Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 16


                                                   చెరిగిన కథ

    ఆఫీసునించి వచ్చి విసుగ్గా సోఫాలో వాలిపోయిన రాజారావుని చూసి, "ఏమిటలా వున్నారు, మొహం వాడిపోయింది. వంట్లో బాగోలేదా ఏం?" కాఫీ గ్లాసుతో వచ్చిన శకుంతల అంది.
    "ఏం లేదు, బాగానే వుంది" ముభావంగా అని గ్లాసందుకున్నాడు.
    నమ్మకం కుదరక నుదుటి మీద అరచేయి ఆనించింది. "జ్వరం ఏం లేదు, తలనొప్పా, ఏదన్నా మాత్ర ఇవ్వనా" మళ్లీ అడిగింది.
    "ఏం వద్దు, నాకేం లేదన్నానుగా" విసుగ్గా అన్నాడు. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన భర్త మొహం ఏదో ఆలోచనతో సతమతమవుతున్నట్టున్నా, మళ్లీ అడిగితే విసుక్కుంటాడు, అతనే చెపుతాడని శకుంతల ఇంకేం మాట్లాడలేదు.
    భోజనం దగ్గర కూడా అన్యమనస్కంగా కనిపించేసరికి ఇంక ఆగలేక, "ఏం లేదంటారు, ఏం లేకపోతే కొంపలు మునిగినట్టు ఆ మొహం ఎందుకలా పెట్టారు? చెప్పదలచకపోతే యింక అడగను" కోపంగా అంది శకుంతల.
    ఒక్క నిమిషం అన్నం కెలికి, "పొద్దుట ఆఫీసుకి వెళ్తుంటే గీత కన్పించింది"
    శకుంతల ఒక్క క్షణం చాకితురాలైనట్టు చూసి, తరువాత తేలిగ్గా నవ్వేసి "ఓస్ అంతేనా, ఆపాటి దానికి మూడ్ ఆఫ్ అయిపోవాలా పాత ప్రియురాలు కనిపిస్తే సంతోషిస్తారు గాని" వేళాకోళంగా అంది.
    చురుగ్గా చూశాడు రాజారావు. "అందుకే చెప్పకూడదనుకున్నాను. నీకంతా వేళాకోళమే"
    "వేళాకోళం కాదండీ- కనిపిస్తే ఏమయిందిట. మిమ్మల్ని చూసిందా తను. మీతో మాట్లాడిందా. ఎలా వుంది, ఏమంది - అసలు పలకరించిందా" ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది.
    "చూడ్డం ఏమిటి, సర్రున కారు నా స్కూటరు పక్కన ఆపి దిగింది. రోడ్డుమీదే అట్టహాసంగా మాట్లాడేసింది" ఉద్విగ్నంగా అన్నాడు రాజారావు.
    "చాలారోజుల తర్వాత పాత మిత్రుడు కనిపిస్తే మాట్లాడటంలో వింతేం వుంది"
    "పలకరింతతో ఆగితే ఫరవాలేదు. యింటికి వస్తేగాని వీల్లేదని లాక్కుపోయింది. ఆఫీసుంది, మరోసారి వస్తానన్నా వినకుండా డ్రైవరుకి స్కూటరు అప్పజెప్పి కారెక్కమంది. ఎంత మొత్తుకున్నా వినకుండా లాక్కెళ్ళి"
    "అయితే, ఆఫీసుకి వెళ్లలేదన్నమాట. మరింతసేపూ ఆవిడింట్లోనే వున్నారా" అంది ఇబ్బందిగా చూసి.
    "మరే చెయ్యను- అక్కడికెళ్లాక ఆఫీసుకి శెలవు పెట్టమని ఫోన్ చేయించింది. యివాళ భోజనం యిక్కడే అంది. వాళ్లాయన కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లాడట. సాయంత్రం వరకు వదలను, కబుర్లు చెప్పుకోవాల్సిందే అంటూ ఒకటే హడావిడి చేసింది. అప్పటికప్పుడు వంటావిడతో చెప్పి పాయసం, వడలు వేయించి విందు భోజనం పెట్టి, అప్పటి నుంచి మొదలుపెట్టి యిప్పటి వరకు అయినవన్ని కబుర్లు చెప్పింది".
    "మరింకేం.. విందు భోజనం తిని, యిష్టసఖితో కాలక్షేపం చేసి వచ్చి ఏదో కొంప మునిగినట్టు మరి ఆ మొహం ఎందుకు? సంబరమే కదా... ఆముదం తాగినట్టు ఆ ఫోజేమిటి?" శకుంతల సగం చమత్కారం, సగం అసూయ కలగలిపి హేళనగా అంది.
