"నేనూ రానా?" అన్నాడాయన ఉత్సాహంగా లేచి నిలబడుతూ.
"వద్దొద్దు! మీకెందుకు శ్రమ!" అంటూ వెళ్ళి, పదినిమిషాల తర్వాత తిరిగి వచ్చింది అనుపమ.
"రిపేర్లు ఇంకో గంటన్నరా, రెండు గంటలు పడతాయట సర్! డిన్నరు ఇక్కడే సర్వు చేస్తాం!"
"ఇక్కడా?" అన్నాడాయన ఉదాసీనంగా. ఆయన చూపులో మాత్రం చిరాకు కనపడింది.
"సారీ సర్!" అంది అనుపమ అపాలజెటిక్ గా చిరునవ్వు నవ్వుతూ.
కొంతసేపటి తర్వాత అక్కడే డిన్నరు సర్వు చేశారు.
సుజాత పడుకునే ఉంది. ఆమెని పట్టుకుని కూర్చున్న శతృఘ్న డిన్నరు తీసుకోలేదు.
రెండున్నర గంటల తర్వాత రిపేరు పూర్తి అయి, తిరిగి 'బే'లోకి వచ్చి నిలబడింది విమానం -
ప్రయాణీకులందరూ మళ్ళీ ఎక్కారు. ఈసారి ఎవరిలోనూ ఎగ్జయిట్ మెంట్ కనబడలేదు. నిద్రలో తూగుతున్నారు కొందరు. మొహాల్లో అలసట కనపడుతోంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఢిల్లీలో వాలదామా అని వుంది అందరికీ.
మూడుగంటల తర్వాత బయలుదేరింది విమానం. రన్ వే మీద పరిగెత్తి, గాల్లోకి లేచి, మళ్ళీ ఢిల్లీ దిశలోకి మళ్ళింది.
ఆ చీకట్లో, అంత ఎత్తులోనుంచి చూస్తే, హైదరాబాద్ నగరం, బంగారు పళ్ళేలనిండా నవరత్నాలు దొర్లి నేలమీద పడిపోయినట్లు లైట్లతో మెరుస్తోంది. కాసేపటి తర్వాత విమానం ఏటవాలుగా ఎగరడం మాని, భూమికి సమాంతరంగా గీస్తున్న సరళరేఖలా దూసుకుపోవడం మొదలెట్టింది.
ఎయిరు హోస్టెస్ లూ, స్టివార్డ్ లూ తమతమ డ్యూటీలు నిర్వర్తించడం మొదలెట్టారు. ట్రేలలో చాక్ లెట్లూ, పెప్పరమెంట్లూ, సోంపూ, చిన్న పాకెట్లలో వున్న దూదీ పెట్టుకుని, ఒక్కొక్క పాసెంజరు దగ్గరా ఆగి, అందిస్తున్నారు.
కాటన్ ఉన్న పాకెట్ ఒకటి ఓపెన్ చేసి, స్మితకు అందించింది మోనికా. "దీన్ని చెవుల్లో పెట్టుకో స్వీటీ!"
"నాకు తెలుసు! నాకు తెలుసు!" అని ఉత్సాహంగా ఆ దూదిని రెండు చెవుల్లోనూ పెట్టుకుంది స్మిత. పాసెంజర్ కేబిన్ల లోపల, విమానం తాలూకు ఇంజన్ల హోరు వినబడదు. కానీ ఎత్తుకు వెళ్ళినకొద్దీ చెవులు దిబ్బెళ్ళు వేసినట్లు అయిపోతాయి. దూది చెవుల్లో పెట్టుకుంటే, ఆ అసౌకర్యం కొంచెం తగ్గుతుంది.
గుప్పెటతో చాక్లెట్లు తీసుకుంది స్మిత. "స్వాగత్ కొత్తదా అక్కా?" అంటూ, ముందు సీటుకి ఉన్న కవరులోంచి మేగజైను ఒకటి బయటికి తీసింది.
"అవును" అని నవ్వి, ముందుకు నడిచింది మోనికా.
ఇండియన్ ఎయిర్ లైన్స్ వారు ప్లాయిట్ సమయంలో ప్రయాణీకులు చదువుకోవడానికి ప్రచురించే 'ఇన్ ఫ్లయిట్ మేగజైన్' స్వాగత్. దానితోబాటు మిగతా మేగజైన్సూ, న్యూస్ పేపర్సూ కూడా ఉంచుతారు.
