూర్చుంది.
"మేము నవనికేతన్ సంస్థ తరుపు నుంచి వచ్చామండీ. వీరు ప్రెసిడెంటుగారు! వీరు సెక్రటరీగారు. మేమంతా మెంబర్సుము" అని ఒకలావుపాటి ఆవిడ తమల్ని పరిచయం చేసుకుంది. తల పంకించింది జ్యోతి.
"చెప్పండి మీరు వచ్చిన పనేమిటో?" అడిగింది జ్యోతి.
"రేపు ట్వంటీసిక్స్ మా సంస్థ వార్షికోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా ఒక ప్రముఖ సినీ కళాకారుడ్ని ఆహ్వానించి సన్మానం చేయాలనుకున్నాం. అందుకు మీలాంటి పెద్దలు సహకరిస్తే ఫంక్షన్ గ్రాండ్ గా అరేంజ్ చేయగలము" ప్రెసిడెంటు చెప్పింది.
"మీ సంస్థలో ఎంతమంది సభ్యులున్నారు?"
"దాదాపు వందకు పైగానే వుంటారండీ..."
"ఇంతవరకూ ఎంత కలెక్టు చేసారు?"
"ఎక్కడండి...అంతా ఐదుపదులే...బాగా విరాళమివ్వగలరనుకున్న వారుకూడా ఈసారి ఉత్తచేతులు చూపించారు. కనీసం మీలాంటివారు నలుగురు పూనుకుంటే ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది" అన్నది సెక్రటరీ.
వాళ్ళ మాటల్ని మౌనంగా వింటున్నాడు శ్రీకర్.
కొన్ని క్షణాలు ఆలోచించి ఇలా అన్నది జ్యోతి. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది. మీకేమయినా అంచనా తెలుసా?"
"వచ్చే డొనేషన్ లబట్టి ఏర్పాట్లు భారీగా చేయడమా క్లుప్తంగా ముగించడమా అన్నది నిర్ణయించుకుంటామండీ_ ఇప్పటివరకూ ఆశాజనకమైన సహకారం అందలేదు.-"
"రప్ గా చెప్పండి. టూ ధవుజండ్ సరిపోతుందా?"
"రెండువేలే...చాలా గ్రాండ్ గా చేయవచ్చు. కానీ రెండువేలు ప్రోగవ్వాలి గదండీ..."
"అయితే గ్రాండ్ గానే చేయండి. ఆ రెండువేలు నేను ఇస్తాను_" గర్వంగా అన్నది ఆమె.
వాళ్ళ ముఖాలు గుప్పున వెలిగాయి. తమ రొట్టె విరిగి నేతిలోపడ్డట్లు మురిసిపోయారు. ఒకరితరువాత ఒకరు పొగడ్తల హారంకూర్చి ఆమె మెడలో వేశారు.
ఆమె ఉబ్బిపోయింది.
రెండువేలకు చెక్కు రాసి యిచ్చింది.
శ్రీకర్ చూస్తున్నాడేగానీ పెదవి కదపలేదు.
"మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలీడంలేదు. మీవంటివారు ఊరికి ఒక్కరున్నాచాలు. మా సంస్థలు అభివృద్ధిని సాధిస్తాయి" అని మరోసారి పొగిడి చెక్కు అందుకున్నది ప్రెసిడెంట్.
ఇటీజ్ ఎగ్రేట్ వండర్! మమ్మల్ని ఆశ్చర్యంలో_ఆనందంలో ముంచెత్తుతాడు. ఏదో వందో రెండొందలో ఇస్తారనుకున్నాము గానీ... రెండువేలు...మీ విశాల హృదయానికి, ఉదారతకు జోహార్లు...సెక్రటరీ మాటలకు మిగతావాళ్ళు తాళం వేశారు.
జ్యోతి ముఖంనిండా గర్వరేఖలు పొటమరించాయి.
"ఫంక్షన్ ఎప్పుడన్నారూ?" తెలిసినా తెలీనట్లు జ్యోతి ఆడంబరమైన ప్రశ్న!
"26వ తేది సాయంత్రం సెవెన్ కు మిమ్మల్ని మరలా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానిస్తామండీ..."
అధ్యక్షులుగా ఎవర్ని ఇన్వయిట్ చేస్తారు?"
