"హాయ్.. ఏం చేస్తున్నావు? మళ్లీ ఫోనన్నా చెయ్యలేదు." ఫోన్ లోనే ముద్దులు గునుస్తున్నట్లంది గీత.
గతుక్కుమన్నాడు రాజారావు గీత గొంతు విని.
"ఆఁ ఏం లేదు. ఏముంది మాట్లాడడానికి. సంగతులేం వున్నాయి" గొణిగాడు.
"సంగతులు లేకపోతే మాట్లాడకూడదా. మాట్లాడుకోడానికి సంగతులే వుండాలా" కవ్విస్తున్నట్లంది.
రాజారావు మౌనంగా వూరుకున్నాడు.
"సర్లే.. ఫోన్ లో మాట్లాడడానికి సంగతులు లేవు. యింటికి రా, నే చెపుతా బోలెడు సంగతులు.." ఊరిస్తున్నట్లంది.
"ఏయ్.. ఏమిటి మాట్లాడవు. యిప్పుడు రారాదూ. మా శ్రీవారు ఢిల్లీ వెళ్లారు. బోరు కొడ్తోంది. కాసేపు సరదాగా గడుపుదాం రా. కారు పంపనా వచ్చేస్తావా"
"పిలవగానే పరిగెత్తి వచ్చేస్తాడని ఎంత నమ్మకం. వాళ్లాయన లేనపుడు తను కంపెనీ యివ్వాలన్నమాట" ఉడుక్కున్నాడు రాజారావు.
"కుదరదు. ఆఫీసు టైములో ఎలా వస్తాను, రాలేను. ఇంకోసారి ఎప్పుడన్నా శెలవు రోజు వస్తా... సారీ!" అంటూ ఫోన్ పెట్టేశాడు.
మళ్లీ నిముషంలో రింగయింది.
"ఏమిటలా ఫోన్ కట్ చేశావు, మాట్లాడుతుంటే..." కినుకగా అని, "పోనీ ఆఫీసయ్యాక రా, ఎదురుచూస్తుంటాను. డోంట్ డిసప్పాయింట్ మి! ఏం.. సీయూ ఇన్ ద యీవెనింగ్" అంటూ అతను ఏదన్నా అనే లోపలే ఫోన్ పెట్టేసింది.
రాజారావు ఇగో హర్ట్ అయింది.
"ఆవిడగారెప్పుడు రా... అంటే తోకాడించుకుంటూ పరిగెట్టి వస్తానని కాబోలు - తన ఉద్దేశం. ఆ కాలేజీ నాటి టీనేజ్ రాజా అనుకుంటోంది కాబోలు. వెళ్ళను గాక వెళ్ళను.." కసిగా అనుకున్నాడు.
ఇంటికెళ్లాక శకుంతలకు చెప్పాడు ఏం అంటుందో చూడాలని. ఎందుకో గీత సంగతులు శకుంతల దగ్గర దాచాలనిపించడం లేదు. శకుంతల బ్యాలెన్స్ డ్ గా ఆలోచించే మనిషి. నిజంగా ఆ రోజుల్లో శకుంతలే లేకపోతే, గీత చేసి వెళ్లిన గాయాన్ని అంత తొందరగా మాన్చుకోలేకపోయేవాడు. మండే గుండెకి మంచి గంధం పూసి చల్లబరిచింది శకుంతల.
"వెళ్లకపోయారా అంత ప్రేమగా పిలిస్తే" హాస్యంగా అంది శకుంతల.
రాజారావు కోపంగా చూశాడు.
"నీకు హాస్యంగా వున్నట్టుంది. నిజంగా వెడితే ఏడుస్తావు"
"నేనేం ఏడవను - వెళ్లండి, వెళ్లండి" కవ్వించింది.
"హాస్యాలు చాలించు" కసిరాడు చిరాగ్గా.
"అవునూ, అసలు గీత ఉద్దేశం ఏమిటంటావు.. ఎందుకు యిన్నేళ్ల తరువాత మళ్లీ నాతో స్నేహం పునరుద్ధరించుకోవాలనుకుంటోందంటావ్..."