    "కబుర్లంటే ఏమున్నాయి- తన గొప్పలే. అమెరికాలో మొగుడి ఉద్యోగం, జీతం, నాలుగు పడకల గదులు ఇల్లు, స్విమ్మింగ్ పూల్, పడవల్లాంటి రెండు కార్లు, అమెరికా జీవితం, ముద్దులు మూటగట్టే యిద్దరు పిల్లలు, వాళ్ల తెలివితేటలు, వాళ్ల చదువులు- ఆఖరికి ఇండియాలో యీ కంపెనీ ప్రెసిడెంటుగా నెలకు బోలెడు జీతం, బంగళా, కార్లు, ఫోన్లు అన్నీ యిస్తామంటే దేశం మీద ప్రేమతో అమెరికాలో సంపాదించిన డాలర్లు చాలు- ఎన్ని లక్షలున్నా పరాయి దేశం పరాయి దేశమే. పుట్టిన గడ్డ మీద బ్రతకాలన్న కోరిక, మాతృభూమి మీద మమకారంతో దేశానికి సేవ చేద్దామన్న ఆలోచన వచ్చి సరేనని వచ్చారుట. జూబ్లీహిల్స్ లో లంకంత బంగళా, గార్డెన్, ఆ ఫర్నిచరు. ఆ బోంసాయ్ మొక్కలు హాబీగా ఎలా పెంచుతోందో, ఎన్ని క్లబ్బుల్లో మెంబర్లో.. ఎంతమంది వి.ఐ.పి.లతో పరిచయమో.. చెవుల్లో దుమ్మువదలి పోయిందనుకో..."
    "అన్నీ బాగానే వున్నాయి, మీరెందుకు అలా వున్నారని అడుగుతున్నాను"
    రాజారావు కాసేపు మాట్లాడకుండా తల దించుకు కూర్చున్నాడు. తరువాత తలెత్తాడు.
    "ఏమిటో మళ్లీ అప్పటిలాగే తనముందు నేనో చీమనో, దోమనో అయిపోయినట్టు న్యూనతాభావం.. ఏదో హాయిగా బతుకుతున్న నా జీవితంలోకి మళ్లీ వచ్చి, ఆ రోజులు జ్ఞాపకంలోకి తెచ్చి ప్రశాంతంగా పారుతున్న నదిలోకి రాయి విసిరినట్టు ఏమిటోలా అన్పించింది" శకుంతల వంక చూస్తూ నిజాయితీగా అన్నాడు.
    "అంటే మీకింకా ఆమె మనసులోంచి పోలేదన్నమాట..."
    "ఛా...ఛా... అదేంకాదు..." గాభరాగా అన్నాడు.
    "అదేం లేకపోతే, ఏదో పాత ఫ్రెండు కన్పించింది, మాట్లాడింది అనుకుని మామూలుగా వుండచ్చుగా.. ఎప్పుడో, ఎక్కడో పాత తెలిసినవారు కనిపిస్తే యిలాగే రియాక్ట్ అవం గదా. మీరెందుకు యీ సంఘటనకి యింత ప్రాముఖ్యం యివ్వడం.."
    "ఏమో నాకు తెలియదు. నీకు తెలుసుగా తన మాటలు, ఇతరులని తనవైపు తిప్పుకునే చాకచక్యం, ఆ కన్నింగ్ నెస్, ఎందుకో నా మీద అవసరాన్ని మించిన శ్రద్ధ చూపించడం.. నాకెందుకో భయం, అనవసరంగా యిన్నేళ్ల తరువాత తనిలా రావడం నా ప్రశాంతతని భగ్నం చేస్తుందేమోనని.. మళ్లీ నా జోక్యం లేకుండా నా ఆలోచనల్లో జొరబడి.." గొణిగాడు.  
    "చాల్లెండి బడాయి... పెద్ద మీరేదో చాలా గొప్పవారు, మీ కోసం ఆవిడ ఏడుస్తున్నట్టు భ్రమించి, మీకు మీరే ప్రాముఖ్యం అంటగట్టేసుకుని ఊరికే పోజు పెట్టకండి. మీరేం చిన్న కుర్రాళ్లా. యాభై ఏళ్లు వచ్చాయి. ఆవిడకి పెద్ద పెద్ద పిల్లలు. విలాసవంతమైన జీవితం, లక్షలార్జించే మొగుడు అన్నీ వుండగా ఏదో మీలాంటి వాడిమీద ఏదో ఇంట్రెస్ట్ వుందన్నట్టు ఆలోచించడం బాగోలేదు. కాలేజీ రోజులు, తెలిసీ తెలియని వయసు. ప్రేమ అనుకుని మనసులు పారేసుకుని దేవదాసులయిపోవడం కుర్రాళ్లకి మామూలే. మీరింకా ఆ స్టేజిలోనే వున్నాననుకోకండి" వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ నవ్వింది శకుంతల.
    శకుంతలకి వున్న నమ్మకం తనమీద తనకు లేదు. అతనికి తెలుసు ఆ సంగతి. గీత సంగతి తెలిసిన అతనికి గీతంటే తనకున్న బలహీనత గురించి వయసుతో సంబంధం లేని ఆ ఆకర్షణ నుంచి తను తప్పించుకోలేడన్నది అతని భయం. ఆ విషయం శకుంతలకి అర్థం అయ్యేట్టు చెప్పడం అతనికి చేతకాదు.

                                                                            *    *    *    *    *

 Previous Page Next Page