వాల్మీకి రామాయణం కావ్యాన్ని రచించాడు. అది గానం చేయటానికి అనువైంది. గానం చేసేవారు అతనికి కనిపించలేదు. అందుకతడు చాల బాధపడ్డాడు. అలాంటప్పుడు కుశలవులు వచ్చారు. వారు అన్నదమ్ములు, యశోవంతులు, అందమైనవారు, మేధావులు చక్కగా పాడగలవారు. వారు రామాయణం నేర్చుకుంటామన్నారు. వాల్మీకి వారికి రామాయణం ఆసాంతం నేర్పాడు. దాన్ని లోకంలో ప్రకటించమన్నాడు.
రామాయణం అభిగీతమైంది. కుశలవులు సంగీతం బాగా తెల్సినవారు. వారు రామాయణాన్ని చక్కగా పాడారు. సభలకు, సమావేశాలకు వెళ్లారు. వాటిల్లో రామాయణం పాడి వినిపించారు. అందరూ వారిని మెచ్చుకున్నారు. రామాయణాన్ని కీర్తించారు.
రాముడు కూడ వారిని పిలిపించాడు. నిండుకొలువులో కుశలవులు, రామాయణం పాడారు. వారు వీణలు పట్టుకొని లయ తప్పకుండా మధురంగా గానం చేస్తుంటే రాముడు ఆనందించాడు. వారు చెప్పిన రామాయణ కథ సంగ్రహంగా ఇలా వుంటుంది.
అయోధ్య
ఈ భూమండలాన్ని తొలిసారిగా పాలించినవాడు వైవసత్వమనువు. అతని తర్వాత పాలించిన వాళ్లలో ఇక్ష్వాకు వంశంవారు ముఖ్యులు. వారిలో సగరుడు ప్రసిద్ధి. అతని వల్లనే సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది.
ఇక్ష్వాకు వంశంవారు పాలించింది కోసలదేశం. అది సరయూ నదిని ఆనుకొని వుండేది. ఆ దేశానికి రాజధాని నగరం అయోధ్య. అయోధ్య పొడవు 12 యోజనాలు, వెడల్పు 3 యోజనాలు. ఆ నగరానికి బలమైన ప్రాకారముండేది. అది ఒడ్డాణంలా వుండేది. ఆ ప్రాకారానికి అగడ్త వుండేది. అది లోతుగానూ, వెడల్పుగానూ వుండేది. ఆ కోట బలమైంది. ఎన్ని యుద్ధాలు వచ్చినా తట్టుకోగల శక్తి గలది.
ఆ నగరంలో శిల్పులుండేవారు. వందిమాగధులుండేవారు. సామంతరాజు లుండేవారు. అక్కడి బ్రాహ్మణులు పండితులు. అక్కడి క్షత్రియులు మహావీరులు. వైశ్యులు కుబేరులు. శూద్రులు స్వధర్మ నిరతులు.
ఆ నగరంలో అనేక గుణ్ణాలుండేవి. వాటిలో కాంభోజపుని, బాహ్లీకవువి, వదాయుదేశపువి ఉండేవి. కొన్నింటిని సింధూ నది తీరము నుండి కూడ తెచ్చారు. అక్కడ లక్షల ఏనుగులుండేవి. వాటిని వింధ్య పర్వత ప్రాంతాలనుండి, హిమవత్పర్వత సానువుల నుండి తెచ్చారు. వాటిలో కొన్ని ఐరావత జాతివి, కొన్ని అంజన జాతివి, కొన్ని వామన జాతివి.
ఆ నగరాన్ని దశరథుడు పాలిస్తుండేవాడు. అతడు అతిరధుడు, ధర్మాత్ముడు, జితేంద్రియుడు, రాజర్షి, చంద్రుడు నక్షత్రాలను పాలించేట్టు, అతడు పౌరులను పాలించాడు. అతడు మాట తప్పనివాడు, ధర్మార్థకామాలు ఏమరకుండ అయోధ్యను పాలించాడు.
దశరథునికి ఎనిమిదిమంది మంత్రులు, వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్దార్ధుడు, అశోకుడు, మంత్రిపాలుడు, సుమంతుడు మున్నగువారు. వారు మంత్రాంగం క్షుణంగా తెల్సినవారు. పరాక్రమవంతులు, విఖ్యాతులు, అప్రమత్తులు, సత్యసంకల్పులు, సత్యవాదులు. అపరాధం చేస్తే తప్ప శత్రువునైనా శిక్షించరు. తప్పుచేసినవాణ్ణి మిత్రుడైనా మన్నించరు. మంత్రులంతా ఒక్కమాట మీద నడుచుకుంటారు. అందున కోసల దేశంలో అసత్యవాది గాని, కుటిలుడు గాని, పరస్త్రీ రతుడు గాని వుండేవారు కారు. నగరం, రాష్ట్రం ఎప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది.
