Previous Page Next Page 
హైజాక్ పేజి 16

"పూర్తి చెక్ చేస్తేగానీ తెలియదు" అన్నాడు సవ్యసాచి. విమానానికి కొంగల గుంపు ఎదురొచ్చింది. ఒకటి విండ్ స్క్రీన్ కి తగిలింది. ఇంజన్లోకి ఏవీ పోకుండా ఉంటే అదృష్టవంతులమే! ఇంజన్ లోకి గనక పక్షి వెళితే పార్ట్సు విరిగిపోతాయి. అదీకాక, కొన్ని పక్షులు విమానం తోకకీ, రెక్కకీ, ముక్కుకీ, రాడార్ కీ లాండింగ్ గియర్ కీ కూడా తగిలి డామేజ్ చేసి ఉండవచ్చు."
ఉసూరుమంది శతృఘ్న ప్రాణం. అంటే, అంతసేపూ తాము లాంజ్ లోనే ఉండాలి -ఈ అమ్మాయితో సహా!
ఈ లోపల తను అరచి గోల చేస్తే?
"అయినా ఈ పక్షులకి అదేం రోగమయ్యా?" అన్నాడు వెంకట్రావు.
విసుగు అణుచుకుంటూ చెప్పాడు సవ్యసాచి.
"విమానం సమీపిస్తున్నప్పుడు ఒక్కొక్క జాతి పక్షులు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాయి. కెనెడియన్ గీస్ లాంటివి విమానాన్ని దాటేసి ముందుకు పోవాలని చూస్తాయి. గద్దలు ఒక్కొక్కసారి విమానం మీద దాడి చేస్తాయి. రాబందులు విమానంతో వెంబడే ఎగురుతూ వస్తాయి." అని 'నీలాగా!' అనుకున్నాడు మనసులో. తర్వాత పెద్దపెద్ద అంగలు వేస్తూ టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళ్ళిపోయాడు.
పాసింజెర్స్ అందరూ కిందకి దిగి, లాంజ్ లోకి వచ్చారు. విసుగ్గా ఉంది అందరికీ. విమానం రిపేర్స్ కోసం వెళ్ళింది.
సోలిపోయి ఉన్న సుజాతను ఒక సీట్లో కూర్చోబెట్టి, తను పక్కసీట్లో కూర్చున్నాడు శతృఘ్న. ఇక్బాల్, విక్టర్ కొంచెం దూరంలో కూర్చుని జాగ్రత్తగా గమనిస్తున్నారు.  
అటువైపు వచ్చిన మోనికా సందేహంగా సుజాతవైపు చూసింది.
"ఈజ్ షీ ఆల్ రైట్ సర్? వంట్లో బాగుందా?"
"ఏం లేదు! పొద్దుటినుంచీ ఊరికే స్ట్రెయినయి పోయింది. వద్దంటున్నా వినకుండా ఎన్నో కమిట్ మెంట్స్ పెట్టుకుని..." అని మాట తేల్చేశాడు శతృఘ్న. తను ఆ అమ్మాయి తాలూకే అన్న భావం స్ఫురించేటట్లుగా.
"మీరు ఢిల్లీలోనేనా ఉండేది?"
"అవును! కరోల్ బాగ్!" అన్నాడు తేలిగ్గా అబద్దమాడేస్తూ.
"కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే? ఏమన్న సహాయం చేయగలనా నేను?"
కొద్దిగా కదిలింది సుజాత.
అసహనంగా మోనికావైపు చూశాడు శతృఘ్న. "నో! థాంక్యూ!"
మోనికా వెళ్ళిపోయింది. గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు శతృఘ్న. సుజాత మళ్ళీ నిశ్చలంగా ఉండిపోయింది.
అందరిమధ్యా తిరుగుతూ, ఎవరికి ఏమి కావాలో విచారించింది మోనికా. తర్వాత విశ్రాంతి కోసం ఒక్కక్షణం ఒక సీట్లో కూర్చోబోయింది.
"హాయ్ బ్యూటీఫుల్!" అంటూ దగ్గరికి వచ్చాడు వినోద్ రవి.
"హాయ్ హాండ్సమ్?" అంది మోనికా నవ్వుతూ. అందరిమధ్యా ఉన్నప్పుడు అతనితో మాట్లాడటం ఇష్టమే తనకు. ఒంటరిగా ఉన్నప్పుడే మనకీ బిజినెస్ మొదలెడతాడు అతను.
వినోద్ మొహం వికసించింది. ఏదో అనడానికి నోరు తెరిచాడు.
సుడిగాలిలా లాంజ్ లోకి వచ్చాడు రాజేందర్, సెక్యూరిటీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని.
"మిస్! ఢిల్లీ వెళ్ళే ఎయిర్ బస్సేనా ఇప్పుడు కిందికి దిగింది?" అన్నాడు రూఢీ చేసుకోవడం కోసం.
"అవును! ప్లీజ్ సిట్ డవున్! లైక్ టూ హావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్?" అంది మోనికా, లేచి నిలబడుతూ.
తన నోట్లో కరక్కాయ పడ్డట్టు మొహం పెట్టాడు వినోద్.
"మిస్! అయితే నేను ఫ్లయిట్ మిస్ అవలేదన్నమాట! అవునా మిస్?"
"యస్!" అంది మోనికా నవ్వుతూ.
ఈలోగా,
"నీ పేరేమిటక్కా?" అని అడుగుతోంది స్మిత, హోస్టెస్ అనుపమని.
"అనుపమ!"
"పూర్తి పేరు?"
"అనుపమా గంగూలీ!"
"గంగూలీ? అంటే నువ్వు బెంగాలీ! అవునా?"
"అవును! ఎందుకు?"
"ఫ్లయిట్ పూర్తి అయ్యేలోపల నాకు కొన్ని బెంగాలీ వర్డ్స్ అన్నా నేర్పిస్తావా అక్కా! నాకు ఇప్పటికే కొన్ని బెంగాలీ పదాలు వచ్చు. భద్రలోక్ అంటే ఏమిటో తెలుసు! అమర్ సోనార్ బంగ్లా అంటే తెలుసు. లాంగ్వేజెస్ నేర్చుకోవడం నాకు ఇష్టం అక్కా!"
'ఇది జెట్ యుగం!' అనుకుంది అనుపమ. ఈ కాలం పిల్లలకి ఐక్యూ ఎంత పెరిగింది. ఎంత త్వరగా విషయాలు తెలుస్తున్నాయి వీళ్ళకి!
"సరే!" అని నవ్వి, పక్కనే కూర్చున్న ముసలాయనవైపు చూసింది అనుపమ.
"నేనూ బెంగాలీనే పాపా! నా పేరు సుభాష్ చంద్రబోస్!" అన్నాడాయన నవ్వుతూ.
సంతోషంగా చూసింది స్మిత.
బెంగాలీ బాబు సాటి బెంగాలీ అయిన అనుపమతో మాటలు కలిపేశాడు. "డిన్నర్ ఎప్పుడు అమ్మాయ్? విమానంలోనేనా? ఇక్కడే సర్వ్ చేసేస్తారా? నాకు టైం ప్రకారం డిన్నర్ తీసుకోవడం అలవాటు!"
"కనుక్కుని వస్తాను."

 Previous Page Next Page