Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 16


    "ఈవిడ మూలంగా నా వాళ్ళందరికీ దూరం అయ్యాను, కట్టు కున్న మొగుడిని, అత్తవారిని సరిగా చూడటం నేర్పండి.
    "ఏమిటి ఎదిరించాను. పెళ్ళయి వచ్చిన దగ్గరనించి మొదటి రోజు నుంచి ఒక్కలా కాల్చుకు తింటున్నారు. నన్ను నా వాళ్ళని ఆడిపోసు కుంటూంటే ఎంతకని సహిస్తానన్నయ్యా? ఏం పెళ్ళి చేశారు? మీరంతా కలిసి- గొంతు కోసారు. ఒక్కరోజు సుఖం లేదు ప్రాణానికి -నన్నీ నరకం నించి తీసుకు పో -లేదంటే ఇంత విషం తెచ్చి ఇయ్యి" అన్నాను ఏడుస్తూ.
    "తీసుకుపొండి. మీ చెల్లెలికి ఆబుర్ర తిరుగుడు తగ్గితే పంపండి. భర్త కావాలిస్తే చచ్చినట్లు పడివుండమనండి. లేదంటే తీసుకుపొండి." కటువుగా అని జోళ్ళు తొడుక్కొని బయటకు వెళ్ళిపోయారు.
    అన్నయ్య నాద్వారా ముందునించి సంగతులు విన్నాడు. వాడూ చిన్నవాడు. కర్తవ్యం ఏమిటో ఏం చెయ్యాలో వాడికి తోచలేదు.
    "ఏమిటో ఇలాంటి మనిషి. ఈ రోజుల్లోకూడా ఇలాంటివారు వున్నారంటే నమ్మలేకుండా వున్నాను. చదువు కున్నవాడు. సంపాదించుకుంటున్నవాడు బొత్తిగా యింత లేకిగా పెళ్ళిలో కట్నాలకోసం లాంఛనాలకోసం సారెకోసం భార్యనిలా హింసిస్తాడా. మన కర్మకొద్ది దొరికాడు. యిలాంటివాడని తెలియదు." అంటూ వాపోయాడు.
    ఇద్దరం కలిసి వెళ్ళడానికే నిర్ణయించాం. యింటి కెళ్ళాక నాన్న అమ్మ ఏం అంటారోచూద్దాం. తరువాత సంగతి తరువాత. అమ్మ నిన్ను చూడాలని బెంగపెట్టుకుంది. పద బయలుదేరు అన్నాడు.
    ఆ క్షణంలో ఆ నరకంనించి బయటపడబోతున్నందుకు బ్రహ్మానందపడి చక చక పెట్టె సర్దుకున్నాను.
    
