Previous Page Next Page 
మైదానం పేజి 16


    "మహారాజా! దుర్గంధమున నివశించు పురుగులవలె వారిని ఆ పాపమున బ్రతుకనిచ్చుటే మహాశిక్ష."
    "రాజ్ఞీ! వారితో నేమి! తలచుకొనుటకైన తగని ఆ తుచ్చుల ప్రస్తావన మానుము...."
    "నీ ముఖ సౌందర్యాన్ని కోరి, చంద్రుడు మేఘముల మాటున దాగుకొన్నాడు. నీ ముద్దు పెదవులు తాకి, ఆ పరిమళము వల్ల యిదేదో కొత్త పుష్పమును భ్రాంతితో ఆనిలుడట్టే నీ చుట్టూనూ మూగుచున్నాడు. నీ చుట్టూనూ వెన్నెల కొంచె మెర్రకాంతిని పొందుటచేత సూర్యోదయ మయిందా అని కోవెల మేల్కొనది. నీవీ ప్రపంచము నిట్లు క్షోభపెట్టుట న్యాయము కాదు. నీవు లేక చిన్నపోయి విచారగ్రస్తమైన శయ్యాగృహాన్ని నీ నేత్ర కాంతులతో వెలిగించుము."
    "మీ నేత్ర ప్రతాపాగ్నిని చూచి భయపడి సర్వ ప్రపంచమునూ నిశ్శబ్దమయినది. చిరకాలము మేఘముల వెనక దాగుకున్న చంద్రుడు సోమరి అని, మీరాగ్రహించెదరని బయటకు పరుగెత్తి మీ కళ్ళవంక భయంతో వీక్షించుచున్నాడు. మీ భారమును మోయలేక మన పాదముల కింద ఈ నగాధిపతి వణుకుచున్నాడు. మీ సౌందర్య మహిమను ప్రేమించి మ్లేచ్చాధముని కుటీరంబున బంధింపబడ్డ యింతి విరహతావమున యేడ్చుకన్నీళ్ళే ఆ యేరు. ఆమె నిట్టూర్పు....
    అమీర్ కొట్టవచ్చాడు. నేను పరుగెత్తాను. తొరలోనే అలిసిపోయి ఆగాను. ఎందుకో అమీరు నన్ను అందుకోవడమంటే భయమేసింది.
    కొండ అంచున నుంచుని "యింక వొస్తే దూకేస్తాను" అన్నాను.
    "దూకు చూస్తాను" అంటూ వొస్తూ వున్నాడు. నాకు నిజంగా దూకెయ్యాలనిపించింది. దూకి అతని కళ్ళల్లో బాధని చూడాలని కోర్కె కాబోలు! అతనికి నామీద వ్యధ కలిగించి, మోహపు అంతుని కనుక్కోవాలనే ఆశ గావును. తప్పించుకో చూసే నన్ను పైకెత్తి మేకపిల్లని లాగు మోస్తూ తీసుకొని వెళ్ళాడు. గట్టిపడ్డ అతని దండలమీద చేతులువేసి పట్టుకుని కిలకిలనవ్వుతూ యిటూ అటూ చంటిపిల్లవలె తన్నుకుంటున్నాను. అతనికి యెదురుదెబ్బ తగిలి 'అబ్బా' అంటే కొంచెం సంతోషం వేసింది. దెబ్బ బాధతో పళ్ళు బిగించి నన్నాడనీకుండా తన రొమ్ముకి నా ఎముకలు విరిగేటట్టు వొత్తుకుని, వెళ్ళి చదునుగావున్న రాతిమీద పడుకోబెట్టాడు.
    'నీ మూలంగా నాకెంత దెబ్బ తగిలిందో చూడు' నేను పకపక నవ్వాను. ఎత్తయిన ఆ ప్రదేశంలోంచి లోయలోకి నా నవ్వు ప్రతిధ్వనించి మూడుసార్లు నవ్వులు దూర దూరంగా వినబడ్డాయి. అమీర్ రొమ్ముపైన తల పెట్టుకుని వెన్నెలలో నిండిన దక్షిణ దిక్కుకేసి చూస్తూ శాంతంగా పడుకున్నాను.
    సంపూర్ణమైన సంతుష్టితో నా చెయ్యి గరుకైన అతని చంపల్ని రాస్తూ అతని మొహంమీద జుట్టును తాకుతోంది. చల్లగా, తెల్లగా. మా వొంటినిండా, కళ్ళనిండా, గాలినిండా వెన్నెల వుక్కిరిబిక్కిరయింది. కోట గోడలకింద దాక్కున్న చీకట్లు గంభీరంగా కనపడ్డాయి. ఆ కొండపైన నివశించి యీ వెన్నెల్ని అనేక శరత్కాలాలు అనుభవించిన రాణుల ఆత్మలు నా చుట్టూ మూగినట్టు అయింది. ఈ పర్వత రంగంమీద ఎందరు వెన్నెలలో కూడా కందగల లావణ్యంగల రాచ స్త్రీలు, ప్రియులకోసం విరహాలు పడ్డారో, ఎన్ని రహస్య సంకేతాల నేర్పరచుకున్నారో, వాళ్ళలో అదృష్టవంతులెందరు ప్రియుల్ని కలుసుకుని, శీఘ్రరహస్య గాఢాలింగనాన్ని అనుభవించారో, ఎన్ని భగ్నమైన హృదయాలో, వెన్నెలి వేడెక్కించే నిట్టూర్పులో, కన్నీళ్ళో, నవ్వులో - ఏమైనారు వాళ్ళందరూ! ఇక్కడే యీ కొండచుట్టూ వేళ్ళాడుతున్నారా? నేను అమీర్ కూడా అంతేనా, అట్లానే కాలంలో మాయమైపోతామా?
