Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 16

   "కానీ మన తండ్రీ కొడుకుల అనుబంధం,ఈ ప్రేమానురాగాలూ అన్నీ వట్టివే అంటావా?...
    "నాన్నా..."
    ఇప్పటికైనా మించిపోయింది లేదు... ఆ అమ్మాయిని మర్చిపో బాబూ... సెవెన్త్ క్లాస్ చదువుతుండగా ప్రేమించిన ప్రేమకు పరిపక్వత ఉండదు బాబూ... నా మాట విని పాపాయమ్మనే పెళ్ళి చేస్కోబాబూ..."
    గోపాళం ముక్కు పొంగించాడు.
    "అది ఈ జన్మకి జరగదు నాన్నా...నా హృదయం ఏనాడో రాధకి అంకితం ఇచ్చాను...నేను సెవెన్త్ చదువుతుండగా నాలో ప్రేమ అంకురించి మొలకెత్తింది...తర్వాత మొక్కగా మారింది... ఇప్పుడది హృదయపు లోతుల్లో బలంగా వెళ్లుతన్ని పెద్ద వృక్షంగా మారి బోల్డన్ని పూలూ,ఫలాలూ యిస్తుంది నాన్నా...ఇంకో విషయం నాన్నా...నేను సెవెన్త్ క్లాసులో ఉండగా ప్రేమించానని చులకనగా మాట్లాడ్తున్నారు గానీ నా క్లాస్ మేట్స్ కొందరు అయిదవ తరగతిలో ఉండగానే పవిత్రమైన ప్రేమనురాగాలలో డోలికలు ఊగారు నాన్నా..."
    "అయితే నీ నిర్ణయంలో మార్పురాదా?" ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు పరంధామయ్య.
    "రాదు నాన్నా!"
    "ఛీ... విశ్వాస ఘాతకుడా...కనిపెంచినందుకు ఇదా నువ్వు నాకిచ్చే ప్రతిఫలం!నేన్నీకు తండ్రిని కాను...నువ్వు నాకు కొడుకువీ కావు..."
    "అమ్మ శీలాన్ని శంకించడం అంత మంచిదికాదు నాన్నా..."బాధగా అన్నాడు గోపాళం.
    "నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వకూడా ఇవ్వను..."
    "అలాగే నాన్నా...నా రాధను నేను రిక్షా తొక్కుకునైనా పోషిస్తాను!"
    "అలాగేం...అయితే తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోయి రిక్షా తొక్కుకో..."
    "మీ అభీష్టం అదే అయితే అలాగే వెళ్ళిపోతాను నాన్నా..."
    గోపాళం ఓసారి చెల్లిలి దగ్గరికి వెళ్ళి గాఢంగా కౌగిలించుకుని, తర్వాత ఆమెని పైకెత్తి గిరగిరా తిప్పి క్రిందికి దించాడు. ఆ తర్వాత తల్లికి, నాయనమ్మకీ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. తండ్రి కాళ్కకి నమస్కారం పెట్టాలని అనుకుంటే అతను సర్రున వెనక్కి జరిగాడు.
    గోపాళం కళ్ళు తుడుచుకుంటూ గుమ్మంవైపు అడుగులు వేశాడు.
    అందరూ ఘొల్లుమని ఏడ్చారు.
    "ఒరేయ్ గోపాళం...ఇలారా..."పరంధామయ్య పకపకా నవ్వుతూ పిలిచాడు.
    గోపాళం వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూశాడు.
    "నేను ఓడిపోయాన్రా...నువ్వే గెలిచావ్...నీ ప్రేమ ఎంత బలమైనదో తెలుసుకోవాలని పరిక్షించానురా"
    "నాన్నా..."గోపాళం ఆనందభాష్పాలు రాల్చాడు.
    "కన్న తండ్రి ఎప్పుడూ కసాయివాడు కాదు బాబూ...నీకు రాదని ఇచ్చి నేను పెళ్ళి జరిపిస్తాను బాబూ...నేను జరిపిస్తాను..."గుండెల మీద గుద్దుకుంటూ అన్నాడు పరంధామయ్య.
    అందరూ ఆనందభాష్పాలు శక్తివంచన లేకుండా కార్చారు.                                                                                                 శుభం
   
