Previous Page Next Page 
మైదానం పేజి 17


    'ఇంక రా యింటికి వెడదాం' అని నిరుత్సాహమైన గొంతుకతో నెమ్మదిగా అన్నాడు. నా మనసులో రాయి పడ్డది. వెన్నెల మాయమయింది. నా అమీర్ ముఖంలోని ఆ ఒక్క నిర్ణయం అయిన చూపుతోనూ, 'ఈ ఎత్తేమిటి?' అన్న ఆ ఒక్క మాటతోనూ నా జీవితాకాశం మీద నల్లని మేఘాలు కమ్మాయి.
    "చూడు. ఆ పొట్ట దగ్గిర వ్యవహారం నాకేమీ బావుండలేదు. దాన్ని ఎట్లానన్నా వొదిలించుకో-"
    "యేం చెయ్యను?"
    "పోగొట్టుకో"
    "నీ బిడ్డ అమీర్!"
    "నా బిడ్డ కాదు, దెయ్యం. బిడ్డ వొద్దూ, మొద్దూ వద్దు చంపెయ్యి."
    నేను మాట్లాడలేదు. ప్రేమకోసం అమీర్ తో వచ్చేశాను. ఇక రెండో ఆలోచనలేదు. కాని యిప్పుడా పని చెయ్యడమంటే పెద్ద భయం మొదలుపెట్టింది. దేనినన్నా చంపడం, ఎవరి డబ్బన్నా దోచుకోడం, అన్యాయంగా సాక్ష్యం చెప్పి ఖైదుకు పంపడం-యీ పనులు చెయ్యవలసి వస్తే ఎట్లాంటి పాపభయం తోస్తుంది? అట్లా వుంది. ఈ పనితో దేవుళ్ళందరికీ నా మీద కోపం వస్తుందనీ, అమీర్ ని నన్నూ ఎట్లానో శిక్షిస్తారని వొణుకు పట్టుకుంది. ఇప్పుడూ అట్లానే అనిపిస్తోంది. నిజంగా శిక్షించారేమో-
    అదిగాక ఏదో ప్రేమకూడా అప్పుడే ఉదయించింది. దేనిమీదనో తెలియని దానిమీద. అమీర్ పడే అసహ్యంకూడా నా యీ భయాన్ని జయించలేకపోయింది. తల్లి తన పిల్లలకైపడే రక్షణోద్రేకం నా కప్పుడే కలిగింది. అమీర్ హంతకుడైనట్లూ, నేను ఆ అనాధ శిశువుని రక్షించవలసినట్లూ, రక్షణ కోసం అది నన్ను వేడుకొంటున్నట్లూ తోచిందిప్పుడు. ఏమైనా సరే నన్ను అమీరు ఒదిలివేసినా, నా బిడ్డని రక్షించుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనెంత బతిమాలినా నేను వొప్పుకోలేదు. నాకే అర్థంకాని, ఎన్నడూలేని మొండిపట్టు ఒకటి బయలుదేరింది నాలో. అతని మీది నా గొప్ప మోహాన్ని మింగివేయగల యింకోశక్తి నాలో పెరిగింది.
    ఆ కోపంతో అమీరు అక్కడక్కడ తిరుగుతున్నాడు. నే ఒంటరిగా కొండమీద తేలే నీడల్ని చూస్తూ కూచునేదాన్ని. కాని అంత వొంటరి అనిపించేది కాదు. అమీరు ఒకరోజు తాగివచ్చి నన్ను కొడ్తాడు. కాని తరవాత పశ్చాత్తాపంతో ఎంతో ప్రేమ చూపాడు. ఒకనాడొక దక్షిణాది చీర తీసుకొచ్చి నాకిచ్చాడు. నేను యిదేమిటా యితనికి యీ చీరలమీద శ్రద్ధ అనుకున్నాను.
    "నాకు కనబడకుండా యిది కట్టుకో" అన్నాడు. నా మొహంమీద ఉమ్మేసినట్లయింది.
    నా జీవితం యేం కావాలి? విచారం గట్టిగా పట్టుకుంది. అమీర్ నాలుగైదు రోజుల నుంచి అసలే కనబడడంలేదు. నేను ఆ పనిని వొప్పుకుంటేనే కాని అతనితో యింక సఖ్యంలేదని తెలియజేశాడు. నన్నీ విధంగా ఒంటరిగా నమ్మించి, తీసుకొచ్చి, యెంత చెప్పినా నా భయాన్ని అర్థం చేసుకోక నన్ను యిట్లా వదిలివేసే అతని కఠినత్వానికి యెంతో కోపం వచ్చింది. యేడుపొచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద పోట్లాటయింది.
