శ్రీకర్! నీకు తెలియదు బాబూ! తొందరపడ్డావు. ఒక్కక్షణం ఆలోచించి వుంటే నువ్వు అంగీకరించి వుండే వాడివికావు.
ధనవంతుల మనస్తత్వాలు చాలా చిత్రంగా వుంటాయ్. వాళ్ళ రుచులు, అభిరుచులు చాలా ఖరీదయినవి. అవి ఒక్కోసారి జీవితాన్నే బలికోర్తాయ్.
అల్సేషియన్ కుక్కని వేలకి వేలు పోసి కొంటారు. ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెంచుతారు. అది తమ మాట వినదని తెలిస్తే షూట్ చేస్తారు.
"అదో! ఆ కుక్క ఒక్కోసారి ఇల్లరికం అల్లుడికంటే అదృష్టవంతురాలు!"
తల తిరిగిపోయింది శ్రీకర్ కి.
కొడుకు ముఖంచూసి జాలిపడ్డాడు విశ్వనాధం. బాబూ! మరీ భూతద్దంలో చూసినట్టుగా మాట్లాడుతున్నాను. కానీ నీవు జాగ్రత్తగా మసలుకుంటే జ్యోతి మనస్సు ఎరక్కుండా చూసుకుంటే మరేం ఫరవాలేదు. నీవు బిడ్డ తండ్రి వయ్యావా? నీ స్థాన చలనం వుంటుందేమో తప్ప భ్రష్టంకాదు...కనీసం అంతదాకానయినా జాగ్రత్తగా వుండు!"
తండ్రి బయటకు వెళ్ళిపోయినా శ్రీకర్ బయటికి వెళ్ళలేదు. అతని మనస్సునిండా ఆలోచనలు...
రిజల్ట్సు వచ్చాయి. ఫస్టుక్లాసులో పాసయ్యాడు శ్రీకర్.
ఫ్యాక్టరీలో అందరికీ స్వీట్స్ పంచాడతను.
అయ్యగారి అల్లుడుగారిది ఎముకలేని చెయ్యి అన్నారంతా!"
ఆ రాత్రి ఇంట్లో బ్రహ్మాండమైన పార్టీ ఎరేంజ్ చేసింది జ్యోతి. ఆమె కూడా బి.ఏ. అనిపించుకుంది. అదీ జీవితంలో స్వయంగా సంపాదించుకున్న మార్కులతో.
అక్కడ కొడుకునంబర్ పేపర్లో చూసుకున్న విశ్వనాధం బరువుగా నిట్టూర్చాడు.
కౌగిట్లో ఒదిగిపోయిన భార్యని తృప్తిగా చూసుకున్న శ్రీకర్ తండ్రి తనని వూరకే భయపెట్టాడేమోననుకున్నాడు.
మామగారు ప్రజంట్ చేసిన వేయిరూపాయలూ తన భార్యకి తెలియకుండా ఆమె లాకర్ లో ఓ మూల భద్రంగా పెట్టివచ్చి భార్య పక్కలో నొదిగి పడుకున్నాడు శ్రీకర్.
ఈ రెండు నెలల కాలంలోనూ అతనికి అప్పుడప్పుడు మామగారి మాటలు తండ్రి ఉపదేశాలూ గుర్తుకువస్తూనే వుండినాయ్...
17
ఫ్యాక్టరీ పనిమీద పొరుగూరు వెళ్ళి యింటికి తిరిగొస్తున్న శ్రీకర్ యింటిముందు గుమిగూడిన జనసందోహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. భయపడ్డాడు యేమైందోనని!
"పాపం! అత్తపోయిన నెల తిరక్కముందే కోడలు కూడా పోయింది. అయ్యగారికి భలే దెబ్బ!" ఎవరో అన్నారు. అది విన్న శ్రీకర్ గుండె జల్లుమంది. గబగబా నడిచాడు.
"పాపం జ్యోతికిది తీరనిలోటు! పెళ్ళయి రెండు నెలలు అయ్యాయో లేదో. నాయనమ్మ, అమ్మా ఇద్దరూ పోయారు. ఇంట్లో పెద్దదిక్కు కరువైపోయింది!"
"అయ్యో! అత్తగారు పోయారు కాబోలు!" అనుకుని పరికించినట్టుగా వెళ్ళాడు లోపలికి. హాలు మధ్య నిశ్చింతగా నిద్రపోతున్నట్లుగా ఉంది విశాల. తల్లి పాదాల వద్ద కూర్చొని భోరుభోరున ఏడుస్తోంది జ్యోతి. గోవర్ధనం గంభీరంగా కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ వున్నాడు.
"అల్లుడుగారు కూడా వచ్చారు. ఇంకా ఆలస్యం ఎందుకు?" అన్నారెవరో...తర్వాతి కార్యక్రమానికి అంతా తయారు చేయసాగారు. నిద్రలో గుండె ఆగి చనిపోయిందన్నారు డాక్టరుగారు. పుణ్యాత్మురాలు అనుకున్నాడు శ్రీకర్.
