Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 17

    వీర్రాఘవులు వీపు చెడ్డమోత మోగింది.
    "ఏం?...ఇప్పుడు దురద తగ్గిందా?..." అడిగింది మీనాక్షి కోరగా చూస్తూ.
    "తగ్గినట్టుగానే ఉంది..." బిక్కమొహం వేస్తూ అన్నాడు వీర్రాఘవులు.
    "అయినా మీకెన్నిసార్లు చెప్పాలండీ గోళ్లు కొరికే అలవాటు చెడ్డ అలవాటనీ...మానమనీ..."
    "మానేస్తాన్లే...మానేస్తా..." నీర్సంగా జవాబిచ్చాడు వీర్రాఘవులు దీనంగా తన గోళ్లవంక చూస్కుంటూ.
    "ఇలా మీరు చాలాసార్లు అన్నారు... మిమ్మల్నిలా వదిలిపెడ్తే ఏం లాభం లేదు...ఉండండి... మీ పని చెప్తా..."అంటూ లోపలికెళ్లింది మీనాక్షి.
    ఒక నిమిషం తర్వాత మళ్లీ  హాల్లోకి వచ్చింది. ఆ నిమిషం సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అనుకున్నాడేమో వీర్రాఘవులు  మీనాక్షి వచ్చేసరికి హయ్యర్ స్పీడ్ లో టైపు కొట్టినట్టు"టక టక టక టక" గోళ్లు కొరికెయ్యసాగాడు.
    "హేయ్... హేయ్... హేయ్... ఏంటిది?..." అతని చేతుల్ని నోట్లోంచి లాగేసింది మీనాక్షి.
    "ఏం చెయ్యనుమరి?... చిన్నప్పటి నుండీ ఉన్న అలవాటు ఒక్కసారిగా ఎలా పోతుంది చెప్పు?" సంజాయిషీ ఇచ్చుకున్నాడు వీర్రాఘవులు.
    "అందుకే తీసుకొచ్చా ఇది!..." లోపల్నుండి తీసుకొచ్చిన పాత చీరని గర్వంగా చూపించింది మీనాక్షి.
    "అయితే గోళ్లు కొరికనందుకు శిక్షగా నాకు పాతచీర కట్టబెడ్తావన్నమాట!... కట్టుకో... నాకేం? నా గోళ్లు నాకు వదిలిపెడ్తే నాకంతే చాలు!..." తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు వీర్రాఘవులు.
    "హమ్మా ఆశ!... ఈ చీర మీకు చుట్టబెట్టడానిక్కాదు!!..."
    "మరి?"
    "చూడండి-ఏం చేస్తానో!..."
    మీనాక్షి ఆ పాత చీరని రెండు ముక్కలుగా చింపింది. తర్వాత ఆ చీర ముక్కలను వీర్రాఘవులు రెండు చేతులకీ చుట్టి గట్టిగా ముళ్లు వేసింది.
    "ఇప్పుడు గోళ్లు ఎలా కొరుకుతారో చూస్తాను..." అంది మీనాక్షి.
    వీర్రాఘవులు మాత్రం నిశ్చితంగా ఉన్నాడు.
    "నేనిహ వంటపని మొదలుబెడ్తా..." అని మీనాక్షి లోపలికి వెళ్లిపోయింది.
    వంటగదిలోకి వెళ్ళగానే మీనాక్షి కిసకిసా నవ్వింది. "పాపం!... ఇహాయన గోళ్లు ఎట్టా కొరుకుతారో ఏమో!!!..."
    కూరముక్కలు తరిగి స్టవ్ మీద పడేసిన తర్వాత టి.విలో సినిమా పాటల కార్యక్రమం చూద్దామని హాల్లోకి వచ్చిన మీనాక్షి ఒక భయంకరమైన దృశ్యం చూసింది...అంతే!...గది గోడలు బీటలు పడేలా కెవ్వుమని అరిచింది.
    వీర్రాఘవులు సోఫాలో కూర్చుని కట్లుకట్టి ఉన్న చేతుల్తో కుడికాలు పాదాన్ని పట్టి పైకిలేపి టకటకా గోళ్లు కొరికేస్తున్నాడు.
    తట్టుకోలేని మీనాక్షి నేలమీద కుప్పకూలిపోయి "వా.." అని ఏడుపు లంకించుకుంది.
    మర్నాడు మీనాక్షి పక్కింటి పార్వతమ్మ దగ్గర తన గోడును వెళ్లబోసుకుని కళ్లనీళ్లెట్టుకుంది.
    "నువ్వు భయపడకు మీనాక్షీ...మా ఆయనకీ ఈ దరిద్రం అలవాటుండేది... కానీ ఇప్పుడు లేదు!..." అంది పార్వతమ్మ.
    "లేదా?... ఎలా పోయింది..." ఆతృతగా అడిగింది మీనాక్షి.
    "ఎలా పోతుందీ...నేను మానిపించాను..."
    "ఎలా?...ఎలా??...ఎలా???"
