"అమీర్!" మాటలేదు.
"అమీర్!", అంతే-
మెల్లిగా కదులుతో, చేతులతో, తడుముతో వెళ్ళాను.
నా కాళ్ళు అతని కాళ్ళకు తగిలి ముందుకు తూలిపడ్డ చేతులమీద అనుకున్నాను. అతను కదలక అట్లాగే పడుకున్నాడు. కోపంతో మండిపోవడంలేదు గదా? నేను మోకాళ్ళ పక్కనే కూచున్నాను. అతని శ్వాసా, వానహోరు చప్పుడూ? ఆకాశం భగ్గుమని వెయ్యి కాగడాలతో వెలిగింది. ప్రళయం వొచ్చింది. మేమిద్దరం నాశనమనుకుని వొణికాను. పెళ పెళ ఆకాశం విరుచుకుపడుతూ వుంది.
"అమీర్! చచ్చాను" అని అతన్ని కావలించుకున్నాను.
"రాజా!" అని నన్ను గట్టిగా కావలించుకున్నాడు.
ఏటి ప్రవాహం మోగుతోంది. గాలి గుడిశ గడ్డిలో నుంచి దూసుకుపోయింది. మెరుపురానీ, ఉరుములు రానీ ప్రళయమే రానీ యింక భయం లేదు, ఆ రెండు చేతులూ నన్ను రక్షిస్తున్నంతసేపు.
"యెన్నాళ్ళకి! మళ్ళీ యెన్నాళ్ళకీ"
దగ్గిరిగా, యింకా దగ్గిరిగా జరిగి, వొత్తుకుని, అణిగి, ఐక్యమై పోయినాను.
మాట్లాడలేనంత ఆనందంలో మునిగిపొయినాను.
"అమీర్!" "అబ్బా భరించలేను" అంతే.
వాన మళ్ళీ యింకా నాలుగు రెట్లుగా ప్రారంభించింది.
అమీర్ 'నా మాట వినవా?' అన్నాడు. తన చేతులతో రొమ్ములో నన్ను అదుముతూ-
"ఈ మెత్తని శరీరంలో ఎక్కడ వుంది ఆ పట్టుదల, ఆ పెంకితనం?"
"పెంకితనం లేదు" అన్నాను.
'అవును.' పెంకితనం కాదనీ, నా శక్తికి మించిన ప్రోద్భలమనీ చెప్పాలనుకుంటాను. మాటలు తెలీవు. అమీరుకి తెలిసేట్టు యెట్లా చెప్పాలో తెలీదు. మాట్లాడలేదు. కాని అతనినట్లా బతిమాలుకుంటే నా కోసం, మా ప్రేమకోసం, మా ఆనందం కోసం-
మాట్లాడలేదు. నా కంఠం విచారంతో పట్టుకుపోయింది.
"నీకు నా మీద ప్రేమ వున్నదన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమను. నా రక్తమంతా కార్చమను. నా తండ్రిని నరకమను వెనుతీస్తానా?"
ఉత్త ప్రగల్భాలు కావనీ, వెనుతీయడనీ నాకూ తెలుసు.
"ఇంతేనా? ఇంత క్రూరమైనదానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను వొదుల్చుకోడానికి చూస్తున్నావా?"
క్రూరమైన మాటలవి. కాని అమీర్ కంఠంలోని జాలి వాటికి భయంకరమైన లోతును కలిగిస్తూ వుంది-
"రాణీ! ఇంతేనా మనకి?"
రెండు వేడి కన్నీటి చుక్కలు పడ్డాయి. అవి అతని కళ్ళలోనించి రక్తపు చుక్కలయినట్టు భయపడ్డాను. అమీర్ కళ్ళలోంచి నీళ్ళా౧ నల్లరాతిలో నించి! యింక ఆగలేను. పోనీ సరేనంటా. యే త్యాగమైనా యింకా సంకోచింపగలనా?
మెల్లిగా గుండ్రంగా నా పక్క ఎముకల్ని-కాదు నా గుండెల్ని- నా ఆత్మని-తాకుతూ తన చిన్న కాళ్ళతోనూ, పెదిమలతోనూ రాసుకుంటూ కదిలింది. నా మొహం తిరిగింది. యేమనను? ఎట్లా? తన ప్రాణం కోసం, పాపం ఆ నోరులేని దిక్కుమాలిన ఆ చిన్నకూన తన ప్రాణం కోసం వేడుకొంటోంది?
అమీర్ బిడ్డ?
"నా చేతకాదు అమీర్?"
మొహంమీద ఉమ్మి పడ్డవాడివలె లేచాడు అమీర్. ఆకాశం మెరిసింది. అమీర్ ముఖాన నిప్పులు రాలుతున్నాయి. ఏం చేస్తాడో, యేమంటాడో అనుకుంటూ వున్నాను.
ఆ పెద్ద ఉరుము మధ్య పిడుగువలె అతని మాటలు నా చెవిమీద పడ్డాయి.
"నేను వెడుతున్నాను."
సీత నడివికి పంపించ నిశ్చయించుకున్న రామున్ని కన్నీళ్ళెంత మాత్రం కరిగించగలవో అమీర్ నీ అంతేనని తెలుసు. ఇద్దరూ ధీరోదాత్తులు, కాని మాట్లాడకుండా యెట్లా వూరుకోను?
"యెక్కడికీ!"
"యెక్కడికైతేనేం! ఇంకా ఆర్నెల్లకి వొస్తాను."
"అమీర్ నువ్వు కనబడక ఒంటరిగా నేనిక్కడ...."
