Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 18

   
    "మీ ఆయన ఏమిటి కొండెక్కి కూర్చున్నాడు. యింటికి రమ్మని సరదాగా పిలిస్తే... ఏం చేస్తాం! మహమ్మదు రాకపోతే మౌంటెనే వెళ్లాలి మరి" అంది రాజారావు వంక చిలిపిగా చూస్తూ.
    "ఈ మహమ్మదు గార్కి మౌంటెన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కనపడలేదేమో, ఇంట్రెస్ట్ పోయుంటుంది" తను గడుసుగానే అంది నవ్వి.
    "ఏం తీసుకుంటారు... కాఫీ, టీ..."
    "అదిగో, మళ్లీ మీరు అంటూ యీ మర్యాద ఏమిటి?" చనువుగా మందలించింది.
    "ఇప్పుడు మీరు పెద్దవారు, గొప్పవారు. నీవు అనచ్చో, లేదోనని..."
    "ఏమిటయ్యా బాబూ... ఆముదం తాగినట్టు ఆ మొహం. ఎందుకొచ్చానా అనుకుంటున్నావా?"
    రాజారావు నవ్వీ నవ్వనట్టు నవ్వి, "నిజమే, ఈ బీదవాడి ఇంటికి దేనికొచ్చావు, నాతో పని ఏమిటా అని అనుకుంటున్నాను" అన్నాడు.
    శకుంతల "కాఫీ తెస్తాను" అంటూ లేచి వెళ్లింది.
    గీత ఆ అవకాశాన్ని వదలకుండా, "ఎందుకలా మాట్లాడతావు. స్నేహానికి బీదేమిటి, గొప్పేమిటి?"
    "అవును, స్నేహానికి అక్కరలేదు నిజమే - పెళ్లికి కావాలి అవన్నీ. ఆ తేడాలన్నీ చూసుకోవాలి" కసిగా అన్నాడు.
    కాస్త తెల్లబోయి అంతలోనే తేలిగ్గా నవ్వేసి, "అవును మరి, నాలుగూ చూసుకోకుండా పెళ్లెలా చేసుకుంటారు ఎవరన్నా. అంతస్తు, హోదా, కుటుంబం, ఉద్యోగం... ఎన్ని చూసుకోవాలి..." ఆరిందలా ఏం తెలీనట్లుంది.
    "నీకింకా నా మీద కోపం పోనట్టుంది.. అవునా?" కవ్వింపుగా అంది.
    "నాకేం కోపం! కోపం ఎందుకు? హాయిగా వున్నాను. ఉన్నంతలో చీకూచింతా లేని జీవితం, అనుకూలవతైన భార్య, చక్కగా చదువుకుంటున్న పిల్లలు, ఉండడానికో కొంప, చెయ్యడానికో ఉద్యోగం, నాకేం లోటు? హాయిగా మనశ్శాంతిగా, సుఖంగా ఉన్నాను. నిజంగా శకుంతల నాకు దొరికిన అదృష్టం. నిజంగా సహధర్మచారిణి అన్న పదానికి నిర్వచనం ఆమె. ఆమెని మించిన ఐశ్వర్యం నాకేం అక్కరలేదు" చాలా గర్వంగా, నిజంగా ఫీలయ్యే అన్న మాటలు అవి. గీతకి తను ఆమెని కోల్పోయి ఏం బాధపడడం లేదు అని చెప్పాలన్న తాపత్రయం మాత్రం వుంది.
    గీత మొహం కాస్త ఎర్రబడింది. అంతలో తేలిగ్గా నవ్వేసి,
    "అబ్బో... బాగా పొగిడేసుకుంటున్నావు భార్యని. యింకా అందగత్తె, గొప్ప యింటిది దొరికుంటే.." చిన్నగా లో గొంతుతో అంది. కాస్త అసూయ ధ్వనించింది ఆ మాటల్లో.
    రాజారావు ఏదో అనే లోపలే కాఫీ కప్పులతో శకుంతల వచ్చింది.
    మాట చప్పున మార్చేసి నవ్వుతూ, "శకుంతలా! మీవారు నిన్ను అందలం ఎక్కించేశారు. తెగ పొగిడేస్తున్నారు. నీవంటి భార్య దొరకడం అదృష్టంట" కవ్విస్తూ అంది.
    "ఆశించినవి దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి పడడం గొప్ప విషయమేగా. లేనిదాని కోసం ఏడవడం కంటే, దొరికిన దానికి సంతోషించడం తెలివైనవారు చేసే పని. మా ఆయనకి ఆ మాత్రం తెలివితేటలున్నాయి మరి" గడుసుగా అంది.
    అబ్బో... ఒకరినొకరు అంత పొగిడేసుకుని నన్ను కుళ్ళించాలనా" హాస్యంగా అంది.
    "మమ్మల్ని చూసి కుళ్లే స్థితిలో నిజంగా మీరుంటే మరి మేం జాలిపడాలి" గడుసుగా మళ్లీ అంది.
    గీత మొహం ఎర్రబడింది.
    "మాటల్లో నిన్నోడించడం కష్టంలే, నీవు చాలా తెలివైనదానివి, గడుసుదానివి" కాస్త అక్కసు చూపింది.
    "మనిషన్నాక ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలిగా. నా క్వాలిఫికేషన్ అదేమో" నవ్వింది.
    రాజారావు బుద్ధుడిలా యిద్దరి మాటలు వింటూ చిద్విలాసంగా నవ్వుకుంటూ కూర్చున్నాడు అంతసేపూ.