అతనికి జ్యోతిని ఓదార్చటం చాలా కష్టమైంది. శవం ఇల్లుదాటి వెళ్ళగానే శ్రీకర్ చేతిలో మూర్ఛపోయింది జ్యోతి. తన చేతుల్లో పసిపిల్లలావున్న జ్యోతిని అలాగే ఎత్తుకెళ్ళి పడుకోబెట్టి సేదతీర్చసాగాడతను.
18
కరకరమని పొద్దుపొడిచి చాలాసేపయింది. శ్రీకర్ కాలకృత్యాలు ముగించుకొని గదిలోకి వచ్చాడు. జ్యోతి ఇంకా నిద్రపోతూనే వుంది. వడలినముఖం, చెదిరిన జుట్టులో అదో ఆకర్షణీయంగా కనిపించిందతని కళ్ళకామె. నవ్వుకుంటూ మంచంమీద కూర్చున్నాడు.
"జ్యోతీ! టైం ఎనిమిదయింది లే" తట్టిలేపాడు.
జ్యోతి మేలుకుని బద్ధకంగా మూలిగింది.
"అబ్బా! నాకు నిద్రవస్తుందండి..." అని గారాంగా గునిగింది.
కలవారి అమ్మాయి. ఆమె ఎప్పుడూ ఎనిమిది దాటనిదే నిద్రలేచే అలవాటులేదు. ఇవ్వాళ క్రొత్తగా ముందులేచే అలవాటు ఎలా వస్తుంది?"
"అబ్బ! లెమ్మంటుంటే...నాకు బోర్ గా వుంది" మళ్ళీ కుదిపాడు శ్రీకర్.
జ్యోతి చిరాగ్గాచూసి "మీకు బోర్ గా వుంటే నా నిద్ర పాడుచేయాలా? హాల్లోకి వెళ్ళి పేపర్ తిరగేయండి. నేను కాసేపు పడుకుంటాను" అని ముసుగు కప్పేసింది నిండుగా.
శ్రీకర్ మనసు చివుక్కుమన్నది.
భార్యను గురించి అతని ఊహలు, ఆలోచనలు వేరే విధంగా వున్నాయి.
భర్తకన్నా ముందుగా నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి భర్తకు మేలుకొలుపు పాడాలని. అనుక్షణం అతని కనుసన్నలలో మెలగాలని అతని కోరిక. అందుకు జ్యోతి పద్ధతులు విరుద్దం. ఎనిమిది తర్వాత లేస్తుంది లేస్తూనే ముఖం కడక్కుండా బెడ్ కాఫీ సేవిస్తుంది. కాఫీ ఒక్కక్షణం లేటయితే ఇల్లుపీకి పందిరేసినంతగా నౌకర్లను హడలు గొట్టేస్తుంది! తరువాత టిఫిన్ ముగించి స్నేహితుల ఇళ్లకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒంటిగంట తరువాత యిల్లు చేరడం తిండి తిని విశ్రమించడం! సాయంత్రం డ్రస్ చేసుకుని బజారుకు వెళ్ళడం. ఇదీ జ్యోతి దినచర్య. ఇందులో చాలావరకు శ్రీకర్ కు నచ్చని పద్ధతులున్నాయి.
భార్య ఎప్పుడూ తనచెంతనే వుండాలని! తనకు కావాల్సినవి సమకూరుస్తూ దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తూ ఆప్యాయంగా కబుర్లు చెప్పాలని కోరుకుంటాడు.
ఆమె అలా లేపినా లేపకపోయినా, నిర్లక్ష్యంగా మాట్లాడేసరికి అతని మనసు చిన్నబోయింది. మౌనంగా లేచిహాల్లోకి వచ్చాడు శ్రీకర్.
19
"జ్యోతీ! నీకోసం ఎవరో వచ్చారు?" హాల్లోంచి పిలిచాడు శ్రీకర్.
"ఒక్కక్షణంలో వచ్చేస్తా. వాళ్ళను కూర్చోమను" పైగదిలోంచి అందామె వచ్చినవాళ్ళు సోఫాలో కూర్చుని ఆమె రాకకై ఎదురుచూస్తున్నారు. శ్రీకర్ వాళ్ళ కెదురుగా కూర్చుని యేదో పుస్తకం తిరగేస్తున్నాడు.
ఒక్కక్షణమన్న జ్యోతి క్రిందికి దిగిరాలేదు.
పావుగంట తరువాత మెట్లమీద కలహంసలా, మహారాణిలా దర్పంగా దిగివస్తున్న ఆమెని చూసి వాళ్ళు వినయంగా లేచి నమస్కరించారు. ఆమె ప్రతినమస్కారం చేయలేదు తలూపింది. శ్రీకర్ భార్యవంక చూశాడు. ఆమె ట్రిమ్ గా అలంకరించుకుని వుంది. మబ్బురంగు చీరె! అదేకలర్ బ్లవుజు వేసుకుంది. కళ్ళకు నల్లని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. నున్నగాదువ్వి కొప్పుచుట్టింది. సిగలో ఓ ప్రక్కగా రోజాపువ్వు!