"నీకు బియ్యమూ అవీ మీరా యిస్తాడు."
ఇదే చివరిమాట. నేను యెంత గోలపెట్టినా, ఏడ్చినా ఒక్కమాట మాట్లాడక ఒక్కసారి నా వేపు కన్నెత్తి చూడక వెళ్ళిపోయినాడు నా అమీర్. ఆ వానలో, ఆ చీకట్లో, ఆ అర్థరాత్రి!
6
అమీర్ ఒక్కరోజు కనబడకపోతే ఒక్కరోజయినా యెట్లా బతకనా అనుకునేదాన్ని, వెళ్ళింతరవాత నేననుకున్నంత ఒంటరిగా లేనేలేదు.
నన్ను అన్యాయం చేసి వొదిలాడే అనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధపెట్టాయి. అమీర్ మీద కోపం కలిగింది. ఎట్లానన్నా అతను నా కోసమే పరితపించి బాధపడేటట్టు చెయ్యాలనిపించింది. ఇంక అతనికి కనపడకుండా వెళ్ళిపోతే. దేంటోనయినా పడి చచ్చిపోతే? మళ్ళీ వెళ్ళి అమ్మదగ్గిర చేరితే? ఇన్నీ అనుకున్నాను.
మీరా పదహారేళ్ళ కుర్రవాడు. చాలా నాజూకైనవాడు. తరతరాల నించి వొచ్చే గొప్ప వంశపు లక్షణాలు అతనిలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఆ వేళ్ళ యెర్రని చివర్లలో, ఆ కళ్ళ కొలుకుల తేటలో, ఆ చంపల పాల మెత్తదనపు నునుపులో, మాట్లాడేప్పటి వొంపు ధీరత్వంలో, చేతుల నెమ్మదీ, గంభీరమూ అయిన ఊపులో, మర్యాదలో, గౌరవంలో, ధీయుతమైన కాంక్షలో సహజంగా పుట్టిన 'నొబిలిటీ' తోస్తుంది. వందల కొలది యేళ్ళనించీ నీచమైన తలంపులు లేనటువంటి వాళ్లూ, సౌందర్యాన్నే ఆరాధించి, దేహాన్నీ, ఆత్మనీ మెరుగుపెట్టి తేజస్సుతో నింపినవాళ్ళూ మీరాని కన్నట్టున్నారు. అట్లా సుందరమైన పటంలాగ, విగ్రహంవలె, ప్రపంచాత్మానందం కోసం ఉండిపోవలసిన వాడుగాని, సామాన్య మానవుల వలె పనికీ వ్యవహారానికీ ఉపయోగపడవలసినవాడుగా కనబడడు. నాలుగు రోజుల్లో నాకు వశుడైనాడు. భోజనానికీ, నిద్రకి ఇంటికి వెడతాడు. తక్కిన సమయాలలో యెప్పుడూ నాకెదురుగా మాటలు చెపుతూ కూచుంటాడు. నేనేమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా చెవులూ, కళ్ళూ వొప్పజెప్పి ఒక్కమాటెక్కడ మాయమౌతుందో, ఒక్క చూపెక్కడ జారిపోతుందో అన్నట్టుంటాడు. త్వరలో అమీర్ నాకు జ్ఞాపకం రావడమూ, నేను విచార పడడమూ తక్కువై పోయినాయి. నా కళ్ళవెంబడి నీళ్ళచుక్క చూశాడంటే మీరా గిలగిల లాడేవాడు. నా ఆలోచనలోకి కొంచెం విచారం తోచగానే నా ముఖాకాశం మీదికి మబ్బు వొచ్చిందని, తాను గాలిననీ, వీచి మబ్బుల్ని తరిమేస్తాననీ మాటలు చెప్పి నవ్విస్తాడు. నా వొళ్ళో పడుకుని వూరికే పాటలు పాడుతూ యిటూ అటూ దొర్లుతాడు. నా కళ్ళలో పడే జుట్టుని పైకి తోస్తూ, దాంతో 'సీరియస్'గా పోట్లాడతాడు. నా నవ్వును దాచుకుంటానని అల్లరి యత్నాలు చేస్తాడు. నా వేళ్ళు బొమ్మలైనట్టు గంటలకొలది ఆడుకుంటాడు. పది వేళ్ళకీ పది ముద్దు పేర్లు పెట్టాడు. వాటిని పిలుస్తాడు. మాటాడతాడు. అతని అందమైన బుగ్గలు నిమురుతూ, అతన్ని కావలించుకుంటూ వుడికిస్తూ, నేను కాలం గడిపేదాన్ని. అతని ఆటలూ, స్నేహితుల అల్లర్లూ, చిన్నపిల్లలమీద చిన్నప్పటి ప్రేమలూ, అన్నీ సంతోషంగా వినేదాన్ని. ఆ చేతులు కొంచెంగా వూయిస్తూ రాజఠీవితో తల ఆడిస్తూ మాట్లాడుతూ వుంటే యీ నవాబు నా వొళ్లో కెట్లా వొచ్చాడనిపించేది. ఎక్కడనించో తెచ్చేవాడు కూరలూ, ఫలహారాలూ, పాలూ, పళ్ళూ, ఇంటిదగ్గిర పెట్టినవన్నీ దాచి నాకు పట్టుకొచ్చేవాడేమో? రోజూ సాయంత్రం పూలదండ చేతిలో లేనిది నాకు కనపడడు. నన్ను రాత్రి పడుకోబెట్టిగాని యింటికి పోడు. నాకు వొంటరిగా భయం వేస్తుందని యింటికి వెళ్ళడు, నేనెంత బతిమాలినా.