"స్నేహమా, పాడా.. ఆవిడకి తన గొప్పలు చూపుకోవడానికి, కాలక్షేపానికి, తన వెంట ఇంకా మగవాళ్లు పడతారో, లేదో పరీక్షించడానికి... ఇంకా చెప్పాలంటే ఓ గేమ్ ఆడి చూడాలన్న సరదా..." తేలిగ్గా అంది శకుంతల.
"అంతేనంటావా, యీ వయసులో కూడా ఇంకా అలా ఆలోచిస్తుందంటావా"
"ఆవిడ మనస్తత్వం అది. అందరూ తన చుట్టూ తిరగాలనే ఆవిడ బుద్ధి మనం ఎరగనిదా. డబ్బు కోసం డబ్బున్న వాడిని వెతుక్కుంది. లక్షల రూపాయలిచ్చే సుఖాలు, అనుభవాలు పాతబడ్డాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మొగుడు ఉద్యోగంలో బిజీ. ఈవిడకి ఏదో కాలక్షేపం కావాలి. దానికి మీరు దొరికారు. ఆనాటి మీ ప్రేమావేశాలు ఎలా వున్నాయో, అసలు మీరెలా వున్నారో... అవన్నీ తెలుసుకోవాలన్న ఆరాటం ఆవిడకి. మీరింకా ఆవిడ పట్ల పాత అనుభూతులతో ఆవిడ పొందుకోరి వస్తారో లేదోనని పరీక్షించాలని ఉత్సుకత. మీరెళితే మళ్లీ పాత రోజుల్లా మిమ్మల్ని వెంట తిప్పుకుని సరదాగా ఓ కాలక్షేపంగా వుంటుందని అనుకుంటోందేమో ననిపిస్తోంది నాకు. మీ వైవాహిక జీవితం ఎలా వుందో తెలుసుకోవాలన్న ఆరాటం.. అన్నీ వున్నాయి"
"అందుకే నాకు వెళ్లాలనిపించడం లేదు"
"అలా కాదు, అసలు ఓసారి వెళ్లి చూడండి. అసలు ఆవిడ ఉద్దేశం అర్థం అవుతుంది. మీరెక్కడ బయటపడకుండా మీరు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నట్టు, వున్న దానితో తృప్తిగా, హ్యాపీగా గడుపుతున్నట్టు, ఆ రోజులు కాలేజీ రోజులు ఏవో అందరూ టీనేజ్ లో అలాగే ప్రవర్తిస్తారన్నట్టు తేలిగ్గా మాట్లాడండి. అప్పుడు ఆవిడ ధోరణి ఎలా వుంటుందో చూడండి"
"నీవు రా... మనిద్దరం ఓ ఆదివారం కలిసి వెళదాం. మనల్ని చూసి ఆవిడంతట ఆవిడే గ్రహించొచ్చు. కేవలం స్నేహం కోసం అయితే ఫరవాలేదు, అప్పుడప్పుడు కలవొచ్చు మనం."
"ఉహుఁ నేను రాను. మీరు ముందు వెళ్లండి. ఆమె కేవలం స్నేహం కోసమే ఆరాటపడుతోంది అనిపిస్తే చెప్పండి. అప్పుడు వస్తాను."
రాజారావు ఇబ్బందిగా చూశాడు.
"ఏమిటీ, ఆవిడేదో మీద పడుతున్నంత భయపడుతున్నారు? పడితే మంచిమాటేగా మీ మగాళ్లకి" చిలిపిగా అంది.
కోపంగా చూశాడు రాజారావు.
* * * * *
"నిన్న వస్తావనుకున్నాను. చాలాసేపు ఎదురుచూశాను. డిసప్పాయింట్ చేశావు. కనీసం రాలేనని ఫోనన్నా చెయ్యకూడదూ" నిష్ఠూరంగా అంది ఆఫీసుకి ఫోన్ చేసి.
