Previous Page Next Page 
శరతల్పం పేజి 16


    మరో అడుగు ముందుకు వేద్దామనుకున్నాడు. చెరువుగట్టు మీంచి కేక వినిపించింది, "ఒరే గురువా చస్తవురా! తామర తీగున్నది! ఇవతలికి రా చస్తవు" వెనక్కి తిరిగి చూచాడు గురువయ్య. రామకిష్ణయ్య అరుస్తున్నాడు.
    గురువయ్య పూవును చూచాడు.
    నీటిని చూచాడు నీటి లోతును చూచాడు.
    తనను చూచుకున్నాడు. తన స్థితిని చూచుకున్నాడు.
    చెరువు కట్టాను చూచాడు, కట్టమీది రామకిష్ణయ్యను చూచాడు.
    పూవును వదులుకున్నాడు-చేతిలో ఉన్న మొగ్గతో బయటికి వచ్చాడు. "తామరమొగ్గ శాన బాగున్నది ఇస్తవా?" రామకిష్ణయ్య అడిగాడు. గురువయ్య తామరమొగ్గను చూచాడు. రామకిష్ణయ్యను చూచాడు. తామర మొగ్గ అక్కడ పెట్టి దూరం జరిగాడు. తామరమొగ్గ అందుకొని నవ్వాడు రామకిష్ణయ్య.
    "పనున్నది జరా చేసిపెడ్తవా?" రామకిష్ణయ్య అడిగాడు.
    "ఇయ్యాల చాతనైత లేదుండి" గురువయ్య జవాబు. రామకిష్ణయ్య కు ఆశ్చర్యం కలిగింది.
    "భీమునోలె ఉన్నవు. అట్లంటవేర! పైసలిస్త" డబ్బంటే కొండ మీది కోతి దిగివస్తుందని రామకిష్ణయ్య నమ్మకం. అసలు దేవుణ్ణి సైతం డబ్బుపెట్టి కొనవచ్చునని అతని విశ్వాసం.
    "ఏమోనుండి చాతనయితలేదు-కాల్మొక్త" అని సాగిపోయాడు మర్రిచెట్టువైపు గురువయ్య.
    రామకిష్ణయ్య అలా గురువయ్య వైపు కాసేపు చూచి తనదారితాను వెళ్ళి పోయాడు.    
    మర్రిచెట్టు కింద కూలబడ్డాడు గురువయ్య. అతని ఒంటిమీద తడిబట్ట ఎండి పోయింది. తామర వనాన్ని చూచాడు. అదంతా తాను కోసి ఉంటే అని ఆలోచించి రామకిష్ణయ్య తీసికెళ్ళేవాడు అనుకున్నాడు. అలా అనుకోగానే నల్లపిల్ల గుర్తుకు వచ్చింది. నల్లపిల్ల గుర్తుకు వచ్చేవరకు మళ్ళీ పిచ్చి, పిచ్చిగా అనిపించింది. అక్కన్నుంచి లేచాడు. చెరువు కట్టమీదపడి సాగిపోయాడు. ఎక్కడికి పోతున్నదీ తెలియదు. ఎందుకు పోతున్నదీ తెలియదు. కట్ట దిగాడు, చెట్లెక్కాడు. గుట్టలెక్కాడు. రాళ్ళేక్కాడు. దిగాడు. వళ్ళంతా చెమట పట్టింది. ఎండకు మెరుస్తున్నది. పొద్దువాలేదాకా అలాగే తిరిగాడు.
    పొద్దు వాలింది. తాటి వనానికి చేరుకున్నాడు, చింతచెట్టు బోసిగా కనిపించింది. అక్కడేమీ లేదు. ఎవరూ లేరు. కాలవ కనిపించింది. పారుతూంది. గురువయ్య తనను చూచుకున్నాడు; కాలవలో దిగి వళ్ళు కడుక్కున్నాడు- ముఖం కడుక్కున్నాడు. బండమీద కూర్చొని ఊరివైపు చూడసాగాడు. బాటనే చూస్తూ కూర్చున్నాడు గురువయ్య. ఎవరూ రావడంలేదు. బాట శూన్యంగా ఉంది - అతని గుండెలాగే.
    వస్తున్నది.
    గురువయ్య గుండె గంతువేసింది.
    ఆమె వస్తున్నది- కల్లుకుండ నెత్తిన పెట్టుకొని వయ్యారంగా నడుస్తూన్నది వస్తున్నది.
    వచ్చేది నల్లపిల్లే!    
    లేచి అమాంతంగా ఎదురుగా పరుగెత్తుదామనుకున్నాడు. నిగనిగలాడే బుగ్గలను ముద్దు పెట్టుకుందామనుకొన్నాడు. కాని తీరా లేద్దామనుకునేవరకు నీరు కారిపోయాడు. ఆమె ఏమనుకుంటుందో? లోకం ఏమనుకుంటుందో?
    అసలు తానెవరు? ఆమె ఎవరు?
    తాను మాల ఆమె గౌండ్ల.