    పార్వతమ్మ భుజాలు పట్టి ఊపేసింది మీనాక్షి.దెబ్బకి పార్వతమ్మ కొప్పూడిపోయింది.
    "నువ్వింతిదిగా నా కొప్పూడగొట్టావంటే నువ్వెంత బాధపడ్తున్నవో నా కర్థం అవుతూంది...ఏం లేదు చాలా సింపిల్. మీ ఆయనకి గోళ్లు కొరకాలని అనిపించినప్పుడల్లా గుప్పెడు బఠాణీలు ఇచ్చి తినమను... మా ఆయనకీ అలా బఠాణీలు తినిపించే గోళ్లు కొరికే అలవాటుని మాన్పించా..."
    "థాంక్సొదినా...నేనిహ వస్తా..." ఆనంద భాష్పాలు రాలుస్తూ అంది మీనాక్షి.
    "అలాగే వెళ్లిరా..."అని పుటుక్కున తన కుడిచేతి చిటికెనవేలు గోరు కొరికి తుపుక్కున ఉమ్మూసింది పార్వతమ్మ.
    మీనాక్షి ఓసారి పార్వతమ్మ వంక దెబ్బతిన్న మేకలా చూసి ఇంటికి వెళ్లడానికి వెనుతిరిగింది.
    ఆరోజు మొదలు మీనాక్షి వీర్రాఘవులుకి బఠాణీలు ఇవ్వడం మొదలు బెట్టింది. వీర్రాఘవులుకి రోజు రోజుకీ బఠాణీలు తినడం ఎక్కువైపోయింది. బఠాణీలు ఇవ్వడం కాస్త ఆలస్యం అయితే చాలు పుటుక్ పుటుక్ మని గోళ్లు కొరికేస్తున్నాడు. అందుకని ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా బఠాణీలు అతనికి సప్లయి చేయసాగింది మీనాక్షి.
    ఫలితం...
    బఠాణీలు హోల్ సేల్ గా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది మీనాక్షికి.
    ఓరోజు కిరాణా కొట్టు కిష్టయ్య వాళ్లింటికి వచ్చాడు.
    "ఏంటి కిష్టయ్యా ఇలా వచ్చావ్?..." అడిగింది మీనాక్షి.
    "మీరు బఠాణీలు కొంటున్నారుకదా...హి..హిహి...నామస్తూ మెలికలు తిరిగాడు కిరాణా కొట్టు కిష్టయ్య.
    "అవునూ...బఠాణీలు నీ దగ్గరే కొంటున్నాగా...ఇంకెవరిదగ్గరా కొనడంలేదుగా..."
    "అవునమ్మా... మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా...హి...హిహి..."
    "ఆ ... దాందేముందిలే...మాకు అవసరం కాబట్టి కొంటున్నాం... అవసరం లేకుండా కొంటామా ఏంటీ?..."
    "ఇంకో చిన్న సాయం చెయ్యాలమ్మా..."
    "ఏంటి?"
    "ఈ రోజు నుండి తమరు రెట్టింపు బఠాణీలు కొనాలమ్మా...ప్లీజమ్మా..."
    "ఎందుకలా?..." ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి.
    "మీ దయవల్ల మీకు బఠాణీలు అమ్మీ అమ్మీ ఓ ఇంటివాడినయ్యానమ్మా...హి..."
    "ఏంటీ? పెళ్లి చేసుకున్నావా?...చెప్పేవుకావేం?"
    "పెళ్లి చేస్కోడం కాదమ్మా...ఇల్లు కట్టుకున్నాను... మీరు మరికాస్త ఎక్కువ బఠాణీలు కొంటే ఫస్టుప్లోరు కూడా కట్టుకుంటానమ్మా...ప్లీజమ్మా...హి...హిహి..." మెలికలు తిరిగాడు కిరాణా కొట్టు కిష్టయ్య.
    మీనాక్షి కళ్లు బైర్లు క్రమ్మాయ్...
    "అమ్మో...బఠాణీలకి అంత ఖర్చు అవుతుందన్నమాట!... ఆ డబ్బుంటే నేనే ఒక ఇల్లు కొనుక్కుని ఉండొచ్చునే!!" అనుకుంది.
    "ఏమేవ్..."
    బఠాణీలయిపోయాయ్...ఓ సంచుడు ఇలా పట్టుకొస్తావ్?...లేదా గోళ్లు కొరుక్కోనా?" లోపల్నుండి అరిచాడు వీర్రాఘవులు.
    "నోర్ముయ్యండి..." బయటినుండి గట్టిగా రంకె వేసింది మీనాక్షి.
    మీనాక్షి రెండురోజులు తీవ్రంగా ఆలోచించింది బఠాణీలు తినిపించకుండా ఆయనచేత గోళ్లు కొరికే అలవాటు ఎలా మాన్పించాలా -అని ! చివరికి వెనకింటి వెంకమ్మ ఓ మాంఛి పద్దతి చెప్పింది. ఆ పద్దతి ఆచరించి మీనాక్షి మొగుడిచేత గోళ్లు కొరికే అలవాటుని మాన్పించింది.

 Previous Page Next Page