మేగజైను తిరగెయ్యడం మొదలెట్టింది స్మిత.
కాసేపటి తర్వాత -
బెంగాలీ బాబు సుభాష్ చంద్రబోస్ అనుపమని దగ్గరికి పిలిచాడు. "చూడమ్మాయ్! గొంతెండిపోతోంది. డ్రింక్స్ ఏమన్నా ఇస్తున్నావా?"
"యస్ సార్!" అంది అనుపమ.
ఆయన మొహంలో సంతోషం కనబడింది. "మ్మ్ మ్మ్! గుడ్! పద! నేనూ వస్తాను నీతోపాటు!" అంటూ లేచి నిలబడ్డాడు.
పెద్దమనిషికి అభ్యంతరం చెప్పి నొప్పించడం ఇష్టంలేక పోయింది అనుపమకి. ప్లీజ్ కమ్ సర్!" అని ఆయన్ని తనతోబాటు తీసుకెళ్ళింది. ఒక చోట, కర్టెన్ల వెనక డ్రింక్స్ ట్రేలలో సర్దుతున్నారు స్టివార్డులు.
"ఈ బెంగాలీ బాబు భోజన ప్రియుడిలా ఉన్నాడు!" అన్నాడు రాజేందర్. అతను స్మితకి ఎడమ వైపున ఉన్న సీట్లో కూర్చుని ఉన్నాడు.
అతని మాటలని ఎవరూ పట్టించుకున్నట్లు కనబడలేదు.
"నేను హాస్య ప్రియుణ్ణి. మాట్లాడకుండా ఎక్కువసేపు ఉంటే ఊపిరాడదు" అని ప్రకటించి. "మంచి జోక్ చెప్పనా పాపా!" అన్నాడు స్మితతో.
"చెప్పు అంకుల్" అని నవ్వు మొహం పెట్టింది స్మిత.
"బెంగాలీలు 'అ' అనే అక్షరాన్ని 'ఓ'లాగా పలుకుతారు. ఒక బెంగాలీ బాబు తన సర్దార్జీ ఫ్రెండుని ఇవ్వాళ మా ఇంట్లో భోజనానికి రా అని ఆహ్వానించాడుట. తిండిపోతు రాముడయిన ఆ సర్దార్జీ పగలంతా ఏమీ తినకుండా మాడి, బెంగాలీ బాబు ఇంట్లో రసగుల్లాలూ, శ్రీఖండ్ లగాయించ వచ్చని ఉవ్విళ్ళూరుతూ వెళ్ళాడు. తీరా వెళితే అక్కడ భోజనం ఏర్పాట్లు ఏమీ లేవు. భజన మాత్రం జోరుగా జరుగుతోంది."
వింటున్న ఇద్దరు ముగ్గురు నవ్వారు. స్మిత మొహంలో మాత్రం నవ్వు తగ్గింది.
ఇంకా పుంజుకున్నాడు రాజేందర్.
"ఈసారి కల్తీలేని సర్దార్జీ జోకు మరొకటి చెబుతాను. ఒక సర్దార్జీ రేడియోల షాపుకి వెళ్ళి ఫిలిప్స్ రేడియో కావాలని అడిగాడుట. షాపు ఓనరు ఇచ్చాడు. మర్నాడు పొద్దున్నే ధుమధుమ లాడుతూ రేడియోని తిరిగి ఇచ్చేశాడుట ఆ సర్దార్జీ. 'ఫిలిప్స్ రేడియో కావాలంటే ఇంకేదో అంటగడతావా? ఇది ఆలిండియా రేడియో అని దానిలోనే గొంతు చించుకు చెబుతున్నారు. ఇది నాకొద్దు!" అన్నాడుట.
విరగబడి నవ్వారు చాలామంది.
స్మిత మొహం చిట్లించింది.
"ప్రతి జోకులోనూ మూర్ఖుడిగా సర్దార్జీనే ఎందుకు ఉండాలి అంకుల్? సర్దార్జీ అనగానే జోకు మరింతగా నవ్వొస్తుందా? అందరూ అలా వెక్కిరిస్తుంటే సర్దార్జీ అంకుల్స్ బాధపడరా?"