                                               *    *    *
    
    ఏడాది తరువాత నావాళ్ళని చూడగానే కళ్ళు నిండాయి. అప్పటికైనా వచ్చినందుకు అమ్మానాన్న సంతోషించారు. ఆ సంతోషం పట్టుమని రెండుగంటలే! అన్నయ్య నోట సంగతి విన్న అమ్మ నాన్నల మొహాలు వివర్ణమయ్యాయి.
    కలవరపడ్తూ "నిజమేనా తల్లీ". ఆందోళనగా అడిగారు నాన్న.
    నిజమన్న సంగతి నా మొహమే చెప్తూంటే యిద్దరూ విలవిలలాడారు!
    "యిదేం ఖర్మ. సుఖపడ్తావని శక్తికిమించి ఖర్చు పెట్టి పెళ్ళిచేస్తే నీ అదృష్టం యిలా తయారయిందా. అయ్యో మాకెందుకు రాయలేదు. చదువుకున్నవాడు, వున్నవాళ్ళు అని చేశాం, వీళ్ళిలాంటివాళ్ళని తెలుసుకోకపోయాంగదా." అమ్మ కళ్ళు నిండాయి.
    "నాన్నా - అతనెంత పొగరుగా మీ చెల్లిని తీసుకుపొండి అన్నాడో తెలుసా. తప్పు తనది, పైపెచ్చు దీన్ని తిడ్తాడు. కొట్టడం ఏమిటి నాన్నా! వెంటనే మీరు ఏదన్నా చెయ్యాలి నాన్నా." ఆవేశంగా అన్నాడు అన్నయ్య.
    నాన్న ఆవేదనగా "ఏంచెయ్యను?" అన్నారు నిస్సహాయంగా చూస్తూ.
    "నాన్నగారూ నాకున్న డిగ్రీకి ఏదన్నా ఉద్యోగం దొరికితే చూసిపెట్టండినాన్నా...ఏదో యింత సంపాదించుకుని నా బతుకు నేను బతుకుతాను. నన్నో మనిషిగా చూడని ఆ నరకంలోకి యింక వెళ్ళను నాన్నా. ఆడదానికి మొగుడెంత అవసరమో మొగాడికి ఆడదాని అవసరం అంత కంటే ఎక్కువని ఆయనకి తెలియ చెప్తాను" ఆవేశంగా అన్నాను.
    నాన్నగారు ఏం అనాలో ఏం మాట్లాడాలో తెలియనట్టు మౌనంగా ఆవేదనగా కూర్చున్నారు.
    అమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది. "శారదని తీసికెళ్ళి దిగబెట్టినపుడు మీరెళ్ళి నాలుగూ అడగండి. అసలతని ఉద్దేశం ఏమిటో కనుక్కోండి. మాకింతకంటే శక్తి లేదు అని దణ్ణం పెట్టండి."
    "అమ్మా." అరిచాను కోపంగా. "వీల్లేదు. మనం ఏం తప్పు చేశామని వంగి దండాలు పెట్టాలి. మనం లొంగితే యింకాస్త నెత్తికెక్కుతారు. ఆడపిల్ల నిచ్చినంత మాత్రాన బానిసల్లా పడివుండాలా. ఆయన కంత పెళ్ళాం అక్కరలేదనుకుంటే నాకూ మొగుడు అక్కరలేదు." తీవ్రంగా అన్నాను. అమ్మ అదోలా నవ్వింది.
    "శారదా నీకింకా చిన్నతనం. ఒకసారి పెళ్ళంటూ అయ్యాక ఆ మొగుడు కావాలనుకోడానికి అక్కరలేదనుకోడానికి ఈ దేశంలో ఆడదాని చేతిలో ఏం లేదమ్మా. మన సమాజం, మన కట్టుబాట్లు....యివన్నీ నీ కర్ధంకావు. కట్టుకున్న మొగుడ్ని కాదనడం అంత సుళువుకాదు. దాంతో మన పరువు ప్రతిష్ట నీతోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ముడిపడి వుంటాయి. ఈ సంబంధాలు తెంచుకోడం అంత సుళువే అయితే రోజూ ఎందరో తెంచుకుని పోయేవారు..." నాన్న గారు నెమ్మదిగా అన్నారు.
    తెల్లబోయాను. నేనెంత తెలివి తక్కువదాన్ని. ఎంత సేపూ నాగురించి నేను ఆలోచించుకున్నాను! ! నాన్నగారి మాటలతో హతాశురాలి నయ్యాను.
    ఈదేశంలో ఆడపిల్లని కన్న తల్లితండ్రులు ఆడపిల్ల పెళ్ళిచేసి పంపాక అమ్మాయి అదృష్టం బాగుండి సుఖపడితే సంతోషించడం లేకపోతే కన్నీరు కార్చడం మినహా ఏం చెయ్యలేని నిస్సహాయులని మా అమ్మ నాన్నలని చూశాక నాకర్ధం అయింది. అమ్మాయిని అల్లుడు హింసిస్తూవుంటే ఎదిరించి ధైర్యంగా యింటికి తీసుకురాగలిగే ధైర్య సాహసాలు వారికిలేవు.

 Previous Page Next Page