"కుదరలేదు. ఇంటికి వెళ్లేసరికి గెస్ట్ లు వచ్చారు" చిన్న అబద్ధం ఆడేశాడు.
"పోనీ, యివాళ వస్తావా" ఆశగా అంది.
"మళ్లీ రేపు సాయంత్రం ఆయనొచ్చేస్తారు. మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఇవాళయితే".
"కుదరకపోవచ్చు... ఆఫీసు పని పూర్తయితే చూస్తాను" ముభావంగా అన్నాడు.
"ఏయ్ రాజా, ఎందుకలా మాట్లాడుతున్నావ్! నన్ను ఎవాయిడ్ చెయ్యాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎందుకు..." హర్ట్ అయినట్టు అడిగింది.
"ఎందుకో నీకు తెలీదా.." అనకుండా ఉండలేకపోయాడు. అతని గొంతులోంచి అతనికి తెలియకుండానే వాడిగా వచ్చాయి మాటలు.
"ఇంకా, పాత సంగతి మర్చిపోలేదా. ఎప్పుడో తెలిసీ తెలియని వయసులో ఏదో అనుకుంటా, ఏదో చేస్తా. అదింకా సీరియస్ గానే తీసుకుంటున్నావా"
"మళ్లీ పాత సంగతులు గుర్తుకు రాకుండా వుండడం కోసమే రానంటున్నాను" ముభావంగా అన్నాడు.
"అవి గుర్తుకు తెచ్చుకోవడం నాకిష్టం లేదు" అని కూడా చేర్చాడు.
ఆ మాటలకి హర్ట్ అయినట్టు ఒక్క క్షణం మౌనం అటునుంచి - "ఏదో కాలేజీ నాటి స్నేహితుడివి కనిపించగానే సంతోషం అనిపించి, పిలిచాను..." నిష్ఠూరంగా అంది.
"ఏమో, నాకు తీరిక లేదు. కోరికా లేదు కలవాలని. ఏదో ప్రశాంతంగా జీవితం దొర్లిపోతోంది. మళ్లీ అనవసరంగా ఆ ప్రశాంతతని భగ్నం చేసుకోవడం నాకిష్టం లేదు. క్షమించు..." సడన్ గా ఫోను పెట్టేశాడు. ఆమెని అలా కట్ చేసినందుకు, చేయగల్గినందుకు తనని తానే మెచ్చుకున్నాడు.
"ఇంక ఈ దెబ్బతో తన జోలికి రాదు మళ్లీ" అనుకున్నాడు.
* * * * *
మూడు రోజుల తరువాత, ఆదివారం నాలుగ్గంటల వేళ నిద్రలేచి బద్ధకంగా కాఫీ తాగుతుంటే, బయట కారుచప్పుడు, ఆ తర్వాత గేటుచప్పుడు వినిపించి అటు చూసేలోగానే గుమ్మం దగ్గరికి వచ్చేసింది గీత.
ఆమెని చూసి సంభ్రమంగా లేచి, అట్టహాసంగా ఆహ్వానించి చకచకా లోపలికెళ్లి బట్టలు మార్చేసి, తల దువ్వుకుని రావాలనిపించలేదు అతనికి.
"ఓఁ మీరా.. రండి!" లేచీలేవనట్టు కుర్చీలోంచి లేచి, మరో కుర్చీ చూపించి, "శకూ... ఎవరొచ్చారో చూడు!" అంటూ వంటింటి వైపు కేకపెట్టాడు.
"ఎక్స్ క్యూజ్ మీ" అంటూ అప్పుడులేచి, లోపలికెళ్లి లుంగీమీద బెంగాలీ షర్ట్ వేసుకుని బయటికి వచ్చాడు.
శకుంతల లోపల్నించి వచ్చి ఆశ్చర్యంగా, "మీరా" అంది.
"హలో.. ఎలా వున్నావు. ఏమిటి, కొత్తగా మీరు అంటున్నావు...." శకుంతలని ఆపాదమస్తకం పరీక్షిస్తూ విలాసంగా నవ్వింది.