ఋశ్యశృంగుడు
దశరథునికి ముగ్గురు భార్యలు. వారు కౌసల్య, కైక, సుమిత్రలు. దశరథునికి చక్కని రాజ్యం వుంది. మంచి మంత్రులున్నారు. రాజుగా అతడు గొప్పవాడు. అయినా కుటుంబంలో ఒక లోటుంది. అతనికి సంతానం లేదు. సంతానం కావాలని అతడు పరితపించాడు. సంతానం కోసం అశ్వమేధం చేయాలనుకున్నాడు. అశ్వమేధం చేస్తే సంతానం కలుగుతుందని అతని ఆశ. ఆ విషయం మంత్రులకు తెలిపాడు. వారు పురోహితులను సంప్రదించారు. దశరథునికి వశిష్టుడు, వామదేవుడు పురోహితులు. జాబాలి మున్నగువారు ఋత్విజులు. మంత్రుల మాట విన్నారు పురోహితులు. రాజు దగ్గరకి వెళ్లారు. "మహారాజా! మీ సంకల్పం నలుగురూ మెచ్చదగింది. సామాగ్రి సమకూర్చండి. యజ్ఞాశ్వం విడువండి. మీ మనోరథం సిద్ధిస్తుంది" అన్నారు.
దశరథుడు సామాగ్రి సమకూర్చవలసిందని మంత్రులను ఆదేశించాడు. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టడానికి ఏర్పాట్లు చేయమన్నాడు. ఎలాంటి లోపం జరగకుండా యజ్ఞం జరగాలని హెచ్చరించాడు. మంత్రులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నులయినారు.
దశరథుడు అంతఃపురానికి వెళ్లాడు. భార్యలను ముగ్గురినీ పిలిచాడు. సంతానం కోసం అశ్వమేధం చేస్తున్నానని చెప్పాడు. వారిని దీక్షగా ఉండాల్సిందన్నాడు. రాణులు ఆ మాట విన్నారు. అప్పటికి వారి ముఖాలు హేమంతంలో కమలాల్లా వున్నాయి. ఆ మాట విన్నారు. వారి ముఖాలు వసంతంలో కమలాల్లా వికసించాయి.
ఇలా వుండగా సుమంత్రుడు దశరథునికి ఒక సలహా యిచ్చాడు. ఋశ్యశృంగునితో అశ్వమేధం చేయించాల్సిందన్నాడు. ఋశ్యశృంగుని గురింతి తనకు తెలిసిన కథ చెప్పాడు. అది సంగ్రహంగా ఇలా వుంటుంది :-
కాశ్యపుని కొడుకు విభండకుని కొడుకు ఋశ్యశృంగుడు. ఋశ్యశృంగునికి అరణ్యమే ప్రపంచం. అతనికి జనపదం తెలియదు. మరో ప్రపంచం ఉందని తెలీదు. తండ్రికి సేవచేయడం, అడవుల్లో ఉండడమే తెలుసు. అలా ఉండగా అతనికి యవ్వనం అంకురించింది. అతనికి యవ్వన వ్యాపారం సహితం తెలియదు.
అడవిలో అతడలా ఉన్నాడు. అప్పుడే అంగదేశంలో కరువు ఏర్పడింది. అంగదేశాన్ని రోమపాదుడు పాలిస్తున్నాడు. అతడు అధర్మంగా పాలించాడు. అందుకే కరువు వచ్చిందన్నారు. రోముపాదుడు వణికిపోయాడు. పురోహితులను పిలిపించాడు. తాను చేసిన అధర్మం ఏమిటో చెప్పమన్నాడు. కరువు తీరే మార్గం చెప్పమని వేడుకున్నాడు.
పురోహితుడు ఆలోచించారు. ఋశ్యశృంగుని గురించి చెప్పారు. "ప్రాకృత భోగాలెరుగని మహానుభావుడతను. అతన్ని రాజ్యానికి పిలిపించండి, వర్షాలు కురుస్తాయి కరువు దూరం అవుతుంది. ఋశ్యశృంగుడు ఎల్లకాలం ఇక్కడే ఉండేట్టు మీ కూతురు శాంతను చేయండి" అన్నాడు.
ఋశ్యశృంగుణ్ణి పిలిపించే ఉపాయం చెప్పాల్సిందని రాజు పురోహితులను ప్రార్థించాడు. అందుకు పురోహితుడు "ఋశ్యశృంగుడు మహాతపస్వి. ఆగ్రహనుగ్రహ సమర్థుడు. మేం అతని దగ్గరకి వెళ్తే మమ్మల్ని శపిస్తాడు. ఋశ్యశృంగుడు యవ్వనంలో వున్నాడు. విషయ వాంఛలు ఎరుగడు. అందమైనవాళ్లూ, చురుకైనవాళ్ళూ అయిన వేశ్యలను పంపిస్తే వారు కార్యం సాధించగలరు. ఋశ్యశృంగుణ్ణి అంగరాజ్యానికి తేగలరు" అని చెప్పారు.