    "గీతా! ఒక్క విషయం మాత్రం నాకీ పాతికేళ్లలో బాగా అర్థం అయింది. చూడు - జలపాతం సౌందర్యాన్ని చూసి అబ్బురపడతాం, ఆనందపడతాం, ఆశ్చర్యపోతాం. ఆ ఆనందాన్ని శాశ్వతం చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ నిజంగా అలా జరిగితే ఆనందం అటుంచి, ఎప్పుడు అక్కడి నుంచి పారిపోదాం అనిపిస్తుంది. ఆ హోరు, ఆ నీటి తాకిడి చూస్తూ భరించలేక ప్రశాంతత కోసం, హాయిగా నిశ్శబ్దంగా, మెల్లగా, చల్లగా పారే ఏ నోటి ఒడ్డుకో పారిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే చోటు వెతుక్కుంటాం - ఎంతటి సౌందర్యాన్నైనా కొద్దిసేపే భరించగలం - ఏ అందాన్నైనా ప్రశాంతంగా ఆహ్వానించగలం గాని, నీటి హోరు మధ్య కొన్ని గంటలు బాగున్నట్టు జీవితకాలం బాగుండదు. మనిషికి మానసిక శాంతి కావాలి. అందం నాలుగు రోజులే మురిపిస్తుంది. మనిషిలోని అంతః సౌందర్యం మనిషికి ఊరటని, ప్రశాంతతని యిచ్చి జీవితం సాఫీగా సాగేట్టు చేస్తుందన్న సత్యం గ్రహించాను. నేను కోరుకున్న ప్రశాంతత నాకు దొరికింది. నో రిగ్రెట్స్ యిన్ లైఫ్- నేను దొరికిన దానితో చాలా సంతోషంగా వున్నాను. నాకీ తృప్తి చాలు-" అతను మాట్లాడుతున్నంతసేపూ గీత మొహంలో రంగులు మారాయి.
    "అంటే - ఆవిడ జలపాతం, నేను నదిననా మీ పోలిక-" శకుంతల హాస్యంగా అంది.
    గీత మొహం కాస్త నల్లబడి అంతలోనే తేరుకుని తనూ హాస్యంగానే, "అందని ద్రాక్ష పుల్లన - అన్నది ఎవరూ ఒప్పుకోరుగా"
    "ఎవరెలా అయినా అనుకోండి - ఎవరికి కావాల్సిన అర్థాలు వారు వెతుక్కోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నా జీవితం హాయిగా వుంది. యింక ఎవరేం అనుకుంటే నాకేం బాధ"
    "యింక చాల్లెండి. మళ్ళీ మళ్లీ మీరామాట అంటే ఆవిడకి కోపం వచ్చేసి, టీ.వి. సీరియల్ లో మాదిరి, 'నిన్ను సుఖపడనీయను, నాకు దక్కనిది నీకు దక్కనీయను, నిన్ను ప్రశాంతంగా బతకనీయను' అంటూ ప్రతిజ్ఞ చేసేయొచ్చు" గలగలా నవ్వింది.
    గీత మొహం ఉక్రోషంతో ఎర్రబడింది.
    "ఆహాహాఁ యిద్దరికిద్దరు ఎంతో తెలివిగా - మీ యిద్దరూ చాలా సంతోషంగా, చాలా అన్యోన్యంగా వున్నట్టు ఇంప్రషన్ యివ్వాలని ఎంత తాపత్రయపడుతున్నారో చూస్తే జాలేస్తోంది. ఏదో తెల్సిన వాళ్లని చూసి పోదామని వచ్చానంతే. మిమ్మల్ని చూసి ఉడుక్కోవలసిన ఖర్మ నాకేంటి- లక్షల ఆస్థి, కార్లు, రత్నాల లాంటి పిల్లలు, గీచిన గీత దాటని మొగుడు" గర్వంగా తలెగరేసి అంది.
    రాజారావు అదోలా నవ్వాడు - శకుంతల వైపు చూస్తూ "పాపం గీత.. యింకా పాత రాజారావనే అనుకుంటోంది" నర్మగర్భంగా అన్నాడు.  
    శకుంతల ముసిముసి నవ్వులు నవ్వింది. ఆ నవ్వులు చూసేసరికి తిక్కరేగింది గీతకి.
    "ఐ పిటీ యూ రాజారావ్!! 'అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగా' అన్న పద్యం జ్ఞాపకం వస్తోంది మీ యిద్దరి మాటలు వింటుంటే. లేనిది వున్నట్టుగా చూపుకోవడం కోసం మీ తాపత్రయం చూస్తే జాలేస్తోంది" మొహాన నవ్వు పులుముకున్నా మాటలు కసిగా వత్తింది.
    "అరే, స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్ - నాకూ చిన్నప్పుడు చదివిన 'ఎలుక తోక తెచ్చి ఎంత ఉతికినా' పద్యం - 'పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగాని పోదు' అన్న సామెత ఎంత నిజం అనిపించింది" నవ్వుతూ అన్నాడు.
    గీత విసురుగా లేచి నిల్చుని, "ఛీ....నీలాంటి వాడింటికి పిలవని పేరంటం రావడం నాదే బుద్ధి తక్కువ" అని వెళ్లబోతుంటే వెనకనుంచి.
    "నిజమే, నీలాంటి వారు రాదగ్గ చోటు కాదిది" అన్నాడు రాజారావు కూల్ గా.
    ఆ మాటన్నాక పాతికేళ్ళుగా పేరుకున్న బాధ, అవమానం, కసి చేత్తో తీసిపారేసినంతగా మనసు తేలికపడ్డట్టు అనిపించింది రాజారావుకి. నచ్చని అక్షరాలూ చెరిపేసిన తెల్ల కాగితంలా మనసు తేట పడింది.

                                                                                            (పత్రిక - అక్టోబరు 2003)

                                                                                   *  *  *  *  *

 Previous Page Next Page