అలా పాముల మధ్య ముంగిసలా కొన్నాళ్ళు, వుండి, తర్వాత వుండలేక, తనని తీసుకొని బొంబాయి పారిపోయాడు అన్నయ్య పారిపోయే టైంలో అన్నయ్య దగ్గర కట్టలు కట్టలుగా డబ్బు వుంది: "ఎక్కడిది ఇంత డబ్బు?" అని తను అడిగింది ఆశ్చర్యంగా.
"మన రాబంధువులది కాదులే: దొంగతనం చేసిన డబ్బు కాదది. సంపాదించినదే:" అన్నాడు తప్పితే, అంతడబ్బు ఎలా సంపాదించాడో చెప్పలేదు అన్నయ్య. అలా అంటూ సీరియస్ గా తనవైపు చూశాడు. ఆ చూపులో ఒక శాసనం వుంది. "ఈ ప్రస్తావన ఇంకెప్పుడూ తేవద్దు" అని.
అంతే:
ఆ తర్వాత ఎప్పుడూ తను ఆ ప్రస్తావన తేలేదు.
కానీ తనకి తెలుసు.
కొట్లో పొద్ధులురాస్తే అంతడబ్బు సంపాదించలేరు ఎవరూ.
ఎక్కడన్నా గుమస్తా ఉద్యోగం చేసినా అంతధనం గడించలేరు.
అన్నయ్య చదివిన చదువుకి అంతకంటే మంచి వుద్యోగాలు రావు.
తనకి తెలుసు. అన్నయ్య ఏదో చెప్పకూడని పని చేస్తున్నాడని.
చెప్పకూడని పనా?
చెప్పకూడని పనా?
ఏమో:
అన్నయ్యకి చదువు అబ్బలేదు. చదువుకునే అవకాశం దొరకలేదు.
కానీ తన చదువు విషయంలో చాలాశ్రద్ధ చూపించాడు అన్నయ్య: ప్రైవేట్ గానే తనని పరీక్షలకు కూర్చోమన్నాడు. అవి పాసయ్యాక యూనివర్సిటీలో చేర్చాడు.
యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తనకి ఏవియేషన్ మీద ఇంట్రస్టు కలిగింది. ప్లయింగ్ క్లబ్ లో చేరింది. తర్వాత కమర్షియల్ పైలట్ గా లైసెన్స్ సంపాదించింది. ఇండియన్ ఎయిర్ లైన్స్ లో చేరింది పైలట్ అయింది.
కానీ-
మీ అన్నయ్య ఏం చేస్తున్నాడనీ ఎవరన్నా అడిగితే నిజంగా ఏం చెప్పాలో తనకి తెలియదు.
"బిజినెస్" అని చెప్పేస్తుంది నాన్ కమిటల్ గా అంతే:
అలా తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నయ్యతో ఒక్క మాటన్నా చెప్పకుండా ఈ ప్రతాప్ తో వచ్చేసిందితను - పాత జీవితాన్ని పూర్తిగా వదిలేసి.
ఎందుకిలా చేసింది?
ఈ ప్రతాప్ తన ప్రాణాలు రక్షించాడన్న కృతజ్ఞతతోనేనా?
అది కొంతవరకూ నిజమే:
కానీ అంతకంటే బలమైన మరో కారణం కూడా ఏదో వుండి వుండాలి.
ఏమిటది?
ఇతనిలో వున్న మాగ్నెటిజమా?
అయి వుండవచ్చు. ప్రతాప్ కళ్ళు కావాలనుకుంటే నల్లమందు భాయి కళ్ళలాగా బద్ధకంగా, మొద్దు చూపులు చూడగలవు.
అవసరమైతే, అలర్ట్ గా అయిపోయి, ఎదుటి వాళ్ళని హిప్నొటైజ్ చేస్తున్నట్లు చూడగలవు.
అవును: అతనిలో ఏదో మెస్మరిజమ్ వుంది. అసాధారణమైన వ్యక్తిత్వం అతనిది.
అతని మాటలకి ఎదురు చెప్పి కాదనడం అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు.
బహుశా అందుకనేమో అతనితో వచ్చేసింది తను:
కానీ...
తనకోసం అన్నయ్య ఎంత ఆదర్దా పడతాడు:
తను ఇంక ఎప్పటికి కనిపించనని తెలిస్తే ఎంత బాధపడతాడు?
మొన్ననో ఎప్పుడో అన్నాడు అన్నయ్య. "ఈ సంవత్సరం నీకు పెళ్ళిచేసేస్తే బాగుంటుందనుకుంటున్నాను" అని:
నవ్వి వూరుకుంది తను.
తనకు తల్లీ తండ్రీకూడా తనే అయి పెంచిన అన్నయ్య...
పదేపదే అన్నయ్యే గుర్తు రావడంతో వినీలకి కన్నీళ్ళు ఆగలేదు. అవి ప్రతాప్ కి కనబడకుండా ఉండటానికి బాత్ రూంలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంది.
ఆమె పరిస్థితిని గమనిస్తూనే వున్నాడు ప్రతాప్. అత్యున్నతమైన త్యాగం చేసేసి దేశరక్షణ అనే నిరంతర యజ్ఞం కోసం తన దేహాన్నీ, జీవితాన్నీ, సుఖాన్నీ, అనురాగాలనీ, ఆప్యాయతలనీ అన్నిటినీ సమిధలుగా చేసెయ్యడానికి సిద్ధపడింది ఈ అమ్మాయి మనసు పూర్తిగా రాజీపడే కొత్త పరిస్థితులని అంగీకరించే వరకూ కాస్త మహావికారం తప్పదు.
అందుకని, ఆమె వ్యాకులతని గమనించనట్లు అన్నాడు ప్రతాప్. "నీలోఫర్: నేను పనిమీద బయటికి వెళుతున్నాను. స్నానంచేసి భోజనం చేసెయ్యి. అశ్రద్ధ చెయ్యకు.
రేపటినుంచి మొదలవుతుంది నీ ట్రైనింగ్" అనేసి వెళ్ళిపోయాడు:
* * * *
సరిగ్గా అదే సమయంలో:
చిత్రద్వీప్ లోని తన ప్రెసిడెన్సియల్ పాలెస్ లోని క్రిస్టల్ రూంలో కూర్చుని 'హాట్ టాడీ' తాగుతున్నాడు జనరల్ భోజా.