ఇంకా నిర్ణయించుకోలేదండీ ... ఎవర్నో ఎందుకు ఇంత పెద్దమొత్తంగా విరాళం ఇచ్చిన మీలాంటి సహృదయులే అధ్యక్షస్థానానికి అర్హులు-" అని తమ వాళ్ళవంక ఒకసారి చూసింది. ప్రెసిడెంట్ ని అంతాతమకు సమ్మతమేనని చూపులతో చెప్పగా మళ్ళీ మొదలుపెట్టింది.
"మీకు అభ్యంతరము లేకపోతే ఆ స్థానం మీరే అలంకరించితే బావుంటుంది."
"...నో ...నో...నాకెలా వీలవుతుంది?"
ప్లీజ్! మాకోసం శ్రమతీసుకోండి మామాట కాదనకండి-" అన్ని కంఠాలు ముక్తంగా అర్ధించాయి. జ్యోతీ మెత్తబడినట్లు వాళ్ళమాటల్ని కాదనలేక అంగీకరిస్తున్నట్లు తలూపింది.
"అలాగే! మీకోసం - మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టంలేక అంగీకరిస్తున్నాను.
"చాలా చాలా థ్యాంక్సండీ...మేము ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాం. మరలాకలసి ప్రోగ్రాంవిషయం తెలియజేస్తాం_" అని నమస్కారాలుచేసి కదిలారు.
వాళ్ళు అవతలకు వెళ్ళగానే "హుష్!" అని నిట్టూర్చింది జ్యోతి.
భార్య లౌక్యానికి, శ్రీకర్ నవ్వాడు.
"ఏమిటో ఈమధ్య పట్టుమని రెన్నాళ్ళు ఇంటిపట్టున వుండటానికి వీల్లేనంత బిజీగా అయిపోయింది నాపని ఎవరో ఒకరు రావడం సభలు, సమావేశాలు అంటూ ప్రాణం తోడేస్తున్నారు. కాదంటే బాధపడిపోతారు. వీళ్ళతో పెద్ద గొడవైపోయింది-"
ఆ మాటలకు శ్రీకర్ కాస్తా పెద్దగా నవ్వాడు.
"ఎందుకు నవ్వుతారు?" నొసలు చిట్లించింది. అసహనంగా.
రెండువేల రూపాయల విరాళమిచ్చి! అధ్యక్షుని పదవికొనుక్కున్నావు మధ్యలో వాళ్ళనెందుకు ఆడిపోసుకుంటావ్?" నవ్వుతూనే అన్నాడు శ్రీకర్.
నేనేం కొనుక్కోలేదు. వెధవ అధ్యక్షపదవికి ఆశపడి డబ్బు ఇవ్వలేదు. ఏదో మంచిపని చేస్తున్నారని సాయం చేశాను. ఉక్రోషంగా అన్నది జ్యోతి.
ఆ మాటలకు మరింతగా నవ్వాడు శ్రీకర్.
జ్యోతి ఉడుక్కుని "చాల్లెండి మీ వెకిలినవ్వు __" అని కసురుకుంది.
పాపం ఆమెను చూస్తుంటే అతనికి జాలేసింది.
"జ్యోతీ నిన్ను చూస్తుంటే జాలేస్తుందోయ్...నవ్వుతూ దగ్గరకు చేరబోయాడు. జ్యోతి చివ్వున లేచి నిలబడి దూరంగా జరిగింది.
ఒకరు నన్ను చూసి జాలిపడేంత హీనస్థితిలో లేను. డబ్బుపడేస్తున్నాను గౌరవాన్ని కొనుక్కుంటున్నాను అందరికీ అలాంటి యోగ్యతకావద్దు_"
డబ్బున్న ప్రతివారూ నీలాగే ప్రవర్తిస్తున్నారా? ఏమైనా మనిషికంత గర్వం పనికిరాదు. అన్నీ డబ్బుతోనే కొనగలవా?" అభిమానపడుతూ రోషంగా అడిగాడు శ్రీకర్.
"ఓ యస్! గన్ షాట్! నేను తలచుకుంటే డబ్బు వెదజల్లి ఏదయినా కొనగలను. డబ్బుముందు అన్నీ తలవంచాల్సిందే..."