    ఆ ఆరునెలలూ తాను యెక్కడికో వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళవద్దని నేనేడ్చాను. అయితే తన మాట వినమన్నాడు. వినకపోవడానికి కారణం చెప్పమంటాడు. చెప్పడం యెట్లానో నాకు తెలీదు. మొండికేసి మాట్లాడకుండా మూలకూచున్న నన్ను చూసి పళ్ళు కొరికి కర్ర తీసుకొని బాదాడు. నేను మాట్లాడలేదు. చప్పున పెద్దగా ఏడ్చాడు.
    "దీని మూలాన్నే, యీ పాడు పిశాచం మూలానే నీకూ నాకు చెడిందని" నా డొక్కలో ఒక తన్ను తన్నాడు; ఎందుకో అతని మీద అంత కోపంలోనైనా అతని కాలుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అదుగో తృణీకారం కనబడుతోంది నీ ముఖంలో కాని అమీర్ని చూశావా?
    కోపంలో కళ్ళు యెర్రగా రుద్రుడివలె మెరుస్తూ, ఆ పెద్ద చేతులు బిగించి-అట్లాంటివాడికి అంత ఆగ్రహం తెప్పించేటంత అదృష్టం ఎవరికి కలుగుతుంది? కోపం వచ్చింది. కాని అతనిపైన గౌరవం అధికమైంది. దృఢంగా కోపం తెప్పించుకుని నిస్సంశయంగా కొట్టగలిగిన వాళ్ళని చూస్తే ఉండదూ మరి....?
    హత్య అయినా సరే. ఆత్మహత్య అయినా సరే చెయ్యమంటారు. తమ కోసమూ, నీ కోసమూ తాము చేస్తారు. యే చిన్న భయాలూ, సందేహాలూ, పాపాలూ, వాళ్ళనేమీ అంటవు. వాళ్ళకి అర్థంకావు. వాళ్లు ప్రేమ చూపినా, ద్వేషం చూపినా దేవతలే. ఆ దేవతలకి చేసినట్లే ఆత్మార్పణం చెయ్యాలి. దేహాన్నీ, ప్రాణాన్నీ, పిల్లల్ని అర్పించాలి, వాళ్ళ పాదపీఠాల వద్ద. ఈ చచ్చు మొగుళ్ళు అట్లాంటి త్యాగం అడిగేటంత సమర్థులు కారు. గయ్యాళిగంప భార్య రోడ్డుమీద పడి అరిస్తే నోరు మూసుకున్నాడు. మా వూరి కరణం. బళ్ళో కుర్రాడితో తన కళ్ళముందు కాపరం చేస్తున్నా బయటికెక్కడ కొస్తుందోనని కనిపెట్టి కడుపులో దాచుకున్నాడు హెడ్మాష్టరు. నేనే ఇంకోడి కోసం కన్నెత్తితేనా ఇక్కడే నరకడూ అమీర్? నన్నే యింకొకడు కన్నెత్తి చూస్తేనా? వాడి కళ్ళు పెరికి పాతిపెట్టడూ? పదిమంది వొచ్చి మీదపడ్డా, తనని నరికినా, నన్ను వాళ్ళకి వొదిలి పరిగెత్తుతాడా? విస్తరినిండా తుంపర్లు పడేట్లు తిడతారు. దొంగతనంగా బుగ్గలు మెలేస్తారు, అంతేకాని దిమ్మతిరిగేట్టు అమీర్ మల్లే కొట్టమను మన మొగాళ్ళని. అసలు వాళ్ళ చేతుల్లో సత్తువ ఏడుస్తేగదా! ప్రతిష్ట దేవతని పూజ చెయ్యడం తప్ప యింకేమీ చాతకాదు మన పురుషులకి.
    ఆ రాత్రి పెద్దవాన, సాయంత్రం నించి యెడతెరిపిలేక కురుస్తోంది. దీపమన్నా లేని ఆ చిన్న గుడిసెలో యిద్దరమూ కూర్చున్నాము. ఏ నిమిషాన ఆ పైకప్పు ఎగిరిపోతుందో అనుకుంటున్నాను. జగమంతా జలమయమయినట్టూ, మేమిద్దరమే ఆ చిన్న నావలో అనంతయాత్ర చేస్తున్నట్టు అనిపించింది. ఇంక తెల్లవారదు. తేలుతో యే లోకానికో, యే ఒడ్డునో చేరుకుంటాము అనుకున్నాను. ముందేదో అపాయం రాబోతుందనిపించింది. అప్పుడన్నా అమీర్ ఆ రాయివంటి మౌనాన్ని వదులుతాడా! ఎంత రాత్రి అయిందో తెలీదు. అప్పుడప్పుడూ యోచనలోనూ, కునికిపాట్లలోనూ తూగుతున్న నాకు రోజులో, వారాలో జరిగిపోయినట్టు తోచింది. ఇంత ఆ చిక్కని వూపిరాడని నిశ్శబ్దాన్ని భరించలేక పిలిచాను. జీర్ణమైన ఆ గుడిశని చలిగాలి, చినుకులతో సహా యీ మూల నించి ఆ మూలకి వూడ్చుకుంటూ పోతోంది.

 Previous Page Next Page