"అలాగే నీకు కూడా ఇవాళ నుంచి కొత్త ఐడెంటిటీ. ఇకనుంచి నీ పేరు వినీలకాదు. నీలోఫర్. ప్రపంచం దృష్టిలో వినీల ఇంక లేదు... చనిపోయింది. నీలోఫర్ గా నువ్వు పునర్జన్మ ఎత్తావు. నీలోఫర్ అంటే తెలుసుగా నీకు?"
పెదిమలు తడి చేసుకుని ఒక్క గుటక వేసింది వినీల.
ఇకనుంచి తన పేరు వినీల కాదు.
నీలోఫర్:
నీలోఫర్ అంటే హైదరాబాది నైజాం వంశంలోకి వచ్చినటర్కిష్ రాచబిడ్డ.
ఆమె పేరుతోనే హైదరాబాద్ లో నీలోఫర్ హాస్పిటల్ కట్టించడం జరిగింది.
అందమైన ఆమె పేరులాగే ఆమెకూడా అసాధారణమైన అందగత్తె అని చెప్పుకుంటారు.
అంత అందమైన పేరు తనకి పెట్టాడా ప్రతాప్?
ఇవాల్టినుంచి తను నీలోఫర్?
మై గుడ్ నెస్::
కారు స్టార్ట్ చేశాడు ప్రతాప్
ఇరవై నిమిషాల తర్వాత విజయవాడ వెళ్ళే రోడ్డు ఎక్కింది కారు
ఆ రోడ్డులో మరో ఇరవై నిమిషాలు ప్రయాణం చేశాక, కుడి వైపున ఉన్న ఒక మట్టిరోడ్డులోకి తిప్పాడు కారుని ప్రతాప్.
ఒక తోటలోకి ప్రవేశించింది కారు.
తోటమధ్యలో వుంది బంగళా పెంకులతో వున్న చిన్న ఇల్లు....
కారుని చూడగానే పరుగెత్తి వచ్చి ఇంటి తలుపుతీశాడు తోటమాలి. చాలా బలిష్టంగా కండలు తిరిగి వున్నాడు అతను. తోటమాలి గెటప్ లో వున్న కమెండోలాగా ఉన్నాడతను,
లోపల రెండు బెడ్ రూములు వున్నాయి.
మూడో రూము తాళం వేసి ఉంది.
నున్నగా గచ్చు చేయబడిన ఒక పెద్ద హాలు వుంది. జిమ్నాసియంలా కనబడుతోంది అది. అందులో ఎక్సర్ సైజుకి పనికివచ్చే అధునాతనమయిన పరికరాలు చాలా వున్నాయి.
షూటింగ్ ప్రాక్టీస్ కోసం ఒక బోర్డుమీద 'బుల్స్ ఐ' పెయింట్ చేసి వుంది.
"చాలా అలసిపోయి ఉంటావు. స్నానం చెయ్యి ఈ లోపల మన ఐలయ్య భోజనం రెడీ చేస్తాడు" అన్నాడు ప్రతాప్.
భోజనం అనగానే తమ స్టౌమీద వదిలేసి వచ్చిన వంటకాలు గుర్తొచ్చాయి వినీలకి. అన్నయ్య కోపం తయారుచేయడం మొదలెట్టిన డిన్నరు గుర్తువచ్చింది. అన్నయ్య గుర్తువచ్చాడు.
ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఇంక జన్మలో మళ్ళీ అన్నయ్యని చూడగలదా తను? ఇంక ప్రపంచం దృష్టిలో వినీల చనిపోయినట్లే: తను చనిపోయిందని అనుకున్నా అనుకోకపోయినా, అంతర్థానమై పోయిందని మాత్రం అందరికీ తెలుస్తుంది. అన్నయ్యకి కూడా తెలుస్తుంది. పోలీసు రిపోర్టు ఇస్తాడు..... కొన్నాళ్ళు అందరూ తన కోసం వెదుకుతారు.
ఆ తర్వాత?
క్రమంగా తనని మర్చిపోతారు అందరూ.
అందరూ తనని మర్చిపోతారేమోగానీ -
అన్నయ్య మాత్రం ఎప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ తనని మర్చిపోడు.
తనని తనన్నా మర్చిపోతాడేమోగానీ, ఈ చెల్లెలు వినీలనిమాత్రం మర్చిపోడు అన్నయ్య.
తనంటే పంచప్రాణాలు అన్నయ్యకి
తాగి తాగి నాన్నా, నాన్నపోయిన దిగులుతో అమ్మా, ఇద్దరూ రెండేళ్ళ వ్యవధిలో చనిపోయాక, తనకి తల్లీ తండ్రి రెండూ తనే అయి పెంచాడు అన్నయ్య. అందుకోసం అన్నయ్య ఎన్ని కష్టాలు పడ్డాడో తనకి తెలుసు. దూరపు బంధువులెవరో చేరదీశారు తమని. కేవలం అన్నం మెతుకులు తప్ప ప్రేమాభిమానాలు దొరికేవి కావు ఆ యింట్లో. రెండో తరగతి పౌరుల్లా పనులూ బాధ్యతలే తప్ప ఏ రకమైన హక్కులూ లేకుండా బతికేవారు తనూ అన్నయ్యా:
అన్నయ్యకి పంతం, పౌరుషం చాలా ఎక్కువ. ఆ బంధువులు అనే మాటలు భరించలేక ఎప్పుడూ రోడ్లు పట్టుకునే తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడోగానీ ఇంటికి వచ్చేవాడు కాడు. అన్నయ్యకి చెడుసావాసాలు ఎక్కువయ్యాయని శాపనార్థాలు పెడుతూ వుండేవారు ఆ బంధువులు. రెండు మూడు రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు అన్నయ్య. వచ్చినప్పుడల్లా తామిద్దరికీ భోజనంకోసం అయిన ఖర్చుని హోటల్ బిల్లు చెల్లించినట్లు వాళ్ళ మొహానకొడుతూ వుండేవాడు.
వాళ్ళకు తిక్కరేగేది.
"ఎక్కడివిరా గతిలేని వెధవకు నీకు డబ్బు?" అని నిలదీసేవాళ్లు.
"స్టేషన్ దగ్గర పెట్టెలు మోకా: కట్టెల అడితీలో కట్టెలుకొట్టా:" అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు అన్నయ్య.