                                                                  *  *  *
                            అలవాటంటే అలవాటే...
    టి.వి చూస్తున్న మీనాక్షి విసుగ్గా మొహం పెట్టింది. కారణం...టక టక... టక అంటూ శబ్దం వస్తూ ఒహటే డిస్టర్ బెన్స్.
    టి.వి నాటకంలో సీరియస్ గా డైలాగులు చెప్పేస్తున్నారు హీరో,హీరోయిన్లు.
    "నిన్ను విడిచి నేనుండలేను భావా...టక టక..." ఎక్కడ వత్తులు పలకాలో ఎక్కడ పలక్కూడదో తెలీని హిరోయిన్ డైలాగు అత్యధిక భావోద్వేగంతో పలికింది.
    "కానీ మనందరిలో ప్రవహించేది...టకటక...ఒకటే రక్తం రాధా...టక...బీదా గొప్పల మధ్య అంతరాన్ని తొలగించేందుకు టకటక మనతరం టక నడుంబిగించాలి రాధా... టకటక" బిక్క మొహంతో గంభీరంగా పలికాడు హీరో.
    "అవును భావా టకటక...ఈ సమాజంలో కుళ్లుని టకటక మనం తొలగించి మన పెద్దల కళ్లు టకటక తెరిపించాలి భావా...టక..."
    "నిజం రాధా...మనం ఆదర్శాన్ని సాధించి చనిపోయినవారి ఆత్మకి శాంతి కలిగించాలి!టక... టక..."
    "అవును భావా...ప్రతి ఒక్కరిలోనూ ఎర్రని రక్తమే టకటక ప్రవహిస్తుందని టక మనం నిరూపించాలి టకటక భావా...అప్పుడు ఛీ అన్న ఈ పెద్దలే మనల్ని దీవిస్తారు టకటక..."
    మీనాక్షికి ఇరిటేషన్ పుట్టి శక్తివంచనలేకుండా జుట్టు పీక్కుంది.
    ఆమె ఇరిటేషన్ కి కారణం?
    నాటకంలో డైలాగులా?...
    కాదు
    ఎక్స్ప్రెషన్స్ లేని వారి నటనా?...
    కాదు కాదు...కానేకాదు.
    మరి ఏమిటి?...ఆమె ఇరిటేషన్ కి కారణం ఏమిటి??
    మధ్య మధ్య వినిపిస్తున్న ఆ "టక టక" శబ్దం!
    ఆ శబ్దం ఎక్కడ్నుండి వస్తుంది...ఎవరు చేస్తున్నారు?!
    ఆ శబ్దాన్ని వీర్రాఘవులు చేస్తున్నాడు!ఎలా చేస్తున్నాడూ?...
    నోట్లో వేళ్లు పెట్టుకుని గోళ్లు కొరుకుతూ చేస్తున్నాడు.
    "టక... టక... టకటక...టకటక..."
    మీనాక్షి వీర్రాఘవులు వంక చురచురా చూసింది.
    "మీరింక మీ చేతిగోళ్లు కొరకడం ఆపుతారా లేదా?..."విసుక్కుంటూ అంది.
    "ఓ...అలాగే... ఓక్కే..." అని చెంగున మీనాక్షి ముందుకు దూకి ఆమె చేతిని అందుకుని వేళ్లు నోట్లో పెట్టుకోబోయాడు వీర్రాఘవులు.
    మీనాక్షి భర్త చేతిలోంచి తన చేతిని చటుక్కున వెనక్కి లాక్కుంది.
    "ఇదేమిటి?..."అంది మొహం చిట్లించి.
    "నువ్వు నా చేతి గోళ్లు కొరకొద్దన్నావుగా...అందుకే నీ చేతిగోళ్లు కొరుకుదామనీ...తేమ్మాతే...నీ చెయ్యిలాతే...నీ చేతిగోళ్లు కోరికేస్తే నాకు నెయిల్ పెయింట్స్ కొనే బాధకూడా తప్పుతుంది..."మళ్ళీ భార్య చెయ్యి అందుకోబోయాడు.
    మీనాక్షి అతనికి తన చెయ్యి అందకుండా తప్పించుకుంటూ "ఏం?... వీపుగానీ దురదగా వుందా?" అని అడిగింది.
    "దురదగా ఉంటే మాత్రం గోక్కోడానికి చెయ్యి వెనక్కి అందుతుందా ఏమిటి?...అందినా గోక్కోడానికి నాకు గోళ్లున్నాయా ఏమిటి??...హిహిహి... నువ్వే గోకాలోచ్..."
    "చెళ్..."

 Previous Page Next Page