    సాధ్యమా? ఇది సాధ్యమా?
    ఆలోచనలు అతన్ని అణగద్రొక్కాయి. అయినా అతనిలోని వెల్లవ తగ్గ లేదు. గురువయ్య లేచాడు. ఆమెకు ఎదురు పోయాడు.
    పరిగెత్తలేదు-మెల్లగానే సాగాడు.
    ఆమె దగ్గరకి వచ్చింది - జగన్మోహినిలా కనిపించింది - సురాఖాండంతో.
    ఏమిటో అందామనుకున్నాడు గురువయ్య - అనలేకపోయాడు.
    ఆమె చిరునవ్వు నవ్వింది.
    గురువయ్య గుండెలో వెన్నెలలు విరిశాయి.
    ఆమె రమ్మన్నట్లు తల వూపింది - సాగిపోయింది.
    గురువయ్య యంత్రంలా అనుసరించాడు.
    ఆమె కుండ దింపింది.
    సాయంకాలం ప్రశాంత సమయం- అక్కడెవరూ లేరు. ఇద్దరే అయినా అతడేమీ చేయలేదు. ఆకు నోటి దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు.
    ఆమె కుండ అందుకొని వంగింది.
    "నీ పేరేంది?" అడిగాడు గురువయ్య.
    "పిచ్చమ్మ" ఆమె గురువయ్య కళ్ళల్లోకి చూచి అన్నది. వెంటనే చూపు తిప్పుకొన్నది.
    "అట్లనా! నాకు పిచ్చెక్కిస్తున్నవు."
    పిచ్చెమ్మ చేతులు వణికాయి. కుండలోని కళ్ళు తొణికి కింద పోయింది.
    గురువయ్య ఆమె ముఖం చూచాడు-ఆమె ముఖంలో తామర పూలు కనిపించాయి. ముద్దు పెట్టుకోవాలనిపించింది కాని పెట్టుకోలేదు. లేచి నుంచున్నాడు. "పిచ్చంమా నే చచ్చిపోత" అన్నాడు.
    "అత్తొస్తున్నది కూకొ-ఆకు పట్టుకో" అన్నది పిచ్చమ్మ.
    గురువయ్య ఆకు పట్టుకొని కూర్చున్నాడు.
    పిచ్చమ్మ మొగ్గలో రెండు వ్రేళ్ళూ అడ్డంపెట్టి వంపుతూంది.
    గురువయ్య తాగుతున్నాడు-ఆమెను చూస్తున్నాడు.
    పిచ్చమ్మ పోస్తున్నది-అతన్ని చూస్తున్నది.
    కుండ ఒడిసింది ఇద్దరూ గమనించలేదు. అత్త పిలుపు విని లోకంలోకి వచ్చింది పిచ్చమ్మ. "ఈడనే ఉండు  మాపటికి వస్త" అని తటాలున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది.
    గురువయ్యకు ఈలపాట వచ్చింది.
    "ఇంటికాడా ఒంటిగాణ్ణి
    జంటలేకా పొగులుతుంటే
    అందకారి బంగరు బొమ్మా
    ఓరకంట నన్ను సూస్తావా?"
    పాడుతూ సాగిపోతున్నాడు గురువయ్య మళ్ళీ రావడానికి__మల్లెలు ఏరడానికి.
    పిచ్చమ్మ ఆ సాయంకాలం చాలా కల్లు పారబోసింది. అత్తతో చీవాట్లు తిన్నది.
    రాత్రి.
    ఆకాశాన చుక్కలు వెలుగుతున్నాయి. చింతచెట్టుకింద చిక్కని చీకట్లో గురువయ్య కూర్చున్నాడు-ఎదిరి చూస్తూ. నిరీక్షణలో ఉన్న ఆరాటం ప్రేమికులకే తెలియాలి! లేస్తున్నాడు, ఎదురు సాగుతున్నాడు. నించున్నాడు. నిరీక్షిస్తున్నాడు. వెనక్కు వస్తున్నాడు. కూర్చున్నాడు. చింతాకు తెంపేస్తున్నాడు.
    అతని ఆవేదన పెరుగుతూంది. ఆరాటం పెరుగుతూంది. ఆగలేకున్నాడు.
    పిచ్చమ్మ కనిపించింది. ఎదురు పరుగెత్తాడు. ఆమె కూడా ముందుకు ఉరికి వచ్చింది.
    చుక్కల  కాంతికి మెరిసిపోతూంది పిచ్చమ్మ.
    "పిచ్చమ్మా! కౌగిలించుకోనా!"
    "ఊఁ. నేను జల్ది పోవాలె. పండబెట్టి వచ్చిన అందరిని."
    గురువయ్య గుండెలో లావా పొంగింది. లిప్త సైతం నష్టం కానివ్వదలచలేదు అతడు ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. ఆమె కౌగిట్లో ఒరిగిపోయింది.
    రాత్రి, చుక్కలు, చల్లనిగాలి ఏకాంతం.

 Previous Page Next Page