    అమీర్ పెదిమెలు నా ముఖాన్ని గట్టిగా ఆఘ్రాణిస్తున్నాయి తుఫాను మొదలని వాకర్థమవుతోంది. ఇంత శాంతంగా పాల సముద్రంలో తేలే పర్వత శిఖరాలమీద నిద్రపోతున్నట్టు వున్న ఆ మధురమైన శాంతాన్నెందుకు అతను కలవరపరచడం?
    "ఇంత వెన్నెలలో నిన్ను చూడాలి. నీటి చిన్ని అలమీద వలె నాట్యమాడే వెన్నెల నీ జుట్టుమీద చిన్న చిన్న చిందులు తొక్కితే చూడాలి. అలిసి నీ పక్షాల నీడలకింద నిద్రపోతాను" అని నన్ను ఒక్క నిముషంలో వివస్త్రను చేసి చూశాడు ఆనంద ముద్రిత నేత్రాలతో.
    అమీర్ తెలుగుదేశంలో పుట్టి, నన్ను పట్టుకుని యీ యెడార్లలో పడివుండక, యే పారవీక దేశంలోనో పుట్టివుంటే మహాకవి అయ్యేవాడని నా ఉద్దేశ్యం.
    "నల్లని గోదావరీ తరంగాలమీద చూశాను. మళ్ళీ నీ జుట్టుమీద చూస్తున్నాను, యీ వెన్నెల చిందులు" అంటాడు.
    జుట్టు నా మొహం మీదపడే వొంపుని చూసి "నల్లని సముద్ర తరంగాలు వంపు తిరిగి తెల్లని నదురుమీద పరుగెత్తుతూ మీద పడేందుకు వస్తున్నట్లు భయమేస్తుంది" అంటాడు. ఆ రాత్రి మాత్రం చిత్రకారుడై వుంటాడనిపిస్తోంది. నన్నట్లా చూసి పొట్టదగ్గర చెయ్యేసి 'ఇక్కడ యీ యెత్తేమిటి? యిట్లా సాగిందేం?" అన్నాడు.
    ఇంకా నాకే నిశ్చయం లేందే, యెవరూ కనిపెట్టటం సాధ్యంకాక ముందే, కళారసజ్ఞుడు అందమైన వొంపులకీ కానివాటికి నూరోవంతు భేదమయినది తెలియగల అతని కళ్ళకి తెలిసింది.
    వూరికే గుడ్డిగా ప్రేమించబడటం ఒక విషయం, ప్రేమిస్తున్నారని సంతోషంగా వుంటుంది. కాని అటువంటి రసజ్ఞుడు సౌందర్యారాధకుడు ప్రేమిస్తూ యెందుకు ప్రేమిస్తున్నాడో, దేన్ని ప్రేమిస్తున్నాడో తెలుసుకుని ప్రేమించి ప్రేమని పొంది, అతను ప్రేమించగల సౌందర్యాన్ని కలిగి ఉన్నాననే జ్ఞానం గొప్ప గర్వాన్నిస్తుంది. అమీర్ చూపుల్ని నిలిపివేయగల నా శరీరంమీద నాకంత ప్రేమ!
    "నా కోసం, నా కళ్ళని మెరిపించేందుకు నా చేతుల్ని లావణ్య వరాలతో నింపేందుకు మీ వాళ్ళు, మీ బ్రాహ్మలు తపస్సులుచేసి, దేవతల్ని మెప్పించి నిన్ను కన్నారు" అనేవాడు. ఆ అమీర్ నా అందాన్ని తప్పుపట్టాడిప్పుడు కాని నాకది బాగానే వుంది. గంతులేసే నా మనసు అతన్ని కంఠంలోని బాధని వినదలచుకోలేదు.
    "అమీర్ అది ఇంకా యెక్కువయేటట్టు వుంది. లోపల ఎవరో స్థలం కోసం వెతుక్కుంటున్నారు" అన్నాను.
    ఎంతో సంతోషంగా అమీర్ నన్ను మీదపడి నలిపేస్తాడో చీల్చేస్తాడో అనే భయంతో చేతులడ్డంగా పెట్టి కళ్ళు మూసుకున్నాను. ప్రళయాన్నెదురు కోడానికి తయారౌతున్నాను. కాని అతను తలవంచుకుని ఆలోచిస్తూ పెదవి కొరుకుతూ నుంచున్నాడు